NDA government
-
బుల్డోజర్ సంస్కృతిపై వేటు!
‘చావుకి పెడితే లంఖణానికి వస్తార’ని నానుడి. కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ స్వామ్యాన్ని జొప్పించి మురిసి ముక్కలవుతున్నవారికి సర్వోన్నత న్యాయస్థానం కీలెరిగి వాత పెట్టింది. నేరం రుజువై శిక్షపడిన లేదా నిందితులుగా ముద్రపడినవారి ఆవాసాలను కూల్చటం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అలాంటి చేష్టలకు పాల్పడే ప్రభుత్వాధికారులు బాధితులకు పరిహారం చెల్లించటంతోపాటు వారి ఇళ్ల పునర్నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని వ్యక్తిగతంగా భరించాల్సి వుంటుందని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం తేల్చిచెప్పింది. కూల్చివేతలకు ఏ నిబంధనలు పాటించాలో వివరించే మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని ఉల్లంఘించే అధికారులపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవటంతోపాటు వ్యాజ్యాలు కూడా మొదలవుతాయని హెచ్చరించింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నా రులూ, ఆడవాళ్లూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కొన్ని విధివిధానాలు పాటించేవారు. నోటీసులిచ్చి సంజాయిషీలు తీసుకుని ఆ తర్వాత చర్యలు ప్రారంభించేవారు. కీడు శంకించినవారు న్యాయస్థానాలను ఆశ్రయించటం, వారికి ఊరట దొరకటం కూడా రివాజే. తమకు నచ్చని అభిప్రాయాలున్నా, ఏదో ఉదంతంలో నిందితులుగా ముద్రపడినా వారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చే పాపిష్టి సంస్కృతి ఇటీవలి కాలపు జాడ్యం. సినిమా భాషలో చెప్పాలంటే ఇది ‘పాన్ ఇండియా’ సంస్కృతి! దీనికి ఆద్యుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తర ప్రదేశ్‌లో నేర సంస్కృతిని అరికట్టడంలో, సంక్షేమ పథకాలు అర్హులకు అందించటంలో ఆయన విజయం సాధించారని బీజేపీ చెబుతుంటుంది. కానీ అంతకన్నా ‘బుల్డోజర్ బాబా’గా పిలిపించుకోవటం యోగికి, అక్కడి బీజేపీకి ఇష్టం. చూస్తుండగానే ఇది అంటువ్యాధిలా పరిణమించింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటకల్లో బీజేపీ ప్రభుత్వాలు బుల్డోజర్లతో విధ్వంసానికి దిగాయి. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకున్నాక బాబు ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయాలను బుల్డోజర్లతో కూల్చాలని చూసింది. ఒకటి రెండుచోట్ల ఆ పనిచేసింది కూడా. ఇక తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న కక్షతో దిక్కూ మొక్కూలేని పేదల ఇళ్లు సైతం ఇదే రీతిలో ధ్వంసం చేసింది. రాజస్థాన్‌లో 2022లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా బీజేపీ ఏలుబడిలో ఉన్న రాజ్‌గఢ్ మున్సిపాలిటీ పరిధిలో ఈ దుశ్చర్య చోటు చేసుకుంది. మహారాష్ట్రలో శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి సర్కారు హయాంలో నిందితుల ఇళ్లనూ, దుకాణాలనూ కూల్చారు. కేంద్రం మాటే చెల్లుబాటయ్యే ఢిల్లీలో జహంగీర్‌పురా ప్రాంతంలో మతఘర్షణలు జరిగినప్పుడు అనేక ఇళ్లూ, దుకాణాలూ నేలమట్టం చేశారు. బాధితులు సుప్రీంకోర్టు ఉత్తర్వులు పొందేలోగానే విధ్వంసకాండ పూర్తయింది. 2020 నుంచి ముమ్మరమైన ఈ విష సంస్కృతిపై సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరిస్తూనే వచ్చింది. ‘నిందితులు మాత్రమే కాదు, శిక్ష పడినవారి ఇళ్లను సైతం కూల్చడానికి లేదు. ఈ విషయంలో చట్టనిబంధనలు పాటించి తీరాలి’ అని స్పష్టం చేసింది. కానీ ఆ చేష్టలు తగ్గిన దాఖలా లేదు. చుట్టూ మూగేవారు ‘ఆహా ఓహో’ అనొచ్చు. అవతలి మతంవారి ఇళ్లు, దుకాణాలు కూలుతున్నాయంటే తన్మయత్వంలో మునిగే వారుండొచ్చు. ఆఖరికి ఇళ్లు కూల్చిన ఉదంతాల్లో పాలుపంచుకున్న అధికారులు విందులు చేసుకున్న ఉదంతాలు కూడా వెల్లడయ్యాయి. కానీ సమాజంలో అరాచకం ప్రబలకూడదన్న ఉద్దేశంతో రాజ్య వ్యవస్థ ఏర్పడినప్పుడూ... రాజ్యాంగమూ, చట్టాలూ ఉన్నప్పుడూ... రాజ్యవ్యవస్థే తోడేలుగా మారితే దిక్కెవరు? సుప్రీంకోర్టు వద్దుగాక వద్దని చెప్పాక కూడా ఈ పోకడ ఆగలేదంటే ఏమను కోవాలి? ఒక వ్యక్తి నిజంగా తప్పు చేశాడనుకున్నా అతని కుటుంబమంతా అందుకు శిక్ష అనుభవించి తీరాలన్న పట్టుదల నియంతృత్వ పోకడ కాదా? సుప్రీంకోర్టు 95 పేజీల్లో ఇచ్చిన తీర్పు ఎన్నో విధాల ప్రామాణికమైనదీ, చిరస్మరణీయమైనదీ. ‘ఇల్లంటే కేవలం ఒక ఆస్తి కాదు... అది కొందరు వ్యక్తుల, కుటుంబాల సమష్టి ఆకాంక్షల వ్యక్తీకరణ. అది వారి భవిష్యత్తు. వారికి స్థిరత్వాన్నీ, భద్రతనూ చేకూరుస్తూ, సమాజంలో గౌరవం తీసుకొచ్చేది. ఇలాంటి ఇంటిని బలవంతంగా తీసుకోవాలంటే ముందుగా ఇతర ప్రత్యామ్నాయాలేవీ లేవని అధికారులు విశ్వసించాలి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన తీరు అమానవీయత నిండిన పాలకులకు ఏమేరకు అర్థమైందో సంశయమే. ఆ మాటెలా వున్నా కఠిన చర్యలుంటాయన్న హెచ్చరిక వారిని నిలువరించే అవకాశం ఉంది. దేశంలో దిక్కూ మొక్కూలేని కోట్లాదిమంది సామాన్యులకు ఊరటనిచ్చే ఈ తీర్పులో హిందీ భాషా కవి ప్రదీప్ లిఖించిన కవితకు కూడా చోటు దక్కింది. దాని సారాంశం – ‘ఇల్లు, పెరడు ప్రతి ఒక్కరి స్వప్నం. ఆ కలను కోల్పోవడానికి సిద్ధపడతారా ఎవరైనా?’ బ్రిటన్ న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా తీర్పులో ఉటంకించారు. ‘రాజ్యా ధికారాన్ని ధిక్కరించి అతి సామాన్యుడు వేసుకున్న గుడిసె చిరుగాలికే వణికేంత బలహీనమైనది కావొచ్చు. ఈదురుగాలికి ఇట్టే ఎగిరిపోవచ్చు. దాన్ని వర్షం ముంచెత్తవచ్చు. కానీ చట్టనిబంధన అనుమతిస్తే తప్ప ఆ శిథిల నిర్మాణం వాకిలిని అతిక్రమించటానికి ఇంగ్లండ్ రాజుకు సైతం అధికారంలేదు’ అని లార్డ్ డెన్నింగ్ అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూశాకైనా తమపై ఏ స్థాయిలో విశ్వాసరాహిత్యం ఏర్పడిందో ప్రభుత్వాలు గ్రహించాలి. నీతిగా, నిజాయితీగా, రాజ్యాంగానికి అనుగుణంగా పాలించటం నేర్చుకోవాలి. -
సుదీర్ఘ తగువుకు పాక్షిక ఊరట!
షష్టిపూర్తికి చేరువలో ఉన్న ఒక వివాదాస్పద కేసుకు సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం పాక్షికంగా ముగింపు పలికింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవి నుంచి వైదొలగుతున్న చివరి రోజున ఆయన ఆధ్వర్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)కు మైనారిటీ ప్రతిపత్తి అర్హతలేదన్న 1967 నాటి నిర్ణయాన్ని కొట్టేస్తూనే వేరే ధర్మాసనం దాన్ని నిర్ధారించాలని తెలిపింది. గత తీర్పుకు అనుసరించిన విధానం సరికాదని తేల్చింది. బెంచ్‌లోని ముగ్గురు సభ్యులు అసమ్మతి తీర్పునిచ్చారు. ఒక వివాదాన్ని ఏళ్ల తరబడి అనిశ్చితిలో పడేస్తే నష్టపోయే వర్గాలుంటాయి. ఏళ్లు గడిచేకొద్దీ సమస్య జటిలమవుతుంది కూడా. జేఎన్‌యూ మాదిరే ఏఎంయూ కూడా వివాదాల్లో నానుతూ ఉంటుంది. 2014లో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఇవి మరింత పెరిగాయి. చిత్రమేమంటే ఈ రెండు యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైనవారిలో చాలామంది సివిల్ సర్వీసులకూ, ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగాలకూ ఎంపికవుతుంటారు. పార్టీల్లో, ప్రభుత్వాల్లో, బహుళజాతి సంస్థల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంటారు. ఏఎంయూది ఒక విషాద చరిత్ర. సమస్యలు కూడా భిన్నమైనవి. సర్ సయ్యద్ మహ్మద్ ఖాన్ అనే విద్యావంతుడు మదర్సాల్లో కేవలం ఇస్లామిక్ విలువల విద్య మాత్రమే లభించటంవల్ల ఆ మతస్తులు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారని భావించి వాటితోపాటు ఆధునిక విద్యాబోధన ఉండేలా 1877లో స్థాపించిన ఓరియంటల్ కళాశాల ఆరంభంలో ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. మౌల్వీలనుంచీ, మదర్సాలనుంచీ సర్ సయ్యద్‌కు ప్రతిఘటన తప్పలేదు. ఆధునిక విద్యనందిస్తే పిల్లల మనసులు కలుషితమవుతాయన్న హెచ్చరిక లొచ్చాయి. అన్నిటినీ దృఢచిత్తంతో ఎదుర్కొని ఆధునిక దృక్పథంతో ఏర్పాటు చేసిన ఈ ఉన్నత విద్యాసంస్థపై 147 ఏళ్లు గడిచాక మత ముద్ర పడటం, దాన్నొక సాధారణ వర్సిటీగా పరిగణించా లన్న డిమాండు రావటం ఒక వైచిత్రి. చరిత్ర ఎప్పుడూ వర్తమాన అవసరాలకు అనుగుణంగా కొత్త రూపు తీసుకుంటుంది. అందు వల్లే కావొచ్చు... ఏఎంయూ చుట్టూ ఇన్ని వివాదాలు! 1920లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఓరియంటల్ కళాశాలనూ, ఆ ప్రాంతంలోనే ఉన్న ముస్లిం యూనివర్సిటీ అసోసియేషన్ సంస్థనూ విలీనం చేసి 1920లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని ఏర్పాటుచేసింది. ఆ చట్టంలోని 23వ నిబంధన యూనివర్సిటీ పాలకమండలిలో కేవలం ముస్లింలకు మాత్రమే చోటీయాలని నిర్దేశిస్తోంది. అయితే ముస్లిం విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలన్న నిబంధన లేదు. స్వాతంత్య్రానంతరం 1951లో ఆ చట్టానికి తెచ్చిన రెండు సవరణలు మతపరమైన బోధననూ, పాలకమండలిలో ముస్లింలు మాత్రమే ఉండాలన్న నిబంధననూ రద్దుచేశాయి. ఈ చర్య రాజ్యాంగంలోని 30వ అధికరణతోపాటు మత, సాంస్కృతిక, ఆస్తి అంశాల్లో పూచీపడుతున్న ప్రాథమిక హక్కులను ఉల్లంఘించటమేనంటూ పిటి షన్ దాఖలైంది. అయితే ఆ సవరణలు చెల్లుతాయని 1967లో సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల బెంచ్ వెలువరించిన తీర్పే ప్రస్తుత వివాదానికి మూలం. వర్సిటీ స్థాపించిందీ, దాన్ని నిర్వహిస్తు న్నదీ ముస్లింలు కాదని ఆ తీర్పు అభిప్రాయపడింది. అయితే అలా మారటం వెనక ముస్లిం పెద్దల కృషి ఉన్నదని అంగీకరించింది. ప్రభుత్వం స్థాపించిన వర్సిటీకి మైనారిటీ ప్రతిపత్తి ఎలా వస్తుందని ప్రశ్నించింది. ఈ తీర్పును వమ్ముచేస్తూ 1981లో ప్రభుత్వం ఏఎంయూ చట్టానికి సవరణలు తెచ్చింది. తిరిగి మైనారిటీ ప్రతిపత్తినిచ్చింది. దాంతో మెడికల్ పీజీలో 50 శాతం సీట్లను ముస్లింలకు కేటాయించాలని పాలకమండలి 2005లో నిర్ణయించింది. దాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. నాటి యూపీఏ సర్కారు, పాలకమండలి 2006లో దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు స్వీకరించినా రిజర్వేషన్ల విధానంపై స్టే విధించింది. ఆనాటినుంచీ అనాథగా పడివున్న ఆ కేసు నిరుడు అక్టో బర్లో జస్టిస్ చంద్రచూడ్ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయటంతో ముందుకు కదిలింది. అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 30వ అధికరణను పరిమితార్థంలో చూసిందనీ, యాంత్రికంగా అన్వయించిందనీ తాజా మెజారిటీ తీర్పు అభిప్రాయపడింది. ఏఎంయూ స్థాపన నేపథ్యం, పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాలి తప్ప తర్వాతకాలంలో వచ్చిన చట్టాన్ని కాదని తెలిపింది. ఈ తీర్పుతో విభేదించిన ముగ్గురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలు కూడా ప్రాధాన్యత గలవే. ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచ్ అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పుపై మరో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు ఎలా సిఫార్సు చేస్తుందని వారి ప్రశ్న. కేశవానంద భారతి కేసులో 1973 నాటి ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ తీర్పుపై 15 మందితో ధర్మాసనం ఏర్పాటు చేయమని రేపన్నరోజు మరో బెంచ్ ఆదేశిస్తే పరిస్థితేమిటని నిలదీశారు. ఏదేమైనా ఆలస్యమైనకొద్దీ సమస్య ఎంత జటిలమవుతుందో చెప్పటానికి ఏఎంయూ కేసే ఉదాహరణ. ఈ వర్సిటీ స్థలదాత జాట్ రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ అని హిందూ సంస్థలూ... ఆయన నెలకు రూ. 2కు 1929లో లీజుకు మాత్రమే ఇచ్చారని ముస్లింలూ రోడ్డుకెక్కారు. హిందువు ఇచ్చిన స్థలమై నప్పుడు దానికి మైనారిటీ ప్రతిపత్తేమిటన్న ప్రశ్న తలెత్తింది. మైనారిటీ సంస్థలో చదువుకుని ఎదిగి నందుకు కృతజ్ఞతగా లీజుకిచ్చారని, అలా ఇచ్చిన వందమందిలో ఆయనొకరని అవతలి పక్షం వాదించింది. మొత్తానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వల్ల మహేంద్ర పేరిట అక్కడే మరో వర్సిటీ ఏర్పాటైంది. రాజ్యాంగ ధర్మాసనం సూచించిన విధంగా ఏఎంయూ ప్రతిపత్తిపై మరో బెంచ్ ఏర్పాటై తీర్పు వస్తే ప్రస్తుత అనిశ్చితికి తెరపడుతుంది. -
అధిక జనాభా వరమా!
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఇష్టమున్నా లేకున్నా జనాభా అంశంపై చర్చ ఊపందుకుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మరో ఏణ్ణర్థంలో ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో ఈ చర్చ ఎంతో అవసరమైనదీ, తప్పనిసరైనదీ. అయితే ఇందులో ఇమిడివున్న, దీనితో ముడిపడివున్న అనేకానేక ఇతర విషయాలను కూడా స్పృశిస్తే ఈ చర్చ అర్థవంతంగా ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామూహిక వివాహాల సందర్భంగా సోమవారం కొత్త దంపతుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘2026లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన పుణ్యమా అని చిన్న కుటుంబానికి బదులు ఎక్కువమంది సంతానాన్ని కనాలని ఆశీర్వదించే రోజులొచ్చేశాయి’ అని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. తెలుగునాట అష్టయిశ్వర్యాలు లభించాలని దంపతులను ఆశీర్వదించినట్టే తమిళగడ్డపై కొత్త దంపతులకు 16 రకాల సంపదలు చేకూరాలని ఆకాంక్షించటం సంప్రదాయం. ఆ ఆకాంక్షను పొడిగించి ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఆశీర్వదించాల్సి వస్తుందన్నది ఆయన చమత్కారం. ఆ మాటల వెనక ఆంతర్యం చిన్నదేమీ కాదు. పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యాక లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలూ అమాంతం 753కు చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ఒక్కసారిగా 210 స్థానాలు పెరుగుతాయన్న మాట! ఆ నిష్పత్తిలో శాసన సభల్లో సైతం సీట్ల పెరుగుదల ఉంటుంది. జనాభా పెరుగుదల రేటులో తీవ్ర వ్యత్యాసాలు కనబడుతున్న నేపథ్యంలో అధిక జనాభాగల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లోక్‌సభ స్థానాలూ... ఆ పెరుగుదల అంతగా లేని దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సంఖ్యలో స్థానాలూ వస్తాయన్నది ఒక అంచనా. మరో మాటలో చెప్పాలంటే జనాభా నియంత్రణపైనా, విద్యపైనా, ఆర్థికాభివృద్ధిపైనా పెద్దగా దృష్టి పెట్టని రాష్ట్రాలు లాభపడబోతున్నాయన్నమాట!దేశంలో చివరిసారిగా 1976లో పునర్విభజన జరిగింది. ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా చేస్తే సమస్యలకు దారి తీయొచ్చన్న కారణంతో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పునర్విభజన ప్రక్రియను 2000 వరకూ స్తంభింపజేశారు. అయితే 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాల హేతుబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. దాని ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్య, వాటి పరిధి 2026 తర్వాత జరిగే జనగణన వరకూ మారదు. అయితే ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను హేతుబద్ధీకరించవచ్చు. దాని పర్యవసానంగా ఉమ్మడి ఏపీ అసెంబ్లీలోని 294 స్థానాల సంఖ్య మారకపోయినా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో జిల్లాలవారీగా సీట్ల సంఖ్య మారింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాగే జరిగింది.ప్రతి రాష్ట్రానికీ దాని జనాభా నిష్పత్తికి అనుగుణంగా లోక్‌సభలో ప్రాతినిధ్యం కల్పించాలని మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దేశంలో ప్రతి ఒక్కరి ఓటు విలువా ఒకేవిధంగా ఉండాలన్నది దీని ఆంతర్యం. 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదని కేంద్రం ప్రకటించింది. కనుక వాస్తవ జనాభా ఎంతన్నది తెలియకపోయినా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని సాంకేతిక బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ సంఖ్యను 142 కోట్లుగా లెక్కేస్తున్నారు. రాష్ట్రాలవారీగా జనాభా ఎంతన్న అంచనాలు కూడా వచ్చాయి. దాన్నే పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు 80 కాస్తా 128కి చేరుతాయి. బిహార్‌కు ఇప్పుడు 40 స్థానాలున్నాయి. అవి 70కి ఎగబాకుతాయి. అలాగే మధ్యప్రదేశ్‌కు ఇప్పుడున్న 29 నుంచి 47కూ, రాజస్థాన్‌కు ప్రస్తుతం ఉన్న 25 కాస్తా 44కు పెరుగుతాయని అంచనా. మహారాష్ట్రకు ప్రస్తుతం 48 ఉండగా అవి 68కి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. కానీ అదే సమయంలో జనాభా నియంత్రణలో విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పెరిగే సీట్ల సంఖ్య స్వల్పంగా ఉంటుంది. దేశ జనాభా వేగంగా పెరుగుతున్నదనీ, ఇదే కొనసాగితే భవిష్యత్తులో అందరికీ చాలినంత ఆహారం లభ్యం కావటం అసాధ్యమన్న అభిప్రాయం ఒకప్పుడుండేది. ఎమర్జెన్సీ రోజుల్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించిన ఉదంతాలకు లెక్కేలేదు. మొత్తంగా జనాభా పెరుగుతూనే ఉన్నా, ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశం మనదే అయినా గడిచిన దశాబ్దాల్లో పెరుగుదల రేటు తగ్గింది. ఈ తగ్గుదల సమంగా లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా, ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా నమోదవుతోంది. ఉదాహరణకు 1951లో తమిళనాడు జనాభా బిహార్ కంటే స్వల్పంగా అధికం. 6 దశాబ్దాల తర్వాత బిహార్ జనాభా తమిళనాడుకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ!దక్షిణాదిన జనాభా పెరుగుదల పెద్దగా లేకపోవటానికి ఆర్థికాభివృద్ధి, స్త్రీలు బాగా చదువు కోవటం, దారిద్య్రం తగ్గటం ప్రధాన కార ణాలు. దేశ జనాభాలో 18 శాతంగల దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీకి 35 శాతం వాటా అందిస్తున్నాయి. కుటుంబాల్లో స్త్రీల నిర్ణయాత్మక పాత్ర ఉత్తరాదితో పోలిస్తే పెరిగింది. కీలకాంశాల్లో ఉత్తరాది రాష్ట్రాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ వైఫల్యం వరం కావటం న్యాయమేనా? స్టాలిన్ మాటల ఆంతర్యం అదే. మరికొందరు నేతలు జనాభా పెంచమంటూ ముసిముసి నవ్వులతో సభల్లో చెబుతున్నారు. ఇది నవ్వులాట వ్యవహారం కాదు. పునరుత్పాదక హక్కు పూర్తిగా మహిళలకే ఉండటం, అంతిమ నిర్ణయం వారిదే కావటం కీలకం. అసలు పునర్విభజనకు జనాభా మాత్రమే కాక, ఇతరేతర అభివృద్ధి సూచీలనూ, దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్రనూ పరిగణనలోకి తీసుకోవటం అవసరం. ఈ విషయంలో విఫలమైతే దక్షిణాది రాష్ట్రాల్లో అసంతృప్తి పెరగటం ఖాయమని కేంద్రం గుర్తించాలి. -
అధిక నిధులతోనే రైతుకు మేలు
దేశంలో దాదాపు 60 శాతం మంది రైతులు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే... వ్యవసాయం మానేయాలని కోరుకుంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం నష్టాలు! 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో వ్యవసాయ నష్టాలను పూడ్చేందుకు బడ్జెట్ మద్దతును అందించని ఏకైక దేశం భారత్ మాత్రమే. ఇప్పటికీ వ్యవసాయ రంగ వృద్ధి కేవలం 1.4 శాతం మాత్రమే. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా దారిద్య్రంలో ఉంచడం దీనికి కారణం. అసమానతలను పెంచిపోషిస్తున్న ఆర్థిక సిద్ధాంతాలను ఇంకా పట్టుకుని వేలాడటంలో అర్థం లేదు. అత్యధిక జనాభా వ్యవసాయంలో ఉన్న దేశంలో దానికి అనులోమంగానే బడ్జెట్లో స్థిరంగా కొన్నేళ్లు కనీసం 50 శాతం వ్యవసాయ, గ్రామీణ రంగాలకు కేటాయించాలి.అది 1996వ సంవత్సరం. ఎన్నికల ఫలితాలు వెలువడి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఒకటీ రెండు రోజుల తర్వాత, న్యూఢిల్లీలో కొంతమంది ఆర్థికవేత్తలతో ఆంతరంగిక సమా వేశం జరిగింది. ప్రధానమంత్రిగా ఎన్నికైన వాజ్‌పేయి రాకపోవడంతో, మరో రాజకీయ ప్రముఖుడు మురళీ మనోహర్ జోషి ఆ సమా వేశానికి అధ్యక్షత వహించారు.ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోకుండా ఉండాలంటే, ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక విధానాలను తీసుకురావాలో సూచించాలని ఆ సమావేశంలో ఆర్థికవేత్తలను కోరారు. హాజరైన చాలామంది ద్రవ్య లోటును నిశితంగా పరిశీలించాలనీ, కరెంట్ ఖాతా లోటును తగ్గించే మార్గాలను కనుగొనాలనీ అభిప్రాయం వెలిబుచ్చారు. కీలకమైనవిగా గుర్తించిన సమస్యలపై చాలా చర్చ జరిగింది. ఉపాధిని సృష్టించడం, తయారీని పెంచడం, ఎగుమతుల ఆర్థిక వ్యవస్థను నిర్మించడం వంటి ఇతర ముఖ్యమైన సమస్యలపై కూడా చర్చ జరిగింది.విధానపరమైన ప్రాధాన్యం దేనిపై ఉండాలో సూచించమని నన్ను అడిగినప్పుడు, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న 60 శాతం జనాభాకు బడ్జెట్లో 60 శాతం మేరకు అందించాలని నేను సమాధాన మిచ్చాను. అక్కడ ఉన్న నా సహచరుల్లో చాలామంది నాతో ఏకీభవించలేదు. వ్యవసాయానికి 60 శాతం బడ్జెట్‌ను కేటాయిస్తే ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని కొందరు హెచ్చరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయ రంగాలకు భారీ కేటాయింపులు జరపాలనీ, దాన్నే అధిక ఆర్థిక వృద్ధికి దారితీసే కచ్చితమైన మార్గంగా తీసుకోవాలనీ వారు నొక్కి చెప్పారు. అయితే కొత్త నమూనాకూ, ఆర్థిక చింతనకూ ఇదే సమయమనీ, వ్యవసాయానికి తగిన బడ్జెట్ కేటాయింపు చేయకపోతే దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందదనీ నేనూ నొక్కిచెప్పాను. నా సలహా ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తల ఆలోచనతో పొసగదని నాకు తెలుసు. కానీ, ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం వ్యవసాయంలో, గ్రామీణాభివృద్ధిలో తగినంత పెట్టుబడి పెట్టడమేనని నా అవగాహన. మా అభిప్రాయాలను ప్రధానికి తెలియ జేస్తానని జోషి చెప్పడంతో సమావేశం ముగిసింది.కొన్ని రోజుల తర్వాత, కొత్త ప్రభుత్వం వ్యవసాయానికి 60 శాతం బడ్జెట్‌ను కేటాయించాలనే ఉద్దేశాన్ని ప్రకటించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. వ్యవసాయంలో చాలా వనరులను అందుబాటులో ఉంచాల్సిన అవసరం గురించి మీడియాలో కోలాహలం చెలరేగింది. చాలామంది నిపుణులు దీనివల్ల ఆర్థిక వ్యవస్థ తిరోగమిస్తుందని అన్నారు. నా వాదన ఏమిటంటే, భారతదేశం అధిక వృద్ధి పథం వైపు సాగుతున్నప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న తన జనాభాలో మూడింట రెండు వంతుల మందిని వెనుకే విడిచిపెట్టడం సాధ్యం కాదు.ఇది సాధ్యం చేయాలంటే, రాజకీయ తత్వవేత్త జాన్ రాల్ సూచించిన న్యాయసూత్రాలకు అనుగుణంగా నడుచుకోవాలంటే, మన విధాన ప్రయత్నం భిన్నంగా ఉండాలి. మానవ మూలధన పెట్టు బడికి, వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి, ఆరోగ్యం, విద్యారంగా లతో సహా గ్రామీణ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి తగిన ఆర్థిక వనరులను కల్పించాలి. ఈ క్రమంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, ఆర్థిక చింతనలో, విధానాల్లో కీలక మార్పు తేవడం వల్లనే, ప్రధానమంత్రి ఇప్పుడు చెబుతున్న ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ను నిజం చేయ వచ్చు. అయితే, వాజ్‌పేయి ప్రభుత్వం 13 రోజులు మాత్రమే కొన సాగింది. దాంతో మార్పునకు బలమైన పునాది వేయగలిగే ఆశ కూడా ఉనికిలో లేకుండా పోయింది.నేను దీన్ని ఎందుకు పంచుకుంటున్నానంటే, మొత్తం బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు మరింత తగ్గాయి. లక్షలాదిమంది జీవనోపాధికి వ్యవసాయం బాధ్యత వహిస్తున్న నేపథ్యంలో ఇది ఆందోళనకరం. బడ్జెట్లో వ్యవసాయం వాటా 2019–20లో అప్పటికే కనిష్ఠంగా ఉన్న 5.44 శాతం నుంచి, 2024–25లో 3.15 శాతానికి పడి పోయింది. వనరుల కేటాయింపులపై ఆధిపత్యం చలాయించేది రాజకీయ ఆర్థిక కారకాలు (బడా వ్యాపారులచే ఎక్కువగా ప్రభా వితమవుతాయి) అని గ్రహించినప్పుడు, తప్పు మార్గాలేమిటో స్పష్టంగా కనిపిస్తాయి. జనాభాలో 42.3 శాతం మంది ఇప్పటికీ వ్యవసాయంలో నిమగ్నమై ఉండగా, దాని వృద్ధి కేవలం 1.4 శాతంగా ఉంటోందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకా దారుణంగా, సగటు వ్యవసాయ ఆదాయాలు బాగా క్షీణించాయి. వాస్తవ గ్రామీణ వేతనాలు దశాబ్ద కాలంగా స్తబ్దుగా కొనసాగుతున్నాయి. నేను తరచుగా చెప్పినట్లు, వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా దారిద్య్రంలో ఉంచడం దీనికి కారణం.దేశంలో దాదాపు 60 శాతం మంది రైతులు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే... వ్యవసాయం మానేయాలని కోరుకుంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మరి భారతీయ రైతులు ఇంత దారుణంగా ఎలా నష్టపోతున్నారని మీరు ఆలోచిస్తున్నట్లయితే, ‘ఆర్గనై జేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ – డెవలప్మెంట్’ (ఓఈసీడీ) చేసిన ఇటీవలి అధ్యయనం పనికొస్తుంది. భారతీయ వ్యవసాయం అట్టడుగున ఉండటమే కాక, 2022లో 20.18 శాతం ప్రతికూల స్థూల వ్యవసాయ జమను (మైనస్) అందుకుంది. అయితే, 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఈ వ్యవసాయ నష్టాలను పూడ్చేందుకు బడ్జెట్ మద్దతును అందించని ఏకైక దేశం భారత్ మాత్రమే.జనాభాలో దాని వాటాకు అనులోమానుపాతంలో కొన్ని సంవత్సరాలపాటు వ్యవసాయానికి సరైన వనరులను అందించినట్ల యితే, అది అద్భుతమైన ఆర్థిక పరిపుష్టిని సంతరించుకుంటుంది. వనరుల కేటాయింపులు తగ్గుముఖం పట్టిన తర్వాత, వ్యవసాయ రంగంలో అద్భుతం జరుగుతుందని ఆశించడం వ్యర్థం. 1996లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లో 60 శాతం వాటాను అందించడానికి అంగీకరించి ఉంటే, నేటివరకు అది కొనసాగి ఉంటే, భారతదేశ గ్రామీణ ముఖచిత్రం పూర్తిగా మారి పోయి ఉండేది.ఇప్పుడు కూడా, వ్యవసాయంలో జనాభా 42.3 శాతంగా ఉన్నందున, రూ.48 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో కనీసం 50 శాతం వ్యవసాయ, గ్రామీణ రంగాలకు కేటాయించాలని చెప్పడానికి బలమైన కారణాలు ఉన్నాయి. పేదలు, మహిళలు, యువత, అన్న దాత అనే నాలుగు కొత్త ‘కులాలను’ చేరుకోవడానికి బహుశా ఇది ఉత్తమ మార్గం. వాస్తవానికి, వ్యవసాయం అన్ని రకాల కుల రూపాలకు జీవనోపాధిని అందిస్తుంది. వ్యవసాయంలో తగిన వనరులను ఉంచడం, పనితీరును మెరుగుపర్చడం వల్ల స్థిరమైన జీవనోపాధిని నిర్మించడమే కాకుండా వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించే ఆకాంక్ష లను కూడా ప్రోత్సహిస్తుంది. వ్యవసాయంలో తగిన పెట్టుబడులను కల్పిస్తే అవి ప్రపంచంలోని 75 శాతం మంది పేదల పేదరికాన్ని తగ్గించడంలో సహాయపడతాయని ప్రపంచ బ్యాంకు కూడా ఎక్కడో అంగీకరించింది.ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 1 శాతం మంది, దిగువన ఉన్న 95 శాతం కంటే ఎక్కువ సంపదను కూడబెట్టుకున్న తరుణంలో... అసమానతలను మరింత పెంచిన ఆర్థిక సిద్ధాంతాలను పట్టుకుని వేలాడటంలో అర్థం లేదు. కాబట్టి భారతదేశం, దాని సొంత గాథను లిఖించవలసిన అవసరం ఉంది. ఇదంతా వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేయడం ద్వారా ప్రారంభమవుతుంది.దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
అహ్మద్‌నగర్ ఇక అహిల్యానగర్
ఔరంగాబాద్:మహారాష్ట్రలోని షిరిడీ సాయినాథుడు కొలువైన అహ్మద్‌నగర్ జిల్లా పేరు మారిపోయింది.అహ్మద్‌నగర్‌ను అహిల్యానగర్‌గా మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్రప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో అహ్మద్‌నగర్‌ను ఇక అహిల్యానగర్‌గా పిలవనున్నారు.18వ శతాబ్దంలో ఇండోర్‌ను పరిపాలించిన మరాఠా రాణి పుణ్యశ్లోక్ అహిల్యాదేవి పేరు మీద అహ్మద్‌నగర్‌కు అహిల్యనగర్ అనే పేరు పెట్టారు.చాలా ఏళ్లుగా అహ్మద్‌నగర్ పేరు మార్చాలన్న డిమాండ్ ఉందని, ఇప్పుడు అది నెరవేరినందుకు సంతోషంగా ఉందని మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి వీకే పాటిల్ చెప్పారు. ఇదీ చదవండి: మహారాష్ట్రలో ధంగర్లకు ఎస్టీహోదాపై నిరసనలు -
వంద రోజుల్లో రూ.మూడు లక్షల కోట్ల పనులకు ఆమోదం
ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులు కావొస్తున్న నేపథ్యంలో రూ.మూడు లక్షల కోట్ల ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌లకు ఆమోదం లభించింది. ప్రాంతాల మధ్య రవాణా సదుపాయాలు పెంపొందించడం, ఆర్థిక వృద్ధిని సులభతరం చేయడం, ఉద్యోగాల కల్పనకు ఈ ప్రాజెక్ట్‌లు ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు.ఓడరేవుల రంగంలో మహారాష్ట్రలోని వధావన్ వద్ద రూ.76,200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పోర్ట్‌కు ఇటీవలే ఆమోదం లభించింది. ఇది పూర్తయితే ప్రపంచంలోని టాప్ 10 ఓడరేవుల్లో ఒకటిగా నిలుస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన - IV కింద 62,500 కి.మీ రోడ్ల నిర్మాణంతోపాటు రోడ్లపై వంతెనల నిర్మాణం కోసం రూ.49,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లు ప్రారంభించనున్నారు. రూ.50,600 కోట్ల అంచనా వ్యయంతో 936 కి.మీ విస్తరించి ఉన్న ఎనిమిది జాతీయ హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. క్లిష్టమైన భూభాగాల్లోనూ రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా లద్దాఖ్‌ను హిమాచల్ ప్రదేశ్‌తో కలుపుతూ షింఖున్ లా టన్నెల్ ఏర్పాటుకు ఇటీవల ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.ఇదీ చదవండి: ‘డిపాజిట్’ వార్!రైల్వే ప్రయాణాలను వేగవంతం చేసేందుకు వీలుగా మొదటి వంద రోజుల్లో ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులను ఆమోదించారు. వీటి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 4.42 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. విమానాశ్రయ మౌలిక సదుపాయాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రా విమానాశ్రయం, బిహార్‌లోని బిహ్తాలో కొత్త సివిల్ ఎన్‌క్లేవ్‌లతో పాటు వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి ప్రభుత్వ ఆమోదం లభించింది. -
మళ్లీ తెరపైకి పౌరస్మృతి
వరసగా మూడోసారి గద్దెనెక్కిన తర్వాత ఎర్రకోట బురుజులపై నుంచి చేసిన తొలి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన అంశాలు ప్రస్తావించారు. అందులో ప్రధానమైనది ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ). ఇప్పుడున్న ‘మతతత్వ పౌరస్మృతి’ స్థానంలో ‘సెక్యులర్ పౌరస్మృతి’ రావా ల్సిన అవసరం ఉందన్నది మోదీ నిశ్చితాభిప్రాయం. నిజానికి ఇదేమీ కొత్త కాదు. ఇంతక్రితం సైతం పలు సందర్భాల్లో యూసీసీ గురించి ఆయన మాట్లాడారు. నిరుడు జూన్‌లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సదస్సులో దీనిపై ఆయన గొంతెత్తారు. ఆ మాటకొస్తే పూర్వపు జనసంఘ్ నుంచీ బీజేపీ దీన్ని తరచూ చెబుతోంది. కనుక ఇందులో కొత్త ఏమున్నదని అనిపించవచ్చు. అయితే గతంలో ప్రస్తావించటానికీ, ఇప్పుడు మాట్లాడటానికీ మధ్య మౌలికంగా వ్యత్యాస ముంది. గత పదేళ్ల నుంచి ఆయన ఎన్డీయే ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నా బీజేపీకి సొంతంగానే పాలించగల సత్తా ఉండేది. ఇప్పుడు కూటమి పక్షాలపై ఆధారపడక తప్పనిస్థితి వచ్చింది. ప్రధాని తాజా ప్రసంగంలో ఇంకా అవినీతి, మహిళల భద్రత, ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలు వంటివి కూడా చోటుచేసుకున్నాయి. నిజానికి ఎర్రకోట బురుజు ప్రసంగం లాంఛనమైన అర్థంలో విధాన ప్రకట నేమీ కాదు. కానీ రాగల అయిదేళ్ల కాలంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చేయదల్చుకున్నదేమి టన్న విషయంలో ఆయన స్పష్టతతో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. మనం పూర్తి స్థాయి సెక్యులర్ దేశంగా మనుగడ సాగించాలని తొలి ప్రధాని నెహ్రూ మొదలు కొని స్వాతంత్య్రోద్యమ నాయకులందరూ భావించారు. యూసీసీ గురించి రాజ్యాంగ నిర్ణాయక సభలో లోతైన చర్చే జరిగింది. రాజ్యాంగసభ అధ్యక్షుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సైతం యూసీసీ ఉండితీరాలని కోరుకున్నారు. సభ్యుల్లో కొందరు వ్యతిరేకిస్తే... అనుకూలంగా మాట్లాడినవారిలో సైతం కొందరు ఇది అనువైన సమయం కాదన్నారు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు భిన్నమై నవి. దేశ విభజన సమయంలో ఇరుపక్కలా మతోన్మాదులు చెలరేగిపోయారు. నెత్తురుటేర్లు పారించారు. పరస్పర అవిశ్వాసం, అపనమ్మకం ప్రబలటంతో ఇళ్లూ, వాకిళ్లూ, ఆస్తులూ అన్నీ వదిలి లక్షల కుటుంబాలు ఇటునుంచి అటు... అటునుంచి ఇటూ వలసబాట పట్టారు. అదే సమయంలో పాకి స్తాన్ ఆవిర్భావానికి కారకుడైన మహమ్మద్ అలీ జిన్నా మరింత రెచ్చగొట్టే ప్రకటన చేశారు. భారత్‌లో ముస్లింలకు మనుగడ ఉండబోదని, వారిని అన్ని విధాలా అణిచేస్తారని దాని సారాంశం. అలాంటి సమయంలో యూసీసీని తీసుకొస్తే అనవసర అపోహలు బయల్దేరి పరిస్థితి మరింత జటిలమవుతుందని అందరూ అనుకున్నారు. అందువల్లే హక్కుల్లో భాగం కావాల్సిన యూసీసీ కాస్తా 44వ అధికరణ కింద ఆదేశిక సూత్రాల్లో చేరింది. ఆ సూత్రాలన్నీ ప్రభుత్వాలు నెరవేర్చాల్సిన అంశాలు. అయినా ఇతర అధికరణాల అమలు కోసం వెళ్లినట్టుగా కోర్టుకు పోయి వాటి అమలుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరటం సాధ్యం కాదు. అందువల్లే సుప్రీంకోర్టు వివిధ తీర్పుల్లో యూసీసీని తీసుకురావలసిన అవసరాన్ని పాలకులకు గుర్తుచేసి ఊరుకుంది. చిత్రమేమంటే పర స్పర పూరకాలు కావలసిన హక్కులూ, ఆదేశిక సూత్రాలూ కొన్ని సందర్భాల్లో విభేదించుకుంటాయి. ఉదాహరణకు 25 నుంచి 28వ అధికరణ వరకూ పౌరులకుండే మత స్వేచ్ఛ గురించి మాట్లాడ తాయి. ఆదేశిక సూత్రాల్లో ఒకటైన యూసీసీపై చట్టం తెస్తే సహజంగానే అది మత స్వేచ్ఛను హరించినట్టవుతుంది. కనుక ఈ రెండింటి మధ్యా సమన్వయం సాధించాలి. గతంలో చాలా సందర్భాల్లో ఇలా చేయకతప్పలేదు. ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ ప్రభావితం కాని రీతిలో ఆ పని చేయాలి. ఆ సంగతలా ఉంచి యూసీసీ తీసుకురాదల్చుకుంటే ఇస్లామ్‌ను అనుసరించేవారికి మాత్రమే కాదు... హిందూ, క్రైస్తవ, పార్సీ మతస్థులపైనా ప్రభావం పడుతుంది. కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చుగానీ దాదాపు అన్ని మతాలూ స్త్రీల విషయంలో వివక్షాపూరితంగానే ఉన్నాయి.ముఖ్యంగా వ్యక్తిగత (పర్సనల్) చట్టాలకొచ్చేసరికి ఇది బాహాటంగా కనబడుతుంది. వీటి మూలాలు వందలు, వేల ఏళ్ల నుంచి పరంపరగా వస్తూవున్న సంప్రదాయాల్లో ఉండటం, మారు తున్న కాలానికి అనుగుణంగా సవరించుకోవటానికి సిద్ధపడకపోవటం సమస్య. వివాహం, విడా కులు, పునర్వివాహం, వారసత్వం, ఆస్తి హక్కు, బహుభార్యాత్వం వంటి అంశాల్లో స్త్రీలకు వివక్ష ఎదురవుతోంది. అయితే రాజ్యాంగం హామీ ఇచ్చిన లింగసమానత్వం లేని పక్షంలో అలాంటి చట్టా లను సుప్రీంకోర్టు కొట్టివేసిన సందర్భాలున్నాయి. పార్శీల్లో అన్య మతస్థుణ్ణి పెళ్లాడిన మహిళలకు వారసత్వ ఆస్తిలో భాగం ఇవ్వరు. పార్శీ పురుషుడికి అది వర్తించదు. అన్ని అంశాలనూ సవివరంగా చర్చించేందుకూ... అన్ని మతాచారాల వివక్షను తొలగించటానికీ సిద్ధపడుతున్నారన్న అభిప్రాయం కలిగిస్తే యూసీసీ రూపకల్పన సమస్యేమీ కాదు. దానికి ముందు మైనారిటీల విశ్వాసం పొందాలి. కోల్‌కతాలో ఇటీవల మహిళా జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య నేపథ్యంలో మహిళల భద్రత అంశాన్ని మోదీ ప్రస్తావించారు. ఇక భారత్‌లో అవినీతి పెచ్చుమీరిందని గణాంకాలు వెల్లడి స్తున్న నేపథ్యంలో కఠినంగా ఉంటామన్న సంకేతాలిచ్చారు. కానీ అలాంటి ఆరోపణలున్న నేతలు బీజేపీలోనో, దాని మిత్రపక్షంగానో ఉన్నప్పుడూ... వారిపై కేసుల దర్యాప్తు మందగిస్తున్నప్పుడూ దీన్ని జనం ఎంతవరకూ విశ్వసించగలరన్నది ఆలోచించుకోవాలి. మొత్తానికి యూసీసీ అంశాన్ని ప్రధాని మరోసారి తెరపైకి తెచ్చారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఎటువంటి స్పందన వస్తుందో, ఎన్డీయే కూటమిలోని ఇతర పక్షాల వైఖరి ఏ విధంగా ఉంటుందో మున్ముందు తెలుస్తుంది. -
మీడియా స్వేచ్ఛకు కళ్లెమా!
వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయకతప్పని పక్షం రోజుల్లోనే ప్రస్తుతం భిన్నవర్గాల పరిశీలనలో ఉన్నదని చెబుతున్న బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లు ముసాయిదాను కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వెనక్కి తీసుకుంది. కారణమేదైనా ఇది ఆహ్వానించ దగ్గ పరిణామం. ఈ బిల్లు తొలి ముసాయిదా నిరుడు నవంబర్‌లో విడుదల చేయగా దానిపై వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని చెబుతూ గత నెల రెండో ముసాయిదా తీసుకొచ్చారు. తాజాగా దాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. వచ్చే అక్టోబర్ 15 వరకూ ముసా యిదా బిల్లుపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. బహుశా శీతా కాల సమావేశాలనాటికి దీనికి తుదిరూపం ఇవ్వాలన్నది పాలకుల ఉద్దేశం కావొచ్చు. డిజిటల్ మీడియా ప్రస్తుతం ఊహకందని రీతిలో విస్తరించింది. 1959లో ప్రయోగాత్మకంగా ఢిల్లీలో ప్రారంభించిన టెలివిజన్ ప్రసారసేవలు 80వ దశకం చివరినాటికి కొత్త పుంతలు తొక్కాయి. స్టార్ టీవీ, ఎంటీవీ, బీబీసీ, సీఎన్ఎన్ వగైరాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రస్తుతం యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్వంటి సామాజిక మాధ్యమాలతోపాటు ఓటీటీలు వచ్చాయి. వాట్సాప్, టెలిగ్రామ్ వంటివి సరేసరి. అన్నింటా మంచీ చెడూ ఉన్నట్టే వీటివల్ల కూడా సమస్యలు ఎదురువుతూ ఉండొచ్చు. అవి దుష్పరిణామాలకు దారితీయటం నిజమే కావొచ్చు. అందుకు తగిన చట్టాలు తీసుకు రావటం కూడా తప్పేమీ కాదు. కానీ ఈ మాధ్యమాలను నియంత్రించే పేరిట భావప్రకటనా స్వేచ్ఛకు కళ్లెం వేయాలనుకోవటం, అసమ్మతిని అణిచేయాలనుకోవటం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ ముసాయిదా బిల్లు చేస్తున్నది అదే. గతంలో కేబుల్ రంగం హవా నడిచినప్పుడు వీక్షకులకు ఇష్టం ఉన్నా లేకున్నా అనేక చానెళ్లు వచ్చిపడేవి. వర్తమానంలో అలా కాదు. ఏం చూడాలో, వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛ వీక్షకులకు ఉంటుంది. పార్టీలకు అమ్ముడుపోయిన చానెళ్లు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అర్థమయ్యాక జనం వాటిని చూడటం మానుకుంటున్నారు. ఆన్లైన్లో ప్రత్యామ్నాయాలను వెదుక్కుంటున్నారు. తమకు నచ్చిన, తాము తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఉన్నదనుకుంటేనే ఆన్లైన్లో లభ్య మయ్యే వీడియోలను వీక్షిస్తారు. వార్తా విశ్లేషణలను చదువుతారు. ఒక అంశంపై ఎవరెవరి అభిప్రా యాలు ఎలావున్నాయో తెలుసుకుంటారు. ఈ క్రమంలో సహజంగానే ప్రజలను పక్కదోవపట్టించేవాళ్లు ఉంటారు. అశ్లీలతనూ, దుర్భాషలనూ గుప్పించేవారుంటారు. తప్పుడు కథనాలను ప్రసారం చేసేవారూ ఉంటారు. అలాంటివారిపై తగిన చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ కాదనరు. కానీ నిజాయితీగా అభిప్రాయాలు వ్యక్తీకరించేవారిని కూడా వారితో సమంచేసి శిక్షించే ధోరణి ఎంతవరకూ సబబు? అత్యధిక వీక్షకుల్ని రాబట్టుకుంటున్న ఆన్లైన్ మాధ్యమాలకు సైతం ముసా యిదాలో ఏముందో అధికారికంగా తెలియదు. అనేకానేక ఆన్లైన్ చానెళ్లు, ఇతర ప్రచురణ మాధ్య మాలూ సభ్యులుగా ఉన్న డిజిపబ్ వంటి స్వయంనియంత్రణ సంస్థలకే ఈ ముసాయిదాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి వర్తమానమూ లేదు. మరి కేంద్రం ఇంతవరకూ సాగించామంటున్న సంప్రదింపులు ఎవరితో జరిగినట్టు? రెండు మూడు ఓటీటీ యాజమాన్యాలనో, కార్పొరేట్ రంగ ఆధిపత్యంలో సాగుతున్న ఇతర మాధ్యమాలనో, తాము నిపుణులుగా భావించేవారినో సంప్రదిస్తే సరిపోతుందా? సాగు చట్టాల విషయంలోనూ లక్షలాదిమంది రైతులతో, వేలాది సంఘాలతో చర్చించామని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. చివరకు ఏమైంది? రైతులు పట్టుదలగా పోరాడాక వెనక్కు తీసుకోకతప్పలేదు. సమస్యేమంటే...ట్విటర్లో లక్షల్లో అనుయాయులున్న రాజకీయ నాయకులు మొదలుకొని ధ్రువ్రాఠివంటి పాపులర్ యూట్యూబర్ల వరకూ... ఎంతో నిబద్ధతతో సీనియర్ జర్నలిస్టులు నడిపే మాధ్యమాలవరకూ అందరినీ ముసాయిదా బిల్లు ఒకే గాటన కడు తోంది. ఆఖరికి పత్రికలూ, చానెళ్లూ అనుబంధంగా నడుపుతున్న డిజిటల్ మాధ్యమాలు సైతం ఈ పరిధిలోకొస్తాయి. పైగా ఈ కార్యకలాపాలు క్రిమినల్ చట్టాల పరిధిలోకి కూడా వెళ్లి అనేక కేసులు దాఖలవుతాయి. అరెస్టయితే బెయిల్ దుర్లభమవుతుంది. తటస్థంగా విశ్లేషణలందిస్తూ వేలల్లోనో, లక్షల్లోనో వీక్షకుల్ని సంపాదించుకుంటున్న వ్యక్తులు కూడా ఈ బిల్లు చట్టమైతే అనేకానేక పత్రాలు దాఖలుచేయాల్సివస్తుంది. అంతేకాదు...ఒక గ్రీవెన్స్ అధికారిని నియమించుకోవటం, స్వీయ మదింపు కమిటీని ఏర్పాటుచేసుకోవటం తప్పనిసరవుతుంది. ఈ వ్యయాన్నంతా వీక్షకులనుంచి వసూలు చేయటం సాధ్యమేనా? అసలు వచ్చే ఆదాయం ఎంత? పైగా తప్పుడు కథనాలు ప్రసారం చేశారనుకుంటే వారెంట్ లేకుండా దాడులు చేసి పరికరాలను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభు త్వాలకు వస్తుందంటున్నారు.ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి విపక్షాలను జైళ్లలో కుక్కి అసమ్మతిని అణి చేశారని బీజేపీ తరచు చెబుతుంటుంది. రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజుగా ప్రతియేటా జూన్ 25ను పాటించాలని కూడా పిలుపునిచ్చింది. అలాంటి పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ముసాయిదాను తీసుకురావటం, దాన్ని బహిరంగపరచకపోవటం వింత కాదా? మన పొరుగు నున్న బంగ్లాదేశ్‌లో హసీనా హయాంలో ఇలాంటి చట్టాన్నే తీసుకొచ్చారు. కానీ అక్కడ నిరసన వెల్లువ ఆగిందా? తమ నిర్ణయాలపై సామాన్యులు ఏమనుకుంటున్నారో, వారిలోవున్న అసంతృప్తి ఏమిటో తెలుసుకోవటానికి డిజిటల్ మీడియా తోడ్పడుతుంది. అది పాలకులకే మంచిది. మీడియా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టయిన ఇలాంటి ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవటం ఉత్తమం. -
2029లోనూ ఎన్డీఏదే అధికారం: అమిత్ షా
చండీగఢ్: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మనుగడపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలను హోం మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. తమ ప్రభుత్వం దిగ్విజయంగా మరో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోవమే గాక 2029లోనూ అధికారంలోకి వస్తుందని ఆదివారం ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు మరోసారి అదే పాత్రకు ఇప్పట్నుంచే సిద్ధం కావాలన్నారు. ‘‘ప్రతిపక్షాలు ఏమైనా చెప్పనీయండి. 2029లోనూ ఎన్డీఏదే అధికారం. మోదీయే ప్రధాని’’ అని పేర్కొన్నారు. ‘‘ప్రతిపక్షాలు కాస్త విజయానికే ఎన్నికల్లో గెలిచేసినట్లు సంబరపడుతున్నాయి. కాంగ్రెస్ గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో కలిపి సాధించిన సీట్లను బీజేపీ ఒక్క 2024 ఎన్నికల్లోనే సాధించింది!’’ అని అన్నారు. మోదీ ప్రభుత్వం కొనసాగదంటూ కావాలనే అయోమయం సృష్టించేందుకు మళ్లీమళ్లీ విపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. -
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు..కేంద్ర కేబినెట్ ఆమోదం?
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ చట్టానికి సవరణలు చేసి, తద్వారా వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేసేందుకు సిద్ధంగా ఉందని జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చట్టంలోని సవరణలకు ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం.ఈ సవరణలతో ఇవి తమ ఆస్తులని వక్ఫ్ బోర్డ్ అంటే అందుకు తగిన ఆధారాలు చూపుతూ ధృవీకరించాల్సి ఉంటుందని సమాచారం. ఈ సవరణలకు సంబంధించిన బిల్లును వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా వక్ఫ్ బోర్డుకు సుమారు 9.4 లక్షల ఎకరాలు భూమి ఉంది. -
రాజ్యసభలో ఎన్డీఏపై విజయసాయిరెడ్డి ఫైర్
-
రిటైరయ్యేలోపు తీర్పివ్వండి
న్యూఢిల్లీ: ఆధార్ వంటి సాధారణ చట్టాలను ద్రవ్య బిల్లులుగా ఎన్డీఏ సర్కార్ లోక్‌సభలో ప్రవేశపెడుతున్న విధానాన్ని తప్పుబడుతూ ఈ విధానం చట్టబద్ధతను తేల్చేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు అనుమతించింది. సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సంబంధిత పిటిషన్‌ను సోమవారం విచారించింది. కాంగ్రెస్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ‘‘ ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేశాక ఈ అంశాన్ని పరిశీలిస్తాం’ అని సీజేఐ చంద్రచూడ్ చెప్పారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ రాజ్యాంగంలోని ఆరి్టకల్ 110 కింద ఎన్నో సాధారణ బిల్లులను ద్రవ్యబిల్లులుగా పేర్కొంటూ మోదీ సర్కార్ లోక్‌సభలో ఆమోదింపజేసుకుంటోంది. ఈ రాజ్యాంగ అతిక్రమణకు 2016నాటి ఆధార్ చట్టం చక్కని ఉదాహరణ. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే కోర్టు కూడా ‘ఇది రాజ్యాంగపరంగా మోసమే’ అంటూ సమరి్థంచింది. 2014 నుంచి ఆర్టికల్110 దుర్వినియోగంపై విచారణకు రాజ్యాంగ బెంచ్ ఏర్పాటుచేస్తానని సీజేఐ తీర్పుచెప్పడం హర్షణీయం. ఈ ఏడాది నవంబర్‌లో సీజేఐ చంద్రచూడ్ రిటైర్ అయ్యేలోపు తీర్పు ఇస్తారని ఆశిస్తున్నాం’ అని పోస్ట్ చేశారు. ఆధార్ చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం(సవరణ) వంటి కీలక బిల్లులను ద్రవ్యబిల్లుగా మోదీ సర్కార్ లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పెద్దలసభలో మెజారిటీ లేని కారణంగా అక్కడ బిల్లులు వీగిపోకుండా, తప్పించుకునేందుకు ప్రభుత్వం ఇలా చేస్తోందని చాన్నాళ్లుగా విపక్షాలు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టడం తెల్సిందే. -
అంబేడ్కర్ ఆలోచనల్ని ప్రతిఫలిస్తాయా?
నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ 3.0 ప్రభుత్వం 2024–25కి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి సమాయత్తమవుతోంది. దీనిమీద అందరిలోనూ ఆసక్తి నెలకొని వుంది. అణగారిన సామాజిక వర్గాలు అభివృద్ధి చెందితేనే ప్రపంచ వ్యాప్తమైన ఆర్థికాభివృద్ధిలో భారతదేశం భాగస్వామ్యం కాగలుగుతుందని అంబేడ్కర్ ఏనాడో చెప్పారు. షెడ్యూల్డ్ కులాల ఆర్థిక విమోచన జరగాలంటే, వారికి భూములను పంచే ముఖ్య విషయం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని కూడా అంబేడ్కర్ సూచించారు. దానికి బడ్జెట్లో ప్రాధాన్యమివ్వాలి. కుల నిర్మూలనకు, స్త్రీ సాధికారతకు, వ్యవసాయ కూలీలను వ్యవసాయదారులుగా మలిచేందుకు బడ్జెట్ కేటాయింపులు జరగాలి. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసేలా, కొత్త ఉద్యోగాలు కల్పించేలా బడ్జెట్ కేటాయింపులు జరపాలి.2024–25 సంవత్సరానికి కేంద్రంలోని నూతన ఎన్డీఏ ప్రభుత్వం జూలై 22, 23 తేదీల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా దళితుల్లోనూ, స్త్రీలలోనూ, ఆదివాసీలలోనూ కొత్త ఆశలు కలుగుతున్నాయి. మొత్తం పార్లమెంట్లో 111 మంది దళిత ఎంపీలు ఉన్నారు. అస్పృశ్యతా నిర్మూలనకు, కుల నిర్మూలనకు, స్త్రీ సాధికారతకు, వ్యవసాయ కూలీలను వ్యవసాయదారులుగా మలిచే అంశాల పట్ల దేశంలో ఎంతో ఆసక్తి నెలకొనివుంది. ఈ క్రమంలో ముఖ్యంగా స్త్రీ సాధికారత భారతదేశంలో చాలా అవసరంగా కనిపిస్తుంది. పురుషుల సంఖ్యతో దాదాపు సమానంగా ఉన్న స్త్రీలలో 20 కోట్ల మందికి పనిలేదు. ముఖ్యంగా దళిత స్త్రీలకు సొంత భూమి లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. భూమి చరిత్ర చూస్తే భూస్వామ్య ఆధిపత్య కులాలకే భూమి ఉంది. భూమి ఉత్పాదకతపై వారికి పూర్తి అవగాహన ఉండేది. సమాజంలో వారు బలమైన వర్గంగా వ్యవహరించేవారు. అందుకే కేంద్ర పాలకులు వారిని విస్మరించడం కానీ, వారితో వైరం పెట్టుకోవడం కానీ జరిగేది కాదు. తరతరాలుగా పాలకవర్గాలు అగ్రకులాలకు భూ వసతిని కల్పించడంలోనూ, వాటికి నీటి వసతి కల్పించడంలోనూ జాగరూకతతో ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ భూపరిమితి చట్టాన్ని 1958లో అప్పటి ప్రభుత్వం తెచ్చింది. అది జూన్ 1961లో అమల్లోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకూ దానికి తూట్లు పడుతూనే వున్నాయి. ప్రధానమైన విషయం ఆంధ్రప్రదేశ్ వ్యావసాయిక రాష్ట్రం. ఇందులో 69.7 శాతం మంది వ్యవసాయ కూలీలు. అందులో 90 శాతం మంది దళితులు. ఈ దళితులకు ఉన్నత స్థాయి కలిగించాలంటే తప్పకుండా వీరికి భూమి ఇవ్వాలి. రాను రాను వ్యవసాయ కూలీపని మీద శిథిలమౌతున్న వృత్తులవారందరూ ఆధారపడుతున్నారు.పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో భూమి రేటు విపరీతంగా పెరగడం వల్ల ఏ వ్యవసాయ కూలీలైతే భూమిని చదును చేసి వ్యవసాయీకరించారో వారు భూమి కొనలేని పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. అలాగే కృష్ణా డెల్టాలో అసలు మిగులు భూమి లేదని అధికారులు ప్రకటిస్తున్నారు. ఇటు వ్యవసాయ కూలి పని లేక, అటు ప్రభుత్వం భూమి ఇవ్వక, గ్రామాల్లో ఉండే పరిస్థితులు లేక తీవ్రమైన వలసలకు దళితులు గురి అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కనీసం రూ.1,000 కోట్లు అయినా భూమి కొనుగోలు పథకానికి కేటాయించవలసిన అవసరం ఉందని సామాజిక ఆర్థిక శాస్త్రవేత్తలు కోరుకుంటున్నారు. ఈ విషయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మొదటి ప్రణాళిక సంఘంలోనే భూమి కొనుగోలు పథకానికి 20 కోట్ల కేటాయింపు చేసిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి.అంబేడ్కర్ 1954 సెప్టెంబర్ 6వ తేదీన రాజ్యసభలోని చర్చల్లో ఇలా నివేదించారు: ‘‘ఆర్యా! నేనిప్పుడు షెడ్యూల్డ్ కులాల ఆర్థిక విమోచన సమస్యను ప్రస్తావిస్తున్నాను. చదువుతో పాటుగా ఉద్యోగాలు కూడా షెడ్యూల్డ్ కులాల ఆర్థిక హోదా పెరుగుదలకు ఎక్కువ ప్రాధాన్యమైనవి. అయితే ఇప్పుడు షెడ్యూల్డ్ కులాల ఆర్థిక హోదా పెరుగుదలకు ఏమి అవకాశాలున్నాయి? షెడ్యూల్డ్ కులాల ఆర్థిక విమోచన లాభదాయకమైన వృత్తులలో ప్రవేశం పొందే అవకాశం మీదనే ఆధారపడి ఉందని స్పష్టమైంది. లాభదాయకమైన వృత్తుల్లోకి ద్వారాలు తెరవబడనంత వరకు, వారి ఆర్థిక విమోచన జరిగే వీలు లేదు. వారు బానిసలుగానే మిగిలి పోతారు. బానిసలు కాకపోయినా, గ్రామాలలో భూస్వాముల సేవకులుగా మిగిలిపోతారు. ఆ విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. ఆర్యా! నిస్సందేహంగా షెడ్యూల్డ్ కులాల వారికి ప్రభుత్వంవారు భూమిని పంచే ముఖ్యమైన విషయంపై దృష్టి ఉంచాలి. భూస్వాముల పొలాలపై పరిమితిని విధించి, అంతకన్నా ఎక్కువ ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దానిని షెడ్యూల్డ్ కులాల వారికి ఇవ్వాలి. రెండవదేమిటంటే అమ్మకానికి వచ్చిన భూమిని కొనుక్కోవటం కోసం వారికి ఋణాలివ్వాలి.’’ఇకపోతే స్త్రీలకు భారతదేశ వ్యాప్తంగా కుటీర పరిశ్రమలు రూపొందించి వాటిని వస్తూత్పత్తి కేంద్రాలుగా రూపొందించాలి. అక్కడ తయారైన వస్తువులకు ప్రపంచ మార్కెట్లో స్థానం ఏర్పాటు చేయగలిగితే మన స్త్రీలు చైనాను మించిపోతారు. నిజానికి గత రెండు దశాబ్దాలుగా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. చైనా నుంచి దిగుమతులు పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల గ్రాడ్యుయేట్ యువతలో నిరుద్యోగ రేటు 42 శాతానికి పెరిగింది. దీని వల్ల నిరుద్యోగులలో నిరాసక్తత, సోమరితనం పెరుగుతున్నాయి. మత్తు మందుల వాడకం పెరగడానికి కూడ నిరుద్యోగితే కారణం. ఈ నిరుద్యోగుల్లో మహిళలు ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం. స్త్రీల విద్య, ఉపాధి విషయాల గురించి అంబేడ్కర్ హిందూ కోడ్ బిల్లులోనూ, ఆ తరువాత పార్లమెంట్ చర్చల్లోనూ ఎన్నో సలహాలు ఇచ్చారు. వాటిని పెడచెవిన పెట్టడం వల్లే ఈ రోజున స్త్రీలు చదువుకొని కూడా అటు వ్యవసాయపని చేయలేకా, ఇటు ఉద్యోగం దొరక్కా సంక్షోభంలో ఉండిపోయారు. నిరుద్యోగ నిర్మూలన కోసం బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసేలా, కొత్త ఉద్యోగాలు కల్పించేలా బడ్జెట్ కేటాయింపులు జరపాలి. దళిత విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలను దేశం మొత్తంగా మండలానికి ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి గురుకుల పాఠశాలల్లోనే దళితులకు సరైన విద్య, ఆహారం లభిస్తాయి. ఈ బడ్జెట్లో కుల నిర్మూలన కోసం, కులాంతర వివాహితుల రక్షణ కోసం కూడా కేటాయింపులు తప్పకుండా అవసరం. కుల నిర్మూలనను ఒక ఉద్యమంగా చేపట్టడం వల్ల సమాజంలో విస్తృతమైన మార్పులు వస్తాయనీ, సామాజిక సమతుల్యత ఏర్పడుతుందనీ అంబేడ్కర్ స్పష్టం చేశారు. అందుకే సాంఘిక స్వాతంత్య్రాన్ని, మేధా స్వాతంత్య్రాన్ని, ఆర్థిక స్వాతంత్య్రాన్ని, రాజకీయ స్వాతంత్య్రాన్ని ప్రజలకు కలిగించాలంటే దానికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు ఉండాలని సూచించారు. దేశ బడ్జెట్ అనేది ఉత్పత్తి శక్తుల మానసిక, శారీరక సౌష్టవాన్ని పెంచే దిశగా ఉండాలన్నారు. తాగుడు, సిగరెట్, ఇతర వ్యసనాల నుండి దూరం చేసే నైతిక అధ్యయన కేంద్రాలు పెంచడం వల్ల సంపద మిగులు ఏర్పడుతుందని చెప్పారు. యువకుల నైపుణ్యాలను పెంచే కేంద్రాలను పెంచడం వల్ల వాళ్లు ఏ రంగంలోనైనా అభివృద్ధి చెందగలుగుతారనీ, ఆధీనత భావాన్ని తగ్గించే దిశగా బడ్జెట్ ఉండాలనీ సామాజిక, ఆర్థికవేత్తలు కోరుతున్నారు. శ్రమ నుండే మానవాళి అభివృద్ధి జరుగుతుంది. శ్రమ నుండే చైతన్యం వస్తుంది. ప్రభుత్వం ఎన్ని సబ్సిడీలు కల్పించినా ప్రజలు ఆర్థికాభివృద్ధి చెందరు. వారిలో ఉత్సాహాన్ని, జీవన భద్రతని కల్పించాలంటే వారు చేసే పనికి ప్రతిఫలం లభించాలి. ‘ప్రభుత్వం ఏదైనా ఇస్తే బతుకుదాం’ అనే పరిస్థితుల్లోకి ప్రజలు నెట్టబడుతున్నారు. దీని వల్ల చాలా నష్టం కలగడమే కాక జాతుల్లో అలసత్వం పెరిగే ప్రమాదం ముంచుకొస్తుందని అంబేడ్కర్ ప్రజలకు ఉద్బోధించారు. నిజానికి ఆయన భూమిని జాతీయం చేయండి, పరిశ్రమలను జాతీయం చేయండి అని పిలుపును ఇచ్చిన మేధావి. భారతదేశంలో అణగారిన సామాజిక వర్గాలు అభివృద్ధి చెందితేనే ప్రపంచవ్యాప్తమైన ఆర్థికాభివృద్ధిలో భారతదేశం భాగస్వామ్యం కాగలుగుతుందని చెప్పారు. విద్య, విజ్ఞానం, ఉత్పత్తి, భూపంపిణీ, సామాజిక అభివృద్ధి, పారిశ్రామికీకరణ, స్త్రీ అభివృద్ధి, యువశక్తి వినియోగం, వృద్ధుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ, నదుల అనుసంధానం... వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరిగినపుడు భారతదేశం నిజమైన వికాసాన్ని, ప్రాభవాన్ని పొందుతుందని చెప్పారు. ఆ దిశగా పాలకులు, ప్రజలు నడుస్తారని ఆశిద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
సెన్సెక్స్ రోలర్ కోస్టర్
ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఎన్నికల ఫలితాలు బీజేపీ, ఎన్డీయే కూటమిని బిత్తరపోయేలా చేశాయి. అయితే, మిత్రపక్షాల దన్నుతో మళ్లీ సుస్థిర ఎన్డీయే సర్కారు కొలువుదీరడంతో మార్కెట్ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఫలితాల రోజున నష్టాలన్నింటినీ మూడు రోజుల్లోనే ఎగిరిపోయాయి. వృద్ధికి ఊతమిచ్చేలా 100 రోజుల అజెండాను ప్రకటించిన మోదీ ‘హ్యాట్రిక్’ ప్రభుత్వ చర్యలు ఇన్వెస్టర్లలో మళ్లీ ఉత్సాహా న్ని నింపాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాటను వీడి మళ్లీ కొనుగోళ్ల రూట్లోకి రావడం కూడా మార్కెట్‌కు మరింతి ఇం‘ధనాన్ని’ అందించింది. రాబోయే కాలంలో మౌలిక రంగ ప్రాజెక్టులపై మోదీ సర్కారు భారీగా ఖర్చు చేయనుండటం, బడ్జెట్లో వృద్ధికి ఊతమిచ్చేలా పలు చర్యలు ఉంటాయన్న అంచనాలతో మార్కెట్లో ర్యాలీ కొనసాగుతోంది. తాజాగా 80,000 పాయింట్ల శిఖరాన్ని కూడా దాటేయడం దీనికి నిదర్శనం. కాగా, ఈ ఏడాది చివరికల్లా సెన్సెక్స్ 90,000 పాయింట్లను తాకే అవకాశాలు మెండుగా ఉన్నా యని సుందరం మ్యూచువల్ ఫండ్ మాజీ ఎండీ సునీల్ సుబ్రమణ్యం అంచనా వేయడం విశేషం. దీనికి ప్రధానంగా లార్జ్ క్యాప్ షేర్ల ర్యాలీ దన్ను గా నిలుస్తుందని కూడా ఆయన చెబుతున్నారు. కాగా, ఇన్వెస్టర్ల సంపద గత నెల రోజుల్లోనే రూ. 50 లక్షల కోట్లు దూసుకెళ్లింది. జూన్ 4నరూ.395 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జూలై 3న రూ.445.5 లక్షల కోట్లకు ఎగబాకడం గమనార్హం!జూన్ 4: ఎన్డీయేకు బంపర్ మెజారిటీ ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ముందు రోజు 2,500 పాయింట్ల ర్యాలీ చేసి మార్కెట్ ఫుల్ జోష్ మీదుంది. అయితే, తెల్లారేసరికి అంచనాలు తారుమారయ్యాయి. మార్కెట్‌కు ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఊహించన్ని షాకిచి్చంది. బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కష్టమేనని తేలిపోవడంతో దేశీ స్టాక్ మార్కెట్‌పై అమ్మకాల సునామీ విరుచుకుపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 6,234 పాయింట్లు దిగజారి ఏకంగా 70,234 పాయింట్లకు కుప్పకూలింది. చివరికి 4,390 పాయింట్ల భారీ నష్టంతో 72,079 వద్ద ముగిసింది.కట్ చేస్తే... జూలై 3: ఎన్నికల ఫలితాలతో బుర్రతిరిగిన బుల్.. మళ్లీ రంకెలేస్తూ దూసుకుపోయింది. సరిగ్గా నెల రోజుల వ్యవధిలో (ఫలితాల రోజు కనిష్ట స్థాయితో పోలిస్తే) దాదాపు 10,000 పాయింట్ల ర్యాలీతో దుమ్మురేపింది. చరిత్రలో తొలిసారి 80,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. రోజుకో సరికొత్త రికార్డులతో హోరెత్తిస్తోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అంతా సిద్ధమేనా?
భారత న్యాయశాస్త్ర చరిత్రలో మొన్న జూలై 1న ఒక కొత్త అధ్యాయం మొదలైంది. బ్రిటీషు కాలం నాటి నేర చట్టాల స్థానంలో మూడు కొత్త చట్టాలను మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. భారత శిక్షాస్మృతి– 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్– 1973, భారతీయ సాక్ష్యాల చట్టం – 1872... ఈ మూడింటి బదులు ‘భారతీయ న్యాయ సంహిత’, ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ‘భారతీయ సాక్ష్య అధినియమ్’లు సోమవారం నుంచి ఆచరణలోకి వచ్చాయి. అయితే, న్యాయకోవిదుల మొదలు సాధారణ కక్షిదారుల వరకు ఈ కొత్త చట్టాలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. నేరన్యాయవ్యవస్థను ఆధునికీకరించడంలో ఈ కొత్త చట్టాలు గణనీయమైన ముందడుగు అని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు పాతవాటికి పైపై మెరుగులు దిద్ది, అమానుషంగా మార్చారని విమర్శిస్తున్నారు. పోలీస్స్టేషన్ల నుంచి కోర్టుల దాకా అన్నిటా పనితీరును మార్చేసి, సామాన్యులపై పెను ప్రభావం చూపే ఈ శాసనాలపైనే ఇప్పుడు దేశమంతటా చర్చ సాగుతోంది. కొత్త నేర చట్టాల వ్యవహారం సహజంగానే అధికార బీజేపీకీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌కూ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. వలసవాద పాలన తాలూకు అవశేషాలను వదిలించుకొనే ఈ ప్రయత్నం దేశపురోగతికీ, స్థితిస్థాపకతకూ ప్రతీక అన్నది బీజేపీ మాట. కాంగ్రెస్ మాత్రం గడచిన ప్రభుత్వ హయాంలో పార్లమెంట్లో ఏకంగా 146 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెండైన వేళ, కేవలం మూజువాణి ఓటుతో బలవంతాన ఈ చట్టాలకు ఆమోదముద్ర వేశారనీ, పార్లమెంటరీ వ్యవస్థలో ఈ రకమైన ‘బుల్డోజర్ న్యాయాన్ని’ తమ ప్రతిపక్ష కూటమి సహించబోదనీ పేర్కొంది. శతాబ్ద కాలానికి ముందెప్పుడో బ్రిటీషు హయాంలో చేసిన చట్టాలు శిక్షల మీద ప్రధానంగా దృష్టి పెడుతుంటే, ఈ కొత్త చట్టాలు మటుకు అందరికీ న్యాయం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తాయనేది అధికార పక్షం కథనం. కానీ, ఆ మాటలతో ప్రతిపక్షాలే కాదు... చివరకు పలువురు న్యాయశాస్త్ర నిపుణులు సైతం విభేదిస్తుండడం గమనార్హం. ఇంకా చెప్పాలంటే, సరికొత్త శాసనాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎంతైనా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, మారుతున్న సమాజ పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా పాతకాలపు చట్టాలను మార్చాలన్న ఆలోచన మంచిదే. ప్రస్తుతం విచారణలోని ఖైదీలు లెక్కకు మిక్కిలిగా జైళ్ళలో మగ్గిపోతున్నారు. అసంఖ్యాకంగా బాధితులు న్యాయం కోసం ఏళ్ళ తరబడి నిరీక్షిస్తున్నారు. లక్షల కొద్దీ కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేర న్యాయవ్యవస్థలో సంస్కరణలు అత్యవసరం. అయితే, అందుకు గడచిన మోదీ సర్కార్ హడావిడిగా అనుసరించిన పద్ధతి, తగిన చర్చకు తావివ్వకుండా పార్లమెంట్లో చూపిన ఆధిపత్యం, చేసిన మంచి సూచనల్నీ – చెప్పిన అభ్యంతరాలను సైతం పట్టించుకోని తెంపరితనంతోనే అసలు చిక్కంతా! అసలు 2020 జూలైలోనే కేంద్ర హోమ్ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల సంఘం వైవాహిక అత్యాచారం మొదలు కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేయడం, రాజద్రోహ నేరంపై పునస్సమీక్ష లాంటి అనేక అంశాలపై పౌరులకు వివరమైన ప్రశ్నావళిని జారీ చేసింది. అయితే, కరోనా కాలంలోనే సంప్రతింపుల ప్రక్రియలో అధిక భాగం జరిగింది. అడిగిన, ఆశించిన భారీ మార్పులేమీ లేకుండానే కొత్త చట్టాలు వచ్చేశాయి. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ఏకంగా 14 రోజుల పాటు పోలీసు అధికారి ప్రాథమిక దర్యాప్తు చేయవచ్చనడం, పోలీసు కస్టడీ కాలవ్యవధిని 15 రోజుల నుంచి అనేక వారాలు పెంచేయడం, చేతులకు బేడీలు సహా కొన్ని అంశాల్లో పోలీసులకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడం లాంటివి ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. అలాగని కొత్త చట్టాల్లో ఏ మంచీ లేదనలేం. కొన్ని ముందడుగులు పడ్డాయి. కొన్ని రకాల నేరాల్లో శిక్షకు ప్రత్యామ్నాయంగా సామాజిక సేవ చేయడాన్ని ప్రవేశపెట్టారు. అలాగే, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణలకూ వీలు కల్పించారు. త్వరితగతిన విచారణలు పూర్తయ్యేలా నిర్ణీత కాలవ్యవధులను నిర్ణయించడం మరో మంచి ప్రయత్నం. అయితే, చట్టాలకు అన్ని ప్రాంతాలకు అర్థమయ్యే ఇంగ్లీష్ పేర్లు పెట్టనే లేదు. ప్రాంతీయ భాషల్లో అనువాదం పూర్తి కానేలేదు. రాష్ట్రాలు స్థానికంగా అవసరమైన మార్పులు చేసుకోవచ్చంటున్నా, చిక్కులున్నాయి.ఏమైనా, కొత్త చట్టాల అమలు సైతం సవాలే. దశాబ్దాలుగా అలవాటైపోయిన సెక్షన్లు, చట్టాలను ఒక్కసారిగా మార్చేయడం ఇతర సమస్యలు తెచ్చింది. ఏ నేరానికి ఏ సెక్షన్ ఎంతమేరకు వర్తిస్తుందో ఇప్పటికిప్పుడు చటుక్కున అర్థం కాని పరిస్థితి. పోలీసు, న్యాయ వ్యవస్థలు కొత్త పద్ధతులకు ఏ మేరకు సుశిక్షితమైనదీ చెప్పలేం. అన్నీ అర్థమై, అలవాటయ్యే వరకు చట్టాల అమలు సంస్థలు, జడ్జీలు, లాయర్ల నుంచి కక్షిదారుల వరకు అందరికీ గందరగోళమే. అలాగే జూలై 1కి ముందు కేసులను పాత చట్టాలతో, ఆ తరువాతి కేసులను కొత్త చట్టాలతో విచారించాల్సి ఉంటుంది. ఇప్పటికీ లక్షల కొద్దీ పాత కేసులు పెండింగ్‌లో ఉన్నందున చాలాకాలం రెండు రకాల చట్టాలనూ అనుసరించాల్సి వస్తుంది. ఇది మరో పెద్ద చిక్కు. అలాగే, ఏ చట్టాలైనా వ్యక్తిగత స్వేచ్ఛ, పౌరహక్కులకు అండగా నిలిస్తేనే వాటికి విలువ. కొత్త చట్టాలపై ఆ విషయంలోనూ అనేక అనుమానాలున్నాయి. కాబట్టి వీటిపై పార్లమెంట్‌లోనే కాదు... పౌర సమాజంలోనూ విస్తృత చర్చ జరగనివ్వాలి. ఆ స్వరాలకు పాలకులు చెవి ఒగ్గాలి. లోపాలను సరిచేయాలి. వ్యవస్థలో సంస్కరణ ఒక్కరోజులో, ఒక్కసారిగా జరిగేది కాదని గుర్తించి, మార్పులు చేర్పులతో సాగాలి. అందుకిది మొదటి అడుగు అవ్వాలి. -
నీట్‌పై ప్రధాని స్పందించాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, ఇతర వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్–యూజీ ఎంట్రన్స్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న అనుమానాలను ప్రధాని మోదీ నివృత్తి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు డిమాండ్ చేశా రు. తమ పిల్లలు డాక్టర్లు కావాలని కలలుగన్న తల్లి దండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన వ్యవహారంతో నీళ్లు చల్లినట్టయిందని ధ్వజమెత్తారు.బిహార్‌లో రూ.30 లక్షలకు నీట్ ప్రశ్నపత్రాలు విక్ర యించారని, ఈ వ్యవహారంలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ కేంద్రం నిమ్మ కు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆదివారం రాసిన బహిరంగ లేఖలో నీట్ పరీక్షపై పలు సందేహాలను వెలిబుచ్చారు. ప్రతిసారీ విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చా’కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని...నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విచారకరమన్నారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్య లు తీసుకొని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కోరారు. 67 మందికి మొదటి ర్యాంకు ఎలా? నీట్ పరీక్షలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 67 మందికి మొదటి ర్యాంకులు రావడం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని కేటీఆర్ అన్నారు. ఒకే సెంటర్ నుంచి పరీక్ష రాసిన 8 మంది విద్యార్థు లు 720 మార్కులు సాధించడం చూస్తే ..పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు. ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించడం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు.సుప్రీంకోర్టు జోక్యం చేసుకొనేంత వరకు కూడా కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం ఆశ్చ ర్యం కలిగిస్తోందన్నారు. సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎనీ్టఏ) 1,563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు చెబుతోందని.. అంతమందికి ఏ ప్రాతిపదికన గ్రేస్ మార్కులు కలిపారో స్పష్టం చేయడం లేదని ధ్వజమెత్తారు. ఒక్క గ్రేస్ మార్కుల అంశమే కాకుండా పేపరే లీకేజీ ఆరోపణలపైనా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్, బిహార్ లో అవకతవకలకు పాల్పడిన కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారని.. వరుసగా బయటపడుతున్న వివాదస్పద వ్యవహారాల కారణంగా పరీక్ష తీరుపై అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు.తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నష్టం తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని, గ్రేస్ మార్కులు, పేపర్ లీకేజీ వల్ల వారు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని కేటీఆర్ అన్నారు. వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు మన రాష్ట్ర ఎంపీలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించేలా రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. -
ఎన్డీఏ సర్కారు త్వరలోనే కూలుతుంది: ఖర్గే
బెంగళూరు: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున మూడోసారి అధికారంలోకి వచి్చందని, త్వరలోనే కుప్పకూలుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున అధికారంలోకి వచి్చంది. ప్రజల తీర్పు మోదీకి అనుకూలంగా లేదు. ఈయనది మైనారిటీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అతిత్వరలో కుప్పకూలుతుంది’అని పేర్కొన్నారు. ‘దేశ క్షేమం కోసం ఈ ప్రభుత్వం కొనసాగాలనే కోరుకుంటున్నాం. దేశాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తాం. కానీ, మన ప్రధానికి సవ్యంగా కొనసాగే ఏ పనికైనా అవాంతరం కల్పించడం అలవాటు. అయినప్పటికీ దేశం కోసం మేం సహకారం అందిస్తూనే ఉంటాం’అని ఖర్గే అన్నారు. భాగస్వామ్య పక్షాలను ఏకతాటిపై ఉంచడంలో బీజేపీ ఇబ్బందులను ఎదుర్కొంటోందంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్ చీఫ్ పైవిధంగా వ్యాఖ్యానించారు. ఖర్గే వ్యాఖ్యలపై ఎన్డీఏ పక్షాలైన జేడీయూ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ), హిందుస్తానీ ఆవామ్ మోర్చా(హెచ్ఏఎం) తీవ్రంగా స్పందించాయి. గతంలో కాంగ్రెస్ సారథ్యంలో పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌ల ప్రభుత్వాలు ఎలా కొనసాగాయో చరిత్ర చెబుతోందని ఖర్గేను ఎద్దేవా చేశాయి. కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పడిన మైనారిటీ ప్రభుత్వం పీవీ నరసింహారావు రాజకీయ చతురతతో రెండేళ్లలోనే మెజారిటీ ప్రభుత్వంగా మారిందని జేడీయూ తెలిపింది. ఇటీవలి ఎన్నికల్లో ఇండియా కూటమి పక్షాలు పొరపాటున కొంత బలం పుంజుకున్నాయని, ప్రతిపక్ష పోషించాలని రిపబ్లికన్ పార్టీ, హెచ్ఏఎంలు ఖర్గేకు సలహా ఇచ్చాయి. -
పార్లమెంట్ సమావేశాలు
-
Raksha Khadse: సర్పంచ్ నుంచి సెంట్రల్ మినిస్టర్ వరకూ
తాజా ఎన్.డి.ఏ. మంత్రి వర్గంలో 71 మంది ప్రమాణ స్వీకారం చేస్తే ఏడుగురే స్త్రీలు. వారిలో అందరి కంటే చిన్నది రక్ష ఖడ్సే. 37 సంవత్సరాల రక్ష భర్తను కోల్పోయాక రాజకీయాల్లోకి వచ్చింది. సింగిల్ పేరెంట్‌గా ఉంటూనే సర్పంచ్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకూ ఎదిగింది. మహారాష్ట్ర ఎం.పి. అయిన రక్షకి ప్రజాభిమానం మెండుగా ఉంది. ఆమె స్ఫూర్తిదాయక కథనం.రాజకీయ కుటుంబంలో కోడలుగా అడుగు పెట్టిన అమ్మాయికి రాజకీయాలు ఎంత నాటకీయంగా ఉంటాయో, పదవి విషయంలోనే కాదు జీవితంలో కూడా గెలుపు ఓటములు ఎంత ఖేద మోదాలు కలిగిస్తాయో మెల్లగా తెలిసి వచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో మహారాష్ట్రలోని రావెర్ స్థానం నుంచి మూడోసారి బి.జె.పి. తరఫున గెలిచి, కేంద్రమంత్రిగా మొదటిసారి ప్రమాణం చేసిన రక్ష ఖడ్సే ఆ ఎత్తుకు చేరడానికి తీవ్ర సవాళ్లనే ఎదుర్కొంది. కాని ఓడిపోలేదు. ఆగిపోలేదు. ధైర్యం కూడగట్టుకుని చేసిన ప్రయాణమే గెలుపు తీరానికి చేర్చింది.భర్త ఆత్మహత్యతో...మహారాష్ట్రలోని నాసిక్‌లో కంప్యూటర్ సైన్స్ చదువుకున్న రక్ష ఖడ్సే జలగావ్‌కు చెందిన రాజకీయ కుటుంబంలో కోడలిగా వచ్చింది. ఆమె మామగారు ఏక్నాథ్ ఖడ్సే బి.జె.పి.లో ప్రముఖ నాయకుడు. మంత్రిగా కూడా పని చేశాడు. అతని కుమారుడు నిఖిల్‌తో రక్ష వివాహం జరిగింది. రక్షకు రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేకపోయినా 2010లో జనం ‘కొథాలి’ అనే ఊరికి సర్పంచ్‌ను చేశారు. ఆ తర్వాత ఆమె జిల్లా పరిషత్ స్థాయి నాయకురాలైంది. కాని 2013లో జీవితం తల్లకిందులైంది. 2013 శాసనమండలి ఎన్నికలలో కేవలం 500 ఓట్ల తేడాతో ఓడిపోయినందుకు మనస్తాపం చెందిన రక్ష భర్త నిఖిల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది తెలిసి తండ్రి ఏక్నాథ్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. ఇద్దరు చిన్న పిల్లలతో రక్ష మొత్తం కుటుంబానికే ఊతంగా నిలబడాల్సి వచ్చింది.అత్తింటి ఆదరణతో...భర్త చనిపోయినా అత్తింటిని రక్ష వీడలేదు. అత్తింటి వారు ముఖ్యంగా మామగారు ఆమెను కన్నకూతురిలా ఆదరించి రాజకీయాలలో ్రపోత్సహించాడు. 2014 ఎన్నికలలో రావేర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె ఘన విజయం సాధించింది. భర్త చనిపోయిన సంవత్సరానికే ఇద్దరు చిన్న పిల్లలను తీసుకుని ఆమె సాగించిన ప్రచారం ఆ రోజుల్లో పెద్ద ఆసక్తిని రేపింది. జనం ఆమెకు మద్దతుగా నిలిచి గెలిపించారు. ఐదేళ్ల కాలంలో వ్యవసాయం, విద్యావ్యవస్థ కోసం రక్ష చేసిన కృషి జనానికి నచ్చడంతో 2019లో కూడా రావేర్ నుంచి ఎం.పి.గా ఘనంగా గెలిపించారు.ప్రత్యర్థిగా మామగారురక్ష మామగారైన ఏక్‌నాథ్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో వచ్చిన విభేదాలు బి.జె.పి.ని వీడేలా చేశాయి. ఆయన ఎన్‌సిపి (శరద్‌పవార్) వర్గంలో చేరి ఎం.ఎల్.సి. అయ్యాడు. కాని రక్ష బి.జె.పి.లోనే కొనసాగింది. 2024 ఎన్నికలలో రావేర్ నుంచి రక్ష నిలబడుతున్నప్పుడు శరద్ పవార్ వర్గం ఏక్నాథ్ను ప్రత్యర్థిగా నిలపాలనుకున్నాయి. కాని కోడలి విజయం కోరిన ఏక్నాథ్ తాను పోటీలో నిలవనని దూరంగా ఉండిపోయాడు. దాంతో ఎన్.సి.పి. అభ్యర్థి శ్రీరామ్ పాటిల్ పై రక్షా ఖడ్సే రెండు లక్షల డెబ్బయి వేల మెజారిటీతో గెలిచింది. పిల్లల కోసం...పిల్లలను ముంబైలో చదివిస్తున్న రక్షా ఖడ్సే ప్రతి శని, ఆదివారాలు వారి దగ్గరకు వెళ్లి సమయం గడుపుతుంది. ‘పిల్లలను ముంబైలో ఉంటున్న మా ఆడపడుచులు బాగా చూసుకుంటారు. కాబట్టి నాకు టెన్షన్ లేదు. ప్రజలకు మేలు చేయాలన్నదే నా లక్ష్యం. మా ్రపాంతంలో ఇంకా సాగునీటి వసతి చాలా చోట్ల లేదు. దేశానికి అవసరమైన అరటిలో 35 శాతం మా దగ్గరే పండుతుంది. వ్యవసాయాన్ని ఇంకా వృద్ధి చేయడంలో నేను కృషి చేస్తాను. కేంద్ర మంత్రిగా ఇప్పుడు నా బాధ్యత పెరిగింది. ఏ శాఖ ఇచ్చినా సమర్థంగా పని చేసి నిరూపించుకుంటాను’ అని తెలిపింది రక్షా ఖడ్సే. -
కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులో మోదీ మార్క్!
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్రంలో కొత్త కేబినెట్ కొలువుదీరే సమయం వచ్చింది. ప్రధాని మోదీ సహా కొత్త మంత్రులంతా ఇప్పటికే ప్రమాణం చేసేశారు కూడా. మరి ఎవరెవరికి ఏ శాఖ ఇస్తారనేదానిపై స్పష్టత వచ్చేది ఎప్పుడు?. మోదీ మార్క ఉండనుందా? అనే చర్చ మొదలైంది. ఇవాళ(సోమవారం, జూన్ 10) సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ భేటీలోపు లేదంటే ఈ భేటీలోనే కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు ఉండనుందని తెలుస్తోంది. అంతేకాదు.. వంద రోజుల యాక్షన్ ప్లాన్ మీద తొలి కేబినెట్ సమావేశంలో మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తారని సమాచారం. మరోవైపు.. భాగస్వామ్య పక్షాల ఆశిస్తున్న శాఖల అంశాన్ని పరిగణలోకి తీసుకున్న బీజేపీ.. వ్యూహాత్మక నిర్ణయంతోనే ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, రైల్వే, రవాణా శాఖలను తమ దగ్గరే అంటిపెట్టుకోనుంది బీజేపీ. అలాగే.. మూడో దఫా ప్రభుత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్, మౌలిక వసతులపై ప్రధాన ఫోకస్ ఉంటుందనే గతంలోనే ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో.. దీని పరిధిలోకి వచ్చే శాఖలు కూడా బీజేపీ చేతిలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. మంత్రి వర్గ కూర్పులో ప్రధాని మోదీ కులసమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అలాగే.. త్వరలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక కొత్త మంత్రుల్లో 27 మంది బీసీలు ఉన్నారు. ఐదుగురు మైనారిటీలు, ఏడుగురు మహిళలు ఉన్నారు. యువత, సీనియర్ల కాంబినేషన్లో మోదీ మార్క్‌తో బెర్తులు ఉంటాయనేది తెలుస్తోంది. ఇక.. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు సైతం తమ తమ ప్రయోజనాల దృష్ట్యా శాఖల్ని డిమాండ్ చేశాయి. జేడీఎస్ కుమారస్వామి వ్యవసాయ శాఖ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే శాఖల్ని కోరామని మరో మిత్రపక్షం టీడీపీ ఇది వరకే ప్రకటించుకుంది. అలాగే..జేడీయూ, ఇతర పార్టీలు సైతం పలు శాఖల్ని డిమాండ్ చేసినట్లు తెలియవస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీయే ఎంపీల సమావేశం జరుగుతున్న టైంలోనే.. మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మిత్రపక్ష నేతలతో మంత్రివర్గ కూర్పు, ఎవరికి ఏయే శాఖల వంటి అంశాలపై చర్చలు జరిగి, ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.నిన్న రాత్రి 72 మంది మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇందులో 30 మంది మంత్రివర్గంలోకి, ఐదుగురికి స్వతంత్ర మంత్రులుగా, అలాగే.. 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. 43 మంది మూడుకంటే ఎక్కువసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అలాగే.. ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులను తీసుకోవడం గమనార్హం. అలాగే.. తెలుగు రాష్ట్రాల తరఫున తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ముగ్గురి మంత్రి వర్గంలో చోటు దక్కింది. విశేషం ఏంటంటే.. కేంద్ర కేబినెట్లో ఇంకా ఖాళీగానే 9 బెర్తులు ఉండడం. -
సహాయ మంత్రి మాకొద్దు: ఎన్సీపీ
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ ఇవ్వజూపిన సహాయమంత్రి (స్వతంత్ర హోదా) పదవిని భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ తిరస్కరించారు. కేంద్రంలో ఇప్పటికే ఒకసారి కేబినెట్ మంత్రిగా పనిచేసిన తాను సహాయమంత్రి పదవిని తీసుకోవడం అంటే స్థాయిని తగ్గించుకోవడమేనని ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ అగ్ర నాయకత్వానికి తెలపగా మరో ప్రత్యామ్నాయం దొరికే వరకు వేచి ఉండాలని తనను కోరారని వివరించారు. భవిష్యత్తులో జరిగే విస్తరణలో ఎన్సీపీకి కేబినెట్ హోదా పదవి లభిస్తుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ చెప్పారు. పార్లమెంట్లో ఎన్సీపీకి ఇద్దరు సభ్యులున్నారు. ప్రఫుల్ పటేల్ రాజ్యసభలో, సునీల్ తత్కారే లోక్‌సభలో సభ్యులుగా ఉన్నారు. -
కేంద్ర కేబినెట్: మోదీ 3.0 మంత్రులు వీరే..
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ ఖరారైంది. ఆదివారం ఉదయం నరేంద్ర మోదీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందు ఇచ్చారు. ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందుకున్న 50 మంది ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాబోయే మంత్రుల సమావేశంలో.. వంద రోజుల యాక్షన్ ప్లాన్ గురించి మోదీ వివరించినట్లు తెలుస్తోంది. అలాగే.. వికసిత భారత్ ఎజెండా పై కొత్త మంత్రులకు మోదీ బ్రీఫ్ చేసినట్లు సమాచారం. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలకు మరోసారి కేబినెట్ పదవులు దక్కాయి. వాళ్లకు పాత శాఖల్నే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. కీలక శాఖల్ని కూడా బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం. నిర్మలా సీతారామన్, జైశంకర్, పాత కేబినెట్లో ఉన్న తదితరులు మళ్లీ కేబినెట్లో చోటు దక్కించుకోబోతున్నారు. మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్‌లాల్ ఖట్టర్‌లకు కేబినెట్లో చోటు దక్కింది.రాష్ట్రపతి భవన్లో ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా... మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సంకీర్ణ సర్కార్ కేబినెట్లో భాగస్వామ్య పార్టీల ఎంపీలు కూడా భాగం కానున్నారు.కేబినెట్లో బీజేపీ నుంచి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుక్ మండవియ,రావు ఇంద్రజిత్ సింగ్‌లకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా ఐదుగురికి కేబినెట్లో స్థానం లభించింది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది. ఒకే వాహనంలో ఈ ఇద్దరూ మోదీ నివాసానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నర్సాపూర్ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు కేబినెట్ బెర్త్ దక్కింది. మోదీ నివాసంలో తేనీటి విందుకు ఈయన కూడా హాజరయ్యారు. రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్(టీడీపీ), కుమార స్వామి (జేడీఎస్), లలన్ సింగ్(జేడీయూ), సహాయ మంత్రిగా రామ్ నాత్ ఠాకూర్(జేడీయూ), జితిన్ రామ్ మాంజీ( హిందూస్తాన్ ఆవం మోర్చా), జయంత్ చౌదరి(ఆర్ఎల్డీ) ప్రతాప్ రావ్ జాదవ్(శివసేన), ప్రఫుల్ పటేల్(అజిత్ పవార్ ఎన్సీపీ), అనుప్రియా పాటిల్(అప్నాదళ్), రామ్‌దాస్ అత్వాలే(ఆర్పీఐ)లకు చోటు దక్కింది. సాయంత్రం కల్లా కేంద్ర కేబినెట్‌పై.. వాళ్ల వాళ్ల శాఖలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ 50 మంది మోదీతో పాటే ప్రమాణం చేస్తారని సమాచారం.నరేంద్ర మోదీ(ప్రధాన మంత్రి)అమిత్ షారాజ్‌నాథ్ సింగ్నితిన్ గడ్కరీఎస్ జైశంకర్పీయూష్ గోయల్ప్రహ్లాద్ జోషిజయంత్ చౌదరిజితన్ రామ్ మాంఝీరామ్నాథ్ ఠాకూర్చిరాగ్ పాశ్వాన్హెచ్డీ కుమారస్వామిజ్యోతిరాదిత్య సింధియాఅర్జున్ రామ్ మేఘవాల్ప్రతాప్ రావ్ జాదవ్రక్షా ఖడ్సేజితేంద్ర సింగ్రాందాస్ అథవాలేకిరణ్ రిజుజురావ్ ఇంద్రజీత్ సింగ్శంతను ఠాకూర్మన్సుఖ్ మాండవియాఅశ్విని వైష్ణవ్బండి సంజయ్జి కిషన్ రెడ్డిహర్దీప్ సింగ్ పూరిబి ఎల్ వర్మశివరాజ్ సింగ్ చౌహాన్శోభా కరంద్లాజేరవ్నీత్ సింగ్ బిట్టుసర్బానంద సోనోవాల్అన్నపూర్ణా దేవిజితిన్ ప్రసాద్మనోహర్ లాల్ ఖట్టర్హర్ష్ మల్హోత్రానిత్యానంద రాయ్అనుప్రియా పటేల్అజయ్ తమ్తాధర్మేంద్ర ప్రధాన్నిర్మలా సీతారామన్సావిత్రి ఠాకూర్రామ్ మోహన్ నాయుడు కింజరాపుచంద్రశేఖర్ పెమ్మసానిమురళీధర్ మొహల్కృష్ణపాల్ గుర్జర్గిరిరాజ్ సింగ్గజేంద్ర సింగ్ షెకావత్శ్రీపాద్ నాయక్సి.ఆర్.పాటిల్ -
నేడు మోదీ మూడోసారి
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ 3.0 ఆదివారం నుంచి మొదలుకానుంది. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా... మిత్రపక్షాలతో కలిపి ఎడ్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సొంతంగా మెజారిటీ లేని నేపథ్యంలో మంత్రిపదవులపై మిత్రుల డిమాండ్లను తీర్చడం బీజేపీకి కత్తిమీద సాములా మారింది. శనివారం కూడా బీజేపీ సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మిత్రపక్షాలతో సంప్రదింపులు కొనసాగించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (16 సీట్లు), జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ (12 సీట్లు), శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే (7 సీట్లు)లతో మంత్రి పదవులపై చర్చలు జరిపారు. పెద్దశాఖలైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలతో పాటు సైద్ధాంతికంగా కీలకమైన విద్య, సాంస్కృతిక శాఖలను బీజేపీయే అట్టిపెట్టుకుంటుందని భావిస్తున్నారు. మొదటి విడతలో మిత్రపక్షాలకు ఐదు నుంచి ఎనిమిది మంత్రి పదవులు దక్కవచ్చని సమాచారం. టీడీపీకి ఒక కేబినెట్, ఒక సహాయమంత్రి టీడీపీ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ పదవి దక్కనుంది. పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయమంత్రి పదవి లభిస్తుందని విశ్వసనీయవర్గాల సమాచారం. రెండు పారీ్టలు టీడీపీ, జేడీయూలకు ఒక్కో కేబినెట్, ఒక్కో సహాయమంత్రి పదవులు ఇవ్వనున్నారు. జేడీయూ నుంచి లలన్ సింగ్, సంజయ్ ఝాలలో ఒకరు కేబినెట్ మంత్రిగా, రామ్‌నాథ్ ఠాకూర్ సహాయమంత్రిగా ఆదివారం మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. లోక్ జనశక్తి (రాంవిలాస్) నుంచి ఆ పార్టీ ఆధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌కు కేబినెట్లో చోటు దక్కనుంది. ఢిల్లీకి చేరుకున్న హసీనా మోదీ ప్రమాణస్వీకారంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ శనివారమే ఢిల్లీ చేరుకున్నారు. నేపాల్ ప్రధాని ప్రచండ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్‌కుమార్ జుగ్నాథ్, భూటాన్ ప్రధాని తెర్సింగ్ టోబ్గేలు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మోదీ 3.0ను సెలబ్రేట్ చేసుకునేందుకు అమెరికాలోని 22 నగరాల్లో బీజేపీ మద్దతుదారులు ఏర్పాటు చేస్తున్నారు. న్యూయార్క్, జెర్సీ సిటీ, వాషింగ్టన్ డీసీ, బోస్టన్, అట్లాంటా, హూస్టన్, డల్లాస్, షికాగో, లాస్ఏంజెలెస్, శాన్ఫ్రాన్సిస్కో తదితర నగరాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ– యూఎస్ఏ అధ్యక్షుడు అడపా ప్రసాద్ తెలిపారు. భారతీయ రైల్వేస్‌కు చెందిన పది మంది లోకో పైలట్లను ప్రమాణస్వీకారానికి ఆహా్వనించారు. ఇందులో భారత తొలి మహిళా లోకోపైలట్ సురేఖ యాదవ్ ఉన్నారు. రాష్ట్రపతి భవన్లో వీవీఐపీలకు, కాబోయే మంత్రులకు ప్రత్యేక ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం ముగిశాక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అతిథులకు విందు ఇవ్వనున్నారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల నిషేధాజ్ఞలు విధించారు. ఆది, సోమవారాల్లో దేశ రాజధానిని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. మాకింకా ఆహ్వానం రాలేదు: కాంగ్రెస్ మోదీ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంకా ఎలాంటి ఆహ్వానాలు అందలేదని పార్టీ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ శనివారం రాత్రి చెప్పారు. ఆహ్వానాలు వస్తే హాజరు కావడంపై ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. -
సమన్వయ కమిటీ! నితీశ్ సారథ్యంలో సీఎంపీ: జేడీయూ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ సర్కారు మనుగడకు కీలకంగా మారిన భాగస్వామ్య పక్షాలు బీజేపీ ముందు పలు డిమాండ్లు పెడుతున్నాయి. అందులో భాగంగా ఎన్డీఏ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని జేడీ(యూ) డిమాండ్ చేస్తోంది. దాని కనీ్వనర్‌గా పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఉండాలని కోరుతోంది. అంతేగాక ఎన్డీఏకు కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) ఉండాలని, దాని అమలు కమిటీ సారథ్యాన్ని కూడా నితీశ్‌కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి అదనంగా నాలుగు కేబినెట్ బెర్తులు, బిహార్‌కు ప్రత్యేక హోదా తదితరాలను నితీశ్ ఇప్పటికే బీజేపీ పెద్దల ముందుంచారు. టీడీపీ కూడా నాలుగైదు కేబినెట్, ఒక సహాయ మంత్రి, లోక్‌సభ స్పీకర్ పదవి డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు రావడం తెలిసిందే. టీడీపీ, జేడీ(యూ) డిమాండ్లకు బీజేపీ అంగీకరించడం లేదని తెలుస్తోంది. టీడీపీకి ఒకకేబినెట్, ఒకట్రెండు సహాయ పదవులను ఆఫర్ చేసినట్టు చేసినట్టు సమాచారం. జేడీ(యూ), ఇతర మిత్రపక్షాల డిమాండ్లపై వాటితో చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. -
ఎన్నికలు ఎందుకింత హాటు?
ఎండలు బాబోయ్ ఎండలు... ఏప్రిల్‌లోనే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఇక మే నెల మొదలైతే నిప్పుల కొలిమే! ఎన్నికల సిబ్బందితో పాటు దాదాపు 100 కోట్ల మంది ఓటర్లకు ఈసారి వేసవి సెగ మామూలుగా తగలడం లేదు. ఎన్నికలు ఇలా దంచికొడుతున్న ఎండల్లో జరగడానికి కారణం నూటికి నూరుపాళ్లూ రాజకీయాలే. అవును! తొలి లోక్‌సభ ఎన్నికలు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా చలికాలంలోనే జరిగాయి. 2004లో జరిగిన ముందస్తు ఎన్నికల పుణ్యమా అని 20 ఏళ్లుగా ఇదుగో, ఇలా మండే ఎండల్లో జరుగుతున్నాయి. అక్టోబర్ టు అక్టోబర్... స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా 1951–52లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఈ ప్రక్రియ సుదీర్ఘంగా నడిచింది. నెహ్రూ ప్రధానిగా తొలి లోక్‌సభ 1952 ఏప్రిల్ 17 నుంచి 1957 ఏప్రిల్ దాకా కొనసాగింది. అక్కణ్నుంచి 1980 దాకా లోక్‌సభ ఎన్నికలు జనవరి, ఫిబ్రవరి, లేదంటే మార్చిలోనే జరిగాయి. 1984లో ఇందిర హత్యానంతరం ప్రధాని అయిన రాజీవ్ గాంధీ లోక్‌సభను రద్దు చేయడంతో డిసెంబర్లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. 1989లో సెపె్టంబర్, అక్టోబర్ నెలల్లో జరిగాయి. సంకీర్ణ ప్రభుత్వాలు సరిగా నడవక చివరికి రెండేళ్లకే లోక్‌సభ రద్దయింది. దాంతో 1991 మే, జూన్ నెలల్లో ఎన్నికలు జరిగాయి. ఎండాకాలంలో జరిగిన తొలి ఎలక్షన్లు అవే. 1996లోనూ ఏప్రిల్, మే నెలల్లో ఎండల్లోనే ఎన్నికలు జరిగాయి. రెండేళ్లకే లోక్‌సభ రద్దవడంతో 1998 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. వాజ్‌పేయి సర్కారు 13 నెలలకే కుప్పకూలి 1999లో ఎన్నికలు సెపె్టంబర్, అక్టోబర్ మధ్య జరిగాయి. ఇప్పుడు మనందరినీ ఠారెత్తిస్తున్న ఎండాకాలపు ఎన్నికలకు 2004లో వాజ్‌పేయి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే కారణం. బీజేపీ ఆర్నెల్ల ముందే లోక్‌సభను రద్దు చేసి ఏప్రిల్, మే నెలల్లో మండే ఎండల్లో ఎన్నికలకు వెళ్లింది. అలా ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ మండుటెండల్లో మొదలైన సార్వత్రిక ఎన్నికల సీజన్ ఇప్పటికీ కొనసాగుతోంది. తర్వాత 2009, 2014, 2019లోనూ ఎండా కాలంలోనే ఎన్నికలు జరిగాయి. ఇలా రెండు దశాబ్దాలుగా ఏప్రిల్–జూన్ ఎన్నికల ‘వేడి’ కొనసాగుతూ వస్తోంది. మార్చడం కుదరదా? చట్టప్రకారం లోక్‌సభ గడువు తీరేలోగా ఎన్నికలు జరిగి కొత్త సభ కొలువుదీరాల్సిందే. తదనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఉదాహరణకు ప్రస్తుత 17వ లోక్‌సభ గడువు జూన్ 16తో ముగుస్తుంది. ఆలోపు ఎన్నికల తతంగమంతా పూర్తయి కొత్త సభ్యులతో 18వ లోక్‌సభ కొలువుదీరాలన్నమాట. కనుక ఎన్నికల తేదీలను మరీ ముందుకు, వెనక్కు జరపడం కుదరదు. అంటే మళ్లీ మధ్యంతరమో, ముందస్తు ఎన్నికలో వస్తే తప్ప ఈ షెడ్యూల్ మారబోదు. అప్పటిదాకా మనమంతా ఇలా ఎండల్లో ఓటెత్తకా తప్పదు!! లోక్‌సభ ఎన్నికలు జరిగిన తీరు... ఏడాది పోలింగ్ తేదీలు 1951–52 అక్టోబర్ 25 – ఫిబ్రవరి 21 1957 ఫిబ్రవరి 24 – మార్చి 14 1962 ఫిబ్రవరి 19–25 1967 ఫిబ్రవరి 17–21 1971 మార్చి 1–10 1977 మార్చి 16–20 1980 జనవరి 3–6 1984 డిసెంబర్ 24–28 1989 నవంబర్ 22–26 1991 మే 20 – జూన్ 15 1996 ఏప్రిల్ 27 – మే 7 1998 ఫిబ్రవరి 16–28 1999 సెపె్టంబర్ 5 – అక్టోబర్ 3 2004 ఏప్రిల్ 20 – మే 10 2009 ఏప్రిల్ 16 – మే 13 2014 ఏప్రిల్ 7 – మే 12 2019 ఏప్రిల్ 11 – మే 19 2024 ఏప్రిల్ 19 – జూన్ 1 – సాక్షి, నేషనల్ డెస్క్