international study
-
2020లో భారత్‌లో కరోనాతో... 11లక్షల అధిక మరణాలు
న్యూఢిల్లీ: కరోనా వల్ల 2020లో భారత్‌లో కేంద్రం చెప్పిన వాటికంటే ఏకంగా 11.9 లక్షల అధిక మరణాలు సంభవించినట్లు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి పేర్కొంది. ఇది భారత్ అధికారిక గణాంకాల కంటే 8 రెట్లు, డబ్ల్యూహెచ్ఓ అంచనాల కంటే ఒకటిన్నర రెట్లు అధికం! 2019తో పోలిస్తే ఈ మరణాలు 17 శాతం అధికమని అధ్యయనం పేర్కొంది. బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్, మరికొన్ని విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందుకు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నారు. 2019 నుంచి 2020 దాకా దేశవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా బాధితుల డేటాను సైతం పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కోవిడ్–19 సంబంధిత మరణాల్లో మూడింట ఒక వంతు మరణాలు ఇండియాలోనే చోటుచేసుకున్నాయని వెల్లడించారు. కోవిడ్–19 ప్రభావం వల్ల ప్రజల సగటు ఆయుర్దాయం 2.6 ఏళ్లు తగ్గినట్లు తెలిపారు. మహిళల ఆయుర్దాయం 3.1 ఏళ్లు, పురుషుల ఆయుర్దాయం 2.1 ఏళ్లు తగ్గినట్లు గుర్తించారు. అధ్యయనం వివరాలను ‘సైన్స్ అడ్వాన్సెస్’ పత్రికలో ప్రచురించారు.అవన్నీ కరోనా మరణాలు కాదు అధ్యయనం గణాంకాలపై కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అధ్యయనం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆక్షేపించింది. ఈ గణాంకాల్లో వాస్తవం లేదని, అవన్నీ కరోనా మరణాలు కావని పేర్కొంది. -
Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
న్యూఢిల్లీ: మానవాళికి శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు జీవితకాలం పెరుగుతున్నట్లు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి వెల్లడించింది. 2022 నుంచి 2050 మధ్య పురుషుల్లో 4.9 సంవత్సరాలు, మహిళల్లో 4.3 సంవత్సరాలు పెరుగుతుందని తేల్చింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్, ఎవాల్యుయేషన్(ఐహెచ్ఎంఈ) నిర్వహించిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్(జీబీడీ)–2021 అధ్యయనం వివరాలను లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించారు. ‘‘మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా సగటు జీవితకాలం ఐదేళ్ల దాకా పెరుగుతుంది. కానీ అదే సమయంలో వ్యాధుల ముప్పు కూడా బాగా పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటివి ఎక్కువ ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా స్థూలకాయం, అధిక రక్తపోటు వంటివి బాగా వేధిస్తాయి’’ అని అధ్యయనం హెచ్చరించింది. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం ద్వారా ఈ ముప్పును వీలైనంతగా తగ్గించుకోవచ్చని అధ్యయనం సూచించింది. అధ్యయనం ఇంకా ఏం తేలి్చందంటే... → సగటు జీవితకాలం పురుషుల్లో ఐదేళ్లు, మహిళల్లో నాలుగేళ్లు పెరుగుతుంది. స్త్రీలలో 71.1 నుంచి 76 ఏళ్లకు, పురుషుల్లో 76.2 నుంచి 80.5 ఏళ్లకు పెరుగుతుంది. → పూర్తి ఆరోగ్యవంతమైన జీవితకాలం ప్రపంచవ్యాప్తంగా సగటున 2.6 ఏళ్లు పెరుగుతుంది. ఇది 2022లో 64.8 ఏళ్లుండగా 2050 నాటికి 67.4 ఏళ్లకు చేరుతుంది. → భారత్‌లో 2050 నాటికి పురుషుల సగటు జీవిత కాలం 75 ఏళ్లకు కాస్త పైకి, మహిళల్లో 80 ఏళ్లకు చేరుకుంటుంది. → మన భారతదేశంలో ఆరోగ్యవంతమైన జీవితకాలం స్త్రీ పురుషులిద్దరిలోనూ సమానంగానే ఉంటుంది. 2050 నాటికి 65 ఏళ్లు దాటేదాకా ఆరోగ్యంగా జీవిస్తారు. → జీబీడీ–2021 అధ్యయనం కోసం ప్రపంచవ్యాప్తంగా 11,000 సంస్థల సహకారం తీసుకున్నారు. 204 దేశాల నుంచి 371 రకాల వ్యాధులకు సంబంధించిన అంచనాలు, 88 రిస్క్ ఫ్యాక్టర్లను పరిగణనలోకి తీసుకున్నారు. → ప్రపంచవ్యాప్తంగా వైద్య సదుపాయాలతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిపై జనంలో అవాగాహన పెరుగుతుండడం సగటు జీవితకాలం పెరుగుదలకు దోహదపడుతోంది. → జీవితకాలం పెరుగుదల విషయంలో ప్రపంచ దేశాల మధ్య అసమానతలు చాలావరకు తగ్గుతున్నట్లు గుర్తించామని ఐహెచ్ఎంఈ డైరెక్టర్ క్రిస్ ముర్రే చెప్పారు. → సగటు జీవనకాలం ప్రస్తుతం తక్కువగా ఉన్న దేశాల్లో 2050 నాటికి బాగా పెరగనుందన్నారు. హృద్రోగాలు, కరోనాతో పాటు తీవ్రమైన అంటు రోగాలతో పాటు పౌష్టికాహార లోపం తదితరాలను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుండటమే అందుకు కారణమని ముర్రే చెప్పారు. → భావి తరాలు స్థూలకాలం, అధిక రక్తపోటుతో బాగా బాధపడే ఆస్కారముందని అభిప్రాయపడ్డారు. -
సర్కారు బడిలో అంతర్జాతీయ విద్య
సాక్షి, అమరావతి: ‘మన పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలి. ప్రపంచానికి దిక్సూచిగా మారాలి. అందుకోసం వారికి మీ జగన్ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చి డిజిటల్ బోధన ప్రవేశపెట్టాం. సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేస్తున్నాం. మన పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బక్‌లారియెట్ (ఐబీ) బోధన కూడా ప్రవేశపెడతాం’’ జగనన్న ఆణిముత్యాలు రాష్ట్ర స్థాయి సత్కార వేడుకలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాట ఇది. కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా ఐబీ సంస్థతో బుధవారం ఒప్పందం చేసుకుని ఆచరణలోకి తెచ్చారు. ఇప్పటికే సర్కారు బడిలో సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లిష్ బోధనను అందుబాటులోకి తె చ్చిన ప్రభుత్వం ఇప్పుడు ‘ఐబీ’ చదువులను సైతం పేద పిల్లలకు చేరువ చేస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 210 వరల్డ్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే ఐబీ సిలబస్ అమల్లో ఉంది. ఈ స్కూళ్లలో సంపన్నులు మాత్రమే తమ పిల్లలను చదివించగలరు. అలాంటి చదువులను రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలోకి తెచ్చి పేద పిల్లలకు అందించాలన్న సంకల్పంతో జగన్ సర్కారు ముందడుగు వేసింది. ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ ప్లస్2 వరకు విద్యనందించేందుకు చర్యలు తీసుకుంది. ప్రపంచం మె చ్చిన విద్యా విధానం సాధారణంగా ప్రైవేటు స్కూళ్లలో మార్కులు.. ర్యాంకులు.. ఒకరితో మరొకరికి పోటీతో పిల్లలపై విపరీతమైన ఒత్తిడి పెంచుతారు. దీనికి భిన్నంగా మానసిక ఒత్తిడి లేకుండా పిల్లలు సొంతంగా ఎదగడంతో పాటు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బోధనను ఐబీ అందిస్తుంది. ఐబీ ఒక నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్. పిల్లలపై పరీక్షల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన కొంత మంది ఉపాధ్యాయులు పరిశోధన చేసి 1968లో స్విట్జర్లాండ్‌లో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ బోర్డు. ఇందులో 3 నుంచి 19 ఏళ్ల వయసు విద్యార్థులకు నాణ్యమైన శిక్షణనిస్తారు. ఈ సిలబస్ చదువుకున్న పిల్లల్లో విషయ పరిజ్ఞానం, క్రిటికల్ థింకింగ్, ఇండిపెండెంట్ థింకింగ్, సెల్ఫ్ లెరి్నంగ్ వంటి నైపుణ్యాలు అలవడతాయి. ఓపెన్–మైండెడ్, ఓపెన్ లెర్నింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను ఆకళింపు చేసుకుని, సానుకూల మార్పునకు ఈ పిల్లలు సిద్ధంగా ఉంటారు. ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 159 దేశాల్లో ఈ విద్యా విధానం అమలులో ఉంది. ఈ బోర్డులో చదువుకున్న పిల్లలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రవేశాలు, అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షలు, ఇతర కోర్సులు అంటూ పిల్లలపై ఒత్తిడి పెంచుతున్న నేటి యుగంలో ‘ఐబీ సిలబస్’లో పిల్లల నైపుణ్యాలను అంచనా వేసే అంతర్గత పరీక్షలేగాని అధికారిక పరీక్షలు ఉండవు. నాలుగు దశల్లో ప్రోగ్రాములు ఐబీ ప్రోగ్రాములు నాలుగు దశల్లో ఉంటాయి. 3 నుంచి 12 సంవత్సరాల వయసు విద్యార్థులకు ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్ (పీవైపీ) అందిస్తారు. ఇందులో పిల్లలకు నేర్చుకునే ఆసక్తి పెంచడం, కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ నాలెడ్జ్, సొంతంగా ఆలోచించడం వంటివి నేర్పిస్తారు. ఈ ప్రోగ్రాంలో పరీక్షలు గానీ, గ్రేడింగ్ కానీ ఉండవు. పదేళ్ల ఈ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత చివరలో సైన్స్ ఎగ్జిబిషన్ వంటిది నిర్వహించి పిల్లలను భాగస్వామ్యం చేస్తారు. ♦ కాగా, 11 నుంచి 16 సంవత్సరాల విద్యార్థులకు మిడిల్ ఇయర్స్ ప్రోగ్రామ్ (ఎంవైపీ) ఉంటుంది. ఇందులో విద్యార్థులకు ఆర్ట్స్, లాంగ్వేజ్, లాంగ్వేజ్ అక్విజిషన్, మ్యాథ్స్, డిజైన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇండివిడ్యువల్స్ అండ్ సొసైటీస్, సైన్సెస్ అనే 8 గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూపు నుంచి విద్యార్థులు కనీసం ఒక సబ్జెక్ట్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో పిల్లలు నైపుణ్యాలను ఎంత నేర్చుకుంటున్నారు అనే దానిని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఈ కోర్సు ప్రస్తుతం మన పదో తరగతికి సమానం. ♦ ఇక 16 నుంచి 19 ఏళ్ల వయసున్న విద్యార్థులకు డిప్లొమా ప్రోగ్రామ్ (డీపీ) ఉంటుంది. మూడేళ్ల పాటు ఉండే ఈ ప్రోగ్రామ్‌లో లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, లాంగ్వేజ్ అక్విజిషన్, సైన్స్, ఆర్ట్స్, మ్యాథ్స్, ఇండివిడ్యువల్స్ అండ్ సొసైటీస్ అనే 6 గ్రూపులు ఉంటాయి. డిప్లొమా ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత చివర్లో సరి్టఫికెట్ ప్రదానం చేస్తారు. మన ప్లస్ 2 విద్యకు సమానమైన ఈ డిప్లొమా సర్టిఫికెట్ ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనైనా చెల్లుతుంది. ♦ ఇదే వయసున్న (16–19 సం.) విద్యార్థుల కోసం కెరీర్ రిలేటెడ్ ప్రోగ్రామ్ (సీపీ) డిజైన్ చేశారు. ఇది విశ్వవిద్యాలయాలు, ఉపాధి, తదుపరి ట్రైనింగ్ కోసం విద్యార్థులను సిద్ధం చేసే రెండేళ్ల ప్రోగ్రామ్. విద్యార్థులు ఎంచుకున్న కెరీర్లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను, జ్ఞానాన్ని పెంపొందిస్తారు. విశ్వ మానవుడిగా ఎదుగుదల ఐబీ విద్య విద్యార్థులకు విమర్శనాత్మకంగా ఆలోచించడం, ప్రశి్నంచడం అలవాటు చేస్తుంది. ఇది సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించే సామర్థాన్ని ఇస్తుంది. రాయడం, మాట్లాడటం, ప్రెజెంటేషన్ సహా వివిధ మార్గాల్లో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసే నైపుణ్యాలు బోధిస్తారు. వారి చదువు, కెరీర్‌ను మరింత విజయవంతం చేసేందుకు దోహదం చేస్తుంది. ఐబీ విద్యార్థులు విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల గురించి నేర్చుకుంటారు. ఇది వారికి మరింత సహనాన్ని, ఇతరులను అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని అందిస్తుంది. విద్యార్థులు బాధ్యతాయుతమైన ప్రపంచ పౌరులుగా తయారు చేస్తారు. ప్రపంచంలో ఏమూల ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా అక్కడ సానుకూల మార్పును తీసుకురావడానికి ఈ విద్య సహాయపడుతుంది. అంతర్జాతీయంగా అత్యున్నత కెరీర్‌ను సొంతం చేసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో 210 ఐబీ స్కూళ్లు వాస్తవానికి ఇంటర్నేషనల్ బాకలారియెట్ చదువులు చాలా ఖర్చుతో కూడుకున్నది. మన దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ముస్సోరి, కొడైకెనాల్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు పరిధిలో 210 ఐబీ వరల్డ్ స్కూల్స్ ఉన్నా యి. వాటిల్లో ఏడాదికి రూ. 6 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. చాలా స్కూళ్లలో ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్ (3–12సం.) మాత్రమే అందిస్తుండగా, కొన్ని కొన్ని మిడిల్ ఇయర్ ప్రోగ్రామ్ (11–16 సం.) వరకు, అతి తక్కువ స్కూళ్లు మాత్రం డిప్లొమా ప్రోగ్రామ్ (డీపీ) వరకు బోధిస్తున్నాయి. -
తెలుగు.. 4,500 ఏళ్ల వెలుగు!
సాక్షి, హైదరాబాద్: వేయి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా 4,500 ఏళ్లు! ఒక భాషగా తెలుగు ఉనికిలో ఉన్న కాలమిది! ఒక్క తెలుగేమిటి.. కన్నడ, తమిళ, మలయాళ భాషలతో కూడిన ద్రావిడ భాషా కుటుంబం మొత్తం ఇంత పురాతనమైందని అంటోంది జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సైన్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. ప్రాచీన భాషగా గుర్తింపు కోసం తెలుగు, కన్నడ భాషలు సుప్రీంకోర్టులో పోరాడుతున్న తరుణంలో ఈ అధ్యయనానికి ప్రాముఖ్యత ఏర్పడింది. దక్షిణాదిన ఉన్న 4 ప్రధాన భాషలతోపాటు ఎక్కడో బలూచిస్తాన్‌లో మాట్లాడే బ్రాహుయీ వంటివన్నీ ద్రావిడ భాషా కుటుంబానికే చెందుతాయి. అఫ్గానిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వరకూ ఉండే దక్షిణాసియాలో ఈ భాషా కుటుంబంలో మొత్తం 80 భాషలు, యాసలున్నాయని అంచనా. దాదాపు 22 కోట్ల మంది మాట్లాడే ఈ వేర్వేరు భాషలు, యాసలు ఎంత పురాతనమైనవో తెలుసుకునేందుకు ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహించారు. ఆయా భాషలు మాట్లాడేవారి నుంచి పదాలు, వాటి అర్థాల వంటి వివరాలు సేకరించి విశ్లేషించారు. అందులో తేలిందేమిటంటే.. ఇవన్నీ 4,000 నుంచి 4,500 ఏళ్ల పురాతనమైనవీ అని! అయితే తమిళం, సంస్కృత భాషలు వీటికంటే పురాతనమైనవి కావొచ్చని, సంస్కృత భాష వినియోగం కాలక్రమంలో అంతరించిపోగా, తమిళం మాత్రం ఇప్పటికీ కొనసాగుతోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కె.విష్ణుప్రియ తెలిపారు. క్రీస్తుశకం 570 ప్రాంతానికి చెందిన కళ్లమళ్ల శాసనం తెలుగులో గుర్తించిన తొలి శాసనం అన్న సంగతి తెలిసిందే. యురేసియా చరిత్రకు ఇవే కీలకం యురేసియా ప్రాంతపు పూర్వ చరిత్రను తెలుసుకోవాలంటే ద్రావిడ కుటుంబ భాషలు కీలకమని, ఇవి ఇతర భాషలను ప్రభావితం చేయడమే అందుకు కారణమన్నది నిపుణుల అంచనా. ఈ భాషలన్నీ ఎప్పుడు, ఎక్కడ పుట్టాయి? ఎంత వరకూ విస్తరించాయి? అన్న అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. కాకపోతే ద్రావిడులు భారత ఉపఖండానికి చెందినవారేనని ఉత్తర భారత ప్రాంతానికి ఆర్యులు రావడానికి ముందు నుంచే వీరు ఇక్కడ ఉన్నారనడంపై పరిశోధకుల మధ్య ఏకాభిప్రాయం ఉంది. క్రీ.పూ. 3500 ప్రాంతంలో ఆర్యులు భారత్‌కు వచ్చారని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. అయితే భారతీయుల జన్యుక్రమంలో ఇతర ప్రాంతాల వారి జన్యువులేవీ లేవని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు పరిశోధన ద్వారా స్పష్టం చేశారు. గణాంక శాస్త్ర పద్ధతుల ద్వారా.. ద్రావిడ కుటుంబ భాషలు ఎంత పురాతనమైనవో తెలుసుకునేందుకు మ్యాక్స్‌ప్లాంక్ శాస్త్రవేత్తలు ఆధునిక గణాంక శాస్త్ర పద్ధతులను ఉపయోగించారు. అన్ని ద్రావిడ కుటుంబ భాషల ప్రజల నుంచి పదాలను వాటి అర్థాలను సేకరించి అవి 4,500 ఏళ్ల పురాతనమైన భాషలు, యాసలు కావచ్చునని గుర్తించారు. పురాతత్వ ఆధారాలు దీన్ని రూఢీ చేస్తున్నాయని విష్ణుప్రియ తెలిపారు. ఇదే సమయంలోనే ద్రావిడ భాషలు ఉత్తర, మధ్య, దక్షిణ భాగాలుగా విడిపోయాయని, సంస్కృతీపరమైన మార్పులూ ఈ కాలంలోనే మొదలైనట్లు పురాతత్వ ఆధారాల ద్వారా తెలుస్తోందని వివరించారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ భాషల మధ్య ఉన్న సంబంధాలపై మరింత స్పష్టత రావొచ్చని, భౌగోళిక చరిత్రకూ భాషలకూ మధ్య సంబంధం కూడా తెలుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తెలంగాణలో తెలుగు భాషకు సంబంధించి 2 వేల సంవత్సరాల నాటి ఆధారాలు లభ్యమయ్యాయి. తాజా అధ్యయనం ప్రకారం తెలుగు 4,500 సంవత్సరాల పురాతనమైనదే అయితే తెలుగువాళ్లంతా స్వాగతించాలి. రామగిరి ఖిల్లాలో లభించిన గోపరాజుల నాణాలపై ‘అన్న’అనే తెలుగు పదం ఉంది. – నందిని సిధారెడ్డి, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ -
`అనాస్ట్రోజోల్` తో బ్రెస్ట్ కేన్సర్ నివారణ
సిడ్నీ: మహిళలలో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ కేన్సర్ కు ఔషధాన్ని కనుగొన్నట్టు ఆస్ట్రేలియా పరిశోధకులు వెల్లడించారు. ఈ ఔషధంలో బ్రెస్ట్ కేన్సర్ ను నివారించే గుణం ఉందంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిశోధనలో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందిన ప్రొపెసర్ క్రిస్టోబెల్ సాండర్స్ నేతృత్వంలో పరిశోధకుల బృందం ఈ ఔషధాన్ని తయారుచేసింది. ఈ ఔషధం పేరు `అనాస్ట్రోజోల్'`. దీంతో బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతున్న చాలామంది మహిళలకు ఈ ఔషధం ఉపయోగరమని పేర్కొంది. ఈ ఔషధంలో కొన్ని దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) ఉన్నా.. అదనపు ప్రయోజనాలు మాత్రం ఎక్కువగా ఉన్నట్టు పరిశోధన విభాగం తెలిపింది. బ్రెస్ట్ కేన్సర్ బాధిత కుటుంబాలనుంచి వచ్చిన వందలాది మంది మహిళలు పరిశోధనలో పాల్గొన్నారు. పరిశోధన ప్రకారం.. ఈ అనాస్ట్రోజోల్ ఔషధాన్ని తీసుకున్న మహిళకు ఐదుసంవత్సరాలలో మళ్లీ కేన్సర్ వచ్చే అవకాశం 50 శాతం వరకూ తగ్గుతుందని వెల్లడించింది. ఈ ఔషధంతో భవిష్యత్తులో తరాల మహిళలకు కూడా ప్రయోజనకారిగా ఉంటుందని క్రిస్టోబెల్ సాండర్స్ ఓ ప్రకటనలో తెలిపారు.