Arati Kadav: సాఫ్ట్‌వేర్‌ టు సైన్స్‌–ఫిక్షన్‌ డైరెక్టర్‌ | Arati Kadav: She is currently developing a science fiction series set in Mumbai | Sakshi
Sakshi News home page

Arati Kadav: సాఫ్ట్‌వేర్‌ టు సైన్స్‌–ఫిక్షన్‌ డైరెక్టర్‌

Published Thu, Jan 18 2024 1:09 AM | Last Updated on Thu, Jan 18 2024 6:19 AM

Arati Kadav: She is currently developing a science fiction series set in Mumbai  - Sakshi

మల్టీ టాలెంట్‌ అంటే మాటలు కాదు. ఎంచుకున్న రంగాల్లో సమాన ప్రతిభ చాటాలి. తేడా జరిగితే అన్నిట్లో ‘జీరో’ తప్ప ఏమీ మిగలదు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా తన ప్రతిభను చాటుకున్న ఆరతి కదవ్‌ గురించి....

చిన్నప్పటి నుంచి ఆరతికి ఫాంటసీ జానర్‌ అంటే ఇష్టం. ‘పంచతంత్ర’ ‘మహాభారత’ కథల పుస్తకాలు చదువుతున్నప్పుడు వాటికి తన ఊహాలోకంలో తనదైన ఫాంటసీ జోడించేది. ఆ తరువాత సైన్స్‌–ఫిక్షన్‌ తన ఆసక్తిగా మారింది. ‘ఈ జీవితానికి అర్థం ఏమిటి? పుట్టడం, గిట్టడమేనా ఇంకేదైనా పరమావధి ఉందా?’ ఇలాంటి ప్రశ్నలతో చావుపుట్టుకల గురించి ఎన్నో కోణాలలో ఆలోచించేది. మరణానంతర జీవితం గురించి కథలు రాసేది.

 సైన్స్‌–ఫిక్షన్‌ ఫిల్మ్‌మేకర్‌గా ఆరతి గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ ఊహలే పునాదిగా ఉపయోగపడ్డాయి. డైరెక్టర్‌గా తనకు ఎంతో పేరు తెచ్చిన ఫిలసాఫికల్‌ సైన్స్‌ ఫిక్షన్, బ్లాక్‌కామెడీ ఫిల్మ్‌ ‘కార్గో’కు ముందు రోబోలను దృష్టిలో పెట్టుకొని ‘టైమ్‌ మెషిన్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ తీసింది ఆరతి. ఈ చిన్న చిత్రం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. మన పురాణాలలో నుంచి ఊహాజనితమైన కథలతో హాలీవుడ్‌ స్థాయిలో సినిమాలు తీయాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునేలా చేసింది.,

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన ఆరతి కదవ్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేసింది. సాంకేతిక విషయాలకు తప్ప కాల్పనిక ఊహలకు బుర్రలో కాసింత చోటు దొరకనంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ‘ఫాంటసీ’ కోసం కొంత స్థలం రిజర్వ్‌ చేసుకునేది. కొంతకాలం తరువాత ఉద్యోగాన్ని వదిలి ఫిల్మ్‌ డైరెక్షన్‌ కోర్సులో చేరింది.

కాల్పనిక విషయాల మీద ఆసక్తి ఆరతిని సైన్స్‌కు దూరం చేయలేదు. సందర్భాన్ని బట్టి శాస్త్రీయ విషయాలపై రచనలు చేస్తుంటుంది. చిత్రరంగంలో కృత్రిమ మేథ(ఏఐ)కి సంబంధించి ‘విల్‌ ఏఐ మీన్‌ ది డెత్‌ ఆఫ్‌ క్రియేటివిటీ’ పేరుతో రాసిన వ్యాసానికి మంచి స్పందన వచ్చింది.

రచయిత్రిగా కలం పట్టినప్పుడు తనలోని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బయటకు వచ్చి ‘రిసెర్చ్‌’ చేయమంటూ సలహా ఇస్తుంది. దీంతో ఊహలకు విరామం ఇచ్చి తాను ఏ సబ్జెక్ట్‌ గురించి అయితే రాస్తుందో ఆ సబ్జెక్ట్‌కు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి సాధికారమైన సమాచారాన్ని పోగు చేస్తుంది. దీని ఆధారంగా మళ్లీ రచన చేస్తుంది. డైరెక్టర్‌గా ఉన్నప్పుడు తనలోని రచయిత్రి బయటకు వచ్చి సీన్‌–డైలాగ్‌లను ఇంకా ఎలా మెరుగుపెట్టవచ్చో సలహా ఇస్తుంది. ఇక ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పుడు బడ్టెట్‌ను సమర్థవంతంగా వాడుకోవాలనే విషయంలో సలహాలు ఇవ్వడానికి తనలోని సాప్ట్‌వేర్‌ ఇంజినీర్, రైటర్, డైరెక్టర్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ‘కార్గో’ సినిమా అయిదుగురు నిర్మాతలలో ఆరతి ఒకరు. ‘నేర్చుకున్న విద్య ఏదీ వృథా పోదు’ అని చెప్పడానికి ఆరతి బహుముఖ ప్రజ్ఞ సాక్ష్యంగా నిలుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement