జమిలి ఎన్నికలపై కమిటీ | Centre Sets up Committee to Study One Nation One Election | Sakshi
Sakshi News home page

జమిలి ఎన్నికలపై కమిటీ

Published Thu, Jun 20 2019 3:19 AM | Last Updated on Thu, Jun 20 2019 8:08 AM

Centre Sets up Committee to Study One Nation One Election - Sakshi

బుధవారం ఢిల్లీలో అఖిలపక్ష భేటీలో పాల్గొన్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అమిత్‌ షా

న్యూఢిల్లీ: ఒకే దేశం, ఒకే ఎన్నిక అంశంపై నిర్ణీత గడువులోగా సూచనలు ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బుధవారం నాడిక్కడ ప్రకటించారు. నిర్దిష్ట కాలవ్యవధిలోగా భాగస్వామ్యపక్షాలతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని తెలిపారు. జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించాలని భావించిన మోదీ ఆ మేరకు 40 మందికి ఆహ్వానం పలికారు.

అయితే 21 పార్టీలు మాత్రమే బుధవారం నాటి ఈ భేటీకి హాజరుకాగా మరో మూడు పార్టీలు ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశాయి. అఖిలపక్ష నేతలతో సమావేశానంతరం రాజ్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు. జమిలి ఎన్నికలనేవి ప్రభుత్వ ఎజెండా కాదని, ఇది జాతి ఎజెండాగా ప్రధాని ఈ సమావేశంలో స్పష్టం చేశారన్నారు. ఈ విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాన్ని అయినా స్వాగతిస్తామని మోదీ చెప్పారన్నారు. లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనకు చాలా పార్టీలు మద్దతు పలికాయని చెప్పారు.

ఉమ్మడి ఎన్నికల కసరత్తు ఎలా జరుగుతుందనే దానిపై సీపీఐ, సీపీఎం వంటి పార్టీలకు భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ, ఈ ఆలోచనను వారు నేరుగా వ్యతిరేకించలేదని తెలిపారు. పార్లమెంటు ఉత్పాదకత పెంచాలనే అంశంలో పార్టీలన్నీ ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయన్నారు. చర్చకు, సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుగా సభలో సుహృద్భావ వాతావరణం ఉండాలని అఖిల పక్షానికి హాజరైన నేతలు అభిప్రాయపడినట్లు తెలిపారు. కాగా కమిటీ కూర్పుపై ప్రధాని నిర్ణయం తీసుకుంటారని రాజ్‌నాథ్‌ చెప్పారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. ఇది రాజకీయ కమిటీ. వివిధ రాజకీయ పార్టీల నేతలు ఇందులో సభ్యులుగా ఉంటారు.  

హాజరైన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌
‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’తో పాటు దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అయ్యే సందర్భంగా 2022లో ఉత్సవాలు నిర్వహించడం, అలాగే ఈ ఏడాది మహాత్మాగాంధీ 150 జయంతి ఉత్సవాలు నిర్వహించడం తదితర అంశాలపై చర్చించేందుకు నిర్వహించిన ఈ సమావేశానికి ఎన్డీయే మిత్రపక్షం శివసేనతో పాటు పలు విపక్ష పార్టీలు హాజరుకాలేదు. గైర్హాజరైన ప్రముఖుల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్, డీఎంకే నేత ఎంకే స్టాలిన్, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రే, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ , బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉన్నారు.

హాజరైన వారిలో ఎన్సీపీ నేత శరద్‌పవార్, సీతారాం ఏచూరి (సీపీఎం), సురవరం సుధాకర్‌రెడ్డి (సీపీఐ), ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్, ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ నేత నవీన్‌ పట్నాయక్, సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ (శిరోమణి అకాలీదళ్‌), కోనార్డ్‌ సంగ్మా (నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ) ఉన్నారు. పార్లమెంటు హౌస్‌ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ భేటీలో పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు హాజరయ్యారు. మోదీ, రాజ్‌నాథ్‌లతో పాటు ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, ప్రహ్లాద్‌ జోషి, బీజేపీ కొత్త కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు.

ప్రజాస్వామ్య విరుద్ధం: ఏచూరి
అయితే జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి, సమాఖ్యవాదానికి విరుద్ధమని, ఆ విధంగా అవి రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో సీతారాం ఏచూరి మాట్లాడారు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దొడ్డిదారిన తొలగించడమేనని ఏచూరి పేర్కొన్నారు. అంతకుముందు సమావేశంలో జమిలి ఎన్నికల కోసం ప్రభుత్వం చేస్తున్న కృత్రిమ ప్రయత్నాన్ని సీపీఎం ఎందుకు వ్యతిరేకిస్తోందీ తెలియజేసే ఒక పత్రాన్ని పార్టీల ప్రతినిధులకు అందజేశారు. శాసనవ్యవస్థకు ప్రభుత్వాన్ని జవాబుదారీని చేసే రాజ్యాంగ ప్రక్రియను ఇది తారుమారు చేస్తుందని పేర్కొన్నారు. నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, డేటా విశ్వసనీయత తదితర అంశాలను కూడా ఆ పత్రంలో ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతు పలికిన బీజేడీ నేత నవీన్‌ పట్నాయక్‌.. రాజ్యాంగ ప్రవేశికలో శాంతి, అహింస అనే పదాలను చేర్చాలని డిమాండ్‌ చేశారు.

ఇది ప్రస్తుత ప్రాధాన్య అంశం కాదు: మాయావతి
భారత్‌ వంటి అతిపెద్ద దేశానికి జమిలి ఎన్నికలనేవి అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధ ఆలోచనగా కనబడుతోందని మాయావతి పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం దేశం ముందున్న అంశం కాదని విమర్శించారు. ఈవీఎంలపై అఖిలపక్షం ఏర్పాటు చేసి ఉంటే హాజరయ్యేదాన్నంటూ అంతకుముందు ట్వీట్‌ చేశారు. ఈ అంశంపై ఇతర పార్టీలతో సంప్రదింపుల అనంతరం అఖిలపక్షానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ నిర్ణయించుకుంది. తాను హాజరు కాబోనని మమతా బెనర్జీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అఖిల పక్షానికి బదులుగా దీనిపై చర్చలకు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు. ప్రజా ధనాన్ని పొదుపు చేసేందుకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని గత ఏడాది ఆగస్టులో లా కమిషన్‌ సిఫారసు చేసింది. అయితే ప్రస్తుత రాజ్యాంగ నిబంధనల ప్రకారమైతే ఇది సాధ్యం కాదని న్యాయశాఖకు సమర్పించిన ముసాయిదాలో హెచ్చరించింది.

ఒకేసారి ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగానికి, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. రాజ్యాంగంలోని కనీసం రెండు నిబంధనలను సవరించడంతో పాటు, మెజారిటీ రాష్ట్రాలు కనుక ఆమోదించిన పక్షంలో జమిలి ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించవచ్చని లా కమిషన్‌ తన సిఫారసుల్లో పేర్కొంది.  లా కమిషన్‌ సిఫారసులతో మాజీ ప్రధాన ఎన్నికల అధికారి టీఎస్‌ కృష్ణమూర్తి ఏకీభవించారు. జమిలి ఎన్నికలు సాధ్యమేనని చెప్పారు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని,  కానీ అవిశ్వాస తీర్మానం, దానితో ముడిపడిన అంశాలకు సంబంధించిన రాజ్యాంగ నిబంధన దీని అమలుకు పెద్ద అవరోధమని తెలిపారు. దీనికి పరిష్కారమార్గం రాజ్యాంగ సవరణ ఒక్కటేనని పేర్కొన్నారు. అలాగే ఈ విధంగా ఎన్నికలు నిర్వహించాలంటే ఎన్నికల విధులకు అవసరమైన పారా మిలటరీ బలగాల సంఖ్యను పెంచడం సహా చాలా పాలనాపరమైన ఏర్పాట్లు అవసరమని చెప్పారు.  

భిన్నాభిప్రాయాలు స్వాగతిస్తాం : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌
జమిలి ఎన్నికలనేవి ప్రభుత్వ ఎజెండా కాదు.. ఇది జాతి ఎజెండా అని ప్రధాని ఈ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాన్ని అయినా స్వాగతిస్తామని మోదీ చెప్పారు. లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనకు చాలా పార్టీలు మద్దతు పలికాయి. ఉమ్మడి ఎన్నికల కసరత్తు ఎలా జరుగుతుందనే దానిపై సీపీఐ, సీపీఎం వంటి పార్టీలకు భిన్నాభిప్రాయం ఉన్నా, ఈ ఆలోచనను వారు నేరుగా వ్యతిరేకించలేదు.   
  

బుధవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీకి హాజరైన ప్రధాని నరేంద్రమోదీ, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.
చిత్రంలో ఒడిశా, బిహార్‌ ముఖ్యమంత్రులు నవీన్‌ పట్నాయక్, నితీశ్‌కుమార్, కేంద్ర మంత్రులు నడ్డా, రాజ్‌నాథ్, అమిత్‌ షా, గడ్కరీ తదితరులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement