సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. లోక్‌సభలో ఆమోదంతో ఈబీసీ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానుంది. 124వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోద ముద్ర పడింది. మూడింట రెండొంతులకు పైగా సభ్యులు ఈబీసీ బిల్లుకు మద్దతు తెలిపారు. సభలో ఉన్నవారిలో కేవలం ముగ్గురు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈబీసీ బిల్లు పాసైనట్లు ప్రకటించారు.
అంతకుముందు సుమారు 5 గంటల పాటు ఈబీసీ బిల్లుపై చర్చ జరిగింది. పలు పార్టీల నేతలు బిల్లుపై అభ్యంతరాలు చెప్పినా...పంతంతో బీజేపీ బిల్లును నెగ్గించుకుంది . ఆర్థికంగా వెనకబడి అగ్రకులాల ప్రజలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సోమవారం మోదీ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. చట్టబద్దత కోసమే ఆర్టికల్ 15,16లకు అదనపు క్లాజ్‌లు జోడించామని కేంద్రం తెలిపింది. అలాగే ఈబీసీల రిజరేషన్లకు సంబంధించిన అర్హత ధ్రువీకణలు రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. బిల్లు ఆమోదం పొందిన అనంతరం లోక్‌సభ నిరవధికంగా వాయిదాపడింది.
Comments
Please login to add a commentAdd a comment