అంతర్జాతీయ అధ్యయనం వెల్లడి
తీవ్రంగా ఖండించిన కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా వల్ల 2020లో భారత్‌లో కేంద్రం చెప్పిన వాటికంటే ఏకంగా 11.9 లక్షల అధిక మరణాలు సంభవించినట్లు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి పేర్కొంది. ఇది భారత్ అధికారిక గణాంకాల కంటే 8 రెట్లు, డబ్ల్యూహెచ్‌ఓ అంచనాల కంటే ఒకటిన్నర రెట్లు అధికం! 2019తో పోలిస్తే ఈ మరణాలు 17 శాతం అధికమని అధ్యయనం పేర్కొంది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్, మరికొన్ని విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు.
ఇందుకు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నారు. 2019 నుంచి 2020 దాకా దేశవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా బాధితుల డేటాను సైతం పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కోవిడ్–19 సంబంధిత మరణాల్లో మూడింట ఒక వంతు మరణాలు ఇండియాలోనే చోటుచేసుకున్నాయని వెల్లడించారు. కోవిడ్–19 ప్రభావం వల్ల ప్రజల సగటు ఆయుర్దాయం 2.6 ఏళ్లు తగ్గినట్లు తెలిపారు. మహిళల ఆయుర్దాయం 3.1 ఏళ్లు, పురుషుల ఆయుర్దాయం 2.1 ఏళ్లు తగ్గినట్లు గుర్తించారు. అధ్యయనం వివరాలను ‘సైన్స్ అడ్వాన్సెస్’ పత్రికలో ప్రచురించారు.
అవన్నీ కరోనా మరణాలు కాదు
అధ్యయనం గణాంకాలపై కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అధ్యయనం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆక్షేపించింది. ఈ గణాంకాల్లో వాస్తవం లేదని, అవన్నీ కరోనా మరణాలు కావని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment