Shop Clues
-
Radhika Aggarwal: ఆత్మవిశ్వాసమే గెలుపు మంత్రం
రాధిక అగర్వాల్ తండ్రి సైన్యంలో పనిచేసేవారు. తండ్రి ఉద్యోగరీత్యా జో«ద్‌పూర్ నుంచి అహ్మద్‌నగర్ వరకు ఎన్నో చోట్ల చదువుకుంది రాధిక. వాషింగ్టన్ యూనివర్శిటీలో ఎంబీయే చేసిన రాధిక అగర్వాల్‌కు ఎంటర్‌ప్రెన్యూర్‌గా పెద్ద పేరు తెచ్చుకోవాలనే కల ఉండేది. అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్లలో పోస్ట్–గ్రాడ్యుయేషన్ కూడా చేసింది. ‘చదువు ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇక వ్యాపారంలోకి నిస్సందేహంగా అడుగు పెట్టవచ్చు’ అనుకోలేదు ఆమె. అనుభవ జ్ఞానం విలువ ఏమిటో రాధిక అగర్వాల్‌కు తెలియనిదేమీ కాదు. చదువు పూర్తయిన తరువాత లైఫ్‌స్టైల్, ఇ–కామర్స్, ఫ్యాషన్, పబ్లిక్ రిలేషన్స్, రిటైల్ రంగాలలో 14 సంవత్సరాల పాటు పనిచేసింది. ఎన్నో రంగాలలో ఎంతో అనుభవాన్ని సంపాదించిన రాధిక అగర్వాల్ ఛండీగఢ్‌లో ఒక యాడ్ ఏజెన్సీకి శ్రీకారం చుట్టింది. ఆ తరువాత ప్రవాస భారతీయుల కోసం ‘ఫ్యాషన్ క్లూస్’ పేరుతో ఒక వెబ్సైట్ మొదలు పెట్టింది. మొదటి రెండు వ్యాపారాల విషయం ఎలా ఉన్నా... ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘షాప్ క్లూస్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయకేతనం ఎగరేసింది రాధిక అగర్వాల్. రెండు సంవత్సరాల క్రితం బ్యూటీ, న్యూట్రీషన్, హోమ్కేర్కు సంబంధించి ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘కైండ్ లైఫ్’ ప్రారంభించి మరోసారి విజయం సాధించింది. ‘ఒకసారి వెనక్కి చూస్తే... విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ కనిపిస్తాయి. అవి ఎప్పుడూ నన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి. జాగ్రత్తగా ఉండమని చెబుతాయి. వ్యాపారంలో విజయానికి వినియోగదారులకు మనపై ఉండే విశ్వాసం అనేది ముఖ్యం. అది గెలుచుకుంటే కచ్చితంగా గెలుపు మనదే. దీనికి వ్యూహాల కంటే మన నిజాయితీ అనేది ముఖ్యం. వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనడం ద్వారానే ఇంత పెద్ద విజయాన్ని సాధించగలిగాం’ అంటుంది రాధిక అగర్వాల్. ప్రతి సంవత్సరం ‘ఉమెన్స్ డే’ సందర్భంగా ఎక్కడో ఒకచోట మహిళలతో సమావేశం నిర్వహించి తన వ్యాపార ప్రస్థానాన్ని వారితో పంచుకుంటుంది. అగర్వాల్ స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు వ్యాపారవేత్తలుగా విజయం సాధించారు. ‘వ్యాపారంలో విజయం సాధించాలంటే ఉత్సాహం మాత్రమే సరిపోదు. బరిలోకి దిగే ముందు మన గురించి మనం విశ్లేషించుకోవాలి. ఎంతోమందితో మాట్లాడాలి. అయినా సరే, ఎప్పటికప్పుడు ఒక కొత్త సవాలు ఎదురవుతూనే ఉంటుంది. దానికి జవాబు చెప్పి ముందుకు కదలాలి. దీనికి కావాల్సింది ఆత్మవిశ్వాసం’ అంటుంది రాధిక అగర్వాల్. -
కారు గిఫ్ట్‌గా వచ్చిందని..
సాక్షి, సిటీబ్యూరో: ఓ వైబ్సైట్లో ఇయర్ఫోన్లు ఖరీదు చేసిన యువతికి కారు గిఫ్ట్‌గా వచ్చిందంటూ సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. బాధితురాలు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో సదరు వెబ్సైట్ నుంచి కస్టమర్ల డేటా లీక్ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తర మండల పరిధిలోని తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన ఓ యువతి పది రోజుల క్రితం షాప్‌క్లూస్ నుంచి రూ.500 వెచ్చించి ఇయర్ఫోన్లు ఖరీదు చేశారు. ఇవి డెలివరీ అయిన తర్వాత ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వాళ్లు తాము షాప్‌క్లూస్ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకున్నారు. మీరు ఇటీవల తమ సంస్థ నుంచి వస్తువలు కొనుగోలు చేశారు కదా అని చెప్పడంతో ఆమె నమ్మింది. తమ కస్టమర్ల కోసం లక్కీ డ్రా నిర్వహించామని అందులో మీకు రూ.12.6 లక్షల విలువైన కారు గెల్చుకున్నారని చెప్పి ఆమెకు ఎర వేశారు. బాధితురాలు నిజమేనని నమ్మి ఆ కారును ఎలా పొందాలంటూ అడిగారు. కారు డెలివరీ చేయడం కోసం కొన్ని పన్నులు చెల్లించాల్సి ఉందంటూ చెప్పిన సైబర్ నేరగాళ్లు అసలు ‘పని’ ప్రారంభించారు. దాదాపు పది రోజుల పాటు వివిధ ట్యాక్స్‌ల పేరు చెబుతూ ఆమె నుంచి రూ.68,900 వివిధ ఖాతాల్లోకి డిపాజిట్ చేయించుకుని మోసం చేశారు. ఎట్టకేలకు తాను మోసపోయానని గుర్తించిన బాధిత యువతి మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు వినియోగించిన ఫోన్ నెంబర్, డబ్బు డిపాజిట్ చేయించుకున్న ఖాతాల వివరాల ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి నేరాలు తరచు చోటు చేసుకుంటున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం నేరుగా ఏ స్థాయిలో క్రయవిక్రయాలు జరుగుతున్నాయో... దాదాపు అదే స్థాయిలో ఆన్లైన్లో వస్తువులు విక్రయించే వెబ్సైట్లు, యాప్స్‌లో పుట్టుకువచ్చాయి. వీటిలో పని చేస్తున్న కొందరు నేరగాళ్లు తమ వద్ద షాపింగ్ చేసిన కస్టమర్ల వివరాలు, ఫోన్ నంబర్లకు సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. వీటి ఆధారంగా బాధితులకు ఫోన్లు చేస్తున్న సైబర్ క్రిమినల్స్ వారి షాపింగ్ వివరాలు చెప్పి బుట్టలో పడేస్తున్నారు. ఆపై గిఫ్ట్‌లు పొందడానికి పన్నులు, ఇతర చార్జీల పేర్లు చెప్పి అందినకాడికి దండుకుంటున్నారని వివరిస్తున్నారు. ఈ తరహా ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్స్, ఎస్సెమ్మెస్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. -
అమెజాన్‌లో పిడకల అమ్మకం
ఆన్లైన్ పోర్టల్స్ అపార్ట్మెంట్ల నుంచి గుండు సూది దాకా దేన్నైనా అమ్మేస్తుంటాయి. ఈ కోవలోకి కొత్తగా వచ్చి చేరిందో వస్తువు. అదేమిటో కాదండోయ్.. ఆవు పేడ. నిజమే.. ఆవుపేడతో చేసిన పిడకలకు ఇప్పు డు ఆన్లైన్లో యమ డిమాండ్. అమెజాన్, షాప్‌క్లూస్ వంటి పోర్టల్స్‌లో ఇప్పుడీ పిడక లు అందుబాటులో ఉన్నాయి. హైందవ ఆచారాల్లో శుభ కార్యానికైనా, కర్మలకైనా ఆవుపేడ తప్పనిసరి. విదేశాల్లో స్థిరపడిన వారు సైతం ఈ మధ్య ఖర్చుకు వెనుకాడకుండా అన్ని పనులు సంప్రదాయ పద్ధతుల్లో చేస్తున్నారు. తమ ఆచార వ్యవహారాలు కాపాడుకుంటున్నారు. ఏదో కార్యం పడింది.. మహానగరాల్లో అదెక్కడ దొరుకుతుందో తెలి యదు, పూజాద్రవ్యాలను అమ్మే షాపులకు వెళ్తే దొరుకుతుందనే గ్యారంటీ లేదు. అలాం టి షాపులు కూడా ఎక్కడున్నాయో వెతికి పట్టుకోవాలి. అంత ఓపిక లేని నెటిజన్లు ఇప్పుడు ఎంచక్కా మొబైల్లో ఆర్డరిచ్చే స్తున్నారు. 99 రూపాయలు మొదలు కొని 400 పైచిలుకు (ప్యాక్‌లో పిడకల సంఖ్యను బట్టి) ధరలకు ఆవుపేడ పిడకలు అమెజాన్‌లో లభిస్తున్నాయి. ఇదేదో ఆషా మాషీ వ్యవహారం కాదండోయ్. ఢిల్లీకి చెంది న ఆసియా క్రాఫ్ట్స్ యజమాని ప్రీతి కర్లాకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. ఆసియా క్రాఫ్ట్స్ మతపరమైన సామగ్రిని అమ్ముతుం ది. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన ప్రీతి పూజాదికాల్లో ఇప్పుడేవి వాడు తున్నారో తెలుసుకోవడానికి భక్తి చానళ్లను చూస్తుంది. ఒకరోజు ఓ స్వామివారు ఆవుపేడ పిడకలను కాల్చాలని, పేడతో వాకిలి అలకాలని చెప్పడంతో... ప్రీతికి చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. ఢిల్లీ శివార్లలోని గ్రామాల నుంచి ఆవుపేడతో చేసిన పిడకలను సేకరించి ఆన్లైన్లో అమ్మడం మొదలు పెట్టింది. అయితే ఒక్కొక్కరు ఒక్కో సైజులో, మం దంతో చేస్తుండటంతో ప్యాకింగ్ కష్టమై పో యేది. దీంతో ఓ ఊరిలో సొంతంగా పిడకల తయారీని చేపట్టింది. 8 పిడకల ప్యాక్‌ను ఆసియా క్రాఫ్ట్స్ రూ.419కు అమ్ముతోంది. నెలకు 3,000 పైచిలుకు ప్యాకెట్ల ఆవుపేడ పిడకలను ఈ సంస్థ అమ్ముతోంది. విదేశాల్లో ని హిందూ ఆలయాల నుంచి కూడా వీరికి ఆర్డర్లు వస్తున్నాయి. - సెంట్రల్ డెస్క్ -
షాప్క్లూస్లోకి రూ.615 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ సంస్థ షాప్‌క్లూస్ దాదాపు 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 615 కోట్లు) పెట్టుబడులు సమీకరించినట్లు సోమవారం తెలిపింది. టైగర్ గ్లోబల్ సారథ్యంలోని ఇన్వెస్టర్ల గ్రూప్ తాజా విడత నిధులు ఇన్వెస్ట్ చేసింది. గతంలో ఏంజెల్, ఏ, బీ, సీ విడతల కింద నిధులు సమీకరించిన షాప్‌క్లూస్ తాజా ఫండింగ్‌ను సిరీస్ డీ కింద దక్కించుకుంది. కంపెనీలో ఇంతకు ముందు హీలియోన్ వెంచర్ పార్ట్నర్స్, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్ వంటి సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. 2011లో ప్రారంభమైన షాప్‌క్లూస్ ప్రస్తుతం ప్రతి నెలా 15 లక్షల లావాదేవీలు నిర్వహిస్తోంది. ఇందులో 70 శాతం వ్యాపారం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచే వస్తోంది. ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో స్థూల వ్యాపార పరిమాణం రూ. 1,500 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు షాప్‌క్లూస్ వెల్లడించింది.