దూసుకెళ్లిన బీజేపీ.. ప్రచారానికి రాని సోనియా! | Lacklustre campaign by Congress Gandhi family for assembly elections | Sakshi
Sakshi News home page

అధినేతలేరి..?

Published Sun, Oct 20 2019 3:51 AM | Last Updated on Sun, Oct 20 2019 10:55 AM

Lacklustre campaign by Congress Gandhi family for assembly elections - Sakshi

ఒకనాటి కాంగ్రెస్‌ కంచుకోట హరియాణా, మహారాష్ట్రలలో మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు ప్రధాని మోదీ శ్రమిస్తుంటే.. కాంగ్రెస్‌ పార్టీ ప్రచారపర్వంలో చాలా వెనుకబడింది. ఓ పక్క దేశ పాలనా బాధ్యతల్లో తలమునకలైన మోదీ మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం అలుపెరగకుండా శ్రమించారు. రెండు రాష్ట్రాల్లో గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నా బీజేపీ చీఫ్‌ అమిత్‌షా, మోదీ ఇద్దరూ తమ అభ్యర్థుల గెలుపుకోసం ఏ చిన్న అవకాశాన్నీ విడిచిపెట్టలేదు. రెండు రాష్ట్రాల్లో కలిపి మోదీ మొత్తం 25 భారీ బహిరంగ సభల్లో పాల్గొనడమే అందుకు నిదర్శనం.

ఈ రెండు రాష్ట్రాల ప్రచారంలో కాంగ్రెస్‌ విఫలమైందని చెప్పొచ్చు. గాంధీ కుటుంబం ఎదుర్కొంటోన్న అంతర్గత సంక్షోభానికి, పార్టీని పీడిస్తోన్న ఓటమి భయానికీ కాంగ్రెస్‌ ప్రచారసరళి అద్దం పడుతోందంటున్నారు నిపుణులు. మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ప్రచార అంకం ముగిసింది. ప్రచారంలో దూకుడు ప్రదర్శించిన బీజేపీ రెండు రాష్ట్రాల్లో అధికారపీఠం ఎక్కాలని చూస్తోంది. కాంగ్రెస్‌ మాత్రం హరియాణా, మహారాష్ట్ర ప్రచారంలో వెనకబడింది. సోనియా అసలు ప్రచారంలోనే పాల్గొనకపోతే, రాహుల్‌ నామమాత్రంగా పాల్గొన్నారు.

సోనియా భయపడ్డారా?
సోనియా గాంధీ ఈనెల 18న హరియాణాలో ఒక సభలో పాల్గొనాల్సి ఉండగా అనివార్యకారణాలతో సభకు రాలేదు. సోనియాకు వైరల్‌ జ్వరం వచ్చినందుకే రాలేదని రాహుల్‌ వివరణ ఇచ్చుకున్నారు. అయితే జ్వరం సంగతి పక్కన పెడితే బహిరంగసభకు సోనియా దూరంగా ఉండడానికి ఏఐసీసీ అనేక కారణాలను పేర్కొంది. అవినీతి ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఉందని కొందరి వాదన. లోక్‌సభ ఎన్నికల్లో ఘోరపరాజయంతోపాటు ప్రజామోదం పెద్దగా లేకపోవడం, ఓటమి భయం, పార్టీలో అంతర్గత కలహాలు.. ఆ పార్టీ ప్రచారానికి బ్రేకులు వేసినట్టు పార్టీ వర్గాలు తమ అభిప్రాయం వ్యక్తం చేశాయి.

స్థానిక నేతలు ఎక్కడ?
కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్, అశోక్‌ గెహ్లోత్, కమల్‌నాథ్‌ లాంటి హేమాహేమీలు సైతం ఈ రాష్ట్రాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క బహిరంగ సభను నిర్వహించలేదని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన ప్రియాంకా గాంధీ ఈ రెండు రాష్ట్రాల్లో ప్రచారంలో ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం రెండు రాష్ట్రాల ఎన్నికల్లో నామమాత్రంగా పాల్గొనడానికి స్థానిక నేతలే కారణమని భావిస్తున్నారు. ఢిల్లీ నేతలకంటే స్థానిక నేతలకే ఎన్నికల ప్రచారంలో అధిక ప్రాధాన్యతనివ్వాలని స్థానికనేతలు.. పార్టీ అధిష్టానానికి సూచించిన నేపథ్యంలోనే పెద్దలు ప్రచారంలో వెనకడుగువేసినట్టు తెలుస్తోంది. రాహుల్‌ రాష్ట్రంలో పర్యటించిన నేపథ్యంలో గాంధీ కుటుంబం ప్రచారంలో వెనుకబడిందన్న ప్రశ్నేలేదని పార్టీ సీనియర్‌ నేతలు వ్యాఖ్యానించారు. కాగా, పోలింగ్‌ రేపు జరగనుంది.

మోదీ 25 రాహుల్‌ 7
ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ 25 ర్యాలీల్లో పాల్గొని ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని తిరిగి చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియా మాత్రం ఒక్కటంటే ఒక్క బహిరంగ సభలో కూడా పాల్గొనకపోవడం ఎన్నికల్లో ఆ పార్టీ ఉదాసీనతకు అద్దంపడుతోంది. బీజేపీకే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ బీజేపీ జాతీయ నాయకులు, ప్రధాని మోదీ రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.  రాహుల్‌ గాంధీ హరియాణాలో రెండు, మహారాష్ట్రలో ఐదు మొత్తంగా ఏడు బహిరంగ సభల్లో మాత్రమే పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement