న్యూస్‌మేకర్
తాజా ఎన్.డి.ఏ. మంత్రి వర్గంలో 71 మంది ప్రమాణ స్వీకారం చేస్తే ఏడుగురే స్త్రీలు. వారిలో అందరి కంటే చిన్నది రక్ష ఖడ్సే. 37 సంవత్సరాల రక్ష భర్తను కోల్పోయాక రాజకీయాల్లోకి వచ్చింది. సింగిల్ పేరెంట్‌గా ఉంటూనే సర్పంచ్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకూ ఎదిగింది. మహారాష్ట్ర ఎం.పి. అయిన రక్షకి
ప్రజాభిమానం మెండుగా ఉంది. ఆమె స్ఫూర్తిదాయక కథనం.
రాజకీయ కుటుంబంలో కోడలుగా అడుగు పెట్టిన అమ్మాయికి రాజకీయాలు ఎంత నాటకీయంగా ఉంటాయో, పదవి విషయంలోనే కాదు జీవితంలో కూడా గెలుపు ఓటములు ఎంత ఖేద మోదాలు కలిగిస్తాయో మెల్లగా తెలిసి వచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో మహారాష్ట్రలోని రావెర్ స్థానం నుంచి మూడోసారి బి.జె.పి. తరఫున గెలిచి, కేంద్రమంత్రిగా మొదటిసారి ప్రమాణం చేసిన రక్ష ఖడ్సే ఆ ఎత్తుకు చేరడానికి తీవ్ర సవాళ్లనే ఎదుర్కొంది. కాని ఓడిపోలేదు. ఆగిపోలేదు. ధైర్యం కూడగట్టుకుని చేసిన ప్రయాణమే గెలుపు తీరానికి చేర్చింది.
భర్త ఆత్మహత్యతో...
మహారాష్ట్రలోని నాసిక్‌లో కంప్యూటర్ సైన్స్ చదువుకున్న రక్ష ఖడ్సే జలగావ్‌కు చెందిన రాజకీయ కుటుంబంలో కోడలిగా వచ్చింది. ఆమె మామగారు ఏక్‌నాథ్ ఖడ్సే బి.జె.పి.లో ప్రముఖ నాయకుడు. మంత్రిగా కూడా పని చేశాడు. అతని కుమారుడు నిఖిల్‌తో రక్ష వివాహం జరిగింది. రక్షకు రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేకపోయినా 2010లో జనం ‘కొథాలి’ అనే ఊరికి సర్పంచ్‌ను చేశారు. ఆ తర్వాత ఆమె జిల్లా పరిషత్ స్థాయి నాయకురాలైంది. కాని 2013లో జీవితం తల్లకిందులైంది. 2013 శాసనమండలి ఎన్నికలలో కేవలం 500 ఓట్ల తేడాతో ఓడిపోయినందుకు మనస్తాపం చెందిన రక్ష భర్త నిఖిల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది తెలిసి తండ్రి ఏక్‌నాథ్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. ఇద్దరు చిన్న పిల్లలతో రక్ష మొత్తం కుటుంబానికే ఊతంగా నిలబడాల్సి వచ్చింది.
అత్తింటి ఆదరణతో...
భర్త చనిపోయినా అత్తింటిని రక్ష వీడలేదు. అత్తింటి వారు ముఖ్యంగా మామగారు ఆమెను కన్నకూతురిలా ఆదరించి రాజకీయాలలో ్రపోత్సహించాడు. 2014 ఎన్నికలలో రావేర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె ఘన విజయం సాధించింది. భర్త చనిపోయిన సంవత్సరానికే ఇద్దరు చిన్న పిల్లలను తీసుకుని ఆమె సాగించిన ప్రచారం ఆ రోజుల్లో పెద్ద ఆసక్తిని రేపింది. జనం ఆమెకు మద్దతుగా నిలిచి గెలిపించారు. ఐదేళ్ల కాలంలో వ్యవసాయం, విద్యావ్యవస్థ కోసం రక్ష చేసిన కృషి జనానికి నచ్చడంతో 2019లో కూడా రావేర్ నుంచి ఎం.పి.గా ఘనంగా గెలిపించారు.
ప్రత్యర్థిగా మామగారు
రక్ష మామగారైన ఏక్‌నాథ్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో వచ్చిన విభేదాలు బి.జె.పి.ని వీడేలా చేశాయి. ఆయన ఎన్‌సిపి (శరద్‌పవార్) వర్గంలో చేరి ఎం.ఎల్.సి. అయ్యాడు. కాని రక్ష బి.జె.పి.లోనే కొనసాగింది. 2024 ఎన్నికలలో రావేర్ నుంచి రక్ష నిలబడుతున్నప్పుడు శరద్ పవార్ వర్గం ఏక్‌నాథ్‌ను ప్రత్యర్థిగా నిలపాలనుకున్నాయి. కాని కోడలి విజయం కోరిన ఏక్‌నాథ్ తాను పోటీలో నిలవనని దూరంగా ఉండిపోయాడు. దాంతో ఎన్.సి.పి. అభ్యర్థి శ్రీరామ్ పాటిల్ పై రక్షా ఖడ్సే రెండు లక్షల డెబ్బయి వేల మెజారిటీతో గెలిచింది.
పిల్లల కోసం...
పిల్లలను ముంబైలో చదివిస్తున్న రక్షా ఖడ్సే ప్రతి శని, ఆదివారాలు వారి దగ్గరకు వెళ్లి సమయం గడుపుతుంది. ‘పిల్లలను ముంబైలో ఉంటున్న మా ఆడపడుచులు బాగా చూసుకుంటారు. కాబట్టి నాకు టెన్షన్ లేదు. ప్రజలకు మేలు చేయాలన్నదే నా లక్ష్యం. మా ్రపాంతంలో ఇంకా సాగునీటి వసతి చాలా చోట్ల లేదు. దేశానికి అవసరమైన అరటిలో 35 శాతం మా దగ్గరే పండుతుంది. వ్యవసాయాన్ని ఇంకా వృద్ధి చేయడంలో నేను కృషి చేస్తాను. కేంద్ర మంత్రిగా ఇప్పుడు నా బాధ్యత పెరిగింది. ఏ శాఖ ఇచ్చినా సమర్థంగా పని చేసి నిరూపించుకుంటాను’ అని తెలిపింది రక్షా ఖడ్సే.
Comments
Please login to add a commentAdd a comment