Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి.. | Global Life Expectancy Could Rise By More Than 4 Years by 2050 | Sakshi
Sakshi News home page

Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..

Published Sat, May 18 2024 5:46 AM | Last Updated on Sat, May 18 2024 5:46 AM

Global Life Expectancy Could Rise By More Than 4 Years by 2050

పురుషుల్లో ఐదేళ్లు, మహిళల్లో నాలుగేళ్లు 

2.6 ఏళ్లు పెరగనున్న ఆరోగ్యకర జీవితకాలం 

దాంతోపాటే పెరుగుతున్న వ్యాధుల ముప్పు 

అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడి 

న్యూఢిల్లీ: మానవాళికి శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు జీవితకాలం పెరుగుతున్నట్లు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి వెల్లడించింది. 2022 నుంచి 2050 మధ్య పురుషుల్లో 4.9 సంవత్సరాలు, మహిళల్లో 4.3 సంవత్సరాలు పెరుగుతుందని తేల్చింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్, ఎవాల్యుయేషన్‌(ఐహెచ్‌ఎంఈ) నిర్వహించిన గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజెస్‌(జీబీడీ)–2021 అధ్యయనం వివరాలను లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురించారు.

 ‘‘మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా సగటు జీవితకాలం ఐదేళ్ల దాకా పెరుగుతుంది. కానీ అదే సమయంలో వ్యాధుల ముప్పు కూడా బాగా పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్‌ వంటివి ఎక్కువ ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా స్థూలకాయం, అధిక రక్తపోటు వంటివి బాగా వేధిస్తాయి’’ అని అధ్యయనం హెచ్చరించింది. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం ద్వారా ఈ ముప్పును వీలైనంతగా తగ్గించుకోవచ్చని అధ్యయనం సూచించింది. అధ్యయనం ఇంకా ఏం తేలి్చందంటే... 

→ సగటు జీవితకాలం పురుషుల్లో ఐదేళ్లు, మహిళల్లో నాలుగేళ్లు పెరుగుతుంది. స్త్రీలలో 71.1 నుంచి 76 ఏళ్లకు, పురుషుల్లో 76.2 నుంచి 80.5 ఏళ్లకు పెరుగుతుంది. 
→ పూర్తి ఆరోగ్యవంతమైన జీవితకాలం ప్రపంచవ్యాప్తంగా సగటున 2.6 ఏళ్లు పెరుగుతుంది. ఇది 2022లో 64.8 ఏళ్లుండగా 2050 నాటికి 67.4 ఏళ్లకు చేరుతుంది. 
→ భారత్‌లో 2050 నాటికి పురుషుల సగటు జీవిత కాలం 75 ఏళ్లకు కాస్త పైకి, మహిళల్లో 80 ఏళ్లకు చేరుకుంటుంది. 
→ మన భారతదేశంలో ఆరోగ్యవంతమైన జీవితకాలం స్త్రీ పురుషులిద్దరిలోనూ సమానంగానే ఉంటుంది. 2050 నాటికి 65 ఏళ్లు దాటేదాకా ఆరోగ్యంగా జీవిస్తారు. 
→ జీబీడీ–2021 అధ్యయనం కోసం ప్రపంచవ్యాప్తంగా 11,000 సంస్థల సహకారం తీసుకున్నారు. 204 దేశాల నుంచి 371 రకాల వ్యాధులకు సంబంధించిన అంచనాలు, 88 రిస్క్‌ ఫ్యాక్టర్లను పరిగణనలోకి తీసుకున్నారు.  
→ ప్రపంచవ్యాప్తంగా వైద్య సదుపాయాలతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిపై జనంలో అవాగాహన పెరుగుతుండడం సగటు జీవితకాలం పెరుగుదలకు దోహదపడుతోంది.  
→ జీవితకాలం పెరుగుదల విషయంలో ప్రపంచ దేశాల మధ్య అసమానతలు చాలావరకు తగ్గుతున్నట్లు గుర్తించామని ఐహెచ్‌ఎంఈ డైరెక్టర్‌ క్రిస్‌ ముర్రే చెప్పారు. 
→ సగటు జీవనకాలం ప్రస్తుతం తక్కువగా ఉన్న దేశాల్లో 2050 నాటికి బాగా పెరగనుందన్నారు. హృద్రోగాలు, కరోనాతో పాటు తీవ్రమైన అంటు రోగాలతో పాటు పౌష్టికాహార లోపం తదితరాలను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుండటమే అందుకు కారణమని ముర్రే చెప్పారు. 
→ భావి తరాలు స్థూలకాలం, అధిక రక్తపోటుతో బాగా బాధపడే ఆస్కారముందని అభిప్రాయపడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement