ఓపీ రావత్
న్యూఢిల్లీ: ఒకేసారి ఎన్నికల దిశగా కేంద్రం, అధికార బీజేపీ సంకేతాలిస్తున్న నేపథ్యంలో ఒకేసారి ఎన్నికల నిర్వహణ ఆచరణ సాధ్యం కాదని, అంతేకాకుండా, అందుకు రాజ్యాంగ సవరణ ప్రక్రియ అనివార్యమని ఎన్నికల కమిషన్ తేల్చిచెప్పింది. ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న విలేకరుల ప్రశ్నలకు మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ బదులిచ్చారు. ‘ఒకేసారి ఎన్నికలంటే కొన్ని అసెంబ్లీల పదవీ కాలాన్ని పొడిగించాల్సి వస్తుంది. మరికొన్ని అసంబ్లీల పదవీకాలాన్ని కుదించాలి. అందుకు రాజ్యాంగ సవరణ అవసరం.
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు ఈవీఎంలు, వీవీప్యాట్‌లు తదితర సామగ్రిని సమకూర్చుకోవడం అతిపెద్ద అవరోధంగా మారుతుంది. అదనపు పోలీసు సిబ్బంది, పోలింగ్ యంత్రాంగం భారీగా అవసరం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులో జమిలి ఎన్నికలు సాధ్యం కాదు’ అని రావత్ స్పష్టం చేశారు. ఒకేసారి ఎన్నికలకు తాము సానుకూలమేనంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం లా కమిషన్‌కు లేఖ రాసిన నేపథ్యంలో రావత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్వల్ప కాల వ్యవధిలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లను సమకూర్చుకోవడం సాధ్యం కాదని వివరించారు.
‘ఒకే దేశం..ఒకే ఎన్నిక’కు చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి ఎన్నికల సంఘం 2015లోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది’ అని తెలిపారు. ‘రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం ముగియగానే ఎన్నికలు నిర్వహించే బాధ్యతలను యథా ప్రకారంగా ఎన్నికల సంఘం నిర్వర్తిస్తుంది. ప్రస్తుతానికి 2019 లోక్‌సభ ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్‌లు సమకూర్చుకునే పనిలో ఉన్నామ’న్నారు. ‘2019 లోక్‌సభ ఎన్నికలకు అవసరమైన 13.95 లక్షల ఈవీఎంలు, 9.3 లక్షల కంట్రోల్ యూనిట్లు ఈ సెప్టెంబర్ 30 నాటికి అందుబాటులోకి వస్తాయి. అలాగే, 16.15 లక్షల వీవీప్యాట్‌లు నవంబర్ చివరి నాటికి మా వద్దకు వస్తాయి’ అని గతంలో ఒక సందర్భంలో రావత్ వివరించారు.
2019లో ఒకేసారి లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే.. ఈసీకి 24 లక్షల ఈవీఎంలు అవసరమవుతాయి. ఒకేసారి ఎన్నికల విషయమై మే 16న లా కమిషన్‌తో జరిపిన చర్చల సందర్భంగా ‘ఒకేసారి ఎన్నికలంటే అదనంగా కొనుగోలు చేయాల్సిన 12 లక్షల ఈవీఎంల కోసం రూ. 4,500 కోట్లు అవసరమవుతాయ’ని ఈసీ స్పష్టం చేసింది. జమిలి ఎన్నికలపై ఈ ఆగస్ట్ చివరిలోగా లా కమిషన్ నివేదిక రూపొందించాల్సి ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా(2019లో), మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్‌ల్లో( 2019 చివర్లో), బీహార్లో 2020లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ సంవత్సరం జరగాల్సి ఉన్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలను కూడా కలిపి మొత్తం 11 రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్‌సభ ఎన్నికలతో పాటే ఎన్నికలు జరపాలన్న ఆలోచనలో కేంద్రం, బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడే సాధ్యం కాదు
లోక్‌సభ, అసెంబ్లీలకు దేశ వ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు జరపాలనే ప్రతిపాదనకు బీజేపీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ సహా ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలు స్పందించాయి. ఎన్‌డీఏ భాగస్వామ్య జేడీయూ పార్టీకి చెందిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా ‘ఒకే జాతి–ఒకే ఎన్నిక’ మంచి ఆలోచనే అయినప్పటికీ వచ్చే సాధారణ ఎన్నికల్లో దానిని అమలు చేయడం సాధ్యం కాదన్నారు.
లోక్‌సభను రద్దు చేయండి: కాంగ్రెస్
ఏకకాలంలో ఎన్నికలపై అమిత్ షా సానుకూలంగా స్పందించడంపై కాంగ్రెస్ దీటుగా స్పందించింది. లోక్‌సభను ముందుగానే రద్దు చేసి, ఈ ఏడాది చివర్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలని ప్రధానమంత్రి మోదీకి సవాల్ విసిరింది. ‘ఇందుకు మేం సిద్దం. అలా చేస్తే కాంగ్రెస్ స్వాగతిస్తుంది’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఈ ఏడాది చివర్లో జరగాల్సిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదావేసి, 2019 లోక్‌సభ ఎన్నికలతోపాటు నిర్వహించడం రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం అసాధ్యమని ఆయన తెలిపారు.
అమెరికా, రష్యాతోపాటే పెట్టండి: శివసేన
బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా ఏకకాలంలో ఎన్నికల ప్రతిపాదనపై ఎద్దేవా చేసింది. వారు ‘బీజేపీ)లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చు. ఇంకా అమెరికా, రష్యాలతో కలిపి కూడా ఏకకాలంలో ఎన్నికలు పెట్టవచ్చు. బీజేపీ నేతలు ఏం ఆలోచిస్తారో ఎవరికీ తెలియదు. ఒకే జాతి–ఒకే ఎన్నిక విధానం వల్ల దేశానికి ఏం లాభం?’ అని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
ఖండించిన బీజేపీ
చట్టప్రకారం, ఏకాభిప్రాయం మేరకే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తామని అధికార బీజేపీ తెలిపింది. లోక్‌సభ ఎన్నికలతోపాటు 11 రాష్ట్రాల్లో అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిపే అవకాశాలున్నాయంటూ వచ్చిన వార్తలను ఖండించింది.
Comments
Please login to add a commentAdd a comment