గర్భిణులు పారాసిటమాల్‌ వాడితే... పిల్లల్లో ఏడీహెచ్‌డీ! | Child ADHD risk linked to mother use of acetaminophen | Sakshi
Sakshi News home page

గర్భిణులు పారాసిటమాల్‌ వాడితే... పిల్లల్లో ఏడీహెచ్‌డీ!

Published Mon, Mar 10 2025 6:10 AM | Last Updated on Mon, Mar 10 2025 6:10 AM

Child ADHD risk linked to mother use of acetaminophen

తాజా అధ్యయనంలో వెల్లడి 

కొందరు పిల్లలు చదువుతో పాటు ఆటపాటలు, అల్లరిలోనూ చురుగ్గా ఉంటారు. మరికొందరు మరీ అతి చురుకుదనం చూపిస్తారు. ఏదైనా ఇట్టే చేయగలమనే ధీమా వాళ్లలలో తొణికిసలాడుతుంది. అలా శక్తికి మించిన పనులు చేసి సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు. అలాంటి ఈ పిల్లలు దేనిపైనా ఎక్కువ సేపు దృష్టి పెట్టలేరు. ఆలోచన కంటే ఆవేశంతోనే పనులు చేస్తుంటారు. 

పర్యావసానాలను కూడా పట్టించుకోరు. ఇలాంటి వాళ్లు అటెన్షన్‌ డిఫిసిట్‌ హైపరాక్టివిటీ డిజార్టర్‌ (ఏడీహెచ్‌డీ)తో బాధపడుతున్నట్టు! పారాసిటమాల్‌గా పిలిచే అసిటమినోఫిన్‌ను గర్భిణులు అతిగా వాడితే పిల్లల్లో ముప్పు మూడింతలు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. తలనొప్పికి, జ్వరానికి పారాసిటమాల్‌ వాడటం మన దగ్గర పరిపాటి. ఇది జ్వరంతో పాటు ఓ మాదిరి ఒంటి నొప్పులను కూడా తగ్గిస్తుంది. 

కానీ నొప్పి గర్భంతో ఉన్నప్పుడు ఈ మాత్రను అతిగా వాడితే పుట్టబోయే పిల్లల మెదడు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్టు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. గర్భంతో ఉన్న 307 మంది నల్లజాతి మహిళల్లో పారాసిటమాల్‌ వాడినప్పుడు ఒంట్లో రక్తప్రవాహ రేట్లు, రక్తంలో ఈ ఔషధ పాళ్లను గమనించారు. 

వాటిని అతిగా వాడిన వారికి పుట్టిన చిన్నారుల్లో మిగతా పిల్లలతో పోలిస్తే ఏడీహెచ్‌డీ ముప్పు మూడు రెట్లు అధికమని తేలింది. అమ్మాయిలైతే పదేళ్ల లోపు ఏడీహెచ్‌డీ బారిన పడే ముప్పు ఏకంగా ఆరు రెట్లు ఎక్కువని అధ్యయనకారులు తెలిపారు. కనుక తప్పని పరిస్థితుల్లో మాత్రమే పారాసిటమాల్‌ వాడాలని సూచించారు. అధ్యయన వివరాలు ‘నేచర్‌ మెంటల్‌ హెల్త్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 
 

దశాబ్దాలుగా వాడకం 
‘‘అసిటమినోఫిన్‌ను దశాబ్దాలుగా వాడుతున్నారు. గర్భిణుల్లో పిండం తాలూకు మెదడు, నాడీవ్యవస్థ ఎదుగుదలపై అసిటమినోఫిన్‌ ప్రభావంపై ఇంతవరకు ఎలాంటి పరిశోధనలూ జరగలేదు. తాజా పరిశోధన నేపథ్యంలో గర్భిణుల పారాసిటమాల్‌ వాడకంపై అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మిని్రస్టేషన్‌ (ఎఫ్‌డీఏ) విభాగం పునఃసమీక్ష జరపాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై అమెరికా ప్రభుత్వం ఆలోచించాలి’’ అని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లో పిల్లల వైద్య నిపుణురాలు షీలా సత్యనారాయణ చెప్పారు. అయితే, ‘‘ప్రస్తుత పరిశోధన ఫలితాలతో బెంబేలెత్తాల్సిన పని కూడా లేదు. 

దీనిపై మరింత విస్తృత అధ్యయనం జరగాల్సి ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గర్భిణులకు పారాసిటమల్‌ను తప్పనిసరైతేనే, అదీ  తక్కువ డోసులోనే వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. తాజా అధ్యయనం నేపథ్యంలో ఎఫ్‌డీఏతో పాటు యూరోపియన్‌ మెడికల్‌ ఏజెన్సీ, అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఒబ్‌్రస్టిటీíÙయన్స్, గైనకాలజిస్ట్స్, ది సొసైటీ ఆఫ్‌ ఓబ్‌స్ట్రిటీíÙయన్స్‌ అండ్‌ గైనకాలజిస్ట్స్‌ ఆఫ్‌ కెనడా, ది సొసైటీ ఆఫ్‌ మెటర్నల్‌ –ఫీటల్‌ తదితరాలు పునరాలోచనలో పడే వీలుంది. అయితే గర్భిణులు అసిటమినోఫిన్‌ వాడితే పిల్లలకు ఏడీహెచ్‌డీ వస్తుందని నిరూపణ కాలేదని ఎఫ్‌డీఏ అధికారులు 2015లో తేల్చడం గమనార్హం.     
    
– వాషింగ్టన్‌  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement