సాక్షి, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల నిర్వహణను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేదేశం.. ఒకేసారి ఎన్నికలు నినాదంతో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ఎన్డీయే పక్షాలతో పాటు, బీజేడీ, వైఎస్సార్‌సీపీ, వామపక్ష పార్టీల అధ్యక్షులు కూడా హాజరయ్యారు. అయితే ఈ భేటీకి తాము హాజరుకావడం లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. దీంతో ఆ పార్టీ జమిలి ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, ఆమ్‌ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ కూడా గైర్హాజరు అయ్యాయి. తాము జమిలికి వ్యతిరేకమని బహిరంగంగా చెప్పనప్పటికీ ఆ పార్టీ వ్యవహార తీరుతో వారి అభిప్రాయం స్పష్టమవుతోంది.
దేశవ్యాప్తంగా లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలన్నదే జమిలి విధానం. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన్పటి నుంచి జమిలి కోసం విశ్వప్రయత్నాలు చేసింది. అయితే విపక్షాల నుంచి సరైన సహాకారం లేకపోవడంతో వెనుకడుగేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుపొందడంతో బలమైన ప్రభుత్వంగా బీజేపీ ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో మరోసారి జమిలి విధానం తెరపైకి వచ్చింది. ఆ విధానాన్ని తీసుకురావాలని దేశ వ్యాప్తంగా కొన్ని పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని ఇవాళ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. లోక్‌సభ, రాజ్యసభల్లో ఎంపీలు ఉన్న ప్రతి పార్టీ నేతను మోదీ ఆ సమావేశానికి ఆహ్వానించారు. 2022లో భారత్ 75వ స్వతంత్ర దినోత్సవ సంబరాలను జరుపుకోనున్నది. అదే సంవత్సరం 150 గాంధీ జయంతి ఉత్సవాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ విధానాన్ని అమలు చేయాలని మోదీ భావిస్తున్నారు. కానీ విపక్షలు జమిలి ఎన్నికలపై ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాయన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియదు.
Comments
Please login to add a commentAdd a comment