న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ వేగవంతంతోనే ఎకానమీలో పురోగతి సాధ్యమని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. రెండవ వేవ్ కేసులు తగ్గినప్పటికీ, పలు రంగాలపై దాని తీవ్ర ప్రభావం కొనసాగుతోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో 2021–22 ఆర్థిక సంవత్సరం వృద్ధిపై అంచనాలను పునః సమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. (వృద్ధి రేటును ప్రభుత్వం 11 శాతం అంచనావేస్తుండగా, మూడీస్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్‌లు దాదాపు దీనికి ఒక అంకెకే పరిమితం చేస్తున్నాయి) అయితే దీర్ఘకాలంలో చూస్తే భారత్ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. గ్రూప్ సంస్థ– ఆల్ట్రాటెక్ సిమెంట్ వార్షిక నివేదికలో ప్రముఖ పారిశ్రామికవేత్త వివరించిన విశ్లేషణాంశాల్లో ముఖ్యమైనవి...
♦మొదటివేవ్‌తో పోల్చితే ఎకానమీకి రెండవవేవ్‌లో స్వల్ప నష్టం మాత్రమే సంభవించింది. వ్యాక్సినేషన్ పురోగతితో రవాణా, ఆర్థిక క్రియాశీలత మెరుగుపడుతుంది.
♦రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సరళతర ఆర్థిక విధానాలు, ప్రభుత్వ నుంచి పెరుగుతున్న మూలధన వ్యయాలు వృద్ధి రికవరీకి మద్దతునిస్తాయి.
♦దీనికితోడు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఆస్తుల అమ్మకం, నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ అమలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం, కొత్త కార్మిక చట్టం పెట్టుబడులకు తద్వారా దీర్ఘకాలంలో వృద్ధికి దోహదపడే అంశాలు.
♦ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య వృద్ధి ధోరణి భారత్ ఎగుమతులకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దేశ వృద్ధి బాటలో ఇది అదనపు బలం.
♦దేశంలో ఆరోగ్య రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలు మరింత పెరగాలి.
♦అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2021లో ప్రపంచ వృద్ధిని 6 శాతంగా అంచనావేస్తోంది. అయితే వివిధ దేశాల్లో రెండవ, మూడవ వేవ్స్ సవాళ్లు పటిష్ట వృద్ధి అవుట్‌లుక్‌పై సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్–19 విసిరిన సవాళ్ల నేపథ్యంలో వృద్ధి రికవరీ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది.
♦కరోనా సవాళ్లు కొనసాగినప్పటికీ, మన గ్రూప్ సంస్థల ఉద్యోగులు వ్యాపారం, కస్టమర్ సేవలపై తగిన విధమైన దృష్టి సారించారు.
సిమెంట్ పరిశ్రమకు మెరుగైన అవకాశాలు
ప్రభుత్వ వృద్ధి కార్యకలాపాలు తోడవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ పరిశ్రమకు మెరుగైన అవకాశాలు ఉంటాయని అల్ట్రాటెక్ సిమెంట్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఖర్చు చేయడం, మెరుగైన బడ్జెట్ కేటాయింపులతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) వంటి సరసమైన గృహ నిర్మాణ పథకాలు సిమెంట్ పరిశ్రమ వృద్ధిని నడిపిస్తాయని వాటాదారులను ఉద్దేశించి తెలిపారు. ‘గృహ, మౌలిక సదుపాయాల రంగంతో సిమెంట్ డిమాండ్ ముడిపడి ఉంది. పరిమాణం పరంగా ఈ పరిశ్రమ వృద్ధి మార్గంలో ఉంది. ప్రభుత్వ లక్ష్యమైన 2022 నాటికి అందరికీ గృహాలు, నిర్మాణంలో ఉన్న పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులచే ఈ పరిశ్రమ ప్రేరణ పొందింది. 2020–21లో సిమెంట్ రంగం 10–12 శాతం తిరోగమన వృద్ధి నమోదు చేసింది. అయితే ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధ భాగంలో త్వరగా కోలుకునే సంకేతాలను చూపించింది. గతేడాది మార్చి–ఏప్రిల్ లాక్‌డౌన్ అన్ని తయారీ రంగాలకు భారీ సవాళ్లను విసిరింది. మహమ్మారి ఉన్నప్పటికీ గ్రామీణ, చిన్న పట్టణాలు, రిటైల్‌లో సిమెంట్ వినియోగం బలమైన వృద్ధి కనబరిచింది’ అని ఆయన వెల్లడించారు.
ఆసియా, పసిఫిక్‌లో డెల్టా భయాలు: మూడీస్
భారత్ ఎకానమీపై కోవిడ్–19 సెకండ్‌వేవ్ సవాళ్లు మరికొంతకాలం కొనసాగుతాయని సోమవారం విడుదల చేసిన ఒక నివేదికలో రేటింగ్ దిగ్గజం– మూడీస్ విశ్లేషించింది. ‘ఆసియా పసిఫిక్ ఎకనమిక్ అవుట్‌లుక్: ది డెల్టా రోడ్‌బ్లాక్’ అన్న శీర్షికన విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను క్లుప్తంగా చూస్తే... సామాజిక దూరం అన్న అంశం ప్రస్తుత త్రైమాసికం (జూలై–ఆగస్టు–సెప్టెంబర్)పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక రికవరీ ప్రారంభమయ్యేది ఈ ఏడాది చివరికేనని భావిస్తున్నాం. డెల్టా వేరియంట్ ప్రస్తుతం ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో భయాందోళనలకు గురిచేస్తోంది. 2020తో పోల్చితే ఎకానమీ ఇప్పుడు కొంత తక్కువగా నష్టపోవడం కొంతలో కొంత ఊరట. భారత్ నుంచి ఎగుమతుల విలువ పెరుగుతోంది కానీ, దీనికి అధిక కమోడిటీ ధరలు, గత ఏడాది లో బేస్ ఎఫెక్ట్ కారణం. భారత్‌లో సెకండ్‌వేవ్ తగ్గుతున్నప్పటికీ, చిన్న సంస్థలు కోలుకోడానికి చాలా సమయం పడుతుంది. ఎగుమతులూ ఇప్పుడిప్పుడే నిలద్రొక్కుకుంటున్నాయి. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం కావాల్సి ఉంది.
5.5 శాతం వరకూ ప్రపంచ వృద్ధి రేటు..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) వృద్ధి రేటు 2021లో 5 నుంచి 5.5 శాతం శ్రేణిలో ఉంటుందన్నది తాజా అంచనా. ప్రపంచ వాణిజ్యం కూడా గణనీయంగా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తి కూడా పెరుగుతోంది. గ్లోబల్ సప్లై చైన్స్ యథాతథ స్థాయికి చేరుతున్నాయి. మూడవవేవ్ సవాళ్లు తీవ్రం కాకపోతే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగంగా పురోగమిస్తుంది.
3వ వేవ్ వస్తే కష్టమే: బ్యాంక్ ఆఫ్ అమెరికా
ముంబై: భారత్‌లో కోవిడ్–19 మూడవ వేవ్ సవాళ్లు తీవ్రమయితే, ఎకానమీలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి 2022 నాల్గవ త్రైమాసికం వరకూ సమయం పడుతుందని వా ల్ స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ విశ్లేషించింది. ఈ పరిస్థితుల్లో 2022 తొలి నెలల వరకూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను యథాతథంగా 4 శాతంగానే కొనసాగించే వీలుందని వివరించింది. అప్పటికి సాధారణ పరిస్థితులు నెలకొంటే 2023 డిసెంబర్ నాటికి రెపో రేటు 5.5 శాతానికి పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొం ది. మూడవ వేవ్ భయాలను పక్కనబెట్టి, ప్రస్తు త పరిస్థితు లకు అనుగుణంగా పరిశీలిస్తే, వృద్ధి, ద్రవ్యో ల్బణం లక్ష్యాల నెరవేరుతాయన్న అభిప్రాయా న్ని వ్యక్తం చేసింది. సరఫరాల సమస్యలను పరి ష్కంచడం ద్వారా రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడిలో ఉంచడానికి (2 నుంచి 6 శాతం శ్రేణిలో) కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక విశ్లేషించింది.
క్రూడ్ కష్టాలు...
అయితే అంతర్జాతీయంగా పెరుగుదల ధోరణిలో ఉన్న క్రూడ్ ధరలు ఎకానమీకి కొంత ఇబ్బందిని సృష్టించే వీలుందని అంచనావేసింది. ‘‘తాజా పరిస్థితుల ప్రకారం 2022 రెండవ త్రైమాసికం నాటికి పాలసీ విధానం సరళతరత నుంచి తటస్థ స్థితికి చేరుకుంటుంది. 2022 జూన్‌లో లేదా ఆగస్టులో రెపో రేటు పెంపు ప్రారంభం కావచ్చు. 2023 మార్చి నాటికి 5 శాతం, 2023 డిసెంబర్ నాటికి 5.5 శాతానికి పెరిగే అవకాశం ఉంది’’ అని నివేదిక విశ్లేషించింది.
Comments
Please login to add a commentAdd a comment