జమిలి పరీక్ష | Jamili Elections One Of The Most Important Aspects In Modi Government | Sakshi
Sakshi News home page

జమిలి పరీక్ష

Published Fri, Jun 21 2019 4:57 AM | Last Updated on Fri, Jun 21 2019 4:57 AM

Jamili Elections One Of The Most Important Aspects In Modi Government - Sakshi

‘ఒక దేశం–ఒకే ఎన్నిక’ పేరుతో వచ్చిన జమిలి ఎన్నికల ప్రతిపాదనపైన భిన్నాభిప్రాయాలు వెల్లడి కావడం సహజం. రెండవ విడత ప్రధానిగా ప్రమాణం స్వీకరించిన వెంటనే నరేంద్రమోదీ ప్రదర్శిం చిన పూనికలలో అత్యంత కీలకమైనది ఈ అంశం. మొత్తం నలభై రాజకీయ పార్టీలను సమాలోచ నకు ఆహ్వానిస్తే దాదాపు సగం పార్టీల (21) ప్రతినిధులు ఢిల్లీలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమా వేశంలో పాల్గొన్నారు. లోక్‌సభకూ, శాసనసభలకూ ఏకకాలంలో సమాంతరంగా ఎన్నికలు నిర్వహిం చాలన్న ఆలోచన మోదీ మదిలో కొంతకాలంగా మెదులుతున్నదే. ఒ

కేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు కలసి వస్తుందనీ, ఎన్నికల నియమావళి పేరుతో నిష్క్రియాపరత్వం పాటించవలసిన రోజుల సంఖ్య తగ్గుతుందనీ, ప్రతి సంవత్సరం రెండు, మూడు రాష్ట్రాలలో ఎన్నికలు జరగడం వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సైతం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి సంకోచిస్తుందనీ, ఒకేసారి అన్ని ఎన్నికలు జరిగితే ప్రభుత్వాలన్నీ పరిపాలనపైన దృష్టి పెట్టవచ్చుననీ ఈ ప్రతిపాదనకు అను కూలంగా చెప్పుకోదగిన అంశాలు. 1967 ఎన్నికలలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఏక ఛత్రాధి పత్యం అంతమైంది. ప్రాంతీయపార్టీల ప్రాభవం పెరిగింది. సంకీర్ణయుగం మొదలయింది. ఈ కారణాల వల్ల అస్థిరత చోటు చేసుకున్నది. పరిపాలనకు గండి పడింది. అతుకుల బొంతల సంకీ ర్ణాలు ప్రభుత్వాలు ఏర్పరచడం, పార్లమెంటులో అడుగుపెట్టకుండానే ప్రధాని రాజీనామా సమ ర్పించిన సందర్భం కూడా చూశాం.

ఐదేళ్ళకు ఒకసారి అన్ని శాసన వ్యవస్థలకూ ఎన్నికలు జర గడం వల్ల దేశంలో రాజకీయ సుస్థిరత నెలకొనడానికి ఆస్కారం ఉన్నది. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలకు నష్టం వాటిల్లుతుందనీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజమైన ఆధిక్యం ఉంటుం దనీ, భిన్నత్వంలో ఏకత్వం సూత్రం దెబ్బతింటుందనీ, దేశ సమగ్రతకు జమిలి ఎన్నికలు  భంగం కలిగిస్తాయనే వాదనలు ఉన్నాయి. పరోక్షంగా అధ్యక్ష వ్యవస్థకు దారితీసే ప్రమాదం ఈ ప్రతిపాద నలో ఉన్నదనే భయాలు వ్యక్తం అవుతున్నాయి. సందేహాలు ఉన్నంత మాత్రాన చర్చకు వెనకాడనక్క రలేదు. ప్రధాని అఖిలపక్షం ఏర్పాటు చేసినప్పుడు హాజరు కాకపోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. సమావేశానికి వెళ్ళి తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడమే విజ్ఞత.  

జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని శాసనసభల పదవీ కాలాన్ని పొడిగించాలి. మరి కొన్ని శాసనసభల గడువును  కుదించవలసి రావచ్చు. ఇటువంటి పని ఏది చేయాలన్నా రాజ్యాంగ సవరణ అవసరం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందాలంటే ఉభయ సభలూ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాలి. నేషనల్‌ డెమొక్రాటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌డీఏ)కి లోక్‌సభలో మూడింట రెండు వంతుల ఆధిక్యం ఉన్నది కానీ రాజ్యసభలో లేదు. అందుకే ప్రాంతీయ పార్టీలను ప్రసన్నం చేసుకోవడానికీ లేదా చీల్చడానికీ మోదీ ప్రభృతులు ప్రయత్నిస్తున్నారు. తె

లుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని చీల్చడం, బీజేపీలో విలీనం కావడం ఇందుకు తాజా నిదర్శనం. రాజ్యసభలో మూడింట రెండు వంతుల మెజారిటీ ఎన్‌డీఏకి దక్కితే ఎన్నికల సంస్కరణలతో సరిపెట్టుకోదనీ, కశ్మీర్‌పైన ప్రభావం చూపించే 370వ అధికరణను సవరించే ప్రయత్నం చేయవచ్చుననీ ప్రజాస్వామ్యవాదులు కొందరు భయపడుతున్నారు. వారి భయాలు నిర్హేతుకమైననవి విశ్వాసం కలిగించే బాధ్యత కేంద్ర ప్రభుత్వా నికి ఉంది. సమాంతర ఎన్నికలపైన 2018 ఆగస్టులో లా కమిషన్‌ ఒక ముసాయిదా నివేదిక సమర్పించింది. దాని ప్రకారం చట్టానికి సవరణ చేసిన తర్వాత దానిని దేశంలోని సగం  రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాలి. బీజేపీ సగానికి పైగా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కారణంగా అది తేలికే.

మోదీ వంటి ప్రతిభావంతుడైన నాయకుడు ఎన్నికల ప్రచారం చేసిన తర్వాత ప్రజలు లోక్‌ సభకీ, శాసనసభలకీ ఒకే విధంగా ఓటు చేసే అవకాశం ఉన్నది. 2019లో ఒడిశా ప్రజలు లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి పట్టం కట్టి శాసనసభ ఎన్నికలలో నవీన్‌ పట్నాయక్‌ నాయకత్వంలోని బిజూ జనతాదళ్‌ను అయిదో విడత గెలిపించి విచక్షణాజ్ఞానం ప్రదర్శించారు. నిరుడు రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని ఓడించిన ఓటర్లు మొన్నటి లోక్‌సభ ఎన్నికలలో అదే పార్టీకి ఘనవిజయం కట్టబెట్టారు. కానీ అసెంబ్లీ ఎన్నికలూ, లోక్‌సభ ఎన్నికలూ ఒకేసారి జరిగి ఉంటే అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీజేపీ గెలిచి ఉండేదేమో.  

కేంద్రంలో ప్రభుత్వం గడువు కంటే ముందు పడిపోయినా, రాష్ట్రాలలోని ప్రభుత్వాలు పార్టీ ఫిరాయింపుల కారణంగా కుప్పకూలినా కష్టమే. కేంద్ర ప్రభుత్వం పడిపోతే లోక్‌సభకు మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి. దానితో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఎన్నికలు నిర్వహిస్తారా? కేంద్రంలో కూడా రాష్ట్రపతి పాలన విధించాలంటూ కొత్త చట్టం తెస్తారా? ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయి, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకపోతే సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకూ రాష్ట్రపతి పాలన విధించాలి. ఎటుచూసినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలమే. ఎవరైనా లోక్‌సభ సభ్యుడు కానీ శాసనసభ్యుడు కానీ మృతి చెందితే ఆ స్థానం మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకూ ఖాళీగా ఉండాల్సిందే.

జమిలి ఎన్నికల ప్రతిపాదనను సమర్థిస్తూ చెప్పే కారణాలు ఎంత బలమైనవో, వ్యతిరేకిస్తూ చెప్పే కారణాలు సైతం అంతే బలమైనవి. అందుకే కూలంకషంగా చర్చించి రాజ్యాంగస్ఫూర్తికీ, సమాఖ్య స్వభావానికీ, ప్రజా స్వామ్య స్పృహకూ అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సకల రాజకీయ పక్షాల నాయకులూ చర్చలో పాల్గొనాలి. విధివిధానాలు చర్చించడానికి ఒక కమిటీని నియమిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అన్ని కోణాల నుంచీ పరిశీలించి మౌలి కమైన రాజ్యాంగ విలువలకు విఘాతం కలగకుండా సంయమనమే ప్రధానంగా భవిష్యత్‌ కార్యా చరణ ఉంటుందని ఆకాంక్ష.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement