నల్లధనం ఏది.. ఎక్కడ?
బీజేపీ ప్రభుత్వం ప్రజలకు తప్పుడు హామీలిస్తోందని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ మండిపడ్డారు. నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామంటూ కమిటీలు వేయడమే తప్ప దానిలో కార్యాచరణ ఏమాత్రం లేదని ఆమె అన్నారు. విదేశాల్లో దాగి ఉన్న నల్లధనాన్ని వంద రోజుల్లోగా వెనక్కి తెప్పిస్తామన్నారని, అది ఏదని ఆమె నిలదీశారు. ద్రవ్యోల్బణం తగ్గిస్తామని, ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తామని కూడా ఎన్నికల సమయంలో బీజేపీ పలు హామీలు ఇచ్చిందని, వాటన్నింటినీ ఎన్డీయే నెరవేర్చిందా అని అడిగారు.
హర్యానాలోని మెహమ్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. హర్యానాలో ఈనెల 15వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు రెండు పార్టీల అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.