Simultaneous Elections
-
ఒకే ఎన్నిక... అనేక కోణాలు!
కొన్నేళ్ళుగా చెబుతూ వస్తున్న ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై కేంద్రంలోని అధికార బీజేపీ మరో అడుగు ముందుకు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ఈ ప్రతిపాదనపై ఇచ్చిన నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం లాంఛనంగా ఆమోదం తెలపడంతో రథం కదిలింది. ఈ ప్రతిపాదనపై ఓ బిల్లును రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు భోగట్టా. దేశంలో లోక్‌సభకూ, అన్ని రాష్ట్రాల శాసనసభలకూ కలిపి ఒకేసారి ఎన్నికలు జరపడానికి ఉద్దేశించిన ఈ సంక్లిష్ట ప్రతిపాదనపై మొదటి నుంచి భిన్నాభిప్రాయాలు ఉన్నందున తాజా పరిణామాలతో మరోమారు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పైగా ఈ ప్రతిపాదనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణలు అవసరం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిపాదనను కేంద్రంతో పాటు రాష్ట్రాలూ ఆమోదించాల్సి ఉంటుంది. వెరసి, రాజ్యాంగపరంగానూ, ఆచరణలోనూ అనేక అవరోధాలున్న ఈ ప్రతిపాదనపై రాగల నెలల్లో పెద్దయెత్తున రచ్చ రేగడం ఖాయం.నిజానికి, ఏకకాలంలో ఎన్నికలనేవి కొత్త ఏమీ కావు. గతంలో ప్రత్యేకంగా నియమం, చట్టం లాంటివేమీ లేకున్నా, 1951 – 52లో మొదటి జనరల్ ఎలక్షన్స్ నాటి నుంచి మన దేశంలో లోక్ సభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు కలిసే జరుగుతుండేవి. అయితే, కాలవ్యవధి పూర్తి కాకుండానే రాష్ట్ర అసెంబ్లీలు రద్దవడం ఎప్పుడైతే మొదలైందో, అప్పుడు 1967 తర్వాత నుంచి కథ మారింది. ఏకకాల ఎన్నికల క్యాలెండర్ మారిపోయింది. పదేళ్ళ క్రితం తొలిసారి అధికారంలోకి వచ్చే ముందే బీజేపీ తన మేనిఫెస్టోలో ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ను లక్ష్యంగా పేర్కొంది. అంతకు ముందు సన్నాయినొక్కులు నొక్కినా, బీజేపీ గద్దెనెక్కాక సహజంగానే భారత ఎన్నికల సంఘం ఈ ఆలోచనను సమర్థించింది. అలాగే, లా కమిషన్లు సైతం 1999లో, 2018లో ఈ ఏకకాలపు ఎన్నికల విధానాన్ని పునరుద్ధరించాలన్నాయి. 2015 నాటి పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు పలు పార్టీలు ఈ ప్రతిపాదనకు మద్దతు నివ్వగా, కొన్ని పార్టీలు మాత్రం వ్యతిరేకించాయి. భిన్నాభిప్రాయాలున్న దీనిపై ఏకాభిప్రాయ సాధన అవసరమని మొదట్లో చెబుతూ వచ్చిన మోదీ సర్కార్, ఆ సంగతి పక్కనపెట్టి ఇటీవల తన అజెండాను ముందుకు నెట్టే ప్రయత్నం చేయడం గమనార్హం. కోవింద్ కమిటీ వేయడం, ఆ కమిటీ ఈ ఏడాది మార్చిలో నివేదిక సమర్పించడం చకచకా జరిగాయి. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు, ఆ వెంటనే రెండో దశలో 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు – ఇలా రెండు దశలుగా 2029 నుంచి ‘ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను అమలు చేయవచ్చని కమిటీ సిఫార్సు చేసింది. ఇప్పుడు కమిటీ నివేదికను క్యాబినెట్ ఆమోదించి, పార్లమెంట్లో చట్టం చేయడానికి సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కేంద్రానికి రూ. 4 వేల కోట్లు ఖర్చవుతుందని లెక్క. ఆ యా రాష్ట్రాల పరిమాణాన్ని బట్టి అసెంబ్లీ ఎన్నికలకు అయ్యే ఖర్చు వేరు. ఈ ప్రభుత్వ అధికారిక ఖర్చు కాక, వివిధ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చు అనేక రెట్లు. ఏక కాలపు ఎన్నికల వల్ల ఖర్చులు తగ్గుతాయనీ, తరచూ ఎన్నికలతో పాలన కుంటుపడుతున్నందున దాన్ని నివారించవచ్చనీ, ఒకేసారి ఎన్నికలతో ఓటింగ్ శాతం హెచ్చవుతుందనీ సమర్థకుల వాదన. అయితే, ఏకకాలపు ఎన్నికల కోసం పలు రాష్ట్ర అసెంబ్లీలను ముందుగానే రద్దు చేయాల్సి వస్తుంది. రేపు పొద్దున ఒకేసారి ఎన్నికలు పెట్టినా... ఒకవేళ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తే, కేవలం మిగిలిన కాలవ్యవధికే ఎన్నికల ద్వారా కొత్త ప్రభుత్వాన్ని ఎన్ను కోవాలట. ఇలాంటి ప్రతిపాదనలు వట్టి అర్థరహితం. పైగా, ఇది మరింత ఖర్చుకు దారి తీయడమే కాక, అసలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం. అలాగే ఏకకాలపు ఎన్నికల వల్ల స్థానిక, ప్రాంతీయ అంశాలు పక్కకుపోయి, జాతీయ అంశాలదే పైచేయి అవుతుందనీ, చివరకు స్థానిక, చిన్నపార్టీలు కనుమరుగై పోతాయనీ భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల ఏకకాలంలో హర్యానా, జమ్మూ– కశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు చేయలేమని చేతులె త్తేసిన ఎన్నికల సంఘం రేపు దేశమంతటా ఒకేసారి ఎన్నికలు ఎలా చేయగలుగుతుంది? కొన్ని కోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు, వేల సంఖ్యలో భద్రతా సిబ్బందిని ఏకకాలంలో సమకూర్చుకోవడం సాధ్యమా? దానికయ్యే ఖర్చుతో పోలిస్తే, ‘ఒకే ఎన్నిక’ వల్ల ఆదా అయ్యేది ఏపాటి? అసలింతకీ కేంద్రంలోని కమలనాథులు ఇప్పుడీ పనిని ఎందుకు భుజాన వేసుకున్నట్టు? అధికార పక్షం సొంత మెజారిటీ ఉన్నప్పుడు ఇట్టే చేయగల పనిని మిత్రపక్షాలపై ఆధారపడిన ప్రభుత్వ హయాంలో తలకెత్తుకున్నదేమిటి? 2015 నాటి ఓ సర్వే ప్రకారం... ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 77 శాతం ఓటర్లు రెండింటా ఒకే పార్టీకి ఓటు వేస్తారట. అదే గనక ఆరు నెలల విరామం తర్వాత జరిగితే 61 శాతం మందే ఒకే పార్టీకి ఓటు వేస్తారట. దేశమంతటా ‘డబుల్ ఇంజన్ సర్కార్’కై తహతహలాడుతున్న బీజేపీ ఓటర్ల తాలూకు ఈ ఏకకాలపు ఎన్నికల మనస్తత్వం కలిసొస్తుందని భావిస్తూ ఉండవచ్చు. కానీ, వైవిధ్యానికి నెలవైన సమాఖ్య వ్యవస్థలో కృత్రిమంగా ఏకకేంద్రక స్వభావాన్ని జొప్పించడమే ఇదంతా అని విమర్శ. ఎవరి రాజకీయ, సైద్ధాంతిక వైఖరులు ఏమైనా అనేక అంశాలపై ప్రభావం చూపే ఈ ప్రతిపాదనకు తొందరపడితే సరిపోదు. కాగితంపై అందంగా కనిపించే ఆలోచనకు సైతం ఆచరణలో ఉండే ఇబ్బందులను గమనించాలి. వ్యతిరేకుల వాదన వినాలి. సహేతుకమైన వారి సందేహాల్ని తీర్చాలి. లేదంటే ప్రజాస్వామ్యానికే అర్థం లేదు. -
జమిలి ఎన్నికలు: రాష్ట్రపతికి నివేదిక అందించిన కోవింద్ కమిటీ
సాక్షి, ఢిల్లీ: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నేడు నివేదకను అందించింది. ఈ సందర్భంగా పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు ఒకేసారి జరగాలని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అయితే, ఈ ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్నిరకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం జరిపింది. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల నివేదికను తయారు చేశారు. ఈ నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కోవింద్ సహా కమిటీ సభ్యులు సమర్పించారు. The High-Level Committee on simultaneous elections, chaired by Ram Nath Kovind, Former President of India, met President Murmu at Rashtrapati Bhavan and submitted its report. Union Home Minister Amit Shah was also present. pic.twitter.com/zd6e5TMKng — ANI (@ANI) March 14, 2024 కాగా, దాదాపు 190 రోజుల పాటు జమిలీ ఎన్నికలపై కమిటీ అధ్యయనం జరిపింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించింది. అనంతరం నివేదికను రూపొందించింది. లోక్‌సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్‌ను సవరించాలని కమిటీ తమ నివేదికలో సూచించినట్లు సమాచారం. మూడుస్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. The High-Level Committee on simultaneous elections, chaired by Ram Nath Kovind, Former President of India, has met President Murmu at Rashtrapati Bhavan and submitted its report. The Report comprises of 18,626 pages, and is an outcome of extensive consultations with… — ANI (@ANI) March 14, 2024 ఇదిలా ఉండగా.. ఏకకాల ఎన్నికల జరగాలని కేంద్రంలోని మోదీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే 2023 సెప్టెంబరులో దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నియమించింది. కేంద్ర మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, కమిటీ సెక్రెటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది. -
జమిలి ఎన్నికలతో ప్రజాధనం ఆదా
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికలు అనేవి భారీ బడ్జెట్ వ్యవహారంగా మారిపోయాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఒకేసారి(జమిలి) నిర్వహిస్తే ఎంతో ప్రజాధనం ఆదా అవుతుందని చెప్పారు. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభలో కిరెణ్ చెప్పారు. ఎన్నికలు ఖరీదైన అంశంగా మారిన నేపథ్యంలో జమిలి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల చట్టాల్లో సంస్కరణల కోసం లా కమిషన్ సమర్పించిన నివేదిక జమిలి ఎన్నికల ఆవశ్యకతను గుర్తుచేసిందన్నారు. పరిపాలనలో స్థిరత్వం కోసం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. జమిలి ఎలక్షన్స్‌తో ప్రజలకే కాదు, పార్టీలకు, అభ్యర్థులకు కూడా లాభమేనని తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించడం వల్ల ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’ని రెండుసార్లు అమలు చేయాల్సి వస్తోందని, దీనివల్ల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోందని కిరణ్ రిజిజు వెల్లడించారు. దేశంలో 1951–52, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయి. అయితే, 1968, 1969లో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దయ్యాయి. దాంతో జమిలి ఎన్నికల గొలుసు తెగిపోయింది. -
కీలక నిర్ణయంపై మరోసారి అఖిలపక్షం భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు అంశంపై కసరత్తు చేస్తోంది. దీనిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంట్ ఉభయసభల్లో ప్రాతినిథ్యం ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను అఖిలపక్ష సమావేశానికి మోదీ ఆహ్వానించారు. ఈనెల 19న ఈ సమావేశం జరుగనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. అలాగే ఈ ఏడాది మహాత్మా గాంధీ 150వ జయంత్యుత్సవాల నిర్వహణతోపాటు, భారత దేశం 2022లో 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకోబోతున్న నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణ గురించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని తెలిపారు. వీటితో పాటు మరో ఐదు అంశాలపై కూడా అఖిలపక్షం చర్చించనుంది. కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి జరగనున్న నేపథ్యంలో ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఆదివారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ ముగిసిన విషయం తెలిసిందే. ఉభయసభలు సజావుగా జరిగేలా సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. -
‘జమిలి ఎన్నికలపై మరింత చర్చ జరగాలి’
సాక్షి, న్యూఢిల్లీ : లా కమిషన్ జమిలి ఎన్నికలపై 164 పేజీల ముసాయిదా నివేదికను విడుదల చేసిన సందర్భంగా జమిలి ఎన్నికలపై మరింత చర్చ జరగాలని అభిప్రాయపడింది. ఏకకాల ఎన్నికల్లో అనేక జటిలమైన సమస్యలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలపై మరింత పరిశీలన అవసరమని పేర్కొంది. కేంద్రానికి సిఫారసు చేసే ముందు అన్ని వర్గాలు మరింత చర్చ జరపాలని కోరింది. లా కమిషన్ ఏకకాల ఎన్నికలపై చర్చకు ఏడు అంశాలను లేవనెత్తింది. లా కమిషన్ చర్చకు ఉంచిన ఏడు అంశాలు : ఏకకాల ఎన్నికల వల్ల రాజ్యాంగ ప్రజాస్వామ్య సమాఖ్య వ్యవస్థకు భంగం కలుగుతుందా? హంగ్ అసెంబ్లీ, పార్లమెంటు ఏర్పడిన సమయంలో పరిస్థితి ఏమిటి ? అటువంటి సమయంలో పదో షెడ్యూల్‌ను సవరించాలా ? ఏకకాల ఎన్నికలు ఆలోచన మంచిదే అయినా ఆచరణాత్మక విధానం ఏమిటి ? రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సవరించాలి ? ముసాయిదా నివేదికలో చర్చించిన అంశాలు కాకుండా ఇంకా మరి ఏమైనా విషయాలు పరిశీలించాల్సి ఉందా? ఏకకాల ఎన్నికల వల్ల రాజ్యాంగపరమైన ఉల్లంఘన జరిగే అవకాశం ఉందా ? ఈ ఏడు అంశాలపై మరింత చర్చ అవసరమని, అన్ని వర్గాలు దీనిపై చర్చించిన తర్వాతే కేంద్రానికి తుది సిఫారసు చేస్తామని తేల్చిచెప్పింది. -
‘జమిలి’కి చాన్సే లేదు: సీఈసీ రావత్
ఔరంగాబాద్: దేశంలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశమే లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ముందుగా న్యాయపరమైన ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందన్నారు. అందుకే పార్లమెంటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కాదన్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఓటరు ధ్రువీకరణ పత్రాలు (వీవీపీఏటీ) యంత్రాలు 100% సిద్ధంగా ఉన్నాయన్నారు. 2019 ఎన్నికల కోసం 17.5 లక్షల వీవీపీఏటీలు ఆర్డర్ ఇవ్వగా.. ఇందులో 10 లక్షల యంత్రాలు వచ్చేశాయన్నారు. మిగిలినవి కూడా త్వరలోనే వస్తాయని ఆయన వెల్లడించారు. సహజంగానే సార్వత్రిక ఎన్నికలకు 14 నెలల ముందునుంచే ఎన్నికల సంఘం సిద్ధమవుతుందని ఈసారి కూడా 2018 ఫిబ్రవరి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నామని ఆయన చెప్పారు. -
జమిలి ఎన్నికలపై తేల్చేసిన రావత్..
సాక్షి, ముంబై : న్యాయపరమైన ప్రక్రియ చేపట్టకుండా దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ అలాంటి అవకాశం లేదని తేల్చిచెప్పారు. గురువారం ఔరంగాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై వివరణ ఇచ్చారు. జమిలి ఎన్నికలపై బీజేపీ చీఫ్ అమిత్ షా లా కమిషన్‌కు లేఖ రాయడం, లా కమిషన్ సానుకూలంగా స్పందించిన క్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ వివరణ ప్రాధాన్యత సంతరించకుంది. దేశవ్యాప్తంగా ఏకకాల ఎన్నికలతో నిర్వహణ వ్యయం తగ్గడంతో పాటు దేశమంతటా ఎప్పుడూ ఎన్నికల వాతావరణం నెలకొనే పరిస్థితికి చెక్ పెట్టవచ్చని అమిత్ షా చెబుతున్నారు. జమిలి ఎన్నికలు కేవలం ప్రతిపాదన కాదని, గతంలో విజయవంతంగా ఈ ప్రయోగాన్ని అమలు చేశారని, తిరిగి దీన్ని అమలుపరచవచ్చని లా కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ బీఎస్ చౌహాన్‌కు గతవారం అమిత్ షా రాసిన ఎనిమిది పేజీల లేఖలో పేర్కొన్నారు. కాగా వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతో పాటు ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వీలైతే నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉందని గతంలో రావత్ పేర్కొన్నారు. అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన యంత్రాంగం, సాధనా సంపత్తి లేవని ఈసీ వర్గాలు స్పష్టం చేశాయి. -
ఒకేసారి ఎన్నికలు కష్టం
న్యూఢిల్లీ: ఒకేసారి ఎన్నికల దిశగా కేంద్రం, అధికార బీజేపీ సంకేతాలిస్తున్న నేపథ్యంలో ఒకేసారి ఎన్నికల నిర్వహణ ఆచరణ సాధ్యం కాదని, అంతేకాకుండా, అందుకు రాజ్యాంగ సవరణ ప్రక్రియ అనివార్యమని ఎన్నికల కమిషన్ తేల్చిచెప్పింది. ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న విలేకరుల ప్రశ్నలకు మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ బదులిచ్చారు. ‘ఒకేసారి ఎన్నికలంటే కొన్ని అసెంబ్లీల పదవీ కాలాన్ని పొడిగించాల్సి వస్తుంది. మరికొన్ని అసంబ్లీల పదవీకాలాన్ని కుదించాలి. అందుకు రాజ్యాంగ సవరణ అవసరం. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు ఈవీఎంలు, వీవీప్యాట్లు తదితర సామగ్రిని సమకూర్చుకోవడం అతిపెద్ద అవరోధంగా మారుతుంది. అదనపు పోలీసు సిబ్బంది, పోలింగ్ యంత్రాంగం భారీగా అవసరం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులో జమిలి ఎన్నికలు సాధ్యం కాదు’ అని రావత్ స్పష్టం చేశారు. ఒకేసారి ఎన్నికలకు తాము సానుకూలమేనంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం లా కమిషన్‌కు లేఖ రాసిన నేపథ్యంలో రావత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్వల్ప కాల వ్యవధిలో ఈవీఎంలు, వీవీప్యాట్లను సమకూర్చుకోవడం సాధ్యం కాదని వివరించారు. ‘ఒకే దేశం..ఒకే ఎన్నిక’కు చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి ఎన్నికల సంఘం 2015లోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది’ అని తెలిపారు. ‘రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం ముగియగానే ఎన్నికలు నిర్వహించే బాధ్యతలను యథా ప్రకారంగా ఎన్నికల సంఘం నిర్వర్తిస్తుంది. ప్రస్తుతానికి 2019 లోక్‌సభ ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లు సమకూర్చుకునే పనిలో ఉన్నామ’న్నారు. ‘2019 లోక్‌సభ ఎన్నికలకు అవసరమైన 13.95 లక్షల ఈవీఎంలు, 9.3 లక్షల కంట్రోల్ యూనిట్లు ఈ సెప్టెంబర్ 30 నాటికి అందుబాటులోకి వస్తాయి. అలాగే, 16.15 లక్షల వీవీప్యాట్లు నవంబర్ చివరి నాటికి మా వద్దకు వస్తాయి’ అని గతంలో ఒక సందర్భంలో రావత్ వివరించారు. 2019లో ఒకేసారి లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే.. ఈసీకి 24 లక్షల ఈవీఎంలు అవసరమవుతాయి. ఒకేసారి ఎన్నికల విషయమై మే 16న లా కమిషన్‌తో జరిపిన చర్చల సందర్భంగా ‘ఒకేసారి ఎన్నికలంటే అదనంగా కొనుగోలు చేయాల్సిన 12 లక్షల ఈవీఎంల కోసం రూ. 4,500 కోట్లు అవసరమవుతాయ’ని ఈసీ స్పష్టం చేసింది. జమిలి ఎన్నికలపై ఈ ఆగస్ట్ చివరిలోగా లా కమిషన్ నివేదిక రూపొందించాల్సి ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా(2019లో), మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్‌ల్లో( 2019 చివర్లో), బీహార్‌లో 2020లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ సంవత్సరం జరగాల్సి ఉన్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలను కూడా కలిపి మొత్తం 11 రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్‌సభ ఎన్నికలతో పాటే ఎన్నికలు జరపాలన్న ఆలోచనలో కేంద్రం, బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడే సాధ్యం కాదు లోక్‌సభ, అసెంబ్లీలకు దేశ వ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు జరపాలనే ప్రతిపాదనకు బీజేపీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ సహా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు స్పందించాయి. ఎన్డీఏ భాగస్వామ్య జేడీయూ పార్టీకి చెందిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా ‘ఒకే జాతి–ఒకే ఎన్నిక’ మంచి ఆలోచనే అయినప్పటికీ వచ్చే సాధారణ ఎన్నికల్లో దానిని అమలు చేయడం సాధ్యం కాదన్నారు. లోక్‌సభను రద్దు చేయండి: కాంగ్రెస్ ఏకకాలంలో ఎన్నికలపై అమిత్ షా సానుకూలంగా స్పందించడంపై కాంగ్రెస్ దీటుగా స్పందించింది. లోక్‌సభను ముందుగానే రద్దు చేసి, ఈ ఏడాది చివర్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలని ప్రధానమంత్రి మోదీకి సవాల్ విసిరింది. ‘ఇందుకు మేం సిద్దం. అలా చేస్తే కాంగ్రెస్ స్వాగతిస్తుంది’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఈ ఏడాది చివర్లో జరగాల్సిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదావేసి, 2019 లోక్‌సభ ఎన్నికలతోపాటు నిర్వహించడం రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం అసాధ్యమని ఆయన తెలిపారు. అమెరికా, రష్యాతోపాటే పెట్టండి: శివసేన బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా ఏకకాలంలో ఎన్నికల ప్రతిపాదనపై ఎద్దేవా చేసింది. వారు ‘బీజేపీ)లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చు. ఇంకా అమెరికా, రష్యాలతో కలిపి కూడా ఏకకాలంలో ఎన్నికలు పెట్టవచ్చు. బీజేపీ నేతలు ఏం ఆలోచిస్తారో ఎవరికీ తెలియదు. ఒకే జాతి–ఒకే ఎన్నిక విధానం వల్ల దేశానికి ఏం లాభం?’ అని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఖండించిన బీజేపీ చట్టప్రకారం, ఏకాభిప్రాయం మేరకే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తామని అధికార బీజేపీ తెలిపింది. లోక్‌సభ ఎన్నికలతోపాటు 11 రాష్ట్రాల్లో అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిపే అవకాశాలున్నాయంటూ వచ్చిన వార్తలను ఖండించింది. -
జమిలిపై తేల్చేసిన ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని బీజేపీ చీఫ్ అమిత్ షా లా కమిషన్‌కు లేఖ రాసిన మరుసటి రోజే జమిలి ఎన్నికలు సాధ్యం కాదని ఎన్నికల కమిషన్ (ఈసీ) చేతులెత్తేసింది. జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన సాధనా సంపత్తి తమ వద్ద లేవని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతో పాటే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడం సాధ్యం కాదని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ మంగళవారం పేర్కొన్నారు.జమిలి ఎన్నికలకు సరిపడినన్ని వీవీపాట్ యంత్రాలు తమ వద్ద లేవని అన్నారు. కాగా దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ బీజేపీ చీఫ్ అమిత్ షా సోమవారం లా కమిషన్‌కు లేఖ రాశారు. రాష్ట్రాల్లో ఏడాది పొడవునా ఎన్నికలు జరుగుతుంటే అభివృద్ధి పనులకు అవరోధం ఏర్పడుతున్నదని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. తరచూ ఎన్నికలతో పెద్దసంఖ్యలో అధికారులు, సిబ్బందిని ఎన్నికల విధుల్లో నిమగ్నం చేయడంతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతోందన్నారు. -
ఏకకాల ఎన్నికలకు రజినీ మద్దతు
సాక్షి, చెన్నై: లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్న కేంద్రం ప్రతిపాదనకు ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ మద్దతు తెలిపారు.అన్ని ఎన్నికలూ ఒకేసారి జరిగితే సమయం, ఖర్చు ఆదా అవుతాయని రజినీ అన్నారు. అలాగే 277 కి.మీ. పొడవైన, రూ.పదివేల కోట్లతో చేపట్టనున్న చెన్నై–సేలం 8 వరుసల రహదారి ప్రాజెక్టునూ ఆయన సమర్థించారు. ఈ ప్రాజెక్టు సాగు, అటవీ భూములకు చేటు అంటూ కొందరు వ్యతిరేకిస్తుండగా.. అభివృద్ధి జరగాలంటే ఇలాంటివి అవసరమేననీ, అయితే భూములు కోల్పోయే వారికి తగిన నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. బాలుడి దత్తత: పాఠశాలకు వెళ్తున్నప్పుడు రూ.50 వేలు డబ్బు దొరకగా నిజాయితీతో దానిని పోలీసులకు అప్పగించిన ఏడేళ్ల బాలుడు మహ్మద్ యాసిన్‌ను దత్తత తీసుకుంటానని రజినీ ప్రకటించారు. ఈరోడ్‌కు చెందిన యాసిన్‌తోపాటు, అతని తల్లిదండ్రుల్ని రజినీకాంత్ తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. బాలుడికి బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చిన ఆయన.. ఆ పిల్లాడి ఉన్నత విద్యకయ్యే ఖర్చునంతా తానే భరిస్తానని చెప్పారు. -
జమిలి ఎన్నికలకు వైఎస్సార్ సీపీ మద్దతు
-
జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు