ముంబై: వివిధ రంగాల్లో.. ముఖ్యంగా టెక్నాలజీ విభాగంలో ఆటోమేషన్ వేగవంతం అవుతున్న నేపథ్యంలో దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు ..భారీగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే యోచనలో ఉన్నాయి. 2022 నాటికి ఏకంగా 30 లక్షల మందికి ఉద్వాసన పలకనున్నాయి. జీతభత్యాలకు సంబంధించి కంపెనీలు ఏటా 100 బిలియన్ డాలర్ల దాకా ఆదా చేసుకునేందుకు ఇది తోడ్పడనుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం దేశీయంగా ఐటీ రంగంలో 1.6 కోట్ల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సుమారు 90 లక్షల మంది తక్కువ స్థాయి నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లోనూ, బీపీవో ఉద్యోగాల్లోనూ పనిచేస్తున్నారు.
ఈ విభాగంలోనే ఉద్యోగుల తీసివేత ఉండనుంది. 90 లక్షల ఉద్యోగాల్లో సుమారు 30 శాతం .. అంటే 30 లక్షల కొలువులకు కత్తెర పడనుంది. ప్రధానంగా రోబో ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్‌పీఏ) ప్రభావమే ఇందుకు కారణం. ఆర్‌పీఏ కారణంగా సుమారు 7 లక్షల ఉద్యోగాలకు, ఐటీ కంపెనీలు టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసుకోవడం తదితర అంశాల మూలంగా మిగతా వాటికి కోత పడనుంది. ఆర్‌పీఏ వల్ల అమెరికాలో అత్యధికంగా దాదాపు 10 లక్షల కొలువులకు ముప్పు ఉంది. దేశీయంగా ఉద్యోగులపై వ్యయాలు వార్షికంగా సగటున 25,000 డాలర్లుగాను, అమెరికాలోని వారిపై వ్యయాలు 50,000 డాలర్లుగా లెక్కిస్తే.. ఉద్యోగాల్లో కోతలతో కంపెనీలు 100 బిలియన్ డాలర్ల మేర వార్షిక జీతభత్యాలు, సంబంధిత వ్యయాలు ఆదా చేసుకోనున్నాయి.
టీసీఎస్, ఇన్ఫీ.. అన్నీ..
‘‘ఆర్‌పీఏ అమలు ద్వారా తక్కువ నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలకు సంబంధించి సుమారు 30 లక్షల కొలువుల్లో కోత పెట్టాలని టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్‌తో పాటు ఇతర సంస్థలు యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల వాటికి 100 బిలియన్ డాలర్ల మేర జీతభత్యాలు, ఇతర వ్యయాలు తగ్గుతాయి. ఆర్‌పీఏని విజయవంతంగా అమలు చేయగలిగితే ఐటీ కంపెనీలకు 10 బిలియన్ డాలర్ల దాకా, అలాగే కొత్త సాఫ్ట్‌వేర్‌లతో మరో 5 బిలియన్ డాలర్ల దాకా లాభించే అవకాశం ఉంది. మనుషులతో పోలిస్తే రోబోలు రోజంతా 24 గంటలూ పనిచేస్తాయి కాబట్టి కంపెనీలకు గణనీయంగా ఆదా అవుతుంది’’ అని నివేదిక పేర్కొంది. భౌతిక రోబోలు కాకుండా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ రూపంలో ఉండేదాన్ని ఆర్‌పీఏగా వ్యవహరిస్తారు. దీన్ని రోజువారీగా భారీ స్థాయిలో చేసే పనుల్లో ఉపయోగిస్తారు.
దేశీ ఐటీకి ఆఫ్‌షోరింగ్ ఊతం..
అనేక సంవత్సరాలుగా విదేశీ సంస్థలు తమ ఐటీ అవసరాల కోసం భారత టెక్నాలజీ కంపెనీల వైపు చూస్తుండటంతో (ఆఫ్‌షోరింగ్) దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం గణనీయంగా వృద్ధి చెందింది. 1998లో స్థూల దేశీయోత్పత్తిలో దీని వాటా 1 శాతంగా ఉండగా.. ప్రస్తుతం ఇది 7 శాతానికి చేరింది. ఆర్థిక వ్యవస్థకు అత్యంత వ్యూహాత్మకంగా ఎదిగింది. అయితే, గతంలో తమ కార్యకలాపాలను ఆఫ్‌షోర్ చేసిన చాలా మటుకు దేశాలు తమ స్వదేశాల్లో ఉద్యోగాల కల్పనపై ప్రస్తుతం దృష్టి పెడుతున్నాయి. నివేదిక ప్రకారం.. సంపన్న దేశాలు కూడా విదేశాలకు అవుట్‌సోర్స్ చేసిన ఐటీ ఉద్యోగాలను స్వదేశానికి తరలించడం లేదా స్థానిక ఐటీ ఉద్యోగులను ఉపయోగించుకోవడం లేదా ఆర్‌పీఏ వంటి విధానాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. తద్వారా తమ డిజిటల్ సరఫరా వ్యవస్థను, దేశీయ టెక్నాలజీ ఇన్‌ఫ్రా రంగాన్ని భవిష్యత్‌లో సురక్షితంగా ఉంచుకోవాలని అవి భావిస్తున్నాయి. భారీ స్థాయిలో ఆటోమేషన్ అయినప్పటికీ.. జర్మనీ (26శాతం), చైనా (7శాతం), భారత్ (5శాతం), కొరియా, బ్రెజిల్, థాయ్‌ల్యాండ్, మలేషియా, రష్యా వంటి పెద్ద దేశాల్లో కార్మికుల కొరత ఏర్పడే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. అయితే, దీనికి విరుద్ధంగా దక్షిణాఫ్రికా, గ్రీస్, ఇండొనేíÙయా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో వచ్చే 15 ఏళ్ల పాటు కార్మికుల లభ్యత అధిక స్థాయిలో ఉంటుందని పేర్కొంది.
చదవండి: నెలకు లక్షల ఆర్డర్లు, 4 వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఈకామర్స్ సంస్థ
Comments
Please login to add a commentAdd a comment