సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా వ్యాప్తి ప్రజల జీవితాలతోపాటు వారి ఆర్థిక స్థితిగతులనూ తిరోగమనంలోకి నెట్టేసింది. ఈ మహమ్మారి నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ దేశవ్యాప్తంగా ప్రతి 10 మందిలో 8 మంది ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిందని, దేశంలోని 84 శాతం కుటుంబాలు లాక్‌డౌన్ సమయంలో ఆదాయం కోల్పోయాయని తాజా అధ్యయనంలో తేలింది. యూనివర్సిటీ ఆఫ్ షికాగో, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంయుక్తంగా ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు నిర్వహించిన ఈ సర్వే దేశ ప్రజలపై, వారి ఆర్థిక పరిస్థితిపై కరోనా చూపిన ప్రభావాన్ని తేటతెల్లం చేసింది. 27 రాష్ట్రాల్లో 6 వేలకుపైగా కుటుంబాలపై కన్జూమర్ పిరమిడ్స్ హౌస్‌హోల్డ్ సర్వే జరిగింది.(అన్నీ ఆపేయండి..)
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ నష్టం...
ఈ సర్వే ప్రకారం కరోనా వైరస్ ప్రభావం దేశంలోని దిగువ మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఎక్కువ ఆదాయాన్ని ఈ వర్గాలు కోల్పోగా వ్యవసాయంపై ఆధారపడ్డ పేద వర్గాల ఆదాయంలో పెద్దగా మార్పు రాలేదు. అలాగే ఉన్నతస్థాయిలో ఆదాయం వచ్చే పట్టణాల్లో కంటే దిగువ మధ్యతరగతి వర్గాలుండే గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం ఎక్కువగా తగ్గిపోయిందని సర్వే తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 88 శాతం కుటుంబాలపై ఎఫెక్ట్ కనిపిస్తే, పట్టణ ప్రాంతాల్లో అది 75 శాతం కుటుంబాలపై ప్రభావం చూపింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి ప్రతి కుటుంబం నెలకు ఆర్జించే ఆదాయంలో రూ. 3,801 నుంచి రూ. 1,01,902 వరకు కోల్పోవాల్సి వచ్చిందని అధ్యయనం వివరించింది.
తెలంగాణ, ఏపీలో కాస్త నయం...
కరోనా లాక్‌డౌన్ వల్ల దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రజల ఆదాయం పడిపోయింది. ముఖ్యంగా బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో 90–100 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోగా తెలంగాణలో దేశంలోనే అత్యల్పంగా 50–70 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 60–70 శాతం కుటుంబాల ఆదాయంలో తగ్గుదల కనిపించింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో 70–80 కుటుంబాల రాబడి తగ్గింది.
క్రమంగా సాధారణ స్థితికి...
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఎత్తేశాక నిరుద్యోగిత రేటు మార్చి నెల స్థాయికి పరిమితం కావడం ఊరట కలిగిస్తోంది. మార్చి 22న దేశంలో నిరుద్యోగిత రేటు 8.4 శాతం ఉండగా మే 3 నాటికి అది అత్యధికంగా 27 శాతానికి చేరి జూన్ 21 నాటికి మళ్లీ 8.5 శాతానికి పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక శ్రామిక భాగస్వామ్యం కూడా మార్చి స్థాయికి జూన్ నెలలో వచ్చేసింది.
దశాబ్దాల గణాంకాలు పునరావృతం..
ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పేదరిక గణాంకాలు పెరిగిపోతున్నాయి. కరోనా ప్రభావంతో 1990 నాటి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉందని యూఎన్ యూనివర్సిటీ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్ మెంట్ ఎకనామిక్స్ రీసెర్చ్ ఇటీవలి ప్రచురణలో వెల్లడించింది. రోజుకు ఒక వ్యక్తి 1.9 డాలర్లకన్నా తక్కువ సంపాదన ఉన్న వారిని పేదలుగా గుర్తిస్తే ఆ లెక్కన ప్రపంచ జనాభాలో 17 కోట్ల మంది పేదరికంలోకి వెళ్తారని తెలిపింది. ఇందులో దాదాపు సగం మంది భారత్‌లోనే ఉంటారని వెల్లడిం చింది. ప్రస్తుతం భారత్‌లో పేదరికం శాతం 13.3 గా ఉందని, పేద భారతీయుల సంఖ్య 17.49 కోట్లని తెలిపింది. దేశ జీడీపీ పతనాన్నిబట్టి మరింత మంది పేదరికంలోకి వెళ్తారని, జీడీపీ 5 శాతం పడిపోతే మొత్తం 3.54 కోట్ల మంది వరకు, 10 శాతం తగ్గితే 7.52 కోట్ల మంది, 20 శాతం తగ్గితే 17.85 కోట్ల మంది తీవ్ర పేదరికం లోకి జారిపోతారని అంచనా వేసింది. దేశంలో 2005 నుంచి 2017 వరకు 27.1 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారని ప్రభుత్వం అంచనా వేస్తున్న సమయంలో కరోనా మహమ్మారి మళ్లీ అదే స్థాయిలో దేశాన్ని పేదరికంలోకి తీసుకు పోతుందనే ఆందోళన ఆర్థికవేత్తల్లో వ్యక్తమవుతోంది.
గత మూడు నెలల్లో దేశంలో శ్రామిక భాగస్వామ్యం, నిరుద్యోగిత రేటు అంచనాలు
Comments
Please login to add a commentAdd a comment