University of Washington
-
Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
న్యూఢిల్లీ: మానవాళికి శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు జీవితకాలం పెరుగుతున్నట్లు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి వెల్లడించింది. 2022 నుంచి 2050 మధ్య పురుషుల్లో 4.9 సంవత్సరాలు, మహిళల్లో 4.3 సంవత్సరాలు పెరుగుతుందని తేల్చింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్, ఎవాల్యుయేషన్(ఐహెచ్ఎంఈ) నిర్వహించిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్(జీబీడీ)–2021 అధ్యయనం వివరాలను లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించారు. ‘‘మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా సగటు జీవితకాలం ఐదేళ్ల దాకా పెరుగుతుంది. కానీ అదే సమయంలో వ్యాధుల ముప్పు కూడా బాగా పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటివి ఎక్కువ ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా స్థూలకాయం, అధిక రక్తపోటు వంటివి బాగా వేధిస్తాయి’’ అని అధ్యయనం హెచ్చరించింది. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం ద్వారా ఈ ముప్పును వీలైనంతగా తగ్గించుకోవచ్చని అధ్యయనం సూచించింది. అధ్యయనం ఇంకా ఏం తేలి్చందంటే... → సగటు జీవితకాలం పురుషుల్లో ఐదేళ్లు, మహిళల్లో నాలుగేళ్లు పెరుగుతుంది. స్త్రీలలో 71.1 నుంచి 76 ఏళ్లకు, పురుషుల్లో 76.2 నుంచి 80.5 ఏళ్లకు పెరుగుతుంది. → పూర్తి ఆరోగ్యవంతమైన జీవితకాలం ప్రపంచవ్యాప్తంగా సగటున 2.6 ఏళ్లు పెరుగుతుంది. ఇది 2022లో 64.8 ఏళ్లుండగా 2050 నాటికి 67.4 ఏళ్లకు చేరుతుంది. → భారత్‌లో 2050 నాటికి పురుషుల సగటు జీవిత కాలం 75 ఏళ్లకు కాస్త పైకి, మహిళల్లో 80 ఏళ్లకు చేరుకుంటుంది. → మన భారతదేశంలో ఆరోగ్యవంతమైన జీవితకాలం స్త్రీ పురుషులిద్దరిలోనూ సమానంగానే ఉంటుంది. 2050 నాటికి 65 ఏళ్లు దాటేదాకా ఆరోగ్యంగా జీవిస్తారు. → జీబీడీ–2021 అధ్యయనం కోసం ప్రపంచవ్యాప్తంగా 11,000 సంస్థల సహకారం తీసుకున్నారు. 204 దేశాల నుంచి 371 రకాల వ్యాధులకు సంబంధించిన అంచనాలు, 88 రిస్క్ ఫ్యాక్టర్లను పరిగణనలోకి తీసుకున్నారు. → ప్రపంచవ్యాప్తంగా వైద్య సదుపాయాలతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిపై జనంలో అవాగాహన పెరుగుతుండడం సగటు జీవితకాలం పెరుగుదలకు దోహదపడుతోంది. → జీవితకాలం పెరుగుదల విషయంలో ప్రపంచ దేశాల మధ్య అసమానతలు చాలావరకు తగ్గుతున్నట్లు గుర్తించామని ఐహెచ్ఎంఈ డైరెక్టర్ క్రిస్ ముర్రే చెప్పారు. → సగటు జీవనకాలం ప్రస్తుతం తక్కువగా ఉన్న దేశాల్లో 2050 నాటికి బాగా పెరగనుందన్నారు. హృద్రోగాలు, కరోనాతో పాటు తీవ్రమైన అంటు రోగాలతో పాటు పౌష్టికాహార లోపం తదితరాలను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుండటమే అందుకు కారణమని ముర్రే చెప్పారు. → భావి తరాలు స్థూలకాలం, అధిక రక్తపోటుతో బాగా బాధపడే ఆస్కారముందని అభిప్రాయపడ్డారు. -
Radhika Aggarwal: ఆత్మవిశ్వాసమే గెలుపు మంత్రం
రాధిక అగర్వాల్ తండ్రి సైన్యంలో పనిచేసేవారు. తండ్రి ఉద్యోగరీత్యా జో«ద్‌పూర్ నుంచి అహ్మద్‌నగర్ వరకు ఎన్నో చోట్ల చదువుకుంది రాధిక. వాషింగ్టన్ యూనివర్శిటీలో ఎంబీయే చేసిన రాధిక అగర్వాల్‌కు ఎంటర్‌ప్రెన్యూర్‌గా పెద్ద పేరు తెచ్చుకోవాలనే కల ఉండేది. అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్లలో పోస్ట్–గ్రాడ్యుయేషన్ కూడా చేసింది. ‘చదువు ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇక వ్యాపారంలోకి నిస్సందేహంగా అడుగు పెట్టవచ్చు’ అనుకోలేదు ఆమె. అనుభవ జ్ఞానం విలువ ఏమిటో రాధిక అగర్వాల్‌కు తెలియనిదేమీ కాదు. చదువు పూర్తయిన తరువాత లైఫ్‌స్టైల్, ఇ–కామర్స్, ఫ్యాషన్, పబ్లిక్ రిలేషన్స్, రిటైల్ రంగాలలో 14 సంవత్సరాల పాటు పనిచేసింది. ఎన్నో రంగాలలో ఎంతో అనుభవాన్ని సంపాదించిన రాధిక అగర్వాల్ ఛండీగఢ్‌లో ఒక యాడ్ ఏజెన్సీకి శ్రీకారం చుట్టింది. ఆ తరువాత ప్రవాస భారతీయుల కోసం ‘ఫ్యాషన్ క్లూస్’ పేరుతో ఒక వెబ్సైట్ మొదలు పెట్టింది. మొదటి రెండు వ్యాపారాల విషయం ఎలా ఉన్నా... ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘షాప్ క్లూస్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయకేతనం ఎగరేసింది రాధిక అగర్వాల్. రెండు సంవత్సరాల క్రితం బ్యూటీ, న్యూట్రీషన్, హోమ్కేర్కు సంబంధించి ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘కైండ్ లైఫ్’ ప్రారంభించి మరోసారి విజయం సాధించింది. ‘ఒకసారి వెనక్కి చూస్తే... విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ కనిపిస్తాయి. అవి ఎప్పుడూ నన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి. జాగ్రత్తగా ఉండమని చెబుతాయి. వ్యాపారంలో విజయానికి వినియోగదారులకు మనపై ఉండే విశ్వాసం అనేది ముఖ్యం. అది గెలుచుకుంటే కచ్చితంగా గెలుపు మనదే. దీనికి వ్యూహాల కంటే మన నిజాయితీ అనేది ముఖ్యం. వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనడం ద్వారానే ఇంత పెద్ద విజయాన్ని సాధించగలిగాం’ అంటుంది రాధిక అగర్వాల్. ప్రతి సంవత్సరం ‘ఉమెన్స్ డే’ సందర్భంగా ఎక్కడో ఒకచోట మహిళలతో సమావేశం నిర్వహించి తన వ్యాపార ప్రస్థానాన్ని వారితో పంచుకుంటుంది. అగర్వాల్ స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు వ్యాపారవేత్తలుగా విజయం సాధించారు. ‘వ్యాపారంలో విజయం సాధించాలంటే ఉత్సాహం మాత్రమే సరిపోదు. బరిలోకి దిగే ముందు మన గురించి మనం విశ్లేషించుకోవాలి. ఎంతోమందితో మాట్లాడాలి. అయినా సరే, ఎప్పటికప్పుడు ఒక కొత్త సవాలు ఎదురవుతూనే ఉంటుంది. దానికి జవాబు చెప్పి ముందుకు కదలాలి. దీనికి కావాల్సింది ఆత్మవిశ్వాసం’ అంటుంది రాధిక అగర్వాల్. -
2050 నాటికి 130 కోట్ల మందికి మధుమేహం
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రానున్న 30 ఏళ్లలో విపరీతంగా పెరిగిపోనుంది. ప్రస్తుతం 50 కోట్లుగా ఉన్న చక్కెర వ్యాధి బాధితుల సంఖ్య 2050 కల్లా రెట్టింపు కంటే ఎక్కువగా 130 కోట్లకు చేరనుంది ఈ విషయాలను లాన్సెట్ పత్రిక వెల్లడించింది. ‘డయాబెటిస్ ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. ప్రపంచ దేశాల ఆరోగ్య వ్యవస్థలన్నిటికీ ఇది సవాలు వంటిదే. ఈ వ్యాధి కారణంగా ముఖ్యంగా గుండెజబ్బుల కూడా పెరుగుతాయి’అని ఈ పరిశోధనలకు సారథ్యం వహించిన యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన లియానె ఒంగ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 96 శాతం టైప్ 2 డయాబెటిస్వేనని తెలిపారు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్–2021 సర్వే ఆధారంగా 1990– 2021 సంవత్సరాల మధ్య వయస్సు, లింగం ఆధారంగా 204 దేశాలు, భూభాగాల్లో మధుమేహం విస్తృతి, అనారోగ్యం, మరణాలను బట్టి 2050 వరకు మధుమేహం వ్యాప్తి ఎలా ఉంటోందో వీరు అంచనా వేశారు. వీరి అధ్యయనం ప్రకారం.. మధుమేహం వ్యాప్తి రేటు 6.1%గా ఉంది. మరణాలు, వైకల్యానికి ప్రధాన కారణాలుగా నిలిచే టాప్–10 వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఉండటం గమనార్హం. ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలలో అత్యధికంగా 9.3% మంది ఈ వ్యాధికి గురికాగా 2050 నాటికి ఇది 16.8%కి చేరుకోనుంది. అదే లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతాల్లో అప్పటికల్లా దీని విస్తృతి 11.3% గా ఉంటుందని ఈ సర్వే తెలిపింది. అంతేకాకుండా, 65 ఏళ్లు, ఆపైన వారే ఎక్కువగా డయాబెటిస్ బారినపడుతున్నారని, అన్నిదేశాల్లోనూ ఇదే ఒరవడిని గుర్తించామని లియానె ఒంగ్ పేర్కొన్నారు. అత్యధికంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం ప్రాంతాల్లో అత్యధికంగా ఈ వయస్సు వారిలో 39.4 శాతం మంది ఈ జబ్బు బారినపడినట్లు గుర్తించామన్నారు. అత్యల్పంగా మధ్య ఆసియా, మధ్య యూరప్, తూర్పు యూరప్ దేశాల్లో 19.8% మందిలోనే ఉంది. టైప్2 డయాబెటిస్‌కు ప్రధానమైన 16 కారణాల్లో బీఎంఐ ప్రాథమిక కారణమని, టైప్ 2 డయాబెటిస్తో సంభవించే మరణాలు, వైకల్యాలకు ఇదే కీలకమని సర్వే తెలిపింది. ఆల్కహాల్, పొగాకు వినియోగంతోపాటు, ఆహార, వృత్తిపరమైన, పర్యావరణ సంబంధ సమస్యలతోపాటు తక్కువ శారీరక శ్రమ ఇందుకు ప్రధానమైన అంశాలని పేర్కొంది. తక్కువ, మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాల్లో జన్యుసంబంధ, సామాజిక, ఆర్థిక అంశాలు కూడా ఈ వ్యాధి బారినపడేందుకు కారణాలుగా ఉన్నాయి. -
వృద్ధాప్యానికి చెక్.. తాజా పరిశోధన ఫలితాలతో కొత్త ఆశలు!
వృద్ధాప్యం. మనిషి పరిణామ క్రమంలో అనివార్యమైన దశ. చాలామందికి నరకప్రాయం, బాధాకరం అయిన దశ కూడా. ఒంట్లో అవయవాలన్నీ ఒక్కొక్కటిగా శిథిలమవుతూ పట్టు తప్పి క్రమంగా పనికి రాకుండా పోతుంటే, అన్నింటికీ ఇతరులపై ఆధారపడాల్సిన నిస్సహాయత కుంగదీస్తుంటే, నీడలా వెంట తిరుగుతూ దోబూచులాడే మృత్యువు ఎప్పటికి కరుణిస్తుందా అని ఎదురు చూస్తూ దుర్భరంగా గడుస్తుంటుంది. అలాంటి వృద్ధాప్యాన్ని వీలైనంత వరకూ వాయిదా వేయగలిగితే? ఆ దిశగా ఇప్పటికే పరిశోధనలు మహా జోరుగా జరుగుతున్నాయి. సౌరశక్తి సాయంతో వయసు పెరుగుదలను బాగా నెమ్మదింపజేయవచ్చని అటువంటి అధ్యయనమొకటి తాజాగా చెబుతుండటం ఆసక్తికరం! ఎండలో నిలబడితే ఏమొస్తుందంటే విటమిన్ డి అనేస్తాం. కదా! ఇకపై ఎండలో నిలబడటం ద్వారా ముసలితనానికి టాటా చెప్పేయొచ్చని, వయసు పెరుగుదలను బాగా తగ్గించుకోవచ్చని అంటోంది తాజా అధ్యయనమొకటి. ‘‘సౌరశక్తిని మానవ కణాలు నేరుగా వాడుకునేందుకు అవసరమైన రసాయన శక్తిగా మార్చడం ద్వారా వాటిని ఎక్కువ కాలం పాటు జీవించేలా చేయొచ్చు. కణాల్లోని కీలకమైన మైటోకాండ్రియాలో నిర్దిష్టమైన జన్యుమార్పులు చేయడం దీన్ని సాధించవచ్చు. ఇప్పటికిప్పుడే కాకపోయినా సమీప భవిష్యత్తులో ఇది సాధ్యమై తీరుతుంది’’ అంటూ అది కుండబద్దలు కొడుతుండటం ఆసక్తికరం! వృద్ధాప్యానికి దారి తీసే అంశాల్లో మనిషి కణజాలంలోని కీలకమైన మైటోకాండ్రియా పనితీరు మందగించడమే ప్రధాన కారణం. కాకపోతే ఎటువంటి జీవక్రియలు ఇందుకు కారణమవుతాయన్నది మనకింకా తెలియదు. ఈ సంక్లిష్ట ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ‘‘సౌరశక్తిని రసాయన శక్తిగా మార్చి నిర్దిష్ట పద్ధతితో కణ కేంద్రకంలోని ప్రోటాన్లను శక్తిమంతం చేస్తే మైటోకాండ్రియాలోని జీవన పరిమాణాన్ని పెంచేందుకు తోడ్పడే సమలక్షణాలు సమృద్ధిగా పెరుగుతాయి. యుక్త వయసులో ఇలా కణజాలంలోని మైటోకాండ్రియా సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వయసు పెరుగుదలను బాగా నెమ్మదింపజేయొచ్చు. వయో సంబంధిత వ్యాధులకు మరింత మెరుగైన చికిత్స కూడా అందజేయడం వీలు పడుతుంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని రోచెస్టర్ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. ఇలా చేశారు...: మౌలిక జీవపరమైన సూత్రాలను అవగాహన చేసుకోవడానికి చిరకాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్న ఒకరకం నట్టలనే ఈ అధ్యయనానికి ఎంచుకున్నారు. వాటి కణజాలంలోని మైటోకాండ్రియాలో జన్యుపరంగా మార్పుచేర్పులు చేశారు. అనంతరం సౌరశక్తి సాయంతో దాన్ని పరిపుష్టం చేశారు. సూర్యరశ్మిని గ్రహించడం ద్వారా మైటోకాండ్రియా పైపొరలోని అయాన్లన్నీ మరింత శక్తిమంతంగా మారి దాని సామర్థ్యంతో పాటు తాజాదనం కూడా బాగా పెరిగాయి. మైటోకాండ్రియా–ఓఎన్గా పిలుస్తున్న ఈ ప్రక్రియ ద్వారా మెటబాలిజం రేటులో వృద్ధి జరిగి సదరు నట్టలు మరింత ఆరోగ్యకరంగా మారాయి. పైగా వాటి జీవితకాలం కూడా 30 నుంచి 40 శాతం దాకా పెరగడం గమనించారు. ‘‘మా పరిశో ధనలు విజయవంతమయ్యాయి. వాటిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తే వయో మనుషుల్లోనూ సంబంధమైన వ్యాధులను మరింత మెరుగ్గా నయం చేయడమే గాక ఆరోగ్యకరంగా, నిదానంగా వృద్ధాప్యం వైపు సాగేలా చూసే మార్గం చిక్కుతుంది’’ అని పరిశోధనలో పాలు పంచుకున్న సీనియర్ ఆథర్ ఆండ్రూ వొజోవిక్ చెప్పుకొచ్చారు. ‘‘మనిషి శరీరంలో జీవక్రియలపరంగా మైటోకాండ్రియా పోషించే సంక్లిష్టమైన పాత్రను గురించి ఈ అధ్యయనం ద్వారా మరిన్ని విశేషాలు వెలుగులోకి వచ్చాయి. దీని ఫలితాలు జర్నల్ నేచర్‌లో పబ్లిషయ్యాయి. శక్తి కేంద్రం... మైటోకాండ్రియాను కణం తాలూకు శక్తి కేంద్రంగా చెప్పొచ్చు. కణాల్లో జరిగే జీవ క్రియలకు కావాల్సిన శక్తిని ఇవే తయారు చేస్తాయి. కణంలో రెండు పొరలతో కూడుకుని ఉండే మైటోకాండ్రియాలు స్థూప, గోళాకృతుల్లో ఉంటాయి. జీవ క్రియలు చురుగ్గా సాగే కణాల్లో వీటి సంఖ్య అపారంగా ఉంటుంది. మైటోకాండ్రియా పనితీరు ఎంతగా తగ్గుతుంటే అవయవాలు క్షీణించి శిథిలమయ్యే ప్రక్రియ అంతగా వేగం పుంజుకుంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మద్యపానంతో హాని... యువతకే ఎక్కువ!
వాషింగ్టన్: మద్యపానంతో వయసు మళ్లిన వారితో పోలిస్తే యువతకే అనారోగ్య ముప్పు ఎక్కువట! మద్యం సేవనంపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నిపుణుల పరిశోధన ఫలితాలను లాన్సెట్ జర్నల్‌లో శుక్రవారం ప్రచురించారు. 15–39 ఏళ్ల వారిలో ఆల్కహాల్ వల్ల ఆరోగ్యానికి రిస్క్ అధికంగా ఉంటున్నట్లు పరిశోధనలో తేలింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 40 ఏళ్లు దాటి, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనివారు పరిమితంగా మద్యం తీసుకుంటే కార్డియో వాస్క్యులర్ జబ్బులు, గుండెపోటు, డయాబెటిస్ వంటి సమస్యలు తగ్గుతున్నట్లు వెల్లడయ్యింది. ఒకటి నుంచి రెండు పెగ్గులకే పరిమితం అయితే మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. 15–39 ఏళ్ల పురుషులు ఆల్కహాల్ సేవిస్తే ఆరోగ్యపరంగా నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని తేల్చిచెబుతున్నారు. మద్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు వంటి ఘటనల్లో బాధితులుగా మారుతున్నది ఎక్కువ శాతం 15–39 ఏళ్ల వయసు విభాగంలో ఉన్నవారేనని గుర్తుచేస్తున్నారు. ‘‘మేమిచ్చే సందేశం ఏమిటంటే.. యువత మద్యం జోలికి అస్సలు వెళ్లొద్దు. 40 ఏళ్లు దాటినవారు చాలాపరిమితంగా మద్యం తీసుకోవచ్చు. దానివల్ల వారికి ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలున్నాయి’’ అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ ఎమ్మానుయేల్ గాకిడౌ చెప్పారు. -
చౌకైన కోవిడ్ ‘స్మార్ట్’ టెస్ట్
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్ధారణ పరీక్షలు, ఫలితాల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. అలాంటి ఎదురుచూపులు లేకుండా స్మార్ట్ ఫోన్ డయాగ్నస్టిక్ టూల్‌ను అమెరికా అధ్యయనకారులు కనిపెట్టారు. సార్స్ కోవిడ్2 జన్యు పదార్థం నుంచి దీనిని రూపొందించినట్లు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ తెలిపింది. ఇది ఆర్టీపీసీఆర్ టెస్టు తరహాలోనే పనిచేస్తుందని, దానికంటే రెండు శాతం కచ్చితత్వం ఇస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ముక్కునుంచి సేకరించిన నమూనాతో 97 శాతం కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. 20 నిమిషాల్లో తక్కువ ధరతో నిర్ధారణ చేసే ఈ టూల్ ను ఎక్కడైనా ఉపయోగించొచ్చని, స్థిరమైన ఉష్ణోగ్రతల వద్ద జరిపే ఈ పరీక్ష ఆర్టీపీసీఆర్ కంటే తక్కువ సమయాన్ని తీసుకుంటుందని తెలిపారు. (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్‌పై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు) -
ప్రపంచంలోనే అత్యంత చిన్న కెమెరా.. సైజ్ ఎంతో తెలుసా?
సాధారణంగా మనం రోజూ వాడే ఫోన్లలో ఉండే కెమెరాలే మనకు కనిపించే అతి చిన్న కెమెరాలు కదా. వాటి సైజు ఎంతుంటుంది.. పప్పు గింజంత. కానీ కంటికి కనిపించీ కనిపించని పరిమాణంలో కెమెరాను చూసుంటారా? ప్రిన్స్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు తయారుచేసి చూపించారు. మనం వాడే సన్నరకం ఉప్పులోని రేణువంత పరిమాణంలో ఉండే కెమెరాను రూపొందించి ‘వావ్’ అనిపించారు. సాధారణ కెమెరాలు తీస్తే ఫొటోలు కలర్ఫుల్గా, స్పష్టంగా ఎలా వస్తాయో ఆ స్థాయిలో తీసేలా ఈ అర మిల్లీమీటర్ కెమెరాను రూపొందించారు. ఎలా తయారు చేశారు? ఈ కెమెరా తయారీకి అర మిల్లీమీటర్ పరిమాణంలోని గ్లాస్ లాంటి ‘ ఆప్టికల్ మెటాసర్ఫేస్’ను వాడారు. సాధారణ కెమెరాల్లో సూర్యకాంతిని అదుపుచేయడానికి గాజు లేదా ప్లాస్టిక్ లెన్సులు వాడతారు. మరి ఈ చిన్న కెమెరాలో ఏం వాడి ఉంటారు? అంటే.. హెచ్ఐవీ వైరస్ సైజులో ఉండే స్తూపాకార పరికరాలు (సిలిండ్రికల్ పోస్ట్స్) 16 లక్షలు ఉపయోగించారు. అసలే కంటికి సరిగా కనిపించనంత సైజులో ఉన్న ఈ అతి చిన్న కెమెరాలోనూ సిలిండ్రికల్ పోస్టులను అద్భుతంగా అమర్చారు. చదవండి: హోండూరస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా షియోమరా చిన్న కెమెరాతో తీసినది.. రెగ్యులర్ కెమెరాతో పైగా వీటిల్లో ఒక్కో పోస్టుకూ ప్రత్యేకమైన ఆకారం ఉంటుంది. యాంటెన్నా లాగా ఇవి పని చేస్తాయి. వీటిపై పడిన కాంతికి అవి ఎలా స్పందించాయో మెషీన్ లెర్నింగ్ అల్గారిథం ద్వారా గుర్తించి దాని ఆధారంగా ఫొటోను ముద్రిస్తారు. వీటిల్లో ముందువైపు ఆప్టికల్ టెక్నాలజీని, రెండోవైపు న్యూరల్ టెక్నాలజీని వాడారు. ఇప్పటివరకు తయారు చేసిన ‘కలర్ మెటా సర్ఫేస్’ రకం కెమెరాల్లో స్పష్టమైన ఫొటోలు తీసేది ఇదే. తన సైజుకన్నా 5 లక్షల రెట్లు పెద్దవైన వస్తువులను కూడా సులభంగా ఫొటోలు తీసేస్తుంది. చదవండి: పడుచు కుర్రాడనుకుంటున్నారా.. అసలు వయసు తెలిస్తే.. షాకవుతారు సమస్యలున్నాయా? గతంలో చిన్న సైజు కెమెరాలతో తీసే ఫొటోలు సరిగా వచ్చేవి కావు. ఈ కొత్త కెమెరాతో ఆ సమస్యను అధిగమించారు. అయితే ఫొటోల చివర్లో కాస్త అస్పష్టంగా ఉన్నట్టు కనిపించినా అంత చిన్న సైజు కెమెరా మామూలు కెమెరాలతో పోటీ పడి ఫొటోలు తీయడం గొప్పే. పైగా సాధారణ కాంతిలో కూడా అద్భుతంగా ఇది పని చేస్తుంది. ఎక్కడెక్కడ వాడొచ్చు? చిన్న సైజు రోబోల్లో ఈ కెమెరాలను వాడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాధులను గుర్తించడానికి, చికిత్స చేయడానికి వైద్యులు కూడా ఉపయోగించవచ్చని అంటున్నారు. మున్ముందు మన ఫోన్లకు వెనకాల మూడు కెమెరాలు అక్కర్లేదని, వెనకభాగమంతా పెద్ద కెమెరా అయిపోతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కెమెరా క్వాలిటీ పెంచడంపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. వస్తువులను గుర్తుపట్టే ‘సెన్సింగ్’ సాంకేతికతను కూడా జోడించాలని చూస్తున్నారు. – సాక్షి సెంట్రల్‌డెస్క్ -
ఈ రాక్షస చేప నోట్లో వందల పళ్లు!!.. ఇప్పటికీ రహస్యమే..
Pacific Lingcod Fish Mysterious Unknown and Shocking Facts in telugu: అనగనగా ఒక భారీ చేప. దాని నోటిలో వందల సంఖ్యలో రంపపు దంతాలు. అంతేకాదు ఆ పళ్లు వేగంగా పెరుగుతాయి. అంతేవేగంగా ఉడిపోతాయి. ఎందుకు? ఇదేదో జానపద పొడుపు కథలా ఉందే!! అని అనుకుంటున్నారా..? కథ కాదు ఇలలోనే...! ఈ రాక్షస చేప విశేషాలు మీకోసం.. ఆ చేప పేరు పసిఫిక్ లింగ్‌కాడ్. దాని నోటిలో 555 పదునైన దంతాలు ఉంటాయి. రోజుకు 20 పళ్లు చొప్పున ఊడిపోతాయి. మళ్లీ కొత్తవి పెరుగుతూ ఉంటాయి. ఐతే ఈ చేప దంతాలు మనుషుల దంతాలంత సైజులో కాకుండా చాలా చిన్నగా, పదునుగా ఉంటాయి. ఇలాంటి చేపలు సాధారణంగా నార్త్ పసిఫిక్ సముద్రంలో కనిపిస్తాయి. పసిఫిక్ లింగ్‌కాడ్ చేప యుక్తవయస్సులో 50 సెంటీమీటర్లు పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో 1.5 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఈ రకమైన చేపలకు పైన, కింద రెండు దవడలు ఉంటాయి. వీటిని ఫారింజియల్ దవడలు అంటారు. మనుషులు దవడపళ్లతో నమిలినట్లే చేపలు కూడా ఆహారాన్ని నమలడానికి ఉపయోగిస్తాయని లైవ్‌సైన్స్ నివేదిక తెల్పింది. చదవండి: Side Effects Of Wearing Jeans: ఆ జీన్స్ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో.. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్లో జీవశాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్న కార్లీ కోహెన్, ఈ నివేదిక ప్రధాన రచయిత ఎమిలీ కార్ ఈ చేపల దంతాలపై అధ్యయనం చేశారు. పసిఫిక్ లింగ్‌కోడ్ చేపల దంతాలు మైక్రోస్కోపిక్ పరిమాణంలో ఉన్నందువల్ల వీటిని మామూలు పద్ధతుల్లో లెక్కించడం కుదరదు. అందువల్ల ప్రయోగశాలలో 20 పసిఫిక్ లింగ్‌కోడ్ చేపలను ఒక ట్యాంక్‌లో ఉంచి, నీళ్లలో ఎరుపు రంగును కలిపారు. ఫలితంగా చేపల దంతాలు కూడా ఎరుపు రంగులోకి మారాయి. ఆ తర్వాత ఈ చేపల పళ్లపై మరకలు పడేలా పచ్చ రంగుకలిపిన మరో ట్యాంక్‌లోకి తరలించారు. ఎమిలీ కార్ లైవ్ సైన్స్‌తో మాట్లాడుతూ.. ‘ఈ చేపల పళ్లను లెక్కించడానికి ఒక చీకటి గదిలో పని చేయాల్సి వచ్చింది. మైక్రోస్కోప్‌లో పళ్లను లెక్కించాను. ఒక్కోచేపకు దాదాపుగా వెయ్యికి పైగా పళ్లున్నాయ’ని వెల్లడించారు. చేపలకు ఎక్కువ ఆహారం ఇవ్వడం వల్ల వాటి దంతాల రిప్లేస్మెంట్ సైకిల్లో ఏవైనా మార్పులు వస్తాయేమోననే కోణంలో కూడా పరిశోధకులు ప్రయత్నించారు. ఐతే ఎటువంటి మార్పులు సంభవించలేదు. అందువల్ల పసిఫిక్ లింగ్‌కాడ్ చేప పళ్లకు సంబంధించిన వింత ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. చదవండి: Science Facts: చీమల రక్తం అందుకే ఎర్రగా ఉండదట..! -
కోవిడ్ మరణాలు ఇంకా ఎక్కువేనట!
సాక్షి, అమరావతి: కోవిడ్ మరణాలను ప్రపంచ దేశాలు తక్కువగా చూపిస్తున్నాయంటోంది యూనివర్సిటీ ఆఫ్ అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్–ఇవాల్యూయేషన్ (ఐహెచ్ఎంఈ). 21 దేశాలు కోవిడ్ మరణాలను తక్కువగా చూపిస్తున్నాయని ఆ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. వాటిలో ప్రధానంగా ఆరు దేశాలు మే 3 నాటికి వెల్లడించిన కోవిడ్ మరణాలను వివరిస్తూ.. ఆ దేశాల్లో వాస్తవంగా ఎంతమంది కోవిడ్‌తో మరణించి ఉంటారనే అంచనాతో ఓ అధ్యయనాన్ని విడుదల చేసింది. ఆరు దేశాల జాబితాలో భారత్‌తోపాటు రష్యా, అమెరికా, మెక్సికో, బ్రెజిల్, బ్రిటన్ ఉన్నాయి. నివేదికలోని అంశాలు సంక్షిప్తంగా.. ► కరోనా మరణాలను అత్యధిక శాతం తగ్గించి చూపుతున్న దేశాల జాబితాలో రష్యా మొదటి స్థానంలో ఉంది. అధికారికంగా వెల్లడిస్తున్న మరణాల సంఖ్య కంటే ఆ దేశంలో ఐదున్నర రెట్లు ఎక్కువమంది చనిపోయి ఉంటారని నివేదిక పేర్కొంది. మే 3 నాటికి రష్యాలో 1,09,334 మంది కోవిడ్‌తో చనిపోయినట్టు ఆ దేశం వెల్లడించింది. కాగా ఆ దేశంలో 5,93,610 మంది కోవిడ్‌తో మరణించి ఉంటారని నివేదిక అంచనా వేసింది. ► ఆ జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. అధికారికంగా వెల్లడిస్తున్న మరణాల సంఖ్య కంటే భారత్‌లో మూడు రెట్లు ఎక్కువ మంది చనిపోయి ఉంటారని నివేదిక అంచనా వేసింది. మే 3నాటికి భారత్‌లో 2,21,181 మంది కోవిడ్‌తో చనిపోయినట్టు అధికారికంగా వెల్లడించారు. కానీ 6,54,395 మంది కోవిడ్‌తో మరణించి ఉంటారని నివేదిక అంచనా వేసింది. ► కరోనా మరణాలను తగ్గించి చూపుతున్న జాబితాలో మెక్సికో మూడో స్థానంలో ఉంది. మే 3 నాటికి మెక్సికోలో 2,17,694 మంది కోవిడ్‌తో చనిపోయినట్టు ఆ దేశం వెల్లడించింది. కానీ.. 6,17,127 మంది మరణించి ఉంటారని అంచనా వేసింది. ► కరోనా మరణాలను తగ్గించి చూపుతున్న దేశాల జాబితాలో అమెరికా 4వ స్థానంలో ఉంది. మే 3నాటికి అమెరికాలో కోవిడ్‌తో 5,74,043 మంది మరణించినట్టు అధికారికంగా వెల్లడించారు. కానీ ఆ దేశంలో 9,05,289 మంది కోవిడ్‌తో చనిపోయి ఉంటారని ఆ నివేదిక పేర్కొంది. ► ఈ జాబితాలో బ్రెజిల్ ఐదో స్థానంలో ఉంది. మే 3 నాటికి బ్రెజిల్లో 4,08,680 మంది కోవిడ్‌తో చనిపోయినట్టు చూపుతుండగా.. 5,95,903 మంది మరణించి ఉంటారని నివేదిక అంచనా వేసింది. ► బ్రిటన్‌లో అధికారిక లెక్కల ప్రకారం మే 3నాటికి 1,50,519 మంది కోవిడ్‌తో మరణించారని అధికారికంగా చెబుతుండగా.. 2,09,661 మంది మృతి చెంది ఉంటారని నివేదిక అంచనా వేసింది. ► చాలా దేశాల్లో కోవిడ్ పరీక్షలు తక్కువగా చేస్తున్నారు. అందువల్ల చాలా మరణాలు కోవిడ్ జాబితాలో చేరడం లేదు. ► మానసిక ఆందోళన, కుంగుబాటు కేసులు అమాంతంగా పెరుగుతున్నాయి. వాటితో సంభవిస్తున్న మరణాలు కోవిడ్ జాబితాలోకి రావడం లేదు. -
మెదడు పెద్దదైతే.. మానసిక రుగ్మతలు
వాషింగ్టన్ : మెదడు పరిమాణం పెద్దగా ఉండే వారు మనోవైకల్యం, అల్జీమర్స్ వంటి మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మెదడు పరిమాణం పెద్దగా ఉండడంతో మెదడులోని దూర ప్రాంతాలకు సమాచార మార్పిడి సరిగ్గా జరగకపోవడమే దీనికి కారణంగా వారు పేర్కొంటున్నారు. క్షీరదాలలో సమాచార మార్పిడి, జ్ఞాపకశక్తి వ్యవస్థలను మెదడులోని సెరెబ్రల్ కార్టెక్స్ నిర్వహిస్తుంది. దీనిలోని నాడుల పనితీరును తెలుసుకోవడం ద్వారా అది చేసే పనుల గురించి అవగాహనకు రావచ్చని వాషింగ్టన్ వర్సిటీ, రుమేనియాలోని బొలాయి వర్సిటీ పరిశోధకులు తెలిపారు. -
తక్కువ నిద్రకు కారణమదే!
వాషింగ్టన్: పూర్వీకులతో పోలిస్తే మనం నిద్రపోయే సమయం క్రమంగా తగ్గిపోతోంది. ఇలా మనం తక్కువ సమయం నిద్ర పోవడానికి గల కారణాల్ని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. కృత్రిమంగా సృష్టించిన కాంతి, విద్యుత్ వల్లే మానవులు నిద్రపోయే సమయం తగ్గుతోందని వారు అంటున్నారు. ఎందుకు నేటి తరం తక్కువ సమయం నిద్రపోతోందో తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా విద్యుత్ సౌకర్యం లేని రెండు గిరిజన జాతి తెగలను వారు పరిశీలించారు. ఇందులో ఒక తెగ వారు నివసించే ప్రాంతంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయగా, మరో తెగవారి ప్రాంతంలో మాత్రం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయలేదు. అనంతరం రెండు తెగల వారిని పరిశీలించగా, విద్యుత్ కాంతి ప్రభావానికి గురైన వారు క్రమంగా గంటపాటు తక్కువ నిద్రపోయే స్థితికి చేరుకున్నారు. మిగతా ప్రాంతం వారు మాత్రం ఎప్పటిలాగానే కావాల్సినంత సమయం నిద్ర పోయారు. దీని వల్ల తక్కువ నిద్ర పోయేందుకు విద్యుత్, కృత్రిమ కాంతి కారణాలని రుజువైంది. -
320 కోట్ల ఏళ్ల కిందటే జీవి పుట్టుక
మొదటి జీవి ఎప్పుడు పుట్టిందన్న విషయమై ప్రతిసారీ కొత్త సిద్ధాంతాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. భూమ్మీద 320 కోట్ల ఏళ్ల క్రితమే జీవి పుట్టిందని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాలి నుంచి నత్రజనిని తీసుకుని, దాన్ని జీవజాలానికి పనికొచ్చేలా చేసే ప్రక్రియ 320 కోట్ల ఏళ్ల క్రితమే జరిగిందని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఇంతకుముందు వరకు అయితే.. 200 కోట్ల ఏళ్ల క్రితమే వాతావరణంలోని నత్రజనిని ఉపయోగించుకున్నారని భావిస్తూ వచ్చారు. తాజా సిద్ధాంతంతో జీవి మనుగడ మరో వంద కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్లినట్లయింది. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్ర్రవేత్తలు. దక్షిణ ఆఫ్రికా, ఆగ్నేయ ఆస్ట్రేలియా ప్రాంతాల్లోని శిలాజాలపై జరిపిన పరిశోధనల్లో ఈ సంగతి రుజువైంది. జీవి పుట్టుకకు సంబంధించిన కచ్చితమైన సమాచారం తెల్సుకోవడంద్వారా మానవ పరిణామక్రమాన్ని మరింత సులువుగా అధ్యయం చేసే వీలుంటందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. -
ఒకరు ఆలోచించారు...మరొకరు వీడియోగేమ్ ఆడారు!
వాషింగ్టన్: వారిద్దరూ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు. అరమైలు దూరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు. ఒకరు కంప్యూటర్లో వీడియోగేమ్ చూస్తూ.. టార్గెట్లను ఎలా కాల్చాలో మనసులోనే ఆలోచించారు. మరో చోట ఉన్న వ్యక్తి మొదటి వ్యక్తి ఆలోచించిన విధంగానే వీడియోగేమ్‌లో టార్గెట్లను టపటపా కాల్చేశాడు! మెదడు నుంచి మెదడుకు సమాచార ప్రసారంలో శాస్త్రవేత్తలు సాధించిన అద్భుత పురోగతి ఇది. అందునా.. యూనివర్సిటీకి చెందిన భారత సంతతి శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్ రావు ఈ ప్రయోగానికి నేతృత్వం వహించడం విశేషం. ఇంతకూ ఇదెలా జరిగిందంటే... రాజేశ్ రావు తన తలకు మెదడు సంకేతాలను చదివే ఎలక్ట్రో-ఎన్సెఫలోగ్రఫీ యంత్రాన్ని అమర్చుకున్నారు. అలాగే, చేతిని కదిలించే మెదడులోని ఎడమ మోటార్ కార్టెక్స్ భాగాన్ని ప్రేరేపించేందుకు అయస్కాంత అనుకరణ పరికరంతో కూడిన ఓ టోపీని వేరొకచోట ఉన్న సహ పరిశోధకుడు ఆండ్రియా స్టోకో ధరించారు. తర్వాత రాజేశ్ రావు వీడియోగేమ్ చూస్తూ ఆలోచించగానే మెదడు సంకేతాలను చదివిన ఎలక్ట్రో-ఎన్సెఫలోగ్రఫీ యంత్రం ఆ సంకేతాలను ఇంటర్నెట్ ద్వారా నేరుగా స్టోకో తలకు అమర్చిన టోపీకి పంపింది. ఇంకేం.. జస్ట్ ఒక్క సెకను తేడాతోనే.. రాజేశ్ ఆలోచించినట్లుగానే కీబోర్డుపై స్టోకో చేతివేళ్లు కదిలి టార్గెట్లను కాల్చేశాయి. కాగా, మనుషులు మెలకువగా లేదా నిద్రలో ఉండేలా చేసేందుకు మెదడును నియంత్రించడంపైనా వీరు ప్రయోగాలు చేస్తున్నారు. దీనివల్ల.. ఒక పైలట్ నిద్రలో జోగితే.. మరో పైలట్ అప్రమత్తంగా ఉండేలా చేసేందుకూ వీలవుతుందట. ఉపాధ్యాయుడి మెదడు నుంచి విద్యార్థికి నేరుగా పాఠాలను మార్పిడి చేసే ‘బ్రెయిన్ టూటరింగ్’ను సాధ్యం చేయడంపైనా తాము దృష్టిపెట్టినట్లు రాజేశ్ రావు వెల్లడించారు. వీరి పరిశోధన వివరాలు ‘ప్లాస్ వన్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
2100 నాటికి 1,100 కోట్లకు ప్రపంచ జనాభా
వాషింగ్టన్: 2100 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 1,100 కోట్లకు చేరుతుందట. అయితే జనాభా పెరుగుదల అంశం.. పేదరికం, వాతావరణ మార్పులు, అంటువ్యాధుల వ్యాప్తి అనేక అంతర్జాతీయ సమస్యలకు కారణం కానుందట. ఐక్యరాజ్యసమితి, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సంయుక్తంగా జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆధునిక గణాంక సాధనాలను ఉపయోగించి జరిపిన సర్వేలో 2100 నాటికి ప్రపంచ జనాభా 960 కోట్ల నుంచి 1,230 కోట్ల మధ్య ఉండేందుకు 80 శాతం సంభావ్యత ఉందని తేలింది. గతంలో అంచనా కంటే ఇది 200 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం 700 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుతుందని, అక్కడి నుంచి తగ్గుదల నమోదవచ్చని తెలిపింది. -
బ్యాటరీ-ఫ్రీ పరికరాలు.. రేడియో తరంగాలతో పనిచేస్తాయి..
టెక్నాలజీ మాయ వల్ల ఇంట్లోని అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలనూ ఇంటర్నెట్కు అనుసంధానం చేసుకునేందుకు ఇప్పుడు వీలు అవుతోంది. కానీ వీటన్నింటినీ ఇంటర్నెట్కు అనుసంధానం చేసేందుకు అమర్చే పరికరాలకూ బ్యాటరీలను ఉపయోగించాల్సి రావడం ప్రస్తుతం ఓ పెద్ద ప్రతిబంధకం. అందుకే అసలు బ్యాటరీ అవసరమే లేకుండా.. రేడియో తరంగాలనే విద్యుత్‌గా వాడుకుంటూ.. వాటి ద్వారానే వై-ఫై పరికరానికి, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లకు అనుసంధానమై పనిచేసే వినూత్న ‘బ్యాటరీ-ఫ్రీ డివైస్’లను భారత సంతతి ఇంజనీర్ శ్యామ్ గొల్లకోట నేతృత్వంలోని బృందం ఆవిష్కరించింది. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన శ్యామ్ ఆవిష్కరించిన ‘వై-ఫై బ్యాక్‌స్కాటర్’ అనే ఈ టెక్నాలజీ ప్రస్తుతం వై-ఫై పరికరాలకు రెండు మీటర్ల దూరంలోపు మాత్రమే, సెకనుకు ఒక కిలోబిట్ వేగంతో పనిచేస్తుంది. దీనిని 20 మీటర్లకు పెంచేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి టెక్నాలజీ రావడం ఇదే తొలిసారని చెబుతున్నారు. వీరి పరిశోధన వివరాలను షికాగోలో ఈ నెలలోనే జరిగే ‘అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీస్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ కమ్యూనికేషన్స్’ సదస్సులో సమర్పించనున్నారు. -
ఈ కటకం ఉంటే.. స్మార్ట్ఫోన్లన్నీ సూక్ష్మదర్శినులే!
చొక్కా గుండీ అంత సైజులో ఉన్న ఈ మైక్రోఫోన్ లెన్స్(కటకం)ను యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పూర్వ విద్యార్థి థామస్ లార్సన్ గతేడాది తయారు చేశారు. దీనిని స్మార్ట్ఫోన్ల కెమెరా లెన్స్‌లపై ఉంచితే చాలు.. వస్తువులను 15 రెట్లు ఎక్కువ చేసి చూపుతుంది. అయితే ఏ స్మార్ట్‌ఫోన్‌ను, ట్యాబ్లెట్‌ను అయినా శక్తిమంతమైన సూక్ష్మదర్శినిగా మార్చేలా ఈ లెన్స్‌ను ఎన్నో రెట్లు శక్తిమంతంగా అభివృద్ధిపరుస్తున్నట్లు తాజాగా లార్సన్ వెల్లడించారు. సాధారణ మైక్రోస్కోపులు వస్తువులను 50-400 రెట్లు జూమ్ చేసి చూపుతుంటాయి. వస్తువులను కనీసం 150 రెట్లు పెద్దగా చూపించేలా తాము ఈ లెన్స్‌ను అభివృద్ధిపరుస్తున్నామని, దీనితో వివిధ వ్యాధులను నిర్ధారించడంతోపాటు అనేక వస్తువులను పరిశీలించొచ్చని, విద్యార్థులకు తక్కువ ధరకే వినూత్న మైక్రోస్కోపు చేతికి అందుతుందని లార్సన్ అంటున్నారు. దీనిని వివిధ కెమెరాల లెన్స్‌పై ఎలాంటి పరికరాలు, జిగుర్ల అవసరం లేకుండానే నేరుగా అతికించొచ్చట. స్మార్ట్ఫోన్ల కెమెరాలకు అటాచ్ అయ్యి వాటిని మైక్రోస్కోపులుగా మార్చేసే ఇతర లెన్స్‌లు కూడా ఇప్పటికే అందుబాటులో ఉన్నా.. వాటి సైజు, ధరలు కూడా చాలా ఎక్కువ. వాటితో పోల్చితే చాలా చవకగా రూ.1,800లకే దొరికే ఈ కొత్త మైక్రోఫోన్ లెన్స్ రెండు, మూడు నెలల్లోనే మార్కెట్లోకి విడుదల కానుంది. -
ఎల్ఈడీలు ఇక మరింత పలుచన
ప్రపంచంలోనే అతి పలుచని ఎల్ఈడీ (లైట్ ఎమిట్టింగ్ డయోడ్)ని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు ఇటీవల తయారు చేశారు. వీరు తయారు చేసిన ఎల్ఈడీ మిల్లీ మీటర్లు, నానో మీటర్లు కూడా కాదు.. జస్ట్ మూడు అణువులంత మందం మాత్రమే ఉండటం విశేషం. మనిషి వెంట్రుక కన్నా పది వేల రెట్లు పలుచగా ఉండే ఈ ఎల్ఈడీలను ఉపయోగించి టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తయారుచేయొచ్చని, వీటివల్ల భవిష్యత్తులో మరింత పలుచనైన ఎలక్ట్రానిక్ పరికరాలు రానున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.