
న్యూఢిల్లీ: ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిఫ్టీ 20,500 పాయింట్లకు చేరొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా తెలిపింది. అలాగే భారత ఈక్విటీ మార్కెట్ అవుట్‌లుక్‌ను అప్‌గ్రేడ్ చేసింది. బలమైన దేశీయ పెట్టుబడులు, అమెరికా ఆర్థిక మాంద్యం ఏర్పడకపోవచ్చనే అంచనాలు ఇందుకు కారణాలుగా చెప్పుకొచ్చింది. ఫైనాన్స్, పారిశ్రామిక, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాల లార్జ్, మిడ్ క్యాప్ షేర్లలోని ర్యాలీ దేశీయ మార్కెట్‌ను కొత్త గరిష్టాలకు తీసుకెళ్తుందని బ్రోకరేజ్ సంస్థ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఐటీ, వినిమయ, మెటల్, డిస్క్రీషనరీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవచ్చు అంటున్నారు.
‘‘ఏదైనా దిద్దుబాటు జరిగితే దేశీ, విదేశీ నిధుల రాకకు ఎలాంటి ఆటంకాలు లేకపోవడం, యూఎస్‌లో ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులు తలెత్తకపోవచ్చనే అంచనాల దృష్ట్యా డిసెంబర్ కల్లా నిఫ్టీ 20,500 స్థాయికి చేరొచ్చు. తర్వలో నిఫ్టీ వాల్యూయేషన్లు తన ధీర్ఘకాలిక సగటు 19,000 స్థాయిని అధిగమించవచ్చు. చారిత్రాత్మకంగా గమనిస్తే అమెరికా మాంద్యం ముగియడానికి కనీసం మూడు నెలల ముందు, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రారంభానికి ఆరు నెలల ముందు నిఫ్టీ రాబడులు అధికంగా ఉన్నాయి. అలాగే నిఫ్టీ మార్కెట్ విలువలో మూడో వంతు ఇప్పటికీ దీర్ఘకాలిక సగటు కంటే తక్కువగా ఉంది. అందులో కొన్ని కంపెనీలు కొనుగోళ్లకు అవకాశం ఇస్తున్నాయి’’ అని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్థిక వేత్తలు తెలిపారు.
క్రూడాయిల్ ధరలు పెరగడం, అస్థిరమైన రుతపవనాల ప్రభావంతో ద్రవ్యోల్బణ తారాస్థాయికి చేరుకోవడం, చైనా ఉద్దీపనలతో కమోడిటీల ర్యాలీతో స్వల్ప కాలం పాటు మార్కెట్ ప్రతికూలంగా ట్రేడవ్వొచ్చని బ్రోకరేజ్ సంస్థ వివరించింది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు సైతం నష్టభయానికి గురిచేస్తాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment