సేవ
ఆస్పత్రిలోని రోగులు ప్రతి మధ్యాహ్నం ఆమె కోసం ఎదురు చూస్తారు. ఆమె రాకుండా పోదు. మబ్బులు రానీ నిప్పులు కురవనీ వస్తుంది. ముంబై ఆస్పత్రుల్లోని పేద రోగులకు రోజుకు వంద మందికి ఆమె కిచిడీ పంచుతుంది. ఆమె దగ్గర డబ్బు లేదు. మనసు తప్ప. అందుకే ఆమెను అందరూ ‘కిచిడీ ఆజి’ అని పిలుస్తారు.
62 సంవత్సరాల కిరణ్ కామ్దార్ కుదురుగా నిలబడిగాని, కూచునిగాని మాట్లాడలేదు. దానికి కారణం ఐదేళ్ల క్రితం ఆమెకు వచ్చిన పార్కిన్సన్స్ వ్యాధి. కాని ఆమె ఆలోచనలు కుదురుగా ఉన్నాయి. ఆమె సేవాగుణం కుదురుగా ఉంది. దానిని ఎవరూ కదపలేరు. ముంబై శివార్లలో కొంకణి తీరాన ఉన్నపాల్ఘర్ పట్టణం ఆమెది. సాదాసీదా జీవనమే అయినా ఒక మనిషికి సాటి మనిషి సేవ అవసరం అని ఆమె తెలుసుకుంది.
అందుకు కారణం ఆమె కుమారుడు సెరిబ్రల్‌పాల్సీతో జన్మించడమే. కుమారుడి కోసం జీవితాన్ని అంకితం చేసిన కిరణ్ చుట్టుపక్కల పేద పిల్లలకుపాఠాలు చెప్పడంతోపాటు చేతనైన సాయం చేయడం కొనసాగించేది. అయితేపార్కిన్సన్స్ వ్యాధి ఆమె కార్యకలాపాలను స్తంభింపచేస్తుందని ఆమె భర్త, కుమార్తె అనుకున్నారు. కాని 2021లో జరిగిన ఒక ఘటన అందుకు విరుద్ధంగా ఆమెను ప్రేరేపించింది.
కిచిడి ముద్ద
పాల్ఘర్‌లో ఒకే ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. చుట్టుపక్కల 15 పల్లెల నుంచి పేద జనం ఉదయం నుంచే వచ్చి ఓపీలో వెయిట్ చేస్తుంటారు. వారికి చెకప్ అయ్యేసరికి మధ్యాహ్నం 2 అవుతుంది. ఆ సమయంలో వారి ఆకలి బాధకు అక్కడ విరుగుడు లేదు. 2021లో కోవిడ్ సెకండ్‌వేవ్ సమయంలో ఒక బంధువును పరామర్శించడానికి కిరణ్ ఆ ఆస్పత్రికి వెళ్లింది.
మధ్యాహ్నం వేళ చాలామంది పేషెంట్లు ఆకలితో బాధ పడుతున్నారని గ్రహించింది. ‘వీరికి ఆకలి తీరే మార్గమే లేదా?’ అనుకుని వెంటనే రంగంలో దిగింది. హాస్పిటల్ డీన్‌ని కలిసి ‘నేను మీ హాస్పిటల్‌లోని పేషెంట్లకు శుచిగా చేసిన వెజిటబుల్ కిచిడి పెట్టొచ్చా. వాళ్లు అన్నం లేక బాధ పడుతున్నారు’ అని అడిగింది. హాస్పిటల్ డీన్ వెంటనే అంగీకారం తెలిపారు. అలా మొదలైంది కిరణ్ ‘కిచ్‌డీ బ్యాంక్’ ఆలోచన.
రోజూ 100 మంది
అంతటిపార్కిన్సన్స్ వ్యాధితో బాధ పడుతున్నా రోజూ స్వయంగా దాదాపు 20 నుంచి 22 కిలోల కిచిడి తయారు చేస్తుంది కిరణ్. ఆ తర్వాత దానిని స్వయంగా తీసుకుని ఆస్పత్రి చేరుతుంది. అక్కడ వార్డు వార్డుకు తిరుగుతూ పేషెంట్లకి, వారి బంధువులకి, చిన్న పిల్లలకు పంచి పెడుతుంది. ఇందుకు రెండు మూడు గంటలు పట్టినా ఆమె అలసి పోదు. పల్లెటూరి పేదవారు ఆమె తెచ్చే ఆ కిచిడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ‘నువ్వు దేవతవు తల్లీ’ అని ఆశీర్వదిస్తూ ఉంటారు. ‘కిచిడి పేషెంట్లను త్వరగా కోలుకునేలా చేస్తుంది. సులభంగా అరుగుతుంది’ అంటుంది కిరణ్.
అదే వైద్యం
పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ ఇంతమందికి రోజూ వండటం గురించి కిరణ్‌కు చికిత్స చేస్తున్న డాక్టర్లు ఆందోళన చెందినా, వారించినా ఇప్పుడు మూడేళ్లుగా సాగుతున్న ఆమె సేవను చూశాక, ఆమెకు పరీక్షలు చేశాక ‘ఆమె చేస్తున్న సేవే ఆమెకు వైద్యంగా పని చేస్తున్నదని’ తేల్చారు. ఆమె సంకల్పం వ్యాధిని అదుపులో పెడుతోందని తెలియచేశారు. కిరణ్ కామ్దార్ గత మూడేళ్లుగా సాగిస్తున్న ఈ సేవకు ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి.
మెచ్చుకోళ్లు దక్కుతున్నాయి. నిజానికి ఇది అసాధ్యమైన పని కాదు. ఆమె మాత్రమే చేయదగ్గ పని కాదు. ఎవరైనా అతి సులువుగా పూనుకోదగ్గదే. ప్రతి ్రపాంతంలో ఎన్నో ప్రభుత్వ ఆస్పత్రుల దగ్గర పేదవాళ్లు, లోపలి పేషెంట్లు సరైన తిండి లేక బాధపడుతుంటారు. వారికి కిచ్‌డీయో సాంబార్ రైసో పెట్టడం పెద్ద కష్టం కాదు. రోజూ చేయకపోయినా వారానికి ఒకరోజైనా ఇలాంటి సేవ చేస్తే ఆ తృప్తే వేరు. ఎక్కువమంది పూనుకోరు. పూనుకున్నవారు కిరణ్ కామ్దార్‌లా చిరాయువు
పొందుతారు.
Comments
Please login to add a commentAdd a comment