న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 124వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడానికే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా గెహ్లాట్ స్పష్టం చేశారు. అగ్రవర్ణ పేదలకు న్యాయం చేయడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, రిజర్వేషన్లు కాకుండా వేర్వేరు మార్గాల్లో వారికి ఊరట కలిగించే ప్రయత్నాలు కూడా జరిగాయన్నారు. ఆర్థిక స్థోమత లేక, రిజర్వేషన్ల పరిధిలోకి రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని, సామాజిక సమానత్వం కోసమే ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్ నినాదాన్ని పరిపూర్ణం చేయడానికే.. ఈ రిజర్వేషన్ల రాజ్యంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టామన్నారు. రాజ్యాంగంలోని అధికరణం 15, 16లను సవరణలను ప్రతిపాదిస్తూ బిల్లును తీసుకొచ్చామన్నారు. ఇప్పటికే జరిగిన రాజ్యంగ సవరణలు ప్రభుత్వానికి కొంత వెసులుబాటు కలిగించాయన్నారు.
తొందరపాటు చర్య : కాంగ్రెస్ ఎంపీ
అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తొందరపాటుగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కేవీ థామస్ అభిప్రాయపడ్డారు. ఈ తరహా నిర్ణయాలు.. అనేక సమస్యలకు దారి తీస్తాయన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు తెచ్చారని, కానీ ఆ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు కొట్టేసిందని ఈ సందర్భంగా థామస్ గుర్తు చేశారు. ఆ అనుభవం దృష్ట్యా ఇందులో ఎన్నో చట్టపరమైన అంశాలున్నాయని తెలిపారు. ఎన్డీయేకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉందని, తొందరపాటుతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఎన్డీయే తప్పుల మీద తప్పులు చేస్తోందన్నారు. అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఈ రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారో చెప్పాలన్నారు.
రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు : అరుణ్ జైట్లీ
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌తో న్యాయం జరుగుతోందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ రాజ్యంగ సవరణ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం అవసరం లేదన్నారు. ఈబీసీ రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ సవరణకు ఎలాంటి ఇబ్బందుల్లేవని, దేశంలోని పేదలకు మేలు చేసేందుకే ఈ బిల్లు తీసుకొచ్చామన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకే తమ ఈ ప్రయత్నమని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిని పైకి తీసుకురావాలన్నదే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ అన్న అంశాన్ని 15వ అధికరణ క్లాజ్(5) సవరణ సమయంలోనే చేర్చారని, అదే ప్రకారం ఇప్పుడు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను కల్పించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. పీవీ హయాంలో ప్రత్యేక చట్టం ఏమీ చేయలేదని, అందుకే కోర్టు కొట్టివేసిందన్నారు. చాలా మంది రిజర్వేషన్లు 50శాతం దాటితే కోర్టు కొట్టివేస్తుందని అంటున్నారని, ఆ ఆందోళన నిజమే అయితే ఇప్పటివరకు రిజర్వేషన్లకు ఆర్టికల్ 15, 16 కల్పించిన వెసులుబాటులే మూలమని చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 16(4)లో కులాల ఆధారంగా రిజర్వేషన్ల ప్రస్తావన ఉందని జైట్లీ వెల్లడించారు.
ఇదో రాజకీయ జిమ్మిక్కు: టీఎంసీ
రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లు ఓ రాజకీయ జిమ్మిక్కనే అనుమానం కలుగుతోందని తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు కొట్టిపారేశారు. ఈ సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఈబీసీ బిల్లు ఉద్దేశం మంచిది: శివసేన
ఈబీసీ బిల్లును తీసుకొస్తున్న ఉద్దేశం చాలా మంచిదని, అన్ని రాష్ట్రాల్లోను రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్నారన్నారని శివసేన ఎంపీలు పేర్కొన్నారు. అర్హత ఉండి రిజర్వేషన్లు కోల్పోయిన వారికి అవకాశాలు కల్పించాలని సూచించారు.
ఇంత తొందరేంటి: ఏఐడీఎంకే
ఈబీసీ బిల్లును తొందరగా తీసుకురావాల్సిన అవసరం ఏంటని ఏఐడీఎంకే ఎంపీ తంబిదురై ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయకపోవడం వల్లే ఇంకా పేదరికం ఉందని, 70 ఏళ్ల స్వాతంత్ర భారత్‌లో ఇంకా కుల వివక్ష ఉందన్నారు.
ఈ రాజ్యంగ సవరణ బిల్లుకు ఉభయ సభల్లో 2/3 వంతు మెజార్టీ అవసరం కాగా.. ఈ నిర్ణయంతో రిజర్వేషన్లు 50 శాతం దాటనున్నాయి. ప్రస్తుతం అమలవుతున్నరిజర్వేషన్ల శాతం 49.5 శాతం కాగా.. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5, బీసీలకు 27 శాతంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment