ప్రతిపక్షాల ఐక్యతా రాగం..
విపక్షాలతో సోనియాగాంధీ విందు సమావేశం
► రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడంపై చర్చ
► ఎవరి పేర్లూ చర్చకు రాలేదని మమత వెల్లడి
న్యూఢిల్లీ: ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు పూర్తి చేసుకున్న రోజే ప్రతిపక్షాలన్నీ ఐక్యతారాగం ఆలపించాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎన్‌డీఏ యేతర రాజకీయ పక్షాలతో శుక్రవారం విందు సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ హౌస్ లైబ్రరీలో జరిగిన ఈ భేటీకి పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లో చిరకాల ప్రత్యర్థులైన వామపక్షాలు –తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ)–బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్‌పీ)తో పాటు 17 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, బీఎస్‌పీ చీఫ్ మాయావతి, ఎస్‌పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, డీఎంకే నుంచి కనిమొళి, వామపక్షాల నుంచి సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా, పి.కరుణాకరన్, జేడీయూ నుంచి శరద్‌యాదవ్, కేసీ త్యాగి, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్ అబ్దుల్లాతో పాటు పలు ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. బిహార్ సీఎం నితీశ్‌కుమార్ హాజరు కాలేదు. అయితే శనివారం ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.
ఐక్యంగా ఉన్నామనే సంకేతాలు..
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్.. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయనే సంకేతాలు ఇచ్చేందుకే ఈ విందు భేటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం సాధించేందుకు విస్తృత చర్చ జరిగినట్టు తెలిసింది. వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎన్‌డీఏయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ ఈ సమావేశం ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
అభ్యర్థి ఎంపిక కోసం కమిటీ: మమత
రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించే విషయంలో ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం రాకుంటే.. ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఒక చిన్న కమిటీని ఏర్పాటు చేస్తామని మమత తెలిపారు. ఈ భేటీలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరీ పేరూ చర్చకు రాలేదని చెప్పారు.