
న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదంతో భారత ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేయడంతో ఈబీసీ రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు విద్యాసంస్థల్లో అగ్రవర్ణపేదలకు 10 శాతం రిజర్వేషన్ లభించనుంది. 124వ రాజ్యంగ సవరణ పేరిట తెచ్చిన ఈ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభల్లో వెనువెంటనే ఆమోదం పొందిన విషయం తెలిసిందే.
ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించినప్పటికీ 2/3 మెజార్టీతో పార్లమెంట్ ఆమోదించింది. మరోవైపు ఈ బిల్లును సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలైంది. ఈ బిల్లుతో కోటా పరిమితి 50 శాతం దాటిపోతుందని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంను ఆశ్రయించింది.
అర్హులు ఎవరంటే..
- అగ్ర కులాల్లోని పేదలను గుర్తించేందుకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. (విశ్వసనీయ సమాచారం ప్రకారం)
- ఐదెకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉండకూడదు
- కుటుంబ వార్షికాదాయం రూ. 8 లక్షలలోపు ఉండాలి
- వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో సొంతిల్లు ఉండొద్దు
- మున్సిపాలిటీల్లో 100 గజాలు, మున్సిపాలిటీ కాని ప్రాంతాల్లో 200 గజాలకు మించిన స్థలాలు ఉండకూడదు.
Comments
Please login to add a commentAdd a comment