Radhika Aggarwal: ఆత్మవిశ్వాసమే గెలుపు మంత్రం | Radhika Aggarwal: Indian Women Entrepreneurs Behind Shopclues | Sakshi
Sakshi News home page

Radhika Aggarwal: ఆత్మవిశ్వాసమే గెలుపు మంత్రం

Published Thu, Aug 3 2023 5:04 AM | Last Updated on Thu, Aug 3 2023 10:25 AM

Radhika Aggarwal: Indian Women Entrepreneurs Behind Shopclues - Sakshi

రాధిక అగర్వాల్‌ తండ్రి సైన్యంలో పనిచేసేవారు. తండ్రి ఉద్యోగరీత్యా జో«ద్‌పూర్‌ నుంచి అహ్మద్‌నగర్‌ వరకు ఎన్నో చోట్ల చదువుకుంది రాధిక. వాషింగ్టన్‌ యూనివర్శిటీలో ఎంబీయే చేసిన రాధిక అగర్వాల్‌కు ఎంటర్‌ప్రెన్యూర్‌గా పెద్ద పేరు తెచ్చుకోవాలనే కల ఉండేది. అడ్వర్‌టైజింగ్, పబ్లిక్‌ రిలేషన్‌లలో పోస్ట్‌–గ్రాడ్యుయేషన్‌ కూడా చేసింది.

‘చదువు ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇక వ్యాపారంలోకి నిస్సందేహంగా అడుగు పెట్టవచ్చు’ అనుకోలేదు ఆమె. అనుభవ జ్ఞానం విలువ ఏమిటో రాధిక అగర్వాల్‌కు తెలియనిదేమీ కాదు.
చదువు పూర్తయిన తరువాత లైఫ్‌స్టైల్, ఇ–కామర్స్, ఫ్యాషన్, పబ్లిక్‌ రిలేషన్స్, రిటైల్‌ రంగాలలో 14 సంవత్సరాల పాటు పనిచేసింది.

ఎన్నో రంగాలలో ఎంతో అనుభవాన్ని సంపాదించిన రాధిక అగర్వాల్‌ ఛండీగఢ్‌లో ఒక యాడ్‌ ఏజెన్సీకి శ్రీకారం చుట్టింది. ఆ తరువాత ప్రవాస భారతీయుల కోసం ‘ఫ్యాషన్‌ క్లూస్‌’ పేరుతో ఒక వెబ్‌సైట్‌ మొదలు పెట్టింది. మొదటి రెండు వ్యాపారాల విషయం ఎలా ఉన్నా...
 
ఇ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘షాప్‌ క్లూస్‌’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయకేతనం ఎగరేసింది రాధిక అగర్వాల్‌. రెండు సంవత్సరాల క్రితం బ్యూటీ, న్యూట్రీషన్, హోమ్‌కేర్‌కు సంబంధించి ఇ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘కైండ్‌ లైఫ్‌’ ప్రారంభించి మరోసారి విజయం సాధించింది.

‘ఒకసారి వెనక్కి చూస్తే... విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ కనిపిస్తాయి. అవి ఎప్పుడూ నన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి. జాగ్రత్తగా ఉండమని చెబుతాయి. వ్యాపారంలో విజయానికి వినియోగదారులకు మనపై ఉండే విశ్వాసం అనేది ముఖ్యం. అది గెలుచుకుంటే కచ్చితంగా గెలుపు మనదే. దీనికి వ్యూహాల కంటే మన నిజాయితీ అనేది ముఖ్యం. వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనడం ద్వారానే ఇంత పెద్ద విజయాన్ని సాధించగలిగాం’ అంటుంది రాధిక అగర్వాల్‌.

ప్రతి సంవత్సరం ‘ఉమెన్స్‌ డే’ సందర్భంగా ఎక్కడో ఒకచోట మహిళలతో సమావేశం నిర్వహించి తన వ్యాపార ప్రస్థానాన్ని వారితో పంచుకుంటుంది. అగర్వాల్‌ స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు వ్యాపారవేత్తలుగా విజయం సాధించారు. ‘వ్యాపారంలో విజయం సాధించాలంటే ఉత్సాహం మాత్రమే సరిపోదు. బరిలోకి దిగే ముందు మన గురించి మనం విశ్లేషించుకోవాలి. ఎంతోమందితో మాట్లాడాలి. అయినా సరే, ఎప్పటికప్పుడు ఒక కొత్త సవాలు ఎదురవుతూనే ఉంటుంది. దానికి జవాబు చెప్పి ముందుకు కదలాలి. దీనికి కావాల్సింది ఆత్మవిశ్వాసం’ అంటుంది రాధిక అగర్వాల్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement