Women Entrepreneur
-
బిజినెస్ ఉమెన్
సాక్షి, అమరావతి: గడిచిన మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021–23 మధ్య కాలంలో కొత్తగా 2,28,299 మంది మహిళలు యూనిట్లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి జితిన్ రాం మాంజీ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. 2021–22లో రాష్ట్రంలో 34,625 యూనిట్లు, 2022–23లో 70,811 యూనిట్లు, 2023–24లో 1,22,863 యూనిట్లు కొత్తగా ఏర్పాటయినట్లు వెల్లడించారు.మూడేళ్లలో దేశవ్యాప్తంగా మొత్తం 46,91,577 మహిళా యూనిట్లు ఏర్పాటయితే అందులో రాష్ట్రానికి సంబంధించి 2,28,299 ఉన్నాయి. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి అనేక ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో భారీగా ఎంఎస్ఎంఈలు ఏర్పాటయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా గడిచిన మూడేళ్లలో 19,30,188 మహిళా యూనిట్లకు రూ. 94,296 కోట్ల రుణాలను అందించారు. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి రాష్ట్రంలో మొత్తం ఎంఎస్ఎంఈల సంఖ్య 1.96 లక్షలుగా ఉంటే ఇప్పుడు వీటి సంఖ్య 8.89 లక్షలకు చేరింది. కేవలం ఎంఎస్ఎంఈల ద్వారా రాష్ట్రంలో 22 లక్షల మందికిపైగా ఉపాధి లభించినట్లు అధికారులు చెప్పారు. -
Kirloskar Group: సగౌరవంగా... గౌరీ విజయం
గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన గౌరీ కిర్లోస్కర్ తమ కుటుంబ వ్యాపార విజయాల వెలుగులో మాత్రమే కనిపించాలనుకోలేదు. ‘కొత్తగా నేను ఏమీ చేయకపోయినా జీవితం సాఫీగా సాగిపోతుంది’ అనుకోలేదు. ‘ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యంలో నేను ఎక్కడ?’ అని ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్నే ఆమెతో ఎన్నో ప్రయాణాలు చేయించింది. ప్రతి ప్రయాణంలో విలువైన పాఠాలు నేర్చుకునేలా చేసింది. తమ కుటుంబ వ్యాపార చరిత్రలో తనకంటూ కొన్ని పుటలు ఉండాలనుకుంది. ఆమె ప్రయత్నం, కష్టం ఫలించాయి. ఫిప్త్ జెనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రసిద్ధ వ్యాపార సామ్రాజ్యమైన ‘కిర్లోస్కర్’లోకి అడుగుపెట్టిన గౌరీ కిర్లోస్కర్ తనను తాను నిరూపించుకుంది. తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది.కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టినంత మాత్రానా ఎంటర్‌ప్రెన్యూర్‌గా వారిది నల్లేరు మీద నడక అనుకోవడానికి లేదు. తమను తాము నిరూపించుకొని ఫ్యామిలీ బిజినెస్‌కు మరింత బలాన్ని ఇచ్చేవారితో పాటు నిరూపించుకోలేక వెనుతిరిగేవారు కూడా ఉంటారు. గౌరీ కిర్లోస్కర్ మొదటి కోవకు చెందిన మహిళ.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పోలిటికల్ సైన్స్(ఎల్ఎస్ఈ)లో చదువుకుంది. అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో ఫైనాన్స్‌లో డిగ్రీ చేసింది.చదువు పూర్తి కాగానే తమ కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టి పెద్ద హోదాలో వెలిగిపోవచ్చు. అలా కాకుండా ఉద్యోగం చేయాలనుకుంది గౌరి.ఉద్యోగం చేయాలనుకోవడానికి కారణం... తనను తాను నిరూపించుకోవడం..ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ్రపారంభించింది. ఆ తరువాత ‘పియర్సన్ కార్పొరేట్ ఫైనాన్స్’లో స్ట్రాటజీ గ్రూప్‌లో చేరింది. ఉద్యోగజీవితంలో విలువైన అనుభవాలను సొంతం చేసుకుంది. ఈ అనుభవాలు ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన విజయాలకు బలమైన పునాదిగా నిలిచాయి.మన దేశానికి తిరిగివచ్చిన గౌరి కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇక అప్పటినుంచి ‘కిర్లోస్కర్ గ్రూప్’లో వ్యూహాత్మక విధానాలపై దృష్టి పెట్టింది. బోర్డ్ మెంబర్‌గా సమీక్ష సమావేశాల్లో చురుగ్గా పాల్గొనడం ఒక కోణం అయితే ఎనర్జీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను అన్వేషించడం మరో కోణం.‘ఆర్క్ ఫిన్ క్యాప్’కు సంబంధించి టీమ్ ఏర్పాటు, బిజినెస్ ΄్లానింగ్లో కీలకంగా వ్యవహరించింది.పుణెలో కంపెనీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రధాన బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహించింది. ఇంటర్నేషనల్ ్రపాపర్టీ కన్సల్టెంట్స్తో కలిసి పనిచేసింది. హెచ్ఆర్, బ్రాండింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్‌లో తనదైన ముద్ర వేసింది. పర్యావరణ కోణంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)పై ప్రత్యేక దృష్టి పెట్టింది.గౌరీ నాయకత్వంలో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ గణనీయమైన వృద్ధిని సాధించింది. ‘ఇది కుదరదు’ అనుకునే చోట ప్రత్యామ్నాయాలు అన్వేషించి విజయం సాధించే నైపుణ్యం గౌరీలోఉంది.‘మేము ఇంజిన్ మాన్యుఫాక్చరింగ్‌లోకి వచ్చినప్పుడు గ్లోబల్ కంపెనీలతో టై అప్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఉంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా ఇంజిన్లను స్థానికంగానే తయారు చేసుకునే పరిస్థితి ఉండేది. ఇలాంటి అవకాశం లేకపోవడంతో సొంతంగా మాన్యుఫాక్చరింగ్ మొదలుపెట్టాం. సొంతంగా ఏదైనా చేయడం మొదలుపెట్టినప్పుడు మనదైన ఇంటెలెక్చువల్ ్రపాపర్టీ వృద్ధి చెందుతుంది’ అంటుంది గౌరీ.గౌరీ కంపెనీ బీ2బీ, బీ2సి, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే మూడు ప్రధానమైన బిజినెస్ సెగ్మెంట్లపై దృష్టి పెట్టింది. బీ2బీ బిజినెస్ ఇంటర్నల్ కంబాషన్ ఇంజిన్స్‌పై, బీ2సి బిజినెస్ వాటర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలపై దృష్టి పెడుతుంది. ఇక ‘అర్క’ గ్రూప్ అనేది ఫైనాన్షియల్ సర్వీసెస్ సెగ్మెంట్.స్థూలంగా చెప్పాలంటే...ఉన్నత విద్యాలయాల్లో చదువుకున్న చదువు, ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు, వ్యూహాత్మక దృక్పథం వ్యాపార ప్రపంచంలో గౌరీని ఉన్నత స్థానంలో నిలిపాయి. మూలాలకు తిరిగి రావడం అనేది గణనీయమైన వ్యాపార విజయానికి ఎలా దారితీస్తుందో చెప్పడానికి గౌరీ కిర్లోస్కర్ పేరును ప్రముఖంగా ప్రస్తావించవచ్చు.ఉత్సాహ బలంవ్యాపార ప్రపంచానికి అవతలి విషయానికి వస్తే... గౌరీ కిర్లోస్కర్‌కు యోగా చేయడం, స్క్వాష్, డైవింగ్ అంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికురాలైన గౌరీకి తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్లడం అంటే ఇష్టం. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ల గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాపై కూడా ఆసక్తి ప్రదర్శిస్తుంది. ఒక పుస్తకం చదివినప్పుడో, ఉపన్యాసం విన్నప్పుడో తనకు నచ్చిన వాక్యాన్ని, మాటను నోట్ చేసుకోవడం గౌరీకి ఇష్టం. ‘ఏ పని చేసినా ఉత్సాహంతో చేయాలి. ఉత్సాహమే అనంతమైన శక్తి’ అంటుంది గౌరీ కిర్లోస్కర్. -
సక్సెస్ ఊరికే రాదు : వేలకోట్లతో నెక్ట్స్ లెవల్ అంతే! ఎవరీ బిలియనీర్ మహిళ
విజయవంతమైన వ్యాపార కుటుంబం నుంచి వారసులు చాలామంది వస్తారు. కానీ ఆ విజయాన్ని అంది పుచ్చుకుని అసాధారణ వృద్ధితో ఎదిగిన వ్యాపార దిగ్గజాలు కొంతమందే ఉంటారు. ప్రముఖ ఫుట్‌వేర్ కంపెనీ 'మెట్రో బ్రాండ్స్' మేనేజింగ్ డైరెక్టర్ ఫరా మాలిక్ భాంజీ కథ అలాంటిదే. బిలియనీర్ ఫరా మాలిక్ భాంజీ గురించి ఇంట్రస్టింగ్ సంగతులు ఈ కథనంలో తెలుసుకుందాం.దేశంలోనే సంపన్న ముస్లిం మహిళగా గుర్తింపు పొందారు. కంపెనీ సీఎండీగా ఫరా మాలిక్ భాంజీ రూ. 28,773 కోట్ల కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. మెట్రో బ్రాండ్స్ ఛైర్మన్ రఫీక్ మాలిక్ రెండో కుమార్తె. తన నలుగురు సోదరీమణుల మాదిరిగానే, లంచ్ టేబుల్ వద్ద షాప్ టాక్ వింటూ పెరిగింది. కానీ కంపెనీ పగ్గాలు చేపట్టిన తరువాత ఫరా మార్గదర్శకత్వంలో, గతంలో 'మెట్రో షూస్'గా పిలువబడే మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. డిసెంబర్ 8 నాటికి 35,117 కోట్ల చేరడం విశేషం.ముంబై కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తోంది ఈ కంపెనీ. ఫరా తాత మాలిక్ తేజాని 1955లో తిరిగి స్థాపించారు. మోచి, మెట్రో , వాక్‌వే వంటి విజయవంతమైన బ్రాండ్ల రాకకు పునాది. పాదరక్షల పరిశ్రమలో 20 ఏళ్ల చరిత్రను తిరగరాసి ఆధునిక యుగంలో గేమ్ ఛేంజర్‌గా నిలిచింది ఫరా. ఆమె వినూత్న విధానం , ఫార్వర్డ్-థింకింగ్ స్ట్రాటజీలు కంపెనీని నెక్ట్స్ లెవల్‌కి చేర్చాయి. ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువు చదివి కంపెనీలో మార్కెటింగ్ రంగంలో తన వృత్తిని ప్రారంభించింది. ఇదే ఆ తర్వాత మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ సరఫరా గొలుసును పునరుద్ధరించడానికి తోడ్పడింది.2010లో వెబ్సైట్ ఏర్పాటు చేసి, ఆన్లైన్ అమ్మకాలు ప్రారంభించారు. దేశీ సంస్థల ఉత్పత్తులను రిటైలింగ్ చేసిన మెట్రో విదేశీ పాదరక్షల జోడింపుతో ‘మెట్రో బ్రాండ్స్’గా అవతరించింది.మెట్రో బ్రాండ్స్ పాదరక్షల దిగ్గజం క్రాక్స్ ఇండియా లిమిటెడ్ (CIL)తో ఒప్పందం నిబంధనలు, మార్పులతో తన భాగస్వామ్యాన్ని కూడా విస్తరించింది. దీని ప్రకారం భారతదేశంలోని పశ్చిమ , దక్షిణ రాష్ట్రాలలో Crocs "ఫుల్ కాస్ట్ " దుకాణాలనిర్వహణకు మెట్రో బ్రాండ్లకు ప్రత్యేక హక్కులను మంజూరు చేస్తుంది. కంపెనీ భారతదేశం అంతటా 200కి పైగా ప్రత్యేకమైన క్రోక్స్ స్టోర్లను నిర్వహిస్తోంది.స్కేచర్స్, క్లార్క్స్ వంటి ఇతర గ్లోబల్ టైటాన్స్‌తో వ్యూహాత్మక ఒప్పందాలున్నాయి. 2021లో మెట్రోని ఐపీవోకు వచ్చింది. రూ.28 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. వ్యాపార రంగంలో ఫరా మాలిక్ భాంజీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతోపాటు, పరిశ్రమ దిగ్గజాలకు సైతం స్ఫూర్తిగా ఉన్నారు. -
కోటి రూపాయల జాబ్ వదిలేసి, రూ. 300 కోట్ల కంపెనీ: వినీతా సక్సెస్ స్టోరీ
సొంతంగా వ్యాపారం చేయాలన్న సాహసోపేత నిర్ణయం తీసుకోవడం మాత్రమే కాదు వ్యాపారంలో రాణిస్తున్న మహిళా వ్యాపార వేత్తలు చాలామందే ఉన్నారు. అలాంటి సక్సెస్ ఫుల్బిజినెస్ విమెన్‌లో ఒకరు వినీతా సింగ్. కోటి రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని రిజెక్ట్ చేసి మరీ ఆమె బవ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇపుడు కోట్లాది రూపాయల టర్నోవర్ ఉన్న వ్యాపార సామ్రజ్యానికి సారధి ఆమె. కృషి, సంకల్ప ఉంటే.. కలలు సాకారం కష్టమేమీ కాదని నిరూపించిన షుగర్ కాస్మటిక్స్ సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ వినీతా సింగ్ స్ఫూర్తిదాయక కథ గురించి తెలుసు కుందాం! ఉద్యోగం కోసం ఒకరి దగ్గర పనిచేయడం కాదు...తానే యజమానికిగా పదిమందికి ఉపాధి కల్పించాలని భావించింది వినీతా సింగ్. ఆలోచన వచ్చింది మొదలు క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది. మహిళల చర్మ సౌందర్యానికి సంబంధించి స్వదేశీ బ్రాండ్ షుగర్ కాస్మొటిక్స్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చింది. తనదైన మార్కు వేసి 300 కోట్ల రూపాయల టర్నోవర్‌తో దూసుకుపోతుంది. తనలాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ముఖ్యంగా షార్క్ ట్యాంక్ ఇండియా టీవీ షో ద్వారా వ్యాపారవేత్తగా మరింత పాపులర్ అయింది. అంతేకాదు ఈ షో ద్వారా వినీతా సింగ్ అనేక వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించి విశేషంగా నిలిచారు. ఎవరీ వినీతా సింగ్ వినీత ఐఐటీ మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఐఐఎం అహ్మదాబాద్‌లో తన బిజినెస్ స్టడీస్‌ని కొనసాగించింది. 2005లో అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి MBA పట్టభద్రురాలైంది.లండన్, న్యూయార్క్‌లోని డ్యుయిష్ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్ కూడా చేసింది. ఆమె ఇంటర్న్‌షిప్ సమయంలో, క్యాంపస్ సెలక్షన్స్‌లో కోటి రూపాయల వేతనంతో ఒక ఆఫర్ లభించింది. కానీ వ్యాపారంలో రాణించాలన్న కోరికతో ఉద్యోగంలోని చేరేందుకు సుముఖత చూపించలేదు. వినీత స్వంతంగా ఓ స్టార్టప్‌ను ఏర్పాటు చేయాలని భావించింది. అలా స్నేహితుడు కౌశిక్‌తో కలిసి బ్యూటీ సబ్స్క్రిప్షన్ కంపెనీలను ప్రారంభించింది. అవిపెద్దగా సక్సెస్ కాలేదు. అయినా నిరాశపడలేదు. దేశంలో కాస్మోటిక్స్ బ్రాండ్లు పెద్దగా లేని నేపథ్యంలో మేకప్ బ్రాండ్ సృష్టించాలనే ఆలోచన వచ్చింది. అలా 2015లో డైరెక్ట్-టు-కన్స్యూమర్ మేకప్ బ్రాండ్‌గా కౌశిక్‌తో కలిసి షుగర్ కాస్మెటిక్స్ కంపెనీని ప్రారంభించింది. భారతీయులకోసం ప్రత్యేకంగా ఇండియన్ స్కిన్ టోన్ల కోసం స్వదేశీ మేకప్ ఉత్పత్తులను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2019లో ఉత్తరప్రదేశ్‌లో, తొలి స్టోర్ తెరిచింది. 20-35 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలను లక్ష్యంగా చేసుకుని, సోషల్ మీడియాలో బాగా ప్రచారం నిర్వహించి సక్సెస్ అయింది. ఎంబీఏ చదువుతున్న సమయంలో ప్రేమలో పడిన వినీతా సింగ్ ప్రియుడు కౌశిక్ ముఖర్జీరి 2011లో పెళ్లి చేసుకుంది. కౌశిక్ షుగర్ కాస్మెటిక్స్ కంపెనీకి సీవోవో, కో ఫౌండర్‌గా ఉన్నారు. దంపతులుగానే కాదు, వ్యాపారవేత్తలుగా ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించు కున్నారు. ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. 2023 ఆర్థిక సంవత్సరానికి గాను షుగర్ కాస్మెటిక్స్ ఆదాయం సంవత్సరానికి 89 శాతం పెరిగి రూ. 420 కోట్లకు చేరుకుంది. నికర నష్టం దాదాపు రూ.76 కోట్లుగా ఉంది. మహిళా వ్యాపారవేత్తగా రాణించడం అంత సులువు కాదు అంటారామె. ఒక దశలో ఒక ఇన్వెస్టర్ నన్ను కలవడానికి కూడా ఇష్టపడలేదు. పురుషు వ్యాపారవేత్తల్నే కలవానేది అతని లక్ష్యం కానీ ఈ రోజు తన కంపెనీ బ్రాండ్ వాల్యూ వేల కోట్లకు చేరిందని ఆమె చెప్పుకొచ్చారు. -
Arati Kadav: సాఫ్ట్వేర్ టు సైన్స్–ఫిక్షన్ డైరెక్టర్
మల్టీ టాలెంట్ అంటే మాటలు కాదు. ఎంచుకున్న రంగాల్లో సమాన ప్రతిభ చాటాలి. తేడా జరిగితే అన్నిట్లో ‘జీరో’ తప్ప ఏమీ మిగలదు. సాఫ్ట్వేర్ ఇంజినీర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా తన ప్రతిభను చాటుకున్న ఆరతి కదవ్ గురించి.... చిన్నప్పటి నుంచి ఆరతికి ఫాంటసీ జానర్ అంటే ఇష్టం. ‘పంచతంత్ర’ ‘మహాభారత’ కథల పుస్తకాలు చదువుతున్నప్పుడు వాటికి తన ఊహాలోకంలో తనదైన ఫాంటసీ జోడించేది. ఆ తరువాత సైన్స్–ఫిక్షన్ తన ఆసక్తిగా మారింది. ‘ఈ జీవితానికి అర్థం ఏమిటి? పుట్టడం, గిట్టడమేనా ఇంకేదైనా పరమావధి ఉందా?’ ఇలాంటి ప్రశ్నలతో చావుపుట్టుకల గురించి ఎన్నో కోణాలలో ఆలోచించేది. మరణానంతర జీవితం గురించి కథలు రాసేది. సైన్స్–ఫిక్షన్ ఫిల్మ్‌మేకర్‌గా ఆరతి గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ ఊహలే పునాదిగా ఉపయోగపడ్డాయి. డైరెక్టర్‌గా తనకు ఎంతో పేరు తెచ్చిన ఫిలసాఫికల్ సైన్స్ ఫిక్షన్, బ్లాక్‌కామెడీ ఫిల్మ్ ‘కార్గో’కు ముందు రోబోలను దృష్టిలో పెట్టుకొని ‘టైమ్ మెషిన్’ అనే షార్ట్ ఫిల్మ్ తీసింది ఆరతి. ఈ చిన్న చిత్రం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. మన పురాణాలలో నుంచి ఊహాజనితమైన కథలతో హాలీవుడ్ స్థాయిలో సినిమాలు తీయాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునేలా చేసింది., మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన ఆరతి కదవ్ అమెరికాలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేసింది. సాంకేతిక విషయాలకు తప్ప కాల్పనిక ఊహలకు బుర్రలో కాసింత చోటు దొరకనంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ‘ఫాంటసీ’ కోసం కొంత స్థలం రిజర్వ్ చేసుకునేది. కొంతకాలం తరువాత ఉద్యోగాన్ని వదిలి ఫిల్మ్ డైరెక్షన్ కోర్సులో చేరింది. కాల్పనిక విషయాల మీద ఆసక్తి ఆరతిని సైన్స్‌కు దూరం చేయలేదు. సందర్భాన్ని బట్టి శాస్త్రీయ విషయాలపై రచనలు చేస్తుంటుంది. చిత్రరంగంలో కృత్రిమ మేథ(ఏఐ)కి సంబంధించి ‘విల్ ఏఐ మీన్ ది డెత్ ఆఫ్ క్రియేటివిటీ’ పేరుతో రాసిన వ్యాసానికి మంచి స్పందన వచ్చింది. రచయిత్రిగా కలం పట్టినప్పుడు తనలోని సాఫ్ట్వేర్ ఇంజినీర్ బయటకు వచ్చి ‘రిసెర్చ్’ చేయమంటూ సలహా ఇస్తుంది. దీంతో ఊహలకు విరామం ఇచ్చి తాను ఏ సబ్జెక్ట్ గురించి అయితే రాస్తుందో ఆ సబ్జెక్ట్‌కు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి సాధికారమైన సమాచారాన్ని పోగు చేస్తుంది. దీని ఆధారంగా మళ్లీ రచన చేస్తుంది. డైరెక్టర్‌గా ఉన్నప్పుడు తనలోని రచయిత్రి బయటకు వచ్చి సీన్–డైలాగ్‌లను ఇంకా ఎలా మెరుగుపెట్టవచ్చో సలహా ఇస్తుంది. ఇక ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పుడు బడ్టెట్‌ను సమర్థవంతంగా వాడుకోవాలనే విషయంలో సలహాలు ఇవ్వడానికి తనలోని సాప్ట్వేర్ ఇంజినీర్, రైటర్, డైరెక్టర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ‘కార్గో’ సినిమా అయిదుగురు నిర్మాతలలో ఆరతి ఒకరు. ‘నేర్చుకున్న విద్య ఏదీ వృథా పోదు’ అని చెప్పడానికి ఆరతి బహుముఖ ప్రజ్ఞ సాక్ష్యంగా నిలుస్తుంది. -
Seshanka Binesh: పేదపిల్లల గుండెచప్పుడు
శశాంక బినేశ్... మంచి వక్త. సామాజిక కార్యకర్త... ఓ విజేత. ‘మీ తరఫున మేము మాట్లాడుతాం’ అంటోంది. ‘మీ ఆరోగ్యాన్ని మేము పట్టించుకుంటాం’ అంటోంది. ‘ఉద్యోగినులకు అండగా ఉంటాను’ అంటోంది. ‘సస్టెయినబుల్ ఫ్యాషన్ కోసం పని చేస్తాను’ ... అని ప్రకృతికి భరోసా ఇస్తోంది. శశాంక బినేశ్ సొంతూరు హైదరాబాద్, చందానగర్. బీఫార్మసీ తర్వాత యూకేకి వెళ్లి ‘లండన్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ’ నుంచి ఫార్మసీలో పీజీ చేశారామె. ఇండియాకి వచ్చి కొంతకాలం ఉద్యోగం చేసినప్పటికీ అది సంతృప్తినివ్వలేదు. ‘‘సొంతంగా ఏదో ఒకటి చేయాలి, నన్ను నేను నిరూపించుకోవాలనే ఆలోచన చాలా గట్టిగా ఉండేది. ఈ లోపు మరో ఉద్యోగంలో చేరాను. ఆ ఉద్యోగంలో డిజిటల్ మార్కెటింగ్ మీద మంచి పట్టు వచ్చింది. ఇక ఆలస్యం చేయలేదు. ఇంట్లోనే ఒక గదిలో సొంతకంపెనీ ‘వి హాంక్’ మొదలుపెట్టాను. ఇప్పుడు ప్రతి వ్యాపారమూ బ్రాండింగ్ మీదనే నడుస్తోంది. బ్రాండ్‌కి ప్రమోషన్ కల్పించే పని మేము చేస్తాం. సింపుల్‌గా చెప్పాలంటే... మీ గురించి, మీ వ్యాపారం గురించి మేము హారన్ మోగిస్తామన్నమాట’’ అంటూ తన సేవా ప్రయాణాన్ని వివరించే ముందు ఉపాధి కోసం తాను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన విషయాన్ని చెప్పారామె. ‘సామాజిక కార్యకర్తగా ఈ పనులు ఇప్పుడు కొత్తగా చేస్తున్నవి కావు, మా ఇల్లే నేర్పించింది’’ అన్నారు శశాంక బినేశ్. తాత... నాన్న... నేను! నా చిన్నప్పుడు చందానగర్ నగరంలో భాగం కాదు, గ్రామం. మా తాత మందగడ్డ రాములు గ్రామానికి ఉప సర్పంచ్, సర్పంచ్‌గా ఊరికి సరీ్వస్ చేశారు. పేదవాళ్లు నివసించే శాంతినగర్ కాలనీ వాళ్లకు ఇళ్లు, కరెంటు వంటి సౌకర్యాలు ఆయన హయాంలోనే వచ్చాయి. మా నాన్న విక్రమ్ కుమార్ ఇప్పటికీ శ్రామికుల ప్రయోజనాల కోసం పని చేస్తూనే ఉన్నారు. నా అడుగులు కూడా అటువైపే పడ్డాయి. యూకేలో చదువుకుంటున్నప్పుడు పార్ట్‌టైమ్ జాబ్... షెఫీల్డ్ నగరంలో ఒక వృద్ధాశ్రమంలో. పెద్దవాళ్లకు ఒళ్లు తుడవడం, దుస్తులు మార్చడం, వీల్‌చెయిర్‌లో తీసుకెళ్లడం వంటి పనులు చేశాను. ఆ ఉద్యోగం... జీవితం పట్ల నా దృక్పథాన్ని మార్చేసింది. ఇండియాలో మా నాన్న తన స్నేహితులతో కలిíసి 2007లో నాదర్గుల్ దగ్గర ఒక ట్రస్ట్ హోమ్ స్థాపించారు. ఆ హోమ్ కోసం పని చేయడం మొదలుపెట్టాను. ఇక డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్న సమయంలో సినీనటి సమంత, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగాని తో పరిచయమైంది. అప్పటినుంచి ‘ప్రత్యూష సపోర్ట్’ స్వచ్ఛంద సంస్థతో పని చేస్తున్నాను. పేదపిల్లలకు వైద్యసహాయం అందించడం మీద ప్రధానంగా దృష్టి పెట్టాను. ఇప్పటివరకు 650కి పైగా సర్జరీలు చేయించగలిగాను. స్ఫూర్తి ఫౌండేషన్, డిజైర్ సొసైటీతో కలిసి హెచ్ఐవీ పిల్లలకు ‘విష్ ట్రూ కమ్’ ప్రోగ్రామ్, అనాథ పిల్లలకు ‘వింగ్స్ ఆఫ్ హోప్’ ద్వారా విమాన ప్రయాణాలు చేయించడం వంటి పనులతో సేవాకార్యక్రమాల్లో ఉండే సంతృప్తిని ఆస్వాదించాను. పేదరికం... అనారోగ్యం... రెండూ శాపాలే! నా సర్వీస్‌ని ముఖ్యంగా ఆర్థిక వెనుకబాటు తనం, అనారోగ్యాల నిర్మూలనల మీదనే కేంద్రీకరించడానికి బలమైన కారణమే ఉంది. పేదరికమే ఒక శాపమైతే, అనారోగ్యం మరొక విషాదం. ఈ రెండూ కలిస్తే ఆ వ్యక్తి వేదన వర్ణనాతీతం. పిల్లలకు వైద్యం చేయించలేక తల్లిదండ్రులు పడే గుండెకోతను చెప్పడానికి ఏ భాషలోనూ మాటలు దొరకవు. సమాజంలో ఇన్ని సమస్యలుంటే ఇవి చాలవన్నట్లు మనుషులు ఒకరినొకరు కులాల పరంగా దూరం చేసుకోవడం మరొక విషాదం. భారతీయ విద్యాభవన్‌లో చదువుకున్నన్ని రోజులూ నాకు కులాల గురించి తెలియదు. ఇంటర్‌కి మా వాళ్లు ర్యాంకుల ప్రకటనలతో హోరెత్తించే కాలేజ్‌లో చేర్చారు. బీసీ వర్గానికి చెందిన నేను అక్కడ వివక్షను చూశాను, ఎదుర్కొన్నాను కూడా. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిన ఈ తరంలో కూడా ఇలా ఉంటే మా నానమ్మ, ఇంకా ముందు తరాల వాళ్లు ఎంతటి వివక్షకు లోనయ్యారో కదా అనే ఆలోచన మెదలుతుండేది. మా ట్రస్ట్ హోమ్‌లో కులం లేని సమాజాన్ని సృష్టించగలిగాను. నేను లీగల్ గార్డియన్‌గా ‘జములమ్మ’ అనే అమ్మాయిని దత్తత చేసుకున్నాను. ఆ అమ్మాయి కులమేంటో చూడలేదు. వైద్యసహాయం అందిస్తున్న వారి కులాలూ చూడం. నేను రక్తదాతల సంఘం సభ్యురాలిని కూడా. రక్తం అవసరమైన పేషెంట్లు రక్తదాత కులాన్ని చూడరు. సమంత చూపిన బాట! మేము పేషెంట్‌కి వైద్యసహాయం కోసం ఎంపిక చేసుకునేటప్పుడు త్రీ పార్టీ ఫండింగ్ విధానాన్ని అవలంబిస్తుంటాం. మూడింట ఒకవంతు మేము సహాయం అందిస్తాం, ఒక వంతు పేషెంట్ కుటుంబీకులు, ఒక వంతు హాస్పిటల్ వైపు నుంచి బిల్లులో తగ్గింపు ఉండేటట్లు చూస్తాం. సరీ్వస్ విషయంలో సమంత ప్రభావం నా మీద ఎంతగా ఉందంటే... ఆమె చేనేతల ప్రమోషన్ కోసం పని చేస్తున్న సమయంలో నా వంతుగా ప్రకృతికి ఉపకరించే పని చేయాలని స్టూడియో బజిల్ హ్యాండ్లూమ్ క్లోతింగ్ బిజినెస్ పెట్టాను. ఇన్నేళ్ల నా సరీ్వస్‌లో లెక్కకు మించిన పురస్కారాలందుకున్నాను. కానీ వాల్మీకి ఫౌండేషన్ నుంచి ఈ ఏడాది అందుకున్న ‘సేవాగురు’ గుర్తింపు ఎక్కువ సంతోషాన్నిచ్చింది. మావారు బినేశ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ‘వి హాంక్’ కోసమే పూర్తి సమయం పని చేయడం కూడా నాకు అందివచి్చన అవకాశం అనే చెప్పాలి. నన్ను నేను మలచుకోవడంలో బినేశ్ నాకు పెద్ద సపోర్ట్’’ అన్నారు శశాంక బినేశ్. ‘పోష్’ చైతన్యం మహిళలు పని చేసే ప్రదేశాల్లో తప్పనిసరిగా ‘సెక్సువల్ హెరాస్మెంట్ రిడ్రెసల్ కమిటీ’ ఉండాలి. ధనలక్ష్మీ బ్యాంకు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీ సభ్యురాలిని. చాలా మంది మహిళలకు తమ పని ప్రదేశంలో అలాంటి కమిటీ ఉందనే సమాచారమే ఉండడం లేదు. ఇందుకోసం అవగాహన సదçస్సుల ద్వారా మహిళలను చైతన్యవంతం చేయడం నాకు చాలా సంతృప్తినిస్తోంది. సమస్య ఎదురైతే గళం విప్పాలనే తెగువ లేకపోవడం కంటే గళం విప్పవచ్చనే చైతన్యం కూడా లేకపోవడం శోచనీయం. నేను ధైర్యంగా ఇవన్నీ చేయడానికి మా నాన్న పెంపకమే కారణం. ‘ఆడవాళ్లు మానసికంగా శక్తిమంతులు. ఎన్ని అవాంతరాలెదురైనా అనుకున్న పనిని మధ్యలో వదలరు’ అని చెప్పేవారాయన. ‘మహిళ ఒకరి మీద ఆధారపడి, ఒకరి సహాయాన్ని అరి్థంచే స్థితిలో ఉండకూడదు. తన కాళ్లమీద తాను నిలబడి, మరొక మహిళకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉండాలి. సమాజం గురించి భయపడి వెనుకడుగు వేయవద్దు. జీవితం పట్ల నీ నిర్ణయం ప్రకారం ముందుకే వెళ్లాలి. నువ్వు విజయవంతమైతే సమాజమే నిన్ను అనుసరిస్తుంది’ అని చెప్పేవారు. నేను సాటి మహిళలకు చెప్పే మంచి మాట కూడా అదే. – శశాంక బినేశ్, సోషల్ యాక్టివిస్ట్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ -
Kanika Talukdar: జై కొట్టాల్సిందే!
అస్సాంకు చెందిన కనిక భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కనికకు భవిష్యత్ చీకటిగా కనిపించింది. తాను ఎలా బతకాలి? అనే ఆందోళన మొదలైంది. ధైర్యం ఉంటే అదే దారి చూపిస్తుంది అంటారు. డీలా పడకుండా ధైర్యంగా ఉండడం నేర్చుకుంది. అయిదు వందల రూపాయల పెట్టుబడితో వర్మికంపోస్ట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టిన కనిక ఇప్పుడు లక్షాధికారి అయింది... పెళ్లయిన మూడు సంవత్సరాలకు అస్సాంలోని బోర్జాహర్ గ్రామానికి చెందిన కనికా తలుక్దార్కు బిడ్డ పుట్టింది. బిడ్డ మూడు నెలల వయసులో ఉన్నప్పుడు భర్త అనారోగ్యంతో చనిపోవడం కనికను విషాదసాగరంలోకి నెట్టింది. కళ్ల ముందు పసిపాపే కనిపిస్తుంది. భవిష్యత్ మాత్రం మసకబారిపోయింది. ఆ సమయంలో వర్మికంపోస్ట్ రూపంలో ఒక వెలుగు కిరణం కనిపించింది. కొన్ని సంవత్సరాల క్రితం కృషి విజ్ఞాన కేంద్ర(కేవీకే) నిర్వహించిన ఒక వర్క్‌షాప్‌లో వర్మికంపోస్ట్, చేపల పెంపకం, కోళ్ల పెంపకం...మొదలైన వాటి గురించి తెలుసుకుంది కనిక. వర్క్‌షాప్ తాలూకు విషయాలు గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు వర్మికంపోస్ట్ తయారీ సులభం అనిపించింది. ఎందుకంటే ఆవు పేడలాంటి ముడిసరుకులు సేకరించడానికి తాను పెద్దగా కష్టపడనక్కర్లేదు. ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండా తన చుట్టుపక్కల అందుబాటులో ఉన్న వనరులతోనే వర్మికంపోస్ట్ తయారుచేయవచ్చు. 2019లో నార్త్ ఈస్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్ రెండు నెలల ఓరియెంటేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం కనికకు ఎంతో ఉపకరించింది. శిక్షణలో భాగంగా వర్మివాష్ను తయారు చేయడం నేర్చుకుంది. ఇది వర్మికంపోస్ట్ నుంచి తయారుచేసే ద్రవసారం. సాధారణ వర్మికంపోస్ట్ కంటే ఎక్కువ నత్రజని, భాస్వరం..మొదలైనవి ఇందులో ఉంటాయి. అయిదు వందల రూపాయల పెట్టుబడితో వ్యాపారంలోకి అడుగు పెట్టింది కనిక. కృషి విజ్ఞాన కేంద్ర ఉచితంగా వానపాములను అందించింది. ‘జై వర్మికంపోస్ట్’ బ్రాండ్‌తో వర్మికంపోస్ట్, వర్మివాష్ అమ్మకానికి రెడీ అయింది. తయారీ సంగతి సరే, మరి కొనేవారు ఎవరు? రసాయన ఎరువులకు అలవాటు పడిన రైతులకు వర్మికంపోస్ట్ నచ్చుతుందా? అందుకే తన ఉత్పత్తికి తానే ప్రచారకర్తగా మారింది. వర్మికంపోస్ట్ వాడకం వల్ల నేలకు జరిగే మేలు ఏమిటో ఊరూరా తిరుగుతూ ప్రచారం చేసింది. ఆమె శ్రమ వృథా పోలేదు. వ్యాపారం అడుగుల స్థాయి నుంచి పరుగుల స్థాయికి చేరుకుంది. పేడ కోసం మొదట రెండు ఆవులను కొన్న కనిక ఆ తరువాత నాలుగు ఆవులను ఒకేసారి కొనగలిగే స్థాయికి చేరింది. ఒకప్పుడు ‘జై’ కంపెనీ ఒక సంవత్సరంలో 800 కిలోల వర్మికంపోస్ట్‌ను ఉత్పత్తి చేసేది. ప్రస్తుతం అది నెలకు 35 టన్నుల స్థాయికి చేరుకుంది. అస్సాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో పాటు మేఘాలయా, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్‌లో ఎన్నో నర్సరీలు జై ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయి. వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేకపోయినా అద్భుత విజయం సాధించిన కనిక ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. విద్యార్థుల కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (అస్సాం) ప్రతి నెల కనికతో అవగాహన తరగతులు నిర్వహిస్తోంది. ‘ఇది కలలో కూడా ఊహించని విజయం. ఎలా బతకాలో అని భయపడిన నేను ఎంతోమందికి ఉపాధి కల్పించగలుగుతున్నాను. ఎలా బతకాలో తెలియక ఒకప్పుడు ధైర్యం కోల్పోయిన నేను ఇప్పుడు ఎంతోమందికి ధైర్యం చెబుతున్నాను. ఈ విశాలమైన ప్రపంచంలో మన కోసం ఎన్నో అవకాశాలు ఉంటాయి. వాటిలో ఒకటి అందిపుచ్చుకున్నా మన జీవితమే మారిపోతుంది’ అంటుంది నలభై అయిదు సంవత్సరాల కనికా తలుక్దార్. -
ఫైనాన్షియల్ లిటరసీతో మహిళా ప్రపంచాన్ని మార్చేస్తోంది!
ఏమీ తెలియకపోవడం వల్ల కలిగే నష్టం సంక్షోభ సమయంలో, కష్టసమయంలో భయపెడుతుంది. బాధ పెడుతుంది. సమస్యల సుడిగుండంలోకి నెట్టి ముందుకు వెళ్లకుండా సంకెళ్లు వేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అనన్య పరేఖ్ ‘ఇన్నర్ గాడెస్’ అనే సంస్థను ప్రారంభించింది. ‘ఇన్నర్ గాడెస్’ ద్వారా ఫైనాన్షియల్ లిటరసీ నుంచి మెంటల్ హెల్త్ వరకు అట్టడుగు వర్గాల మహిళల కోసం దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. చెన్నైలోని మైలాపూర్‌లో ఉమ్మడి కుటుంబంలో పెరిగిన అనన్య పెద్దల నుంచి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంది. ఆరు సంవత్సరాల వయసు నుంచే పుస్తకాలు చదవడం అలవాటైంది. ‘పుస్తకపఠనం అలవాటు చేయడం అనేది నా కుటుంబం నాకు ఇచ్చిన విలువైన బహుమతి’ అంటున్న∙ అనన్య పెద్దల నుంచి విన్న విషయాలు, పుస్తకాల నుంచి తెలుసుకున్న విషయాల ప్రభావంతో సమాజం కోసం ఏదైనా చేయాలనే ఆలోచన చేయడం ప్రారంభించింది. సోషల్ ఎంట్రప్రెన్యూర్‌గా వడివడిగా అడుగులు వేయడానికి ఈ ఆలోచనలు అనన్యకు ఉపకరించాయి. అనేక సందర్భాలలో లింగ విక్ష ను ఎదుర్కొన్న అనన్య ‘ఇది ఇంతేలే’ అని సర్దుకుపోకుండా ‘ఎందుకు ఇలా?’ అని ప్రశ్నించేది. కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి చర్చించేది. తమ ఇంటికి దగ్గరగా ఉండే ఒక బీద కుటుంబానికి చెందిన పిల్లల కోసం క్లాసు పుస్తకాలు కొనివ్వడం ద్వారా సామాజిక సేవకు సంబంధించి తొలి అడుగు వేసింది అనన్య. ఏరో స్పేస్ ఇంజనీరింగ్ చేసిన అనన్య ఉన్నత ఉద్యోగాలపై కాకుండా మహిళల హక్కులు, మహిళా సాధికారత, చదువు... మొదలైన అంశాలపై దృష్టి పెట్టింది. చెన్నై కేంద్రంగా ‘ఇన్నర్ గాడెస్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ తరపున అట్టడుగు వర్గాల మహిళల కోసం ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షి యల్ యాంగై్జటీ, మెంటల్ హెల్త్, పర్సనల్ ఇన్వెస్టింగ్... మొదలైన అంశాలపై దేశవ్యాప్తంగా డెబ్భైకి పైగా వర్క్‌షాప్‌లు నిర్వహించింది. సరైన సమయంలో ఆర్థిక విషయాలపై అవగాహన కలిగిస్తే అది భవిష్యత్ కార్యాచరణకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో పదహారు నుంచి ఇరవైనాలుగు సంవత్సరాల మధ్య ఉన్న యువతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఇన్నర్ గాడెస్. ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం కలిగే ఇబ్బందులు, ఉండడం వల్ల కలిగి మేలు, జీరో స్థాయి నుంచి వచ్చి విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తల గురించి ఈ వర్క్‌షాప్‌లలో చెప్పారు. షాపింగ్ నుంచి బ్యాంక్ వ్యవహారాల వరకు ఒక మహిళ తన భర్త మీద ఆధారపడేది. దురదృష్టవశాత్తు అతడు ఒక ప్రమాదంలో చనిపోయాడు. ఆమె ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? ఇలాంటి మహిళలను దృష్టిలో పెట్టుకొని వ్యవహార దక్షత నుంచి వ్యాపార నిర్వహణ వరకు ఎన్నో విషయాలపై ఈ వర్క్‌షాప్‌లలో అవగాహన కలిగించారు. ‘ఇన్నర్ గాడెస్’ నిర్వహించే వర్క్‌షాప్‌ల వల్ల పర్సనల్ ఫైనాన్స్‌కు సంబంధించిన ఎన్నో విషయాలపై మహిళలకు అవగాహన కలిగింది. సరిౖయెన నిర్ణయాలు తీసుకోవడంలో ఇది వారికి ఉపకరించింది. ఇరవై సంవత్సరాల వయసులో ‘ఇన్నర్ గాడెస్’ను ప్రారంభించిన అనన్య తన ప్రయాణంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొంది. ‘అవరోధాలు అప్పుడే కాదు ఏదో ఒక రూపంలో ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే వాటికి ఎప్పుడూ భయపడలేదు. ప్రారంభంలో ఫైనాన్షియల్ లిటరసీ అనే కాన్సెప్ట్‌పై నాకు కూడా పరిమిత మైన అవగాహనే ఉండేది. కాలక్రమంలో ఎన్నో నేర్చుకున్నాను. కెరీర్‌కు ఉపకరించే సబ్జెక్ట్‌లకు తప్ప పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్పై మన విద్యాప్రణాళికలో చోటు లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించాం. వీటిలో ఎంతోమంది వాలంటీర్లు, స్కూల్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఒక అమ్మాయి మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన చేసుకోవడమే కాదు, తన అమ్మమ్మకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో సహాయపడింది. ఇలాంటివి విన్న తరువాత మరింత ఉత్సాహం వస్తుంది’ అంటుంది అనన్య పరేఖ్. -
Radhika Aggarwal: ఆత్మవిశ్వాసమే గెలుపు మంత్రం
రాధిక అగర్వాల్ తండ్రి సైన్యంలో పనిచేసేవారు. తండ్రి ఉద్యోగరీత్యా జో«ద్‌పూర్ నుంచి అహ్మద్‌నగర్ వరకు ఎన్నో చోట్ల చదువుకుంది రాధిక. వాషింగ్టన్ యూనివర్శిటీలో ఎంబీయే చేసిన రాధిక అగర్వాల్‌కు ఎంటర్‌ప్రెన్యూర్‌గా పెద్ద పేరు తెచ్చుకోవాలనే కల ఉండేది. అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్లలో పోస్ట్–గ్రాడ్యుయేషన్ కూడా చేసింది. ‘చదువు ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇక వ్యాపారంలోకి నిస్సందేహంగా అడుగు పెట్టవచ్చు’ అనుకోలేదు ఆమె. అనుభవ జ్ఞానం విలువ ఏమిటో రాధిక అగర్వాల్‌కు తెలియనిదేమీ కాదు. చదువు పూర్తయిన తరువాత లైఫ్‌స్టైల్, ఇ–కామర్స్, ఫ్యాషన్, పబ్లిక్ రిలేషన్స్, రిటైల్ రంగాలలో 14 సంవత్సరాల పాటు పనిచేసింది. ఎన్నో రంగాలలో ఎంతో అనుభవాన్ని సంపాదించిన రాధిక అగర్వాల్ ఛండీగఢ్‌లో ఒక యాడ్ ఏజెన్సీకి శ్రీకారం చుట్టింది. ఆ తరువాత ప్రవాస భారతీయుల కోసం ‘ఫ్యాషన్ క్లూస్’ పేరుతో ఒక వెబ్సైట్ మొదలు పెట్టింది. మొదటి రెండు వ్యాపారాల విషయం ఎలా ఉన్నా... ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘షాప్ క్లూస్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయకేతనం ఎగరేసింది రాధిక అగర్వాల్. రెండు సంవత్సరాల క్రితం బ్యూటీ, న్యూట్రీషన్, హోమ్కేర్కు సంబంధించి ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘కైండ్ లైఫ్’ ప్రారంభించి మరోసారి విజయం సాధించింది. ‘ఒకసారి వెనక్కి చూస్తే... విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ కనిపిస్తాయి. అవి ఎప్పుడూ నన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి. జాగ్రత్తగా ఉండమని చెబుతాయి. వ్యాపారంలో విజయానికి వినియోగదారులకు మనపై ఉండే విశ్వాసం అనేది ముఖ్యం. అది గెలుచుకుంటే కచ్చితంగా గెలుపు మనదే. దీనికి వ్యూహాల కంటే మన నిజాయితీ అనేది ముఖ్యం. వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనడం ద్వారానే ఇంత పెద్ద విజయాన్ని సాధించగలిగాం’ అంటుంది రాధిక అగర్వాల్. ప్రతి సంవత్సరం ‘ఉమెన్స్ డే’ సందర్భంగా ఎక్కడో ఒకచోట మహిళలతో సమావేశం నిర్వహించి తన వ్యాపార ప్రస్థానాన్ని వారితో పంచుకుంటుంది. అగర్వాల్ స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు వ్యాపారవేత్తలుగా విజయం సాధించారు. ‘వ్యాపారంలో విజయం సాధించాలంటే ఉత్సాహం మాత్రమే సరిపోదు. బరిలోకి దిగే ముందు మన గురించి మనం విశ్లేషించుకోవాలి. ఎంతోమందితో మాట్లాడాలి. అయినా సరే, ఎప్పటికప్పుడు ఒక కొత్త సవాలు ఎదురవుతూనే ఉంటుంది. దానికి జవాబు చెప్పి ముందుకు కదలాలి. దీనికి కావాల్సింది ఆత్మవిశ్వాసం’ అంటుంది రాధిక అగర్వాల్. -
ఒక కష్టం దశ... దిశను మార్చింది!!
ఓ పండు కన్నతల్లిని కాపాడింది... కన్న బిడ్డను రక్షించింది. ఒక బిడ్డగా ఒక తల్లిగా ఎదురైన అనుభవాలు... ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పాయి. కంప్యూటర్స్ నుంచి పంటపొలానికి దారి మళ్లించాయి. పంట పొలం నుంచి పరిశ్రమ దిశగా నడిపించాయి. ‘ఎన్ఆర్ఐలు ఇండియాలో వెయ్యి రూపాయలు చాలా సులువుగా ఖర్చు చేయగలుగుతారు. తిరిగి తాము పనిచేసే దేశాల్లో అంత డబ్బును సులువుగా సంపాదించుకోవచ్చనే ధీమా అది. అదే ఎన్ఆర్ఐలు ఇండియాలో వెయ్యి రూపాయలు సంపాదించడం చాలా కష్టం’ అన్నారు చికోటి కీర్తి. జీవితం నేర్పించిన పాఠాలనుంచి ఆమె తెలుసుకున్న జ్ఞానం అది. ‘నా జీవితమే నన్ను నడిపించింది. హైదరాబాద్‌లో కంప్యూటర్ సెంటర్ నిర్వహించి, పెళ్లితో నైజీరియా వెళ్లాను. ముగ్గురు పిల్లల తల్లిగా ఇండియాకి వచ్చి నా సవాళ్లకు జవాబుల కోసం అన్వేషణ మొదలు పెట్టాను. సంజీవనిలాంటి పరిష్కారం దొరికింది. తొగరు పండు నన్ను పారిశ్రామికవేత్తగా మార్చింది’ అని క్లుప్తంగా వివరించారు కీర్తి. విజయవంతమైన కీర్తి ప్రయోగాల జీవితం ఇలా సాగింది. బాబు తక్కువ బరువుతో పుట్టాడు ‘‘నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. బీఎస్సీ కంప్యూటర్స్ చేసి లిబర్టీ సెంటర్లో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నిర్వహించాను. నాన్న నైజీరియాలో మెకానికల్ ఇంజనీర్, అమ్మ మా కోసం గాంధీ హాస్పిటల్లో గవర్నమెంట్ ఉద్యోగం మానేసింది. మూడు నెలలకోసారి ఎవరో ఒకరు ఇండియా– నైజీరియాల మధ్య ప్రయాణించేవాళ్లం. పెళ్లి కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్న ఇక్కడి అబ్బాయితో కుదరడం యాదృచ్ఛికమే. నా పిల్లలు ఇండియాలోనే పుట్టాలనే ఆకాంక్ష కొద్దీ మూడు డెలివరీలకూ ఇండియాలోనే ప్లాన్ చేసుకున్నాను. రెండవసారి గర్భిణిగా ఉన్న సమయంలో సరిగ్గా ఏడవ నెలలో అమ్మ ఆరోగ్యం మా కుటుంబాన్ని కుదిపేసింది. అక్కడ (నైజీరియా) మలేరియా సర్వసాధారణం. అమ్మకు మలేరియా మెదడుకు సోకడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. అక్కడ అన్నిరకాల వైద్యం అందించిన తర్వాత ఇండియాకి తీసుకువచ్చి డాక్టర్ సూచనతో నోని ఫ్రూట్ (తొగరు పండు) జ్యూస్ పట్టించాం. ఆమె రికవరీ స్పీడ్ మాకే ఆశ్చర్యం కలిగింది. నా డెలివరీ టైముకు పూర్తిగా కోలుకుని అంతా తనే చూసుకుంది. నాకది మిరకిల్. అయితే ఆ మిరకిల్ నా తదుపరి జీవితానికి ఒక సంకేతమని ఆ తర్వాత తెలిసింది. నాకు బాబు డౌన్ సిండ్రోమ్‌తో పుట్టాడు. బరువు ఒకటిరన్నర కిలోలు. మేము ఏ మాత్రం ఊహించని పరిణామం అది. నాలుగు నెలలు నిండినా బరువు గ్రాము కూడా పెరగ లేదు. డాక్టర్లు ఏ భరోసా ఇవ్వలేకపోయారు. అప్పుడు అమ్మ తనను కాపాడిన నోని జ్యూస్ బాబు ఆరోగ్యాన్ని కూడా బాగు చేస్తుందేమో చూద్దామన్నది. దేవుడి మీద భారం వేసి పట్టించాం. నెల రోజుల్లో ఏడు వందల గ్రాములు పెరిగాడు. అప్పటి నుంచి నోని మీద రీసెర్చ్ మొదలు పెట్టాను. కంపెనీ మాట మార్చింది మార్కెట్లో ఉన్న నోని ఫ్రూట్ జ్యూస్ కంపెనీలను సంప్రదించాను. ఇదీ అదీ అనే తేడా లేకుండా అందుబాటులో ఉన్న సమాచారాన్నంతటినీ సేకరించి అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. అదే సమయంలో అమ్మ ఆరోగ్య దృష్ట్యా నాన్న బయటి దేశాల్లో ఉండడానికి ఇష్టపడక ఉద్యోగం మానేసి ఇండియాకి వచ్చేశారు. ఆయన తనకంటూ వ్యాపకం కోసం వ్యవసాయం చేయాలనుకున్నారు. అలా పదెకరాల పొలం కొని తొగరు చెట్లను పెంచాం. ఓ కంపెనీ ఇచ్చిన భరోసాతో పంటను యాభై ఎకరాలకు విస్తరించాం. అయితే పంట పెద్ద మొత్తంలో వచ్చే సమయానికి కంపెనీ మాకిచ్చే ధర తగ్గించింది. ఖర్చులు కూడా రానంత తక్కువ ధరకు అమ్మడంకంటే ఈ పండ్లతో మనమే పరిశ్రమ స్థాపిద్దామనే ఆలోచన వచ్చింది. అప్పటి వరకు మా కుటుంబ అవసరాలకు తగినట్లు తయారు చేస్తున్న జ్యూస్, లోషన్, షాంపూ, హెయిర్ ఆయిల్ వంటి మొత్తం పాతిక రకాల ఉత్పత్తులను పెద్ద మొత్తంలో తయారు చేసి ‘చెక్ బయో ఆర్గానిక్స్’ పేరుతో మార్కెట్లోకి వచ్చాం. మా పొలంలో పండించి తయారు చేయడం వల్ల క్వాలిటీ విషయంలో మోసపోవడం, రాజీ పడడం రెండూ ఉండవు. మా అమ్మను, నా బిడ్డను కాపాడిన ఈ పండులోని ఔషధగుణాలను ప్రపంచానికి తెలియచేయాలనే సంకల్పంతో సంజీవని వంటి ఈ పండును ఎన్ని రకాలుగా అందించవచ్చనే పరిశోధనలు చేస్తున్నాను. ప్రభుత్వ అనుమతుల ప్రకారం సర్టిఫికేట్లతోపాటు నాచురల్ హెల్త్ సైన్స్ అసోసియేషన్ అవార్డు, ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ పురస్కారం అందుకున్నాను’’ అని తాను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన వైనాన్ని వివరించారామె. ‘పరిశ్రమ స్థాపించిన ప్రతి మహిళ వెనుక ఒక కథ ఉంటుంది. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ’ అన్నారు కీర్తి. సంజీవని పండుతో పరిశోధన తొగరు చెట్లు చలిని తట్టుకోలేవు. పాశ్చాత్య దేశాల్లో ఈ పండు మీద పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఈ పంట అక్కడ పండదు. కాబట్టి ఎన్నో ఔషధగుణాలున్న సంజీవని వంటి ఈ పండుకు ప్రచారం కూడా పెద్దగా లభించలేదు. ఈ పండు నేరుగా మన దేహంలోని కణాల మీద పనిచేస్తుంది. అనేక రోగాలను నయం చేస్తుంది. కణాల శక్తిని పెంచి, దేహాన్ని వ్యర్థరహితం, విషరహితం చేస్తుంది. క్యాన్సర్ పేషెంట్లకు కూడా మంచి గుణాన్నిస్తుంది. అనారోగ్యాలు వచ్చిన తర్వాత స్వస్థత కోసం వాడడమే కాదు. మామూలు వాళ్లు కూడా రోజుకు 30 మిల్లీలీటర్ల రసం తాగితే సమగ్రమైన ఆరోగ్యం చేకూరుతుంది. రసాయన రహితంగా తయారు చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ వచ్చింది. ఆయుష్ అనుమతి కోసం అప్లయ్ చేశాను. – చికోటి కీర్తి ఫౌండర్, చెక్ బయో ఆర్గానిక్స్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
Prachi Bhatia: జీవితాన్ని అలంకరించుకుంది
అరకొర ఆర్థిక పరిస్థితులు బాల్యాన్ని సర్దుకు పొమ్మన్నాయి. ఏమీ తెలియని పసిమనసు కూడా పరిస్థితులకు తలొంచక తప్పలేదు. తన వయసుతో పాటు కుటుంబ ఆర్థికభారం పెరిగిపోతుంటే చూడలేకపోయింది. డిగ్రీలోనే సంపాదనకు నడుం బిగించి, 28 ఏళ్లకే సక్సెస్‌పుల్ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది ప్రాచీ భాటియా. ఘజియాబాద్‌కు చెందిన ప్రాచీ భాటియా దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. తండ్రి జర్నలిస్టు, తల్లి గృహిణి. తండ్రికొచ్చే కొద్దిపాటి ఆదాయమే కుటుంబానికి ఆధారం. ఆ ఆదాయం ఏమూలకూ సరిపోయేది కాదు. ప్రాచీ స్కూలు ఫీజులు కట్టడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఎప్పుడూ స్కూల్లో అందరికంటే ఆలస్యంగా ఫీజు చెల్లించేవారు. ఇంతటి గడ్డు పరిస్థితుల్లో సైతం ఇంటర్మీడియట్ పూర్తిచేసిన ప్రాచీ ... తనకెంతో ఇష్టమైన డిజైనింగ్ డిగ్రీ చేయాలనుకుంది. అనుకున్నట్టుగానే ఢిల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్టీ) లో సీటు సంపాదించింది. కానీ అక్కడ హాస్టల్ ఫీజు, ఇతర ఖర్చులకు డబ్బులు లేక ఎన్ఐఎఫ్టీలో చేరలేదు. గురుగామ్‌లోని జీడీ గోయెంకా యూనివర్శిటీలో చేరింది. ► సంపాదిస్తూనే కాలేజీ టాపర్ అతి కష్టంమీద డిగ్రీలో చేరిన ప్రాచీ.. ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క చిన్న వ్యాపారం ప్రారంభించింది. కుటుంబానికి ఆర్థి కంగా సాయపడేందుకు.. గిఫ్ట్స్ తయారు చేసి విక్రయించేది. ఫొటో ఆల్బమ్స్, ఫొటో ప్రింటెడ్ ల్యాంప్స్, హ్యాండ్‌మేడ్ కార్డ్స్, రోజెస్ వంటివి తయారు చేసి ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసేది. ఇలా విక్రయిస్తూ నెలకు ఐదువేల రూపాయల దాకా సంపాదించేది. వాటిలో కొంత ఇంట్లో ఇచ్చి మిగతావి దాచుకునేది. ఆర్ట్స్, క్రాఫ్ట్స్ మీద ఆసక్తి ఉండడంతో సర్టిఫికెట్ కోర్సులు చేసేది. మరోపక్క డిగ్రీ చదువుతూ వచ్చే స్కాలర్‌షిప్‌తో తన ఎడ్యుకేషన్ లోన్ కట్టేది. ఇవన్నీ చేస్తూ కూడా డిగ్రీలో కాలేజ్ టాపర్‌గా నిలిచింది ప్రాచీ. ► ఎంప్లాయీ నుంచి ఎంట్రప్రెన్యూర్‌గా డిగ్రీ పూర్తవగానే ప్రాచీ గురుగామ్‌లోని ఓ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో అసిస్టెంట్ డిజైనర్‌గా చేరింది. కొన్నాళ్లు పనిచేశాక.. మరో బహుళ జాతి కంపెనీలో డిజైనర్‌గా ఉద్యోగావకాశం వచ్చింది. అందులోచేరిన కొద్దిరోజులకే ‘‘ఒకరి కింద నేనెందుకు పనిచేయాలి? నేనే ఏదైనా కొత్తగా ప్రారంభించవచ్చు కదా!’’ అనుకుని వెంటనే ఉద్యోగం వదిలేసింది. అప్పటిదాకా చేసిన ఉద్యోగ అనుభవ పాఠాలతో 24 ఏళ్ల వయసులో సొంతంగా ‘చౌఖట్’ పేరిట హోండెకార్ బ్రాండ్‌ను స్థాపించింది. అప్పటివరకు దాచుకున్న లక్ష రూపాయలను పెట్టుబడిగా పెట్టి.. ఇంటి అలంకరణలో ఉపయోగించే∙ఉత్పత్తులను పేపర్ మీద డిజైన్ చేసి, మొరాదాబాద్, జైపూర్, నోయిడాలలోని కళాకారులతో రకరకాల కళాఖండాలను తయారు చేయించేది. తయారైన ఉత్పత్తులను ఫోటోషూట్ చేసి తన సొంత వెబ్సైట్లో పెట్టి విక్రయించడం మొదలు పెట్టింది. విక్రయాలు కాస్త మందకొడిగా ఉండడంతో.. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రకటనలు ఇచ్చింది. వీటిద్వారా చౌఖట్కు గుర్తింపు రావడంతో వ్యాపారం ఊపందుకుంది. దీంతో తన మార్కెటింగ్ బడ్జెట్ నెలకు యాభైవేలకు చేరింది. తొలిఏడాది మూడు లక్షలు, రెండో ఏడాది పదకొండు లక్షలు. దురదృష్టవశాత్తూ మూడో ఏడాది కరోనా కారణంగా ఆశించినంత ఆదాయం రాలేదు. దాంతో ప్రాచీ తన ఐడియాలతో వ్యాపారం పుంజుకునేలా చేయడంతో... గతేడాది (నాలుగో సంవత్సరం) ఒక్కసారిగా 35.5 లక్షలకు చేరింది. ఐదు వందల నుంచి ఇరవై వేల రూపాయల ధరల్లో ఉన్న 70 రకాల ఛౌఖట్ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఆర్డర్లు వస్తున్నాయి. తను డిజైన్ చేసిన వస్తువులను స్కూటీ మీద మోసుకెళ్లిన ప్రాచీ ఇటీవలే తన సొంత డబ్బులతో కారు కొనుక్కుంది. ► రాయి శిల్పంగా మారినట్టు.. ‘‘నేను నడిచిన దారిలో అనేక బెదిరింపులు, వయసు వివక్షలు వంటి అనేక ఇబ్బందులు, సమస్యలు, ఒత్తిళ్లు ఎదురయ్యేవి. అయితే ఉలి దెబ్బలకు రాయి శిల్పంగా మారినట్లు వీటన్నింటిని భరిస్తూనే ఈ స్థాయికి వచ్చాను. భవిష్యత్‌లో చౌఖట్ టర్నోవర్‌ను నాలుగు వందల కోట్లకు తీసుకెళ్లాలి. ఇంటి అలంకరణ వస్తువులు కావాలంటే కస్టమర్లు నా చౌఖట్ను ఎంచుకునే స్థాయికి ఎదుగుతాను’’ అని ప్రాచీ సగర్వంగా చెబుతోంది. -
Neha Narkhede: టెక్నోస్టార్
పుణెలోని ఆ ఇంట్లో మరాఠీ, హిందీ పాటలతో పాటు పాఠాలు కూడా వినిపించేవి. అయితే అవి క్లాస్రూమ్ పాఠాలు కాదు. ఎన్నో రంగాలలో ఎన్నో అద్భుత విజయాలు సాధించిన మహిళల గురించిన గెలుపు పాఠాలు. ఆ పాఠాలు వింటూ వింటూ ‘నేను కూడా సాధిస్తాను’ అన్నది చిన్నారి నేహ. అవును ఆమె సాధించింది! ఫోర్బ్స్ అమెరికా ‘రిచ్చెస్ట్ సెల్ఫ్–మేడ్ ఉమెన్–2023’ జాబితాలో వివిధ రంగాలకు చెందిన వందమంది మహిళలకు చోటు దక్కింది. వీరిలో పదకొండు మంది నలభై ఏళ్ల వయసులోపు ఉన్నవారు. వారిలో ఒకరు 38 సంవత్సరాల టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్ నేహ నర్ఖాడే.... మహారాష్ట్రలోని పుణెలో పుట్టి పెరిగింది నేహ. ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు తనకు కంప్యూటర్ కొనిచ్చారు. అప్పుడు టెక్నాలజీపై మొదలైన ప్రేమ అలా కొనసాగుతూనే ఉంది. టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కొత్త కొత్త విజయాలు సాధించేలా చేస్తూనే ఉంది. తన బలం ‘తల్లిదండ్రులు’ అని చెప్పుకుంటుంది నేహ. ‘మొదట చదువు విలువ గురించి చెప్పారు. చదువుపై ఆసక్తి పెరిగేలా చేశారు. ఎంతోమంది మహిళా రోల్‌మోడల్స్ గురించి చెప్పేవారు. నువ్వు కూడా ఏదైనా సాధించాలి అంటూనే... యస్. నువ్వు సాధించగలవు అనే ధైర్యాన్ని ఇచ్చారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించారు’ అంటుంది నేహ. పుణె ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీలో చదువుకున్న నేహ ... జార్జియా (యూఎస్)లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసింది. జార్జియాలో చదువుకునే రోజుల్లో ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలి అనే విషయంలో ఎంతోమంది స్నేహితులతో చర్చిస్తూ ఉండేది. ‘ఒరాకిల్’లో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా తొలి ఉద్యోగం చేసిన నేహ ఆ తరువాత ‘లింక్ట్ ఇన్’లో చేరింది. ఆ సమయంలో రకరకాల స్టార్టప్‌లు, వాటి విజయాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ‘అపాచీ కాఫ్కా’ అనే ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. కంపెనీలు తమ డాటాతో వేగంగా యాక్సెస్ అయ్యే అవకాశాన్ని ఈ ప్లాట్‌ఫామ్ కల్పిస్తుంది. ‘ఎలాంటి జటిలమైన సమస్యను అయినా పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి’ అనేది లక్ష్యంగా నిర్ణయించుకుంది. రెండు సంవత్సరాల తరువాత ‘కన్‌ఫ్లూయెంట్’ అనే ఫుల్–స్కేల్ డాటా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది నేహ. ప్రపంచవ్యాప్తంగా వేలాది కంపెనీలు ‘కన్‌ఫ్లూయెంట్’ నుంచి సేవలు పొందుతున్నాయి. కంపెనీకి సంబంధించి భాగస్వాములు, ఉద్యోగులను ఎంచుకోవడంలో నేహ అనుసరించే పద్ధతి ఏమిటి? ఆమె మాటల్లో చెప్పాలంటే... ‘తెలివితేటలతో పాటు కష్టపడే స్వభావం ముఖ్యం. వీరితో ఐడియాలు షేర్ చేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది అనిపించాలి. సమస్య తలెత్తినప్పుడు మెరుపు వేగంతో పరిష్కరించే సామర్థ్యం ఉండాలి’ నేహ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలు పెట్టినప్పుడు స్టార్టప్ కల్చర్‌పై ఇప్పుడు ఉన్నంత అవగాహన లేదు. ప్రతి అడుగు ఆచితూచి వేసినా ఎక్కడో ఏదో తప్పు జరుగుతుండేది. వెంటనే ఆ తప్పును దిద్దుకొని ముందుకు సాగేది. నేహా నర్ఖాడే విజయరహస్యం ఏమిటి? ‘వ్యూహాలు, ప్రతివ్యూహల సంగతి తరువాత. ఎంటర్ప్రెన్యూర్లకు తప్పనిసరిగా కావాల్సింది మానసిక బలం. ఆ బలం ఉంటే యుద్ధరంగంలో అడుగు ముందుకు వేయగలం. విజయాలు సాధించగలం. ఇది నా దారి... అంటూ పరుగెత్తడం కాదు. చుట్టూ ఏం జరుగుతుందో అనేదానిపై పరిశీలన దృష్టి ఉండాలి. మన తప్పుల నుంచీ కాదు ఇతరుల తప్పుల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. టైమ్మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఏ రోజైనా సరే... చేయాల్సిన పనిపై పక్కా ప్రణాళిక ఉండాలి’ అంటుంది నేహ. నేహ ఇప్పుడు ఎంతోమంది మహిళలకు రోల్‌మోడల్, తన రోల్‌మోడల్ మాత్రం ఎలక్ట్రిక్ కార్ స్టార్టప్ ‘నియో’ ఫౌండర్, సీయివో పద్మశ్రీ వారియర్. ‘రోల్‌మోడల్ స్థానంలో మనల్ని మనం చూసుకుంటే వారిలా విజయం సాధించడం కష్టం కాదు’ అంటుంది నేహ నర్ఖాడే. టైమ్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఏ రోజైనా సరే... చేయాల్సిన పనిపై పక్కా ప్రణాళిక ఉండాలి. – నేహ -
వీడియో: ఇంట్లో ఇల్లాలు.. 200 కోట్లకు కోటీశ్వరురాలు!
-
అవసరం నుంచి ఆకాంక్ష వరకు
మహిళల పురోగతికి ఆకాశమే హద్దు. నిజమే... మరి! మహిళ పురోగతి ఎక్కడ మొదలవుతుంది? ఒక ఆకాంక్ష నుంచి మొదలు కావచ్చు... అలాగే... ఒక అవసరం నుంచి కూడా మొదలు కావచ్చు. అవును... అవసరమే ఆమెను జాతీయస్థాయిలో నిలిపింది. ఆమె... మహిళలకు చేయూతనిచ్చే స్థానంలో నిలిచింది. ఆలూరి లలిత మహిళాపారిశ్రామికవేత్త. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ చేశారు. పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో వ్యాపార కుటుంబంలో అడుగుపెట్టారు. ఉమ్మడి కుటుంబం కూడా కావడంతో తన మీద పెద్ద బాధ్యతలేవీ లేవు. నాలుగేళ్లు అలా గడిచిపోయాయి. తమ కంపెనీ ఒడిదొడుకుల్లో ఉందని, భాగస్వాములు దూరం జరిగారని తెలిసిన తర్వాత భర్తకు తోడుగా బాధ్యత పంచుకోవడానికి భుజాన్నివ్వాల్సి వచ్చింది. అలా మొదలైన పారిశ్రామిక ప్రస్థానం ఆమెను విజేతగా నిలపడంతోపాటు జాతీయ స్థాయిలో సంఘటితమైన మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య (కోవె)కు అధ్యక్షురాలిని చేసింది. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు లలిత. ‘అవసరం’తో పోరాటం ‘‘గృహిణిగా ఉన్న నేను పరిశ్రమ నిర్వహణలోకి అడుగుపెట్టింది 1998లో. అప్పటికే మనుగడ సమస్య మాది. తీరా అడుగు పెట్టిన తర్వాత తెలిసింది బ్యాంకు వాళ్లు మా పరిశ్రమను ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్) కేటగిరీలో లిస్ట్ చేశారని. మూడు క్వార్టర్లు బకాయి పడి ఉన్నాం. మరో క్వార్టర్ సమయం కావాలని అడిగాను. మొదట్లో ససేమిరా అన్నారు. ‘మీరు హ్యాండోవర్ చేసుకుని మీ డబ్బు ఎలా జమ చేసుకుంటార’ని అడిగాను. మెషినరీ అమ్మేస్తామన్నారు. ఈ మెషీన్లతో పని చేయడానికి మా వారు సింగపూర్‌లో శిక్షణ తీసుకుని వచ్చారు, హైదరాబాద్‌లో ఈ టెక్నాలజీ చాలామందికి తెలియదు. మీరు స్క్రాప్ కింద అమ్మాల్సిందే, రెండు లక్షలు కూడా రావు. మాకు టైమిస్తే మీ లోన్ మొత్తం తీర్చేస్తామని చెప్పాను. ఆ తర్వాత అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముల సహాయంతో పది లక్షలు ఎదురు పెట్టి కొత్త టెక్నాలజీతో పరిశ్రమను నడిపించాం. రెండేళ్లపాటు రోజుకు 18 గంటలు పనిచేశాం. మొత్తానికి గట్టెక్కాం. 2005లో పరిశ్రమ విస్తరించాలనే ఆలోచనతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ నెట్వర్క్ – జేఎన్టీయూ తో కలిసి నిర్వహించిన ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో శిక్షణ తీసుకున్నాను. అప్పటి నుంచి ఈ సంస్థలో భాగస్వామినయ్యాను. లైఫ్ మెంబర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్, జాతీయ స్థాయి కమిటీలో జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టాను. ఈ రాష్ట్రాలు ముందున్నాయి! మహిళా పారిశ్రామిక వేత్తల విషయంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, యూపీ, ఢిల్లీ రాష్ట్రాలు ముందువరుసలో ఉన్నాయి. వెస్ట్‌బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రతోపాటు కొన్ని రాష్ట్రాలు చేయి పట్టి నడిపించాల్సిన దశలోనే ఉన్నాయి. మా సంస్థలో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో ఎక్కువ మంది బాగా చదువుకున్న వాళ్లే. ఐఐటీ, బిట్స్, ఐఐఎమ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్లు ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. మా చదువు, పరిశ్రమ నిర్వహణలో మేము నేర్చుకున్న మెళకువలతో కొత్తగా పరిశ్రమల రంగంలోకి వచ్చిన వాళ్లకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాం. ఈశాన్య రాష్ట్రాల మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నాం. అలాగే కాలేజ్‌లకెళ్లి విద్యార్థులకు వర్క్‌షాపులు నిర్వహించడం, నగరాల్లోని అల్పాదాయ వర్గాలు నివసించే కాలనీల్లోనూ, గ్రామాల్లోనూ మహిళలకు శిక్షణతోపాటు ఇన్క్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు మారారు! మహిళల్లో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు మహిళలు ఉద్యోగం చేసుకుంటే చాలన్నట్లు, భర్త సంపాదనకు తోడు మరికొంత అన్నట్లు ఉండేవారు. ఇప్పుడు ఆ ధోరణి పూర్తిగా మారిపోయింది. తన ఐడెంటిటీని తామే రాసుకోవాలనే ఆకాంక్ష పెరిగింది. అలాగే విజయవంతం అవుతున్నారు. ఉద్యోగం చేసి పిల్లల కారణంగా కెరీర్లో విరామం వచ్చిన మహిళలకు (35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారికి) వారి సామర్థ్యం, ఆసక్తిని బట్టి ‘రీ ఇగ్నైట్’ ప్రోగ్రామ్ కింద సపోర్ట్ చేస్తున్నాం. పదివేల మంది విద్యార్థులను, 30 వేల మంది గ్రామీణ మహిళలను సాధికారత దిశలో నడిపించాలనేది ప్రస్తుతం మా కోవె ముందున్న లక్ష్యం’’. ఇలా చేయండి ఒక మహిళ వ్యాపారం కానీ పరిశ్రమ కానీ పెట్టినప్పుడు అది నిలదొక్కుకుని లాభాల బాట పట్టే వరకు దాదాపుగా మూడు నాలుగేళ్లు జీవితం మనది కాదు మన పరిశ్రమది అనుకుని శ్రమించాలి. మార్కెట్‌ని విశ్లేషించుకోవాలి. రెవెన్యూ మీద అవగాహన ఉండాలి. పెట్టుబడి, రాబడి మాత్రమే కాదు. రాబడికి ఆదాయానికి మధ్య తేడా తెలుసుకోవాలి. ► కౌంటర్లోకి వచ్చిన ప్రతిరూపాయి మనది కాదు. ఉద్యోగుల వేతనాలు, అద్దె, కరెంటు, పెట్టుబడి కోసం మనం ఇంటి నుంచి పెట్టిన డబ్బుకు కొంత జమ వేసుకోవడం, బ్యాంకు లేదా ఇతర అప్పులు అన్నీ పోగా మిగిలినదే ఆదాయం. అదే మనం సంపాదించినది, మన కోసం ఖర్చు చేసుకోగలిగినది. ► పరిశ్రమ కోసం ఒక మూలనిధి ఏర్పాటు చేసి ఏటా పదిశాతం లాభాలను మూలనిధిలో జమ చేయాలి. యంత్రాల రిపేరు వంటి అనుకోని ఖర్చులకు, పరిశ్రమ విస్తరణకు ఆ నిధి పనికొస్తుంది. కోవిడ్ దెబ్బకు తట్టుకుని నిలబడినవన్నీ మూలనిధి ఉన్న పరిశ్రమలే. ► మహిళలు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే... పరిశ్రమ నిర్వహణ బరువైనప్పుడు అది లాభాల బాట పట్టడం కష్టం అని నిర్ధారించుకున్నప్పుడు దాని నుంచి వెంటనే మరొక దానికి మారిపోవాలి. ► మొదట్లో కష్టపడినన్ని గంటలు పదేళ్లు, పాతికేళ్లు కష్టపడలేరు. కాబట్టి ఇంట్లోనూ, పరిశ్రమలోనూ సపోర్టు సిస్టమ్‌ని అభివృద్ధి చేసుకోవాలి. ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ -
Sujata Seshadrinathan: ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్
సార్క్ రీజన్ ‘ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని స్వీకరించిన సుజాత శేషాద్రినాథ్ వ్యాపార అనుభవాలే తన పాఠాలు అని చెబుతుంది... సాఫ్ట్వేర్, ఫైనాన్స్,అకౌంటింగ్ స్పెషలిస్ట్‌గా తనదైన ముద్ర వేసింది సుజాత శేషాద్రినాథన్. ఫండ్ బిజినెస్‌లో అకౌంటింగ్ అప్లికేషన్స్ కోసం ఆటోమేటెడ్ టెక్నాలజీ సొల్యూషన్స్ క్రియేట్ చేసింది. ‘అద్భుతమైన పురస్కారాన్ని స్వీకరిస్తున్నందుకు గర్వంగా ఉంది. నా ప్రయాణంలో సహకరించిన వ్యక్తులు, సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్న భారతీయ మహిళలకు ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను. శ్రీలంక కేంద్రంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఏర్పాటయిన సంస్థ ఉమెన్స్ ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్. భవిష్యత్తరం మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ఉమెన్స్ ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ ఉన్నత ప్రమాణాలు నెలకొల్పింది. ఈ ఉద్యమంలో నేను కూడా భాగం కావడం సంతోషంగా ఉంది’ అంటుంది సుజాత శేషాద్రినాథన్. ఎస్పీజైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మెనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేసిన సుజాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్డీ చేసింది. సాఫ్ట్వేర్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్, ఫండ్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసులలో సుజాతకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న బసిజ్ ఫండ్ సర్వీస్ ప్రైవెట్ లిమిటెడ్‌కు సుజాత డైరెక్టర్. ఫండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఫైనాన్షియల్ రిపోర్టింగ్ వరకు ఈ సంస్థ ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. రకరకాల విషయాలలో క్లయింట్స్‌కు సంబంధించి జటిలమైన సమస్యలను పరిష్కరించడంలో ముందుంటుంది. -
Ruchi Varma: ఉద్యోగం మానేశానని ఇంట్లోవాళ్లు మాట్లాడలేదు..
సొంతంగా ఏదైనా సాధించాలనే కల అందరిలోనూ ఉంటుంది. ఆ కల కోసం నిరంతరం శ్రమిస్తేనే అనుకున్న ఫలితాలను అందుకోగలం. కానీ, కుటుంబ బాధ్యతలలో చాలా వరకు కలలు కల్లలుగానే ఉండిపోతాయి. ఉద్యోగం చేస్తున్న రుచివర్మ పరిస్థితి మొదట్లో అలాగే ఉండేది. వ్యాపారం వద్దని అడ్డుకున్న కుటుంబాన్ని మెప్పించింది, కాబోయే తల్లులకు డ్రెస్ డిజైన్స్ పేరుతో రెండున్నర లక్షలతో మొదలు వ్యాపారం మొదలుపెట్టి, రెండేళ్లలో ఏడాదికి 5 కోట్ల టర్నోవర్ చేరుకునేలా కృషి చేసింది. ఉద్యోగం వదులుకున్న పరిస్థితి నుంచి నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగిన తన తపన నేడు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. ‘‘మాది బీహార్‌లోని దర్భంగా పట్టణం. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న బ్యాంకు ఉద్యోగి, అమ్మ గృహిణి. ముగ్గురు అక్కచెల్లెళ్లం. దర్భంగా నుండి ముంబైకి ఫ్యాషన్ డిజైనర్‌గా నా ప్రయాణం సాగింది. ► అమ్మ కోరుకున్నదని.. ప్రతి తల్లిదండ్రిలాగే మా అమ్మ కూడా మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం ఇంజనీర్లు కావాలని కోరుకునేది. ఆమె కల నెరవేర్చడానికి చాలా ప్రయత్నించాను. కానీ, ఆ కోచింగ్ ఖర్చు భరించడం పెద్ద విషయంగా అనిపించింది. అమ్మనాన్నల గురించి ఆలోచించినప్పుడు నా మనసులో చాలా గందరగోళం ఏర్పడింది. ఇవన్నీ ఆలోచించి నా శక్తి మేరకు ప్రయత్నించి, ఆ కోచింగ్ నుంచి ఆరు నెలల్లో తిరిగి వచ్చేశాను. ► ఫ్యాషన్ పరిశ్రమ వైపు మనసు దర్భంగా భూమి కళలకు ప్రసిద్ధి. మా ఇంటి పక్కన టైలర్‌గా పనిచేసే ఆమె వర్క్ నన్ను బాగా ఆకట్టుకునేది. ఈ విషయం ఇంట్లో చెప్పలేకపోయాను. ధైర్యం తెచ్చుకుని నాకు ఆర్ట్స్ అంటే ఆసక్తి ఉందని, ఇంజినీరింగ్ చదవలేనని నాన్నకు చెప్పాను. నాన్న అంతా గ్రహించి, ఏ చదువు కావాలో దానినే ఎంచుకోమన్నారు. దీంతో నేను నిఫ్ట్‌లో చేరాను. ► ప్రతి నిర్ణయమూ కష్టమే నిఫ్ట్ పరీక్షలో పాసయ్యాక ముంబైకి వెళ్లాలనే నిర్ణయం కష్టమే అయ్యింది. ఒంటరిగానా?! అని భయపడ్డారు. కానీ, కొన్ని రోజుల ప్రయత్నంలో నా ఇష్టమే గెలిచింది. అది నా జీవితాన్ని మార్చింది. కాలేజీ నుంచి వెళ్లి ఓ ఎక్స్పోర్ట్ హౌజ్‌లో జాయిన్ అయ్యాను. అక్కడ మెటర్నిటీ వేర్ డిజైన్ చేసే అవకాశం వచ్చింది. మూడేళ్లపాటు ఆ ఎక్స్పోర్ట్ హౌస్‌లో పనిచేసి చాలా నేర్చుకున్నాను. ఆఫీసు, ఫ్యాక్టరీ ఒకే చోట ఉండడం వల్ల డిజైనింగ్ కాకుండా ప్రింటింగ్, స్టిచింగ్, శాంపిల్, ప్రొడక్షన్ నేర్చుకున్నాను. ఆ వర్క్ నాకు చాలా ఉపయోగపడింది. ► ఎక్కడో ఏదో లోటు. 2012 లో మొదటి ఉద్యోగం వస్తే 2019 నాటికి, నేను నాలుగు కంపెనీలలో డిజైనర్ నుండి సీనియర్ డిజైనర్ స్థానానికి చేరుకున్నాను. ఉద్యోగం చేస్తున్నాను కానీ సంతృప్తి మాత్రం లభించలేదు. పని పెరుగుతూ వచ్చింది. స్థిర జీతం అలవాటుగా మారింది. కానీ ఎప్పుడూ ఏదో మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. బాల్యంలో టైలర్ ఆంటీని స్ఫూర్తిగా తీసుకుంటే టెన్త్ క్లాస్ వచ్చేనాటికి ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నా ఆదర్శంగా ఉండేవారు. ‘నేను కూడా నా సొంత బ్రాండ్‌ని ప్రారంభించాలనుండేది. నేను ఉద్యోగం కోసమే ఈ కోర్సు ఎంచుకోలేదు.. ఎలా?’ అనే ఆలోచనలు నన్ను కుదురుగా ఉండనిచ్చేవి కావు. ► ఇంట్లో వాళ్లు మాట్లాడలేదు... 2019లో ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నాను. ఉద్యోగం మానేసినట్లు తల్లిదండ్రులు, భర్తకు చెప్పినప్పుడు వారు సంతోషించలేదు. మొదట నా భర్త చాలా నిరాకరించాడు. తరువాత నా తల్లిదండ్రులు కూడా సెటిల్డ్ లైఫ్ ను ఎందుకు వదిలేయాలి అనే మాటలే. ఇంట్లో ఉన్నవాళ్లంతా బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వాళ్లే కాబట్టి వాళ్లకు నా బాధ అర్థం కాకుండాపోయింది. నేనే ఓ రోజు నిర్ణయం తీసుకుని ఉద్యోగం వదిలేశాను. ఉద్యోగం మానేసినందుకు నా భర్త కొన్ని రోజులు మాట్లాడలేదు. రీసెర్చ్ వర్క్ చేశాక, వచ్చే 34 నెలల ప్లానింగ్‌ని మా అమ్మనాన్నలకు చెప్పాను, అప్పుడు వాళ్ళు కొద్దిగా కన్విన్స్అయ్యారు. నేను రంగంలోకి దిగగానే అసలు గొడవ మొదలైంది. ► చులకనగా మాట్లాడేవారు.. ఈ రంగంలోకి రాకముందే చాలా పరిశోధనలు మొదలుపెట్టాను. మార్కెట్లో ఏ సెక్షన్ కు డిమాండ్ పెరుగుతుందో కనిపించింది. కాబోయే తల్లుల దుస్తుల విషయంలో చాలా లోటు కనిపించింది. ఇంతకు ముందు ఇదే రంగంలో పనిచేశాను కాబట్టి కొంచెం ఆత్మవిశ్వాసం వచ్చి ఈ ప్రొడక్ట్‌ని ఎంచుకున్నాను. అయితే, రంగంలోకి దిగగానే అసలు గొడవ మొదలైంది. వన్ మ్యాన్ ఆర్మీలా అన్నీ నేనే చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు కేవలం డిజైనింగ్ వర్క్ మాత్రమే చేశాను. కానీ ఇప్పుడు ప్రొడక్షన్ లైన్, లోగో డిజైనింగ్, ప్యాకేజింగ్, డెలివరీ ఫైనాన్స్లాంటివన్నీ చేశాను. ఎందుకంటే నా దగ్గర బడ్జెట్ తక్కువగా ఉంది, కాబట్టి ఇక్కడ అతిపెద్ద సమస్య ఏర్పడింది. నా అవస్థ చూసి ఎగతాళి చేసినవారున్నారు. చులకనగా మాట్లాడినవారున్నారు. ‘ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్లకు డ్రెస్ డిజైన్స్ ఏంటి?!’ అని నాతో పని చేయడానికి వర్కర్స్ నిరాకరించేవారు. దీంతో పెద్ద ఇబ్బందిని ఎదుర్కొన్నాను. కానీ, నా పట్టుదలను వదిలిపెట్టలేదు. రెండేళ్లలో 2.5 లక్షల వ్యాపారం కోట్లకు కోవిడ్ కాలం అందరికీ కష్టంగా ఉండేది. దీంతో ఆఫ్‌లైన్ పనులు ప్రారంభం కాలేదు. అప్పుడు నా వ్యాపారం ఆఫ్‌లైన్ లో మాత్రమే చేయాలని ఆలోచించాను. ఇది నాకు ప్రయోజనకరంగా మారింది. కొన్ని ఆన్లైన్ మార్కెటింగ్ సైట్స్‌తో మాట్లాడాను. ముందు నా ప్రతిపాదనను వాళ్లు అంగీకరించలేదు. దీంతో నా సొంత సైట్లో ‘ఆరుమి’పేరుతో కాబోయే తల్లుల కోసం చేసిన నా డిజైన్స్ పెట్టాను. ప్రారంభించిన 24 గంటల్లోనే ఆర్డర్లు రావడం మొదలయింది. ఈ రోజు నా బ్రాండ్ అన్ని ఆన్లైన్ మార్కెట్లోనూ సేల్ అవుతోంది’’ అని వివరించే రుచివర్మ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. -
Alina Alam: అద్భుతదీపం
దొరికితే అద్భుతాలు సృష్టించవచ్చు. అది కథల్లో తప్ప బయట దొరకదని మనకు తెలుసు! అయితే అలీన అలమ్‌కు ‘పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్’ రూపంలో అద్భుతదీపం దొరికింది. ఆ అద్భుతదీపంతో వ్యాపారంలో ఓనమాలు తెలియని అలీన సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తోంది. నిస్సహాయత తప్ప ఏమీ లేని వారికి అండగా ఉండి ముందుకు నడిపిస్తోంది... అలీన అద్భుతదీపం కోల్‌కత్తాకు చెందిన అలీన అలమ్‌కు హైస్కూల్ రోజుల్లో బాగా నచ్చిన మాట... పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్. రోడ్డు దాటుతున్న వృద్ధురాలికి సహాయపడినప్పుడు, ఆకలి తో అలమటిస్తూ దీనస్థితిలో పడి ఉన్న వ్యక్తికి తన పాకెట్‌మనీతో కడుపు నిండా భోజనం పెట్టించినప్పుడు, పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టలేక సతమతమవుతున్న ఆటోడ్రైవరుకు తన వంతుగా సహాయం చేసినప్పుడు.. ‘పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్’ అనేది తన అనుభవంలోకి వచ్చింది. ‘ఒక మంచి పని చేస్తే అది ఊరకే పోదు. సానుకూల శక్తిగా మారి మనల్ని ముందుకు నడిపిస్తుంది’ అనే మాట ఎంత నిజమో తెలిసి వచ్చింది. అలీన తల్లి గృహిణి. తండ్రి ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగి. ‘డబ్బే ప్రధానం’ అనే ధోరణిలో వారు పిల్లల్ని పెంచలేదు. బెంగళూరులోని అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీలో మాస్టర్స్ చేసింది అలమ్. అక్కడ చదుకునే రోజుల్లో ఎన్నో డాక్యుమెంటరీలను చూసింది. తన ఆలోచనలు విశాలం కావడానికి, కొత్తగా ఆలోచించడానికి, కొత్తమార్గాన్ని అన్వేషించడానికి అవి కారణం అయ్యాయి. ‘రోమన్ చక్రవర్తి నీరోపై తీసిన ఒక డాక్యుమెంటరీ చూసి చలించిపోయాను. యుద్ధఖైదీల పట్ల అతడు క్రూరంగా వ్యవహరిస్తాడు. అయితే ఆ క్రూరత్వం అనేది ఆ చక్రవర్తికి మాత్రమే పరిమితమై లేదు. అతడితో అంతం కాలేదు. రకరకాల రూపాల్లో అది కొనసాగుతూనే ఉంది. క్రూరత్వంపై మానవత్వం విజయం సాధించాలి’ అంటుంది అలీన. 23 సంవత్సరాల వయసులో ‘మిట్టీ’ పేరుతో కేఫ్ ప్రారంభించింది అలీన.‘ఏదైనా మంచి ఉద్యోగం చేయకుండా ఇదెందుకమ్మా’ అని తల్లిదండ్రులు నిట్టూర్చలేదు. ఆశీర్వదించారు తప్ప అభ్యంతర పెట్టలేదు. ఇది లాభాల కోసం ఏర్పాటు చేసిన కేఫ్ కాదు. మానసిక వికలాంగులు, దివ్యాంగులకు ధైర్యం ఇచ్చే కేఫ్. ‘మిట్టీ’ అనే పేరును ఎంచుకోవడానికి కారణం అలమ్ మాటల్లో... ‘మనం ఈ నేల మీదే పుట్టాం. చనిపోయిన తరువాత ఈ నేలలోనే కలుస్తాం. నేలకు ప్రతి ఒక్కరూ సమానమే’ నిజానికి ‘మిట్టీ’ మొదలు పెట్టడానికి ముందు తన దగ్గర పెద్దగా డబ్బులు లేవు. దీంతో ఒక ఆలోచన చేసింది. ‘దివ్యాంగులకు మిట్టీ కేఫ్ ద్వారా సహాయ పడాలనుకుంటున్నాను. నాకు అండగా నిలవండి’ అంటూ కరపత్రాలు అచ్చువేసి కర్నాటకలోని కొన్ని పట్టణాల్లో పంచింది. అయితే పెద్దగా స్పందన లభించలేదు. ఒక అమ్మాయి మాత్రం అలీనకు సహాయం గా నిలవడానికి ముందుకు వచ్చింది. ‘ఒక్కరేనా! అనుకోలేదు. ఈ ఒక్కరు చాలు అనుకొని ప్రయాణం మొదలుపెట్టాను’ అని గతాన్ని గుర్తుకు తెచ్చుకుంది అలీన. కొందరు ఆత్మీయుల ఆర్థిక సహకారంతో హుబ్లీ(కర్నాటక)లోని బీవిబీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాం్యపస్లో ‘మిట్టీ’ తొలి బ్రాంచ్ ప్రారంభించింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. నాలుగు సంవత్సరాలలో బెంగళూరు, కర్నాటకాలలో 17 బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. దివ్యాంగులు, మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ధైర్యం ఇచ్చి, తగిన శిక్షణ ఇచ్చి ఈ కేఫ్‌లలో ఉపాధి కల్పించడం ప్రారంభించింది అలీన. ‘మిట్టీ’ సక్సెస్ఫుల్ కేఫ్గానే కాదు దివ్యాంగుల హక్కులకు సంబంధించి అవగాహన కేంద్రంగా కూడా ఎదిగింది. ‘మిట్టీ కేఫ్‌లోకి అడుగుపెడితే చాలు చెప్పలేనంత ధైర్యం వస్తుంది’ అంటుంది కోల్‌కతాకు చెందిన 22 సంవత్సరాల కీర్తి. దివ్యాంగురాలిగా కీర్తి అడుగడుగునా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది. అయితే మిట్టీ కేఫ్ తనలో ఎంతో ధైర్యాన్ని నింపింది. ఇలాంటి ‘కీర్తి’లు ఎంతో మందికి అండగా నిలుస్తోంది మిట్టీ కేఫ్. -
Heads Up For Tails: శునకాలకు కిరాణా స్టోర్
మనుషులకు కిరాణా దుకాణాలు ఉన్నాయి. శునకాలకు? పిల్లులకు? ఏవో నాలుగు రకాల తిండి, మెడ పట్టీలు, గొలుసులు... ఇవి అమ్మే పెట్ స్టోర్స్ కాకుండా వాటి ప్రతి అవసరాన్ని పట్టించుకుని వాటికి అవసరమైన టాప్ క్లాస్ వస్తువులను అమ్మే ఓ దుకాణం ఉండాలని భావించింది రాశి నారంగ్. పదేళ్ల నుంచి ఎంతో స్ట్రగుల్ అయ్యి నేడు నంబర్ వన్ స్థాయికి చేరింది. ఆమె ‘హెడ్స్ అప్ ఫర్ టెయిల్స్’ దేశవ్యాప్తంగా 75 రిటైల్ స్టోర్స్‌తో 30 పెట్ స్పాలతో సంవత్సరానికి 140 కోట్ల రూపాయల అమ్మకాలు సాగిస్తోంది. రాశి నారంగ్ పరిచయం. ఢిల్లీకి చెందిన రాశి నేడు దేశంలో అత్యధిక పెట్ స్టోర్లు కలిగిన సంస్థ ‘హెడ్స్ అప్ ఫర్ టెయిల్స్’కు ఫౌండర్. పెంపుడు జంతువుల రంగంలో కోట్ల వ్యాపారానికి వీలుంది అని గ్రహించిన తెలివైన అంట్రప్రెన్యూర్. ‘మాది వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం. మా అత్తగారిది కూడా. మా ఇంట్లో చిన్నప్పుడు కుక్కల్ని పెంచేవాళ్లం. అయితే వాటి బాధ్యత మొత్తం కుటుంబం తీసుకునేది. కాని నాకు పెళ్లయిన కొత్తల్లో నాకంటూ ఒక కుక్క కావాలనుకుని ‘సారా’ అనే బుజ్జి కుక్కపిల్లను తెచ్చుకున్నాను. అదంటే చాలా ఇష్టం నాకు. దాని పుట్టినరోజుకు దానికేదైనా మంచి గిఫ్ట్ కొనిద్దామని ఢిల్లీ అంతా తిరిగాను. ఏవో కాలర్స్, గొలుసులు తప్ప దానికి తొడగడానికి మంచి డ్రస్సు గాని, కొత్త రకం ఆట వస్తువు గాని, మంచి ఫుడ్గాని ఏమీ దొరకలేదు. కుక్కలు పడుకునే బెడ్స్ కూడా ఎక్కడా దొరకలేదు. నేను చెబుతున్నది 2008 సంగతి. ఇంటికి ఖాళీ చేతులతో వచ్చి నా సారాను ఒళ్లో కూచోబెట్టుకుని ఆలోచించాక అర్థమైంది... నాలాగే కుక్కలను ప్రేమించేవారు ఎందరో ఉన్నారు. వారు కూడా ఇలాగే ఫీలవుతూ ఉంటారు. నేనే కుక్కలకు అవసరమైన ప్రాడక్ట్స్ ఎందుకు తయారు చేయించి అమ్మకూడదు అనుకున్నాను. అలా నా యాత్ర మొదలైంది’ అంటుంది రాశి. మొదటి స్టోర్ ఢిల్లీలో... అయితే ఆ ఆలోచన వచ్చాక పని మొదలెట్టడం అంత సులువు కాలేదు. రాశి హెచ్.ఆర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఉద్యోగం కూడా చేసింది. ‘అంత చదువు చదివి కుక్కల వస్తువులు అమ్ముతావా’ అని ఫ్రెండ్స్ అన్నారు. ‘ఏదో హాబీలాగా కాలక్షేపం చేస్తుందిలే’ అని భర్త, అత్తమామలు అనుకుని వదిలేశారు. కాని రాశి ఆలోచన వేరుగా ఉంది. కుక్క అంటే ఆమె దృష్టిలో మరో ఫ్యామిలీ మెంబరే. ‘శునకాల పట్ల మన భారతీయుల దృష్టి ఇటీవల మారింది. అంతకుముందు వాటిని ఇంటి బయట కట్టేసి వాచ్ డాగ్‌లుగా చూసుకునేవారు. ఇప్పుడు ఇంట్లోనే ఒక ఫ్యామిలీ మెంబర్‌గా చూసుకుంటున్నారు. వాటికి క్వాలిటీ ఆహారం వస్తువులు మందులు ఇవ్వడంతో వాటి ఆరోగ్యం, వాటితో ఆనందం పొందాలని అనుకుంటున్నారు. కాని అలాంటి వస్తువులు ప్రత్యేకంగా దొరకడం తక్కువ. నేను రంగంలో దిగాను’ అంటుంది రాశి. కుక్కల ఒంటి తీరు, బొచ్చును బట్టి బట్టలు కుట్టి దుస్తులు తయారు చేయడం రాశి చేసిన మొదటి పని. అవి పడుకునే తీరును బట్టి అందమైన బెడ్స్ తయారు చేయడం. అవి ఆడుకోవడానికి రకరకాల వస్తువులు. వాటి ముఖ్య ఆహారం, అల్పాహారం కోసం రకరకాల క్వాలిటీ పదార్థాలు, అందమైన మెడ పట్టీలు, ప్రమాదకర రసాయనాలు లేని షాంపూలు, డియోడరెంట్లు... ఇవన్నీ ఒకచోట చేర్చి వాటిని షాపులకిచ్చి అమ్మాలనుకుంది. ‘కాని పెట్ స్టోర్లు అమ్మే వ్యాపారులు సగటు వ్యాపారులు. నేను తీసుకెళ్లిన ప్రాడక్ట్లు చూసి ఇలాంటివి అమ్మం. ఇవి ఎవరూ కొనరు అని నన్ను వెనక్కు పంపించేసేవారు. ఇక చూసి చూసి నేనే ఒక షాపు తెరిచాను. అలా ఢిల్లీలో హెడ్స్ అప్ ఫర్ టెయిల్స్ మొదటి షాపు మొదలైంది’ అంటుంది రాశి. సుదీర్ఘ విరామం తర్వాత... ఢిల్లీలో షాపు నడుస్తుండగానే రాశి భర్తకు సింగపూర్‌లో ఉద్యోగం వచ్చింది. అతనితో పాటు వెళ్లి అక్కడ 7 ఏళ్లు అక్కడే ఉండిపోయి 2015లో తిరిగి వచ్చింది రాశి. ‘అన్నాళ్లు నేను షాపును అక్కడి నుంచే నడిపాను. విస్తరించడం వీలు కాలేదు. కాని తిరిగి వచ్చాక ఈ ఐదారేళ్లలోనే ఇంత స్థాయికి తీసుకొచ్చాను’ అంటుంది రాశి. ఆమె దార్శనికతను గ్రహించిన సంస్థలు భారీగా ఫండింగ్ చేయడంతో రాశి తన స్టోర్స్‌ను పెంచుకుంటూ వెళ్లింది. అంతే కాదు కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, పిట్టలు... వీటి సంరక్షణకు స్పాలు కూడా మొదలెట్టింది. అన్నీ పెట్ ఫ్రెండ్లీ షాపులు. రాశి ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ‘క్యాట్ ఓన్లీ స్టోర్’ కూడా తెరిచింది. అన్ని మెట్రో నగరాల్లో ‘హెడ్స్ ఫర్ టెయిల్స్’ షాపులు ఉన్నాయి. కుక్కలకు కావాల్సిన 100కు పైగా వస్తువులు, జాతిని బట్టి వాడాల్సిన వస్తువులు అమ్మడం ఈమె సక్సెస్‌కు కారణం. ఒక పనిలో పూర్తిగా శ్రద్ధతో నిమగ్నమైతే రాశిలా ఎవరైనా విజయం సాధించవచ్చు. -
బిజినెస్‌కు ఈజీ మ్యాప్
చాలా మంది మహిళలు తమ సొంత కాళ్లమీద నిలబడటానికి ఉద్యోగమో, వ్యాపారమో చేయాలనుకుంటారు. ఉద్యోగానికైతే కొన్ని అర్హతలు ఉండాలివ్యాపారం చేయాలంటే.. పెట్టుబడి ఉంటే చాలనుకుంటారు. కానీ, కుటుంబం నుంచి అందుకు తగిన మద్దతు రాకపోతే .. నైపుణ్యాలు లేవని వెనకడుగువేస్తేపెట్టుబడి లేదని చతికిలపడితే.. హైదరాబాద్ నానక్‌రాంగూడలో ఉన్న కుంబజాడల సంహితను కలవచ్చు. చార్టర్డ్‌అకౌంటెంట్ అయిన సంహిత దిగువ, మధ్యతరగతి మహిళలు వ్యాపారంలో రాణించడానికి కావల్సిన అవగాహన తరగతులను ఉచితంగా ఇస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులచేత వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నారు. అనుకున్న బిజినెస్‌కు ఈజీ మ్యాప్ డిజైన్ చేసిస్తున్నారు.. ‘మహిళలు ఎవ్వరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు’ అని చెప్పే సంహితను తనకు కలిగిన ఈ ఆసక్తి గురించి అడిగినప్పుడు ఎన్నో విషయాలు పంచుకున్నారు. ‘‘సాధారణంగా చాలామంది చార్టర్డ్ అకౌంటెంట్ అంటే కంపెనీ అకౌంటింగ్, ఆడిటింగ్ పనులు చూస్తారు, అంతవరకే వారి డ్యూటీ అనుకుంటారు. కానీ, ‘మీ బిజినెస్‌ను ఇలా ముందుకు తీసుకువెళ్లచ్చు’ అని గైడెన్స్ ఇవ్వాలనుకోరు. నేను ఉద్యోగరీత్యా ముంబై, ఢిల్లీ, చెన్నై, యు.ఎస్ లలో వర్క్ చేశాను. అన్ని చోట్లా మహిళల పని సామర్థ్యాల పట్ల అవగాహన ఉంది. వివిధ రంగాల్లో నైపుణ్యం గల స్నేహితులున్నారు. వీరితో కలిసి ‘మహిళలు వ్యాపార రంగంలో రాణించడం’ అనే అంశాల మీద చర్చిస్తున్నప్పుడే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి సరైన గైడెన్స్ ఇస్తే బాగుంటుందనే ఆలోచన చేశాను. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ప్రోస్క్వాడ్ కన్సల్టింగ్ను ఏర్పాటు చేసి, నా వర్క్‌కు సంబంధించిన పనులు చూస్తున్నాను. అవగాహనే ప్రధానంగా.. రెండేళ్ల క్రితం ఆంధ్రాలో ఒకమ్మాయి తొక్కుడు లడ్డు 2/– రూపాయలకు ఒకటి అమ్మడం చూశాను. వాళ్లమ్మగారు ఆసుపత్రిలో ఉన్నారు. ఆమె మరొక అమ్మాయితో కలిసి ఈ చిన్న బిజినెస్ చేస్తోంది. ఆ రోజు వాళ్లిద్దరూ 150 లడ్డూలు అమ్మారు. అంత మంచి స్వీట్, తక్కువ ధరకు అమ్ముతున్నారు. వారికి ఆ స్వీట్స్‌ను ఎలా మార్కెటింగ్ చేయాలో చెప్పాలనుకున్నాను. దాంతోపాటు బ్యాంకుల నుంచి పెట్టుబడులు తెచ్చుకోవడం, ప్యాకేజీ సిస్టమ్, మార్కెటింగ్ ఐడియాలు ఇవ్వడంతో ఇప్పుడు వారి వ్యాపారం లక్షల్లో నడుస్తోంది. ఆ అమ్మాయిలిద్దరూ చదువుకున్నవారు కాదు. ఒకరు టైలరింగ్ చేసేవారు, ఇంకొక అమ్మాయి ఇంట్లోనే ఉండేది. ఇప్పుడు వారిని చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది. అదిలాబాద్‌కు చెందిన ఒకరి బిజినెస్ దాదాపు మూతపడిపోయే దశలో ఉన్నప్పుడు మమ్మల్ని కలిశారు. ఇప్పుడు వారి వ్యాపారంలో ఏ చిన్న సందేహం వచ్చినా ఫోన్ చేసి సలహా అడుగుతుంటారు. ప్రతి ఒక్కరికీ సొంతంగా ఎదగాలనే ఆలోచన ఉంటుంది. కానీ, సరైన అవగాహన లేక వెనకబడిపోతుంటారు. లేదంటే ఫెయిల్యూర్స్ చూస్తుంటారు. ఇలాంటప్పుడు సరైన గైడెన్స్ ఇచ్చేవారుంటే తిరిగి నిలదొక్కుకుంటారు. ఈ ఉద్దేశ్యంతోనే రెండేళ్ల నుంచి చిన్న, మధ్య తరగతి మహిళా వ్యాపారులకు అవగాహనా తరగతులను నిర్వహిస్తున్నాం. అందుకు విధి విధానాలను రూపొందించాను. మొదలుపెట్టిన యేడాదిలోనే వందకు పైగా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత యేడు ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది. రిస్క్ అని వద్దనుకుంటారు.. ఏదైనా సొంతంగా వర్క్ స్టార్ట్ చేద్దామని వచ్చినవారిని ‘ముందు మీ ఇంట్రస్ట్ ఏంటి?’ అనే ప్రశ్నతో మొదలుపెడతాం. ఆ తర్వాత వారితో 2–3 సెషన్స్ నడుస్తాయి. ఎందుకంటే, ఏ చిన్న బిజినెస్ మొదలుపెట్టాలన్నా రెండు, మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇలాంటప్పుడు వారిలో ఎన్నో సందేహాలు ఉంటాయి. కుటుంబం అంత పెట్టుబడి పెట్టలేకపోవచ్చు. పైగా ‘మార్కెట్ గురించి ఏమీ తెలియకుండా పెట్టుబడి పెడితే, ఫెయిల్యూర్ వస్తే తట్టుకోలేం’ అనేది ఉంటుంది. ఇవన్నీ వారితో చర్చిస్తాం. వారిలో ఉన్న స్కిల్స్‌ని పరిగణనలోకి తీసుకొని, ఆ తర్వాత బిజినెస్‌లో ప్రోత్సహిస్తాం. ఇందుకు కన్సల్టేషన్ ఫీజు ఉండదు. బిజినెస్ చేయాలనుకునేవారి ఆలోచనకు మా గైడెన్స్ ఒక సులువైన రోడ్ మ్యాప్‌లా ఉంటుంది. నెమ్మదిగా ప్రయాణం.. ఇప్పటి వరకు మా దగ్గరకు వచ్చే వారి నుంచి ఇంకొంత మందికి తెలిసి, వారి ద్వారా మరికొంతమంది చేరుతున్నవారే ఉన్నారు. అలా ఇప్పటి వరకు 350 మంది క్లయింట్స్ ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది స్లో ప్రాసెస్. ‘మీరెందుకు ఫ్రీ సర్వీస్ ఇస్తారు..’ అనేవారూ ఉన్నారు. ఈ సందేహం నిజమే.. మార్కెట్లో మా గైడెన్స్‌తో నిలదొక్కుకున్నాక వాళ్లు ఇంకా పై స్థాయికి చేరుకోవాలనుకున్నప్పుడు ఛార్జ్ ఉంటుంది. ఈ మొత్తం మరికొందరికి గైడెన్స్ ఇవ్వడానికి సహాయపడుతుంది. మార్కెట్లో ఏ ప్రొడక్ట్‌కైనా ఎమ్ఆర్పీ ఉంటుంది. కానీ, మా వర్క్‌కి అలా ఉండదు. ఈ వర్క్‌కి ఎంత చార్జ్ చేయచ్చు అనేది కూడా తెలియదు. కొందరికి వారి బిజినెస్‌ను బట్టి ఛార్జ్ ఉంటుంది. స్వతంత్రంగా ఎదగడం, ఆర్థికంగా నిలబడాలనే విషయంలో మహిళల ఆలోచన పెరుగుతోంది. చాలా మంది మహిళలు నా కోసం నేను ఏ కొంచెమైనా డబ్బు సంపాదించుకోగలనా అని ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా మహిళల్లో మల్టీటాస్కింగ్ చేసే శక్తి ఉంటుంది కాబట్టి, వారికి కొంత ప్రోత్సాహమిస్తే చాలు అనుకున్న స్థాయికి చేరుకోగలరు. ఆ ప్రోత్సాహమే నేను ఇవ్వాలనుకున్నది’’ అని వివరించారు ఈ చార్టర్డ్ అకౌంటెంట్. – నిర్మలారెడ్డి -
నిలువెత్తు గెలుపు సంతకం
‘మర్యాద, సభ్యత, క్రమశిక్షణ అనేవి మనిషిని తీర్చిదిద్ది ఉత్తములుగా తయారుచేస్తాయి’ అనేది మంచిమాట. ఈ మాటకు తన వంతుగా మరో మాట చేర్చాడు ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ లారీ బేకర్... ‘మర్యాద, సభ్యత, క్రమశిక్షణ అనేవి అత్యుత్తమ నిర్మాణాలకు కారణం అవుతాయి’ ఆర్కిటెక్ట్‌గా దేశవిదేశాల్లో రాణిస్తున్న శ్వేతా దేశ్‌ముఖ్ లారీ బేకర్ చెప్పిన ప్రతి మాటను అక్షరాలా ఆచరించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ది ఇండియన్ అలర్ట్ ‘టాప్ టెన్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్–2022’ జాబితాలో చోటు సంపాదించిన శ్వేతాదేశ్ముఖ్ గురించి... ముంబైకి చెందిన శ్వేతాదేశ్ముఖ్కు చిన్నప్పటి నుంచి స్కెచ్చింగ్, పెయింటింగ్ అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనను ఆర్కిటెక్చర్ వైపు తీసుకువచ్చింది. నాగ్‌పుర్‌లో బీ.ఆర్క్, పుణెలో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ పూర్తి చేసింది. ఆ తరువాత సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఉద్యోగంలో చేరితే ఎలా ఉండేదో తెలియదుగానీ, సొంతంగా ప్రాక్టిస్ చేయడం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. వివాహం తరువాత ముంబైలోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సీనియర్ ఆర్కిటెక్ట్‌గా పనిచేసిన శ్వేత ఆ తరువాత ‘డిజైన్బాక్స్’ పేరుతో ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మొదలుపెట్టింది.‘డబ్బులు ఎక్కువ వచ్చినా సరే, తక్కువ క్రియేటివిటీ ఉండే ప్రాజెక్ట్‌లకు దూరంగా ఉండాలి’ అనే నిబంధన విధించుకుంది. క్లయింట్స్ నుంచి సైట్ ఫోటోలు, వీడియోలు, డ్రాయింగ్స్ తీసుకోవడమే కాదు డిజైన్ ప్రాసెస్‌లో కూడా వారిని భాగం చేస్తుంది. కలర్ కన్సల్టింగ్, ఫర్నిచర్ డిజైనింగ్, వాల్ డెకర్, లైటింగ్ ఐడియాస్... ఇలా ఎన్నో విషయాలలో ఎంతోమంది క్లయింట్స్‌కు సేవలు అందించిన ‘డిజైన్బాక్స్’ మోస్ట్ ఇన్నోవేటివ్ ఫర్మ్ అవార్డ్ గెలుచుకుంది. తన ఫేవరెట్ ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే ఇరవై అయిదు ఎకరాల పరిధిలోని భీమాశంకర్ హిల్స్(కర్జత్, మహారాష్ట్ర), పుదుచ్చేరిలోని మలీప్లె్లక్స్,గ్రీన్‌హౌజ్, చెంబూర్‌లోని ఏడు ఎకరాల కమర్షియల్ ఇంటీరియర్... ఇలా ఎన్నో ఉన్నాయి. ‘నాకంటూ ప్రత్యేకమైన స్టైల్ లేదు. క్లయింట్స్ అభిరుచి, అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేస్తాను’ అంటున్న శ్వేత నిర్మాణ ప్రక్రియలో పర్యావరణ కోణానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఉదా: స్క్రాప్ మెటీరియల్‌ను రీసైకిలింగ్ కంపెనీలకు తరలించడం, వర్షపునీటి నిల్వ, స్థానిక వనరులను సమర్థవంతంగా వాడుకోవడం... మొదలైనవి. ‘నా డిజైనింగ్‌కు ప్రకృతే స్ఫూర్తి ఇస్తుంది’ అని చెబుతున్న శ్వేత బాగా అభిమానించే ఆర్కిటెక్ట్ లారీ బేకర్. బ్రిటన్‌లో పుట్టిన బేకర్ ఇండియాకు వచ్చి నిర్మాణరంగం లో అనేక ప్రయోగాలు చేసి ‘లెజెండ్’ అనిపించుకున్నాడు. సామాన్యుల ఆర్కిటెక్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ‘ఇతర ఆర్కిటెక్ట్‌ల నుంచి స్ఫూర్తి పొందడం కంటే సామాన్యులు సృష్టించిన వాటిలో నుంచే ఎక్కువగా స్ఫూర్తి పొందుతాను’ అనే లారీ బేకర్ మాట తనకు ఇష్టమైనది. ఆయన చెప్పిన ‘లోకల్ విజ్డమ్’ను అనుసరిస్తుంది. ‘ఒక డిజైన్ చేసే ముందు ఆ పరిసరాలకు సంబంధించిన విషయాలపై అవగాహన పెంచుకోవాలి’ అని లారీ చెప్పిన మాటను ఆచరణలో చూపుతుంది శ్వేత. గౌతమ్ భాటియా రాసిన ‘లారీ బేకర్: లైఫ్, వర్క్ అండ్ రైటింగ్’ పుస్తకం అంటే ఇష్టం. ‘ప్రతి వృత్తిలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయితే ప్రతి సవాలు మన విజయానికి ఒక మెట్టులా ఉపయోగపడుతుంది. మొదట్లో మాకు కూడా రకరకాల సందేహాలు, సవాళ్లు ఎదురయ్యాయి. ఇలా స్టార్ట్ చేశాం. ఇలాగే ఉంటాం... అన్నట్లు కాకుండా ఎప్పటికప్పుడు మా ప్రణాళికలో మార్పు చేసుకుంటూ వచ్చాం’ అంటుంది శ్వేతాదేశ్ముఖ్. చదువుకునే రోజుల్లో, వృత్తిలోకి వచ్చిన తొలిరోజుల్లో మూర్ఛవ్యాధి సమస్యతో సతమతమయ్యేది శ్వేత. అలా అని ఎప్పుడూ ఆగిపోలేదు. ఇంటికి పరిమితం కాలేదు. పనిలో దొరికే ఉత్సాహన్నే ఔషధంగా చేసుకొని ముందుకు కదులుతుంది. -
ఒకసారి టర్నోవర్ కోట్లలో.. ఒకసారి పుస్తెలతాడు కూడా తాకట్టులో..!
ఏమీ లేని చోట కూడా వనరుల కల్పనకు కృషి చేయవచ్చు అని నిరూపించారు సాకా శైలజ. బీడీ కార్మికులను బ్యూటీషియన్లుగా తీర్చిదిద్దారు. వెయ్యి రూపాయల అద్దె కట్టడానికి లేని రోజుల నుంచి కోటి రూపాయల టర్నోవర్ చేరేవరకు కృషి చేస్తూనే ఉన్నారు. తెలంగాణలోని కరీంనగర్లో రోజాస్ ఇండస్ట్రీ పేరుతో సినోవ్ బ్యూటీ ప్రొడక్ట్స్ తయారుచేస్తున్న సాకా శైలజ జీవన ప్రయాణం ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఒక పాఠం. పూర్తిగా మహిళా ఉద్యోగులు మాత్రమే పని చేసే సంస్థను నడుపుతున్నారు శైలజ. ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్, కెమికల్ హౌస్ క్లీనర్స్‌ను తయారుచేసే కంపెనీయే కాదు, బ్యూటిషియన్ కోర్సులనూ ఇస్తున్నారు. ఇరవై ఏళ్లలో 30 వేల మంది మగువలను బ్యూటీషియన్లుగా తీర్చిద్దారు. పాతికేళ్ల వయసులో మొదలుపెట్టిన వ్యాపారం గురించి శైలజ వివరిస్తూ.. అడవిలో ఇంగ్లిషు పాఠాలు ‘‘నాకు పంతొమ్మిదేళ్ల వయసులో పెళ్లయ్యింది. మా వారికి టీచర్‌గా ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పోస్టింగ్. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి, డిగ్రీ చేసిన నేను పెళ్లవగానే ఓ అటవీ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. ఖాళీ టైమ్‌లో అక్కడి పిల్లలను చేరదీసి, ఇంగ్లిష్ నేర్పించేదాన్ని. దానినే ట్యూషన్‌గా మార్చుకున్నాను. అలా ఆర్నెళ్లు తిరిగేసరికి మా వారికన్నా రెట్టింపు ఆదాయాన్ని సంపాదించేదాన్ని. తర్వాత పిల్లలు పుట్టడం, వారి పెంపకంలో హైదరాబాద్ వచ్చినప్పుడు బ్యూటిషియన్ కోర్సు నేర్చుకున్నాను. మా వారికి సిరిసిల్ల ట్రాన్స్ఫర్ అయితే, అక్కడ బ్యూటీపార్లర్ ఏర్పాటుకు ప్రయత్నించా. చాలా మంది విమర్శించారు ఊళ్లో బ్యూటీపార్లరా అని. ఇల్లు కూడా ఎవరూ అద్దెకు ఇవ్వలేదు. దళిత్ అనే వివక్ష కూడా చాలా చోట్ల ఎదుర్కొన్నాను. చివరకు అద్దె వరకు ఆదాయం వచ్చినా చాలని ఒక రూమ్‌లో పార్లర్ ప్రారంభించాను. ఉచితంగా శిక్షణ పార్లర్లో పనిచేయడానికి వచ్చిన అమ్మాయిలు ఇంటి వద్ద బీడీలు చుడతామని చెప్పారు. అలా వచ్చే ఆదాయం వారికేం సరిపోతుందని, బ్యూటిషియన్ పని నేర్పించాను. అలా మరికొంత మంది అమ్మాయిలు చేరారు. వారికీ ఉచితంగా శిక్షణ ఇచ్చాను. హైదరాబాద్‌లోని బ్యూటీ సెలూన్ వారితో మాట్లాడి వారికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాను. ఆ తర్వాత కరీంనగర్‌కు ట్రాన్స్ఫర్. ఇక్కడా మరో బ్రాంచ్ ప్రారంభించి, బ్యూటీపార్లర్ నడుపుతూ, మహిళలకు శిక్షణ ఇస్తూ వచ్చాను. అలా బ్యూటీ కోర్సులో చేరే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఉత్పత్తుల తయారీ ఒక డాక్టర్ని కలిసినప్పుడు, ‘మీ వర్క్‌లో ఎలాంటి ప్రొడక్ట్స్ అవసరమో మీకు బాగా తెలుసు కాబట్టి వాటిని మీరే తయారుచేయవచ్చు కదా’ అన్నారు. అప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారుచేసి, బ్యాంక్‌కు వెళ్లాను. అది కోటి రూపాయల ప్రాజెక్ట్. నేనెప్పుడూ చూడని అంకె అది. కానీ, ప్రయత్నించాను. నెల రోజులకు బ్యాంక్ లోన్ వచ్చింది. అప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ ప్రారంభించాను. మార్కెట్ పెద్ద టాస్క్ ఉత్పత్తుల తయారీ చాలా బాగుంది. మా పార్లర్స్‌లోనే వాటిని ఉపయోగిస్తున్నాం. బయట కూడా మార్కెట్ చేయాలి అని సెర్చ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్లో స్లాట్ ఓకే అయ్యింది. అక్కడ నా ప్రొడక్ట్స్ పెట్టినప్పుడు, ఫారినర్స్ చూసి ఆర్డర్ ఇచ్చారు. మా యూనిట్‌కి వచ్చి, చూసి, ప్రతీది తెలుసుకున్నారు. ప్రతి యేడాది కోటి రూపాయల మార్కెట్ చేస్తున్నాను. కరోనా వేసిన వేటు ఈ యేడాది మార్చ్ వరకు 70 లక్షల టర్నోవర్ చేశాను. మార్కెట్ పెరగడానికి కరోనా ఓ అడ్డంకి అయ్యింది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా మూసి వేశారు. కానీ, నేను ఆగకుండా నడిపించాను. కరోనా టైమ్‌లోనే చైనా బార్డర్లో ఉన్న ప్రాంతానికి ఆరు రోజుల ఆలశ్యంగా ప్రొడక్ట్ డెలివరీ అయ్యింది. లేట్ అయ్యిందనే కారణంతో ప్రొడక్ట్‌ని రిజక్ట్ చేశారు. దానిని వెళ్లి తీసుకురాలేక వదిలేయాల్సి వచ్చింది. కరోనా సీజన్లో నా దగ్గర డబ్బు లేదు. దీంతో బంగారం తాకట్టు పెట్టాను. అదే సమయంలో రా మెటీరియల్ సప్లయ్ చేసే అతని ఆరోగ్యం బాగోలేక, డబ్బు వెంటనే కావాలన్నారు. ఆ సమయంలో వేరే దారిలేదు. నా మెడలో పుస్తెలతాడు, గాజులు, చెవి కమ్మలు తీసి మా అబ్బాయితో బ్యాంక్‌కు పంపించాను. బిజినెస్‌లో చాలా సవాళ్లు ఉంటాయి, డీలా పడిపోకూడదు. నా సంస్థ ఎప్పుడూ మంచి ఆదాయాన్ని ఇచ్చేదే. ఎంతో మందికి జీవితాన్ని ఇస్తుంది. నాకున్న లక్ష్యం ముందు మిగతా సమస్యలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. బ్యాలెన్స్ ఒక సవాల్ ఇటీవల మా వారికి గుండెపోటు వచ్చింది. ఇదే సమయంలో కంపెనీ స్థలం ఓనర్ ఆ భూమిని వేరొకరికి అమ్మారు. దీంతో ఎటూ తేల్చుకోలేక, లాయర్ సలహా తీసుకున్నాను. మా వారి ఆరోగ్యం, పిల్లలు, కంపెనీ.. దేనినీ వదులుకోలేను. అలాగే, సమస్య అంటూ ఇంటికి వచ్చే అమ్మాయిలకు కౌన్సెలింగ్, సాయం ఎలాగూ ఉంటుంది. వ్యాపారంలో ఒత్తిడి కూడా తీవ్రంగా ఉంటుంది. దానిని అధిగమిస్తేనే విజయం. వర్కింగ్ క్యాపిటల్ పెరిగితే ఐదు కోట్ల బిజినెస్ చేయాలన్నది ఈ యేడాది ప్లానింగ్. బ్యూటిషియన్ స్కూల్‌తో పాటు, ప్రొడక్ట్స్ తయారీలోనూ అంతా మహిళలే. ఒక్కోసారి ఇంతమందికి ఉపాధి కల్పించాం కదా అని గర్వంగా ఉంటుంది. నా దగ్గర పనిచేసే మహిళలు కూడా సొంతంగా చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకునేలా ప్లాన్ చేస్తున్నాను’’ అని వివరించారు శైలజ. – నిర్మలారెడ్డి -
టెక్నాలజీ వ్యాపారవేత్తలుగా మహిళలు
న్యూఢిల్లీ: మెట్రో నగరాలతో పోలిస్తే మెట్రోయేతర నగరాల్లోని మహిళలు ఎక్కువగా టెక్నాలజీ వ్యాపారవేత్తలుగా మారడంపై ఆసక్తిగా ఉన్నారు. అయితే, సాంకేతిక వనరులు, మౌలిక సదుపాయాల కొరత, దిశానిర్దేశం చేసే మెంటార్లు దొరక్కపోవడం వారికి ప్రధాన అవరోధంగా ఉంటోంది. టెక్నాలజీ అనలిటిక్స్ సంస్థ టెక్ఆర్క్, మహిళల ప్లాట్‌ఫామ్ షీట్‌వర్క్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయాయి. దీని ప్రకారం నాన్–మెట్రో నగరాల్లోని మహిళల్లో దాదాపు 48 శాతం మంది .. తమ కెరియర్ ఆప్షన్‌గా టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ఎంచుకోవడంపై ఆసక్తిగా ఉన్నారు. మెట్రో నగరాల్లో తమ సొంత వెంచర్లను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారి సంఖ్య 23 శాతం మాత్రమే ఉంది. మెట్రో నగరాల్లోని మహిళలు.. సౌకర్యవంతమైన కెరియర్ కోసం ఎక్కువగా కార్పొరేట్ ఉద్యోగాలను ఎంచుకుంటున్నారు. ‘భారత్‌లో మహిళా టెక్ ఎంట్రప్రెన్యూర్షిప్ స్థితిగతులు‘ అనే అంశంపై దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో 2,000 మంది పైచిలుకు పాల్గొన్నారు. వీరిలో ప్రొఫెషనల్స్, విద్యార్థులు, స్టార్టప్‌ల వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఐఐటీల్లో పెరిగిన విద్యార్థినులు.. ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో విద్యార్థినుల సంఖ్య గడిచిన నాలుగేళ్లలో గణనీయంగా పెరిగింది. అప్పట్లో ఇది కేవలం 5 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 16 శాతానికి చేరింది. కానీ వీరంతా సొంతంగా టెక్ కంపెనీలను ప్రారంభించే దిశగా వెళ్లడం లేదు. ‘మెట్రోయేతర నగరాల్లోని 73 శాతం మంది మహిళలు .. అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లే .. తాము ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ఎంచుకోలేకపోతున్నామని తెలిపారు. మెట్రోల్లో 22 శాతం మంది మహిళలు భౌతిక ఇన్ఫ్రా కొరత తమకు సమస్యగా ఉంటోందని పేర్కొన్నారు‘ అని నివేదిక వెల్లడించింది. ఇక పురుషులతో పోలిస్తే నిధులు సమీకరించడం, పెట్టుబడులను సమకూర్చుకోవడం కష్టతరంగా ఉంటోందని సర్వేలో పాల్గొన్న వారిలో 58 శాతం మంది చెప్పారు. ‘విద్యావంతుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సంబంధిత వ్యాపార, సాంకేతిక వనరులు పరిమిత స్థాయిలోనే ఉండటమనేది వారి వెంచర్లను విస్తరించడంలో అవరోధంగా ఉంటోంది. టెక్నాలజీ కొరత ప్రధాన సవాలుగా ఉంటోందని మెట్రోయేతర నగరాల్లోని 74 శాతం మంది తెలిపారు. మహిళా వ్యాపారవేత్తలు తమ వెంచర్లలో విజయం సాధించాలంటే టెక్నాలజీ అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమని మెట్రో నగరాల్లో 24 శాతం మంది చెప్పారు‘ అని నివేదిక పేర్కొంది. -
Neha Nialang: 23 ఏళ్లకే ఎంట్రప్రెన్యూర్‌గా... సహజమైన పద్ధతిలో
Neha Nialang Success Story In Telugu: ఇంట్లో ఆడపిల్ల ఉందంటే అమ్మకు ఇంటిపనుల్లో చేదోడువాదోడుగా ఉంటుంది. ఓ నాలుగురోజులు ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా పిల్ల చూసుకుంటుందన్న భరోసా కూడా కల్పిస్తారు కొందరమ్మాయిలు. నేహ నియాలంగ్ భరోసాతోనే ఆగిపోకుండా, తనకు తెలిసిన వంటల తయారీతో ఏకంగా వ్యాపారాన్ని ప్రారంభించింది. చిన్నప్పటినుంచి ఇంటి, వంట పనుల్లో చూరుకుగా పాల్గొనే నేహ ఇంట్లో వాళ్ల కోసం సరికొత్త వంటలు వండడమేగాక, వాటిని బయట మార్కెట్లో విక్రయిస్తూ.. 23 ఏళ్లకే ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగి, మేఘాలయ రుచులను ఇతర ప్రాంత వాసులకు అందిస్తోంది. మేఘాలయలోని జోవైకు చెందిన నేహానియాలంగ్ అందరి అమ్మాయిల్లానే ఇంట్లో పనులను ఇలా చూసి అలా పట్టేసింది. అయితే మేఘాలయలో అనేక కుటుంబాలు ఒక దగ్గర కలిసి నచ్చిన వంటకాలు వండుకుని కలసి తినే సంప్రదాయం ఉంది. దీంతో అడపాదడపా జరిగే గెట్ టు గెదర్‌లలో వండే వంటకాలను నేహ ఆసక్తిగా నేర్చుకునేది. ఇలా నేర్చుకుంటూనే పదహారేళ్లు వచ్చేటప్పటికీ ఇంట్లో అందరికీ వండిపెట్టే స్థాయికి ఎదిగింది. ఇంట్లో తరచూ వంటచేస్తూ ఉండడం వల్ల ఏం ఉన్నాయి ఏం లేవు అనేది జాగ్రత్తగా గమనించేది. సరుకులు నిండుకుంటే వెంటనే మార్కెట్‌కు వెళ్లి తెచ్చేది. అయితే కొన్నిసార్లు ఇంట్లో ఎక్కువగా వాడే జామ్ వంటివి దొరికేవి కావు. కానీ అవి లేకపోతే ఇంట్లో నడవదు. చపాతీ, రోస్టెడ్ బ్రెడ్‌లోకి జామ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. జామ్ దొరకనప్పుడు.. జామ్‌ను ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది తనకు. దీంతో ఇంట్లో ఉన్న పండ్లతో జామ్‌లు తయారు చేయడం మొదలు పెట్టింది. ఈ జామ్‌లు ఇంట్లో వాళ్లకు నచ్చడంతో రకరకాల జామ్‌లు తయారుచేసేది. నేహ తయారు చేసిన జామ్‌ల రుచి నచ్చిన కుటుంబసభ్యులు.. అమ్మకం మొదలు పెడితే ఇవి బాగా అమ్ముడవుతాయి’’ అని చెప్పేవాళ్లు. నేహ మాత్రం ఆ మాటలకు నవ్వేదేగానీ, సీరియస్‌గా తీసుకునేది కాదు. వృథా కానివ్వద్దని.. లాక్ డౌన్ సమయంలో చాలా రకాల పండ్లు వృథా అయ్యేవి. ప్రభుత్వ నిబంధన ప్రకారం నిర్దేశిత సమయాల్లోనే పండ్లు కూరగాయలు విక్రయించాలి. ఆ సమయంలోపు అమ్మకపోతే, అప్పటికే బాగా పండిన పండ్లు మగ్గిపోయి వృథా అయిపోయేవి. మార్కెట్‌కు వెళ్లిన ప్రతిసారి నేహ ఈ విషయాన్ని గమనిస్తుండేది. ఒకసారి ఓ రైతు పండ్లను పారబోయడం చూసింది. ఎందుకు పారబోస్తున్నావని అడిగితే..‘‘మార్కెట్ సమయం అయిపోయింది. ఇవి ఇలా ఉంటే రేపటికి ఇంకా మగ్గిపోతాయి. ఎలాగూ అమ్ముడు కావు. ఈ గంపను అద్దెకు తీసుకొచ్చాను. ఈరోజే యజమానికి ఇచ్చేయాలి’’ అని చెప్పాడు. అతని మాటలు నేహ మనసుని తట్టిలేపాయి. ‘ఎంతో చెమటోడ్చి పండిన పంట నేలపాలవుతోంది. ఈ పండ్లే వారి జీవనాధారంం అవి ఎటూగాకుండా పోతున్నాయి’ అనిపించింది తనకు. వీటిని వృథాగా పోనివ్వకుండా వీటితో ఏదైనా తయారు చేయాలనుకుంది. అనుకుందే తడవుగా మార్కెట్లో దొరికే పండ్లను కొని జామ్‌లు తయారు చేయడం మొదలు పెట్టింది. పండ్లు భారీగా లభ్యమవుతుండడంతో పెద్ద మొత్తంలో జామ్‌లు తయారు చేసేది. దలాడే ఫుడ్స్.. నేహ తయారుచేసిన జామ్‌లు ముందుగా స్థానికంగా విక్రయించింది. వాటికి మంచి స్పందన లభించడంతో ‘దలాడే ఫుడ్స్’ ప్రారంభించి భారీ స్థాయిలో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో విక్రయిస్తుండేది. దలాడే అనేది మేఘాలయలో మాట్లాడే ఖాసీ భాష పదం. దలాడే అంటే ‘మనంతట మనమే’ అని అర్థం. రైతులు ఉత్పత్తి చేసిన దేనిని కూడా వ్యర్థంగా పోనివ్వకుండా..పండ్ల నుంచి తేనె వరకు అన్నింటినీ దలాడే ద్వారా విక్రయిస్తోంది నేహ. ఏడాది తర్వాత స్థానికంగా దొరికే తేనె, మేఘాలయలో ప్రముఖంగా లభించే లకడాంగ్ పసుపు, రుచికరమైన చట్నీలు, జీడిపప్పు బటర్, తేనెతో చేసిన మసాలాల వంటి వాటిని విక్రయిస్తోంది. ఎటువంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు వాడకుండా సహజసిద్ధమైన పద్ధతిలో మేఘాలయ రుచులను వివిధ ప్రాంతాలకు అందిస్తోంది. ‘‘కేవలం బీఎస్సీ బయోకెమిస్ట్రీ చదివిన నాకు ఈ వ్యాపారం కాస్త కష్టంగానే ఉంది. అందులోనూ వ్యాపారం అంటే మామూలు విషయం కాదు. ఈ రంగంలో అనుభవం ఉన్న కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి వంట మీద ఆవగాహనతోనే ఈ రంగంలోకి దిగాను. అందుకే ఒక్కొక్క అంశాన్ని జాగ్రత్తగా నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాను. మహిళా పారిశ్రామిక వేత్తలకు సాధికారత అందించే కార్యక్రమాల్లో పాల్గొని తెలియని విషయాలు ఎన్నో నేర్చుకుంటున్నాను’’ అని నేహ చెబుతోంది. -
Timber Depot: ‘టేక్’ఓవర్ చేసింది
తిండిలేని పరిస్థితి నుంచి ఉన్నత పారిశ్రామికవేత్తగా ఎదిగారు నాడు ఛీ అన్నవారు నేడు ఆమె అభివృద్ధికి ఆశ్చర్యపోతున్నారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా టింబర్ డిపో యజమానిగా ఎదిగారు ప్రియ అడపా ఉద్యోగిగా చేరిన కంపెనీకే యజమాని అయ్యారు ముళ్ళబాటను రెండు దశాబ్దాలలో పూలబాటగా మార్చుకున్నారు. ఇంటీరియర్ డెకరేషన్, ఫర్నిచర్ తయారీలతో వ్యాపారంలో ముందడుగు వేస్తున్నారు. ఉత్తమ ఎంటర్‌ప్రెన్యూర్‌గా లేడీ లెజెండ్ అవార్డును అందుకున్న ప్రియ అడపా విజయగాథ ఆమె మాటల్లోనే... మా తల్లిదండ్రులకు మేం ఇద్దరు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలం. నేను మూడో అమ్మాయిని. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవటంతో, మా అమ్మమ్మ దగ్గర ఏలూరులో ఏడాదిపాటు పెరిగాం. అక్కడ ఎక్కువ కాలం ఉండటం ఇబ్బంది కావటంతో నా పదమూడో ఏట రెండు వేల రూపాయల ఉద్యోగానికి హైదరాబాద్ వచ్చాను. కొంతకాలానికి ఒక టింబర్ డిపోలో ఐదు వేల రూపాయల జీతానికి రిసెప్షనిస్టుగా చే రాను. ఆ తర్వాత అదే టింబర్ డిపోకు ఇన్చార్జి బాధ్యతలు కూడా చేపట్టాను. ఉద్యోగం చేస్తూనే, బీకాం కంప్యూటర్స్ పూర్తి చేశాను. క్రమేపీ నా జీతం లక్ష రూపాయలకు చేరింది. మా డిపోలో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎక్కువగా జరిగేది. కొంతకాలానికి ఆ యజమాని విదేశాలకు వెళ్లిపోవాలనే ఉద్దేశంతో డిపో మూసేద్దామనుకున్న సమయంలో 2013 లో నేను ఆ కంపెనీని కొన్నాను. అదే అప్పుడు ‘ఎకో నేచురల్’ అనే నా బ్రాండ్. నా వయస్సు 24 సంవత్సరాలు. అంతకాలం నేను దాచుకున్న డబ్బుతో గుడ్ విల్ కింద రూ. 8 ల„ý లు చెల్లించాను. స్నేహితుల సహకారంతో.. కంపెనీ బాధ్యతలు చేపట్టినప్పుడు ఏడాది పాటు సమస్యలు ఎదుర్కొన్నాను. నాకున్న అనుభవం తో వాటిని అధిగమించాను. స్నేహితుల సహకారంతో ఓపెన్ స్పేస్‌లో షెడ్ వేసి, లైసెన్స్ కొనుక్కుని కంపెనీని విస్తరించాను. ఒక అమ్మాయి ఇంత పెద్ద ఆర్డర్ చేస్తుందా అని కొందరు, అమ్మాయికి సపోర్ట్ చేద్దాం అని కొందరు, ఆడపిల్ల కనుక మోసం చేయదని కొందరు... ఇలా అందరూ అమ్మాయి అనే అంశం మీదే మాట్లాడినా, ఆర్డర్లు ఇస్తున్నారు. మా టింబర్ డిపోలో నాణ్యమైన టేకు చెక్క మాత్రమే సప్లయి చేస్తున్నాను. టేకు చెక్కతో చాలా సమస్యలు ఎదురవుతాయి. టేకు లోపల గుల్లగా ఉంటే బావుండదు. నా అనుభవాన్ని ఉపయోగించి, వాటితో చిన్న చిన్న ఇంటీరియర్స్ చేయటం ప్రారంభించాను. దాంతో నష్టాల నుంచి బయటకు వచ్చాను. నేను స్వయంగా ఒక ఎకరంలో పూర్తిగా టేకు చెక్కతో ఫామ్ హౌస్ కట్టాను. లొంగిపోకూడదు.. ఒంటరిగా ఉన్న అమ్మాయి కనిపిస్తే చాలు.. ఆశలు చూపిస్తారు, ప్రలోభాలకు గురి చేస్తారు. ఆ ఆశలు కొంతకాలం వరకే ఉంటాయి. పదిరోజుల ఆనందం కోసం ఎదురు చూస్తే, జీవితాంతం బాధపడాలి. నాకు ఎంతోమంది ఎన్నో ప్రలోభాలు చూపించారు. వేటికీ లొంగకుండా, వ్యక్తిత్వంతో నిలబడ్దాను. ఉన్నత స్థాయికి ఎదిగాను. అందరికీ ఇప్పుడు నేను కొనుక్కున్న కారు, ఇల్లు కనిపిస్తాయి. ఈ స్థాయికి రావడం వెనుక 20 సంవత్సరాల స్ట్రగుల్ ఉంది. ధైర్యంగా ఎదుర్కోవాలి జీవితంలో ఎదురైన ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కోవాలే కానీ కుంగిపోకూడదు. చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేయడం మొదలు పెడితేనే ఎదగడానికి అవకాశం వస్తుంది. అమ్మాయిగా పుట్టినందుకు కూడా చాలా గర్వంగా భావిస్తాను. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో బ్యాగు పోగొట్టుకుని, పది రోజుల పాటు తిండి లేకుండా ఫుట్‌పాత్ మీదే గడిపాను. ఆ సమయంలో ఒక కుటుంబం చేసిన సహాయం నా ఎదుగుదలకు బాటలు వేసింది. ఇప్పుడు ‘ఎకో నేచురల్’ అంటే ఒక బ్రాండ్. నాకు గుర్తింపు తెచ్చిన పేరు. నా ఎదుగుదలకు చిరునామా. – వైజయంతి పురాణపండ -
చెన్నైలో మహిళా పారిశ్రామికవేత్త ఆత్మహత్య