సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ : మరో నాలుగు నెలల్లో లోక్‌సభకు సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం సోమవారం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా ఉన్న డిమాండ్‌కు తలొగ్గుతూ అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జనరల్ కోటాగా ఉన్న 50 శాతం నుంచే మరో పది శాతాన్ని పక్కకు తీసి ఈ రిజర్వేషన్లు కల్పిస్తారు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో మార్పు ఉండదు. అగ్ర కులాలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణల బిల్లును కేంద్రం మంగళవారమే పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ప్రభుత్వానికి ఇవే చివరి పూర్తిస్థాయి పార్లమెంటు సమావేశాలు కావడం గమనార్హం. ఇది బీజేపీ ఎన్నికల గిమ్మిక్కు అనీ, మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే జరగుతుందని భయపడి ఉన్నపళంగా రిజర్వేషన్లను తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్ విమర్శించింది. ఈ బిల్లును ఉభయసభలూ మూడింట రెండొంతుల ఆధిక్యంతో ఆమోదించాల్సి ఉంది.
ఈ రిజర్వేషన్లు అమలైతే బ్రాహ్మణ, కమ్మ, కాపు, రాజ్‌పుత్, జాట్, మరాఠా, భూమిహార్ తదితర కులాల్లోని పేదలకు లబ్ధి చేకూరనుంది. కాపులు, మరాఠాలు, జాట్‌లు ఇటీవలి కాలంలో రిజర్వేషన్ల కోసం ఆందోళనలు నిర్వహించడం, అవి హింసాత్మకంగా మారడం తెలిసిందే. గతంలో ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం దాటకూడదు. మిగతా 50 శాతం సీట్లు, ఉద్యోగాలను పూర్తిగా ప్రతిభ ఆధారంగా (జనరల్ కోటా)నే భర్తీ చేయాలి. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలను మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్లా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తంగా 49.5 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లను మరో 0.5 శాతానికి మించి పెంచే వీలు లేదు. ఈ సమస్యను అధిగమించేందుకే కేంద్రం రాజ్యాంగ సవరణ చేపట్టనుంది. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే మొత్తం రిజర్వేషన్ల శాతం దాదాపు 60కి చేరుతుంది. రాజ్యాంగంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ల గురించి ప్రస్తావనేదీ లేదు కాబట్టి అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి. అధికరణం 15, 16లను సవరించడం ద్వారా రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.
కేంద్ర మంత్రి ఒకరు మాట్లాడుతూ ‘బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించాక రాజ్యాంగాన్ని సవరించి, అగ్ర కులాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తాం. ప్రాథమిక హక్కులను అనుసరించి అగ్ర కులాల్లోని వారికి ఈ రిజర్వేషన్లు ఇస్తాం. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు నిబంధన.. రాజ్యాంగాన్ని సవరించకుండా పార్లమెంటును నిలువరించలేదు’అని చెప్పారు. పలువురు బీజేపీ నేతలు ఈ రిజర్వేషన్ల ప్రతిపాదనను స్వాగతించారు. ఈ నిర్ణయం చరిత్రాత్మకమైనదనీ, అందరి తోడుగా అందరి వికాసమనే ప్రభుత్వ విధానంలో ఇది భాగమని పలువురు పేర్కొన్నారు. బీజేపీ మిత్రపక్షం ఎల్జేపీ అధ్యక్షుడు, దళిత నేత రాం విలాస్ పాశ్వాన్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించారు. కేంద్ర మంత్రి, ఆర్‌పీఐ అధ్యక్షుడు రాందాస్ అఠవాలే కూడా ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. నిమ్న, అగ్ర కులాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రజలను మోసం చేసేందుకే: కాంగ్రెస్
ప్రజలను మోసగించేందుకే బీజేపీ ఈ రిజర్వేషన్ల ప్రతిపాదనను తీసుకొచ్చిందనీ, ఆ పార్టీకున్న ఓటమి భయానికి ఇది నిదర్శనమని కాంగ్రెస్ విమర్శించింది. అయితే తాము ఈ బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వీ మాట్లాడుతూ ‘పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు అవసరమైనంత ఆధిక్యం బీజేపీకి లేదన్న విషయం ఆ పార్టీకి బాగా తెలుసు. అయినా దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకే, ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల ముందు ఈ బిల్లు తీసుకొస్తున్నారు. మరి గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు ఏం చేశారు?’అని నిలదీశారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటులో మూడింట రెండొంతుల మంది సభ్యులు మద్దతు తెలపడం తప్పనిసరి. విపక్షాల మద్దతు లేకుండా బీజేపీ ఈ బిల్లును ఆమోదింపజేసుకోవటం అసాధ్యం. అయితే అగ్ర కులాల ఓట్ల కోసం ఈ బిల్లుకు అడ్డుచెప్పే ప్రయత్నాన్ని ఏ పార్టీ చేయబోదని బీజేపీ విశ్వసిస్తున్నట్లు సమాచారం. రిజర్వేషన్ల బిల్లుతో సాధారణ ఎన్నికల్లో అగ్ర కులాల ఓట్లు తమకు గణనీయంగా పడతాయని బీజేపీ భావిస్తోంది.
అర్హులు ఎవరంటే..
- అగ్ర కులాల్లోని పేదలను గుర్తించేందుకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. (విశ్వసనీయ సమాచారం ప్రకారం)
- ఐదెకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉండకూడదు
- కుటుంబ వార్షికాదాయం రూ. 8 లక్షలలోపు ఉండాలి
- వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో సొంతిల్లు ఉండొద్దు
- మున్సిపాలిటీల్లో 100 గజాలు, మున్సిపాలిటీ కాని ప్రాంతాల్లో 200 గజాలకు మించిన స్థలాలు ఉండకూడదు.
Comments
Please login to add a commentAdd a comment