
కొన్నేళ్ళుగా చెబుతూ వస్తున్న ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై కేంద్రంలోని అధికార బీజేపీ మరో అడుగు ముందుకు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ఈ ప్రతిపాదనపై ఇచ్చిన నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం లాంఛనంగా ఆమోదం తెలపడంతో రథం కదిలింది. ఈ ప్రతిపాదనపై ఓ బిల్లును రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు భోగట్టా.
దేశంలో లోక్‌సభకూ, అన్ని రాష్ట్రాల శాసనసభలకూ కలిపి ఒకేసారి ఎన్నికలు జరపడానికి ఉద్దేశించిన ఈ సంక్లిష్ట ప్రతిపాదనపై మొదటి నుంచి భిన్నాభిప్రాయాలు ఉన్నందున తాజా పరిణామాలతో మరోమారు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పైగా ఈ ప్రతిపాదనకు పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణలు అవసరం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిపాదనను కేంద్రంతో పాటు రాష్ట్రాలూ ఆమోదించాల్సి ఉంటుంది. వెరసి, రాజ్యాంగపరంగానూ, ఆచరణలోనూ అనేక అవరోధాలున్న ఈ ప్రతిపాదనపై రాగల నెలల్లో పెద్దయెత్తున రచ్చ రేగడం ఖాయం.
నిజానికి, ఏకకాలంలో ఎన్నికలనేవి కొత్త ఏమీ కావు. గతంలో ప్రత్యేకంగా నియమం, చట్టం లాంటివేమీ లేకున్నా, 1951 – 52లో మొదటి జనరల్ ఎలక్షన్స్ నాటి నుంచి మన దేశంలో లోక్ సభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు కలిసే జరుగుతుండేవి. అయితే, కాలవ్యవధి పూర్తి కాకుండానే రాష్ట్ర అసెంబ్లీలు రద్దవడం ఎప్పుడైతే మొదలైందో, అప్పుడు 1967 తర్వాత నుంచి కథ మారింది.
ఏకకాల ఎన్నికల క్యాలెండర్ మారిపోయింది. పదేళ్ళ క్రితం తొలిసారి అధికారంలోకి వచ్చే ముందే బీజేపీ తన మేనిఫెస్టోలో ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ను లక్ష్యంగా పేర్కొంది. అంతకు ముందు సన్నాయినొక్కులు నొక్కినా, బీజేపీ గద్దెనెక్కాక సహజంగానే భారత ఎన్నికల సంఘం ఈ ఆలోచనను సమర్థించింది. అలాగే, లా కమిషన్లు సైతం 1999లో, 2018లో ఈ ఏకకాలపు ఎన్నికల విధానాన్ని పునరుద్ధరించాలన్నాయి.
2015 నాటి పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు పలు పార్టీలు ఈ ప్రతిపాదనకు మద్దతు నివ్వగా, కొన్ని పార్టీలు మాత్రం వ్యతిరేకించాయి. భిన్నాభిప్రాయాలున్న దీనిపై ఏకాభిప్రాయ సాధన అవసరమని మొదట్లో చెబుతూ వచ్చిన మోదీ సర్కార్, ఆ సంగతి పక్కనపెట్టి ఇటీవల తన అజెండాను ముందుకు నెట్టే ప్రయత్నం చేయడం గమనార్హం.
కోవింద్ కమిటీ వేయడం, ఆ కమిటీ ఈ ఏడాది మార్చిలో నివేదిక సమర్పించడం చకచకా జరిగాయి. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు, ఆ వెంటనే రెండో దశలో 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు – ఇలా రెండు దశలుగా 2029 నుంచి ‘ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను అమలు చేయవచ్చని కమిటీ సిఫార్సు చేసింది. ఇప్పుడు కమిటీ నివేదికను క్యాబినెట్ ఆమోదించి, పార్లమెంట్‌లో చట్టం చేయడానికి సిద్ధమవుతోంది.
లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కేంద్రానికి రూ. 4 వేల కోట్లు ఖర్చవుతుందని లెక్క. ఆ యా రాష్ట్రాల పరిమాణాన్ని బట్టి అసెంబ్లీ ఎన్నికలకు అయ్యే ఖర్చు వేరు. ఈ ప్రభుత్వ అధికారిక ఖర్చు కాక, వివిధ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చు అనేక రెట్లు. ఏక కాలపు ఎన్నికల వల్ల ఖర్చులు తగ్గుతాయనీ, తరచూ ఎన్నికలతో పాలన కుంటుపడుతున్నందున దాన్ని నివారించవచ్చనీ, ఒకేసారి ఎన్నికలతో ఓటింగ్ శాతం హెచ్చవుతుందనీ సమర్థకుల వాదన.
అయితే, ఏకకాలపు ఎన్నికల కోసం పలు రాష్ట్ర అసెంబ్లీలను ముందుగానే రద్దు చేయాల్సి వస్తుంది. రేపు పొద్దున ఒకేసారి ఎన్నికలు పెట్టినా... ఒకవేళ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తే, కేవలం మిగిలిన కాలవ్యవధికే ఎన్నికల ద్వారా కొత్త ప్రభుత్వాన్ని ఎన్ను కోవాలట. ఇలాంటి ప్రతిపాదనలు వట్టి అర్థరహితం.
పైగా, ఇది మరింత ఖర్చుకు దారి తీయడమే కాక, అసలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం. అలాగే ఏకకాలపు ఎన్నికల వల్ల స్థానిక, ప్రాంతీయ అంశాలు పక్కకుపోయి, జాతీయ అంశాలదే పైచేయి అవుతుందనీ, చివరకు స్థానిక, చిన్నపార్టీలు కనుమరుగై పోతాయనీ భయాందోళనలు నెలకొన్నాయి.
ఇటీవల ఏకకాలంలో హర్యానా, జమ్మూ– కశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు చేయలేమని చేతులె త్తేసిన ఎన్నికల సంఘం రేపు దేశమంతటా ఒకేసారి ఎన్నికలు ఎలా చేయగలుగుతుంది? కొన్ని కోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, వేల సంఖ్యలో భద్రతా సిబ్బందిని ఏకకాలంలో సమకూర్చుకోవడం సాధ్యమా? దానికయ్యే ఖర్చుతో పోలిస్తే, ‘ఒకే ఎన్నిక’ వల్ల ఆదా అయ్యేది ఏపాటి?
అసలింతకీ కేంద్రంలోని కమలనాథులు ఇప్పుడీ పనిని ఎందుకు భుజాన వేసుకున్నట్టు? అధికార పక్షం సొంత మెజారిటీ ఉన్నప్పుడు ఇట్టే చేయగల పనిని మిత్రపక్షాలపై ఆధారపడిన ప్రభుత్వ హయాంలో తలకెత్తుకున్నదేమిటి? 2015 నాటి ఓ సర్వే ప్రకారం... ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 77 శాతం ఓటర్లు రెండింటా ఒకే పార్టీకి ఓటు వేస్తారట.
అదే గనక ఆరు నెలల విరామం తర్వాత జరిగితే 61 శాతం మందే ఒకే పార్టీకి ఓటు వేస్తారట. దేశమంతటా ‘డబుల్ ఇంజన్ సర్కార్’కై తహతహలాడుతున్న బీజేపీ ఓటర్ల తాలూకు ఈ ఏకకాలపు ఎన్నికల మనస్తత్వం కలిసొస్తుందని భావిస్తూ ఉండవచ్చు. కానీ, వైవిధ్యానికి నెలవైన సమాఖ్య వ్యవస్థలో కృత్రిమంగా ఏకకేంద్రక స్వభావాన్ని జొప్పించడమే ఇదంతా అని విమర్శ.
ఎవరి రాజకీయ, సైద్ధాంతిక వైఖరులు ఏమైనా అనేక అంశాలపై ప్రభావం చూపే ఈ ప్రతిపాదనకు తొందరపడితే సరిపోదు. కాగితంపై అందంగా కనిపించే ఆలోచనకు సైతం ఆచరణలో ఉండే ఇబ్బందులను గమనించాలి. వ్యతిరేకుల వాదన వినాలి. సహేతుకమైన వారి సందేహాల్ని తీర్చాలి. లేదంటే ప్రజాస్వామ్యానికే అర్థం లేదు.
Comments
Please login to add a commentAdd a comment