సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రజలిచ్చిన తీర్పును చాలా ప్రమాదకరమైన రీతిలో ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ మండిపడ్డారు. గాంధీజీ 150వ జయంత్యుత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి సోనియా అధ్యక్షత వహించారు. బీజేపీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసేందుకు దూకుడుగా ముందుకు వెళ్తున్నామన్న అక్కసుతోనే కాంగ్రెస్‌ను అణగదొక్కేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని సోనియా ఆరోపించారు. ‘దేశ ఆర్థికస్థితి ఆందోళనకరంగా ఉంది. నష్టం తీవ్ర స్థాయిలో ఉంది’అని అన్నారు. ఆర్థిక వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మునుపెన్నడూ లేనివిధంగా ప్రభుత్వం వేధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, బీఆర్ అంబేడ్కర్ వంటి మహనీయుల ప్రబోధాలను వక్రీకరించి తమ అజెండాకు అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు. అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధి మందగించింది. పరిస్థితి మరింత అధ్వానంగా మారనుంది. వాస్తవమేంటో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. మున్ముందు నిరుద్యోగం తీవ్రత మరింత పెరగనుంది’అని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన దేశ వ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ హాజరు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment