ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ (పాత చిత్రం)
సాక్షి, హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో పింక్ బ్యాలెట్ కొనసాగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓం ప్రకాశ్ రావత్ స్పష్టం చేశారు. సాంకేతికత ద్వారా డూప్లికేట్ ఓటర్లను తొలగించడమనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని తాజ్ కృష్ణా హోటల్‌లో విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా... ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని జిల్లాల టీమ్‌లతో సమీక్ష చేశామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ఆరోపణలు- ప్రత్యారోపణల నేపథ్యంలో పర్యవేక్షణ చర్యలు ఉండాలని, శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 32574 పోలింగ్ కేంద్రాలు ఉండగా అదనంగా మరో 222 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈవీఎంలలో ఓట్లు లెక్కపెట్టిన తర్వాత అనుమానాలు ఉంటే వీవీప్యాట్‌లలో ఓట్లను టాలీ చేస్తామని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
211 పెయిడ్ న్యూస్ కేసులు..
వివిధ రాజకీయ పార్టీలతో ఓపీ రావత్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అధికార దుర్వినియోగం, ఉద్యోగుల కేసుల మీద ఇచ్చిన జీవో, టెలిఫోన్ ట్యాపింగ్, మత విద్వేషాలు, మంత్రుల పర్యటనలు వంటి పలు అంశాల మీద ఫిర్యాదులు అందాయని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ మీద వచ్చిన ఫిర్యాదులపై స్పందించడం లేదన్న ఆరోపణలను కొట్టిపారేశారు. డబ్బులు, చీరలు, మద్యం పంపిణీ మీద కొన్ని పార్టీలు ఫిర్యాదు చేశాయని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన ప్రతీ పార్టీపైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రచార కార్యక్రమాల్లో నాయకులు వాడుతున్న భాష మీద వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామన్నారు. అదేవిధంగా డబ్బు ఖర్చు విషయంలో ఉల్లంఘనలకు పాల్పడిన అభ్యర్థుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీడియాలో పెయిడ్ న్యూస్ వేస్తున్నారని, పార్టీ సొంత పేపర్, ఛానెల్స్ ద్వారా విద్వేషపు ప్రచారం చేస్తున్నారంటూ వివిధ రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయని ఓపీ రావత్ తెలిపారు. ఈ క్రమంలో 211 పెయిడ్ న్యూస్ కేసులు వచ్చాయని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలపై కచ్చితంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment