
ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ (ఫైల్‌ఫోటో)
ఏకకాల ఎన్నికలు సాధ్యం కాదు..
సాక్షి, ముంబై : న్యాయపరమైన ప్రక్రియ చేపట్టకుండా దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ అలాంటి అవకాశం లేదని తేల్చిచెప్పారు. గురువారం ఔరంగాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై వివరణ ఇచ్చారు.
జమిలి ఎన్నికలపై బీజేపీ చీఫ్ అమిత్ షా లా కమిషన్‌కు లేఖ రాయడం, లా కమిషన్ సానుకూలంగా స్పందించిన క్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ వివరణ ప్రాధాన్యత సంతరించకుంది. దేశవ్యాప్తంగా ఏకకాల ఎన్నికలతో నిర్వహణ వ్యయం తగ్గడంతో పాటు దేశమంతటా ఎప్పుడూ ఎన్నికల వాతావరణం నెలకొనే పరిస్థితికి చెక్ పెట్టవచ్చని అమిత్ షా చెబుతున్నారు.
జమిలి ఎన్నికలు కేవలం ప్రతిపాదన కాదని, గతంలో విజయవంతంగా ఈ ప్రయోగాన్ని అమలు చేశారని, తిరిగి దీన్ని అమలుపరచవచ్చని లా కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ బీఎస్ చౌహాన్‌కు గతవారం అమిత్ షా రాసిన ఎనిమిది పేజీల లేఖలో పేర్కొన్నారు. కాగా వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతో పాటు ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వీలైతే నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉందని గతంలో రావత్ పేర్కొన్నారు. అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన యంత్రాంగం, సాధనా సంపత్తి లేవని ఈసీ వర్గాలు స్పష్టం చేశాయి.