సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా రంగంలో తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలంటూ దేశవ్యాప్తంగా పటేళ్లు, ఠాకూర్లు, రాజ్‌పుత్‌లు, మరాఠాలు గత రెండు, మూడేళ్లుగా ఆందోళన చేస్తున్నా చలించని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనూహ్యంగా అకస్మాత్తుగా అగ్రవర్ణాల వారికి ఉద్యోగ, విద్యారంగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సోమవారం నాడు నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రానున్న 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్షాలు విమర్శించడంలో నిజం లేకపోలేదు.
అగ్రవర్ణాల రిజర్వేషన్లకు సంబంధించి చట్టం తీసుకురావాలంటే రాజ్యాంగంలోని 15, 16 అధికరణల్లో సవరణలు తీసుకరావాలి. ముఖ్యంగా 15 అధికరణలోని నాలుగవ క్లాజ్‌ను సవరించాల్సి ఉంటుంది. ‘సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన తరగతుల పురోభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి రాజ్యాంగంలోని 29వ అధికరణలోని రెండో క్లాజ్ ఎంతమాత్రం అడ్డంకి కాదు’ అని 15వ అధికరణలోని నాలుగవ క్లాజ్ స్పష్టం చేస్తోంది. వెనకబడిన తరగతుల తర్వాత ‘అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన తరగతులు’ అన్న పదాలను చేరిస్తే సవరణ సరిపోతుంది. (అగ్రవర్ణ పేదలకు 10% కోటా)
అయితే ఈ సవరణ అత్యున్నత న్యాయ స్థానం ముందు నిలబడుతుందా, లేదా ? అన్నదే ప్రధాన సమస్య. రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదని, మించితే రిజర్వేషన్ల ఉద్దేశమే దెబ్బతింటుందని 1992లోనే సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఏకపక్షంగా ఈ తీర్పు చెప్పిందంటూ ఆ తీర్పును లెక్క చేయకుండా తమిళనాడు రాష్ట్రం ప్రస్తుతం 69 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోంది. యాభై శాతానికి మించిన రిజర్వేషన్లు సబబేనంటూ నిరూపించుకునే డేటా ఉన్నట్లయితే మించినా ఫర్వాలేదని 2010లోనే సుప్రీం కోర్టు చెప్పింది. అందుకనే సుప్రీం కోర్టు తమిళనాడు రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేదు.
ఆ మాటకొస్తే ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకపక్షంగానే నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రధాన, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు రేపటి ఎన్నికల ప్రయోజనాలే ముఖ్యం కనుక కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని కాదనలేక పోతున్నాయి. అవి తీసుకొచ్చిన ‘టైమ్’నే ప్రశ్నిస్తున్నాయి. ఏది ఏమైన న్యాయస్థానం ముందు నెగ్గుతుందా, లేదా అన్నదే కోటి రూకల ప్రశ్న.
దేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాల వారికి రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు వచ్చినవే కులాల ప్రాతిపదిక. ఆర్థికంగా వెనకబాటును పరిగణలోని తీసుకుంటే సమాజంలో అట్టడుగున జీవిస్తున్న ఎస్సీ,ఎస్టీ తరగతుల వారికి అన్యాయం జరుగుతుందన్న వాదనతో కులాలనే రిజర్వేషన్లకు ప్రాతిపదికగా తీసుకున్నారు. అందుకని ఎస్సీ, ఎస్టీలకు విద్యా, ఉద్యోగావకాశాల్లో 22.5 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆ తర్వాత 1980లో మండల కమిషన్ సిఫార్సుల మేరకు ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తెచ్చారు. ఈ అంశం కూడా సుప్రీం కోర్టు ముందుకు వెళ్లగా, సమాజంలో వెనకబడిన తరగతులను గుర్తించేందుకు కులాలను ప్రాతిపదికగా తీసుకోవాలా లేదా ఆర్థిక వెనకబాటు తనాన్ని రిజర్వేషన్లకు ప్రాతిపదికగా తీసుకోవాలా? అన్న అంశం చర్చకు వచ్చింది.
ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారు ఏయే కులాల్లో ఎంత శాతం మంది ఉన్నారో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి డేటా లేకపోవడంతో సుప్రీం కోర్టు రాజ్యాంగ పరిషత్తులో రిజర్వేషన్లపై జరిగిన చర్చనే ప్రాతిపదికగా తీసుకుని తీర్పు చెప్పింది. ఈ న్యాయ ప్రక్రియ ముగియడానికి దాదాపు పదేళ్లు పట్టడంతో ఓబీసీ రిజర్వేషన్లు 1992 నుంచి అమల్లోకి వచ్చాయి. పలు కేసుల రూపంలో ఏదోవిధంగా సుప్రీం కోర్టు దృష్టికి ఈ రిజర్వేషన్ల అంశం తరచూ వస్తూనే ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా కులాలను ప్రాతిపదికగా తీసుకోవాలా, ఆర్థికంగా వెనకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకోవాల? అన్న అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. దీన్ని తేల్చడానికి దేశంలో ఏయే వర్గాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నాయో 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకొని డేటాను సమర్పించాల్సిందిగా కూడా కేంద్రాన్ని సుప్రీం కోర్టు కోరింది. అయితే ఆ డేటా తమ వద్దలేదని కేంద్రం చేతులు ఎత్తేసింది. 2021లో జరుగనున్న జనాభా లెక్కల్లో ఏయే కులాల వారు, ఏయే సామాజిక వర్గాల వారు ఎంతశాతం మేరకు వెనకబడి ఉన్నారో వివరాలను సేకరిస్తామని కేంద్రం తెలిపింది.
మళ్లీ అదే ప్రాతిపదికపై చర్చ
అగ్రవర్ణాల వారికి పదిశాతం రిజర్వేషన్ల బిల్లు చట్ట రూపం దాలిస్తే ఎవరో ఒకరు సుప్రీం కోర్టుకు వెళ్లడం ఖాయం. రిజర్వేషన్లకు కులాలను ప్రాతిపదికగా తీసుకోవాలా లేదా ఆర్థికంగా వెనకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలా? అన్న అంశం మళ్లీ చర్చకు రాక తప్పదు. ఇంతకుముందు నిమ్న కులాల వారికి కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చినందున అగ్రవర్ణాల వారికి ఆర్ధిక వెనకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వాదించవచ్చు. మరి నిమ్న వర్గాల వారి రిజర్వేషన్ల కూడా ఆర్థిక వెనకబాటుతనాన్నే అమలు చేయవచ్చుకదా? అని సుప్రీం కోర్టు ఎదురు ప్రశ్నించవచ్చు. అప్పుడు అది మొత్తం రిజర్వేషన్ల వ్యవస్థనే తలకిందులయ్యేందుకు దారితీయవచ్చు. ఇంత పెద్ద తలనొప్పి ఇప్పుడే ఎందుకంటూ 2021 జనాభా లెక్కల వరకు నిరీక్షంచనూవచ్చు. ఏదేమైనా న్యాయ ప్రక్రియ ముగిసి అగ్రవర్ణాల వారికి రిజర్వేషన్లు అమల్లోకి రావడానికి కొన్నేళ్లు పడుతుందనడంలో సందేహం లేదు. అందుకనే మోదీ ప్రభుత్వం దృష్టిలో మూడేళ్ల నుంచే ఈ ప్రతిపదన పరిశీలనలో ఉన్న ఇప్పుడు తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment