రజత్ కుమార్(పాత చిత్రం)
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్‌తో సమావేశం అయ్యారు. వీరి భేటీ సుదీర్ఘంగా ఐదున్నర గంటలపాటు కొనసాగింది. అనంతరం రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం తెలంగాణకు రానున్న నేపథ్యంలో.. వారి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై చర్చించామని తెలిపారు. తెలంగాణలో ఎన్నికల కసరత్తు, సంసిద్దత అంశాలను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించానని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ ఉమేశ్ సిన్హా బృందం తెలంగాణలో పర్యటించిన తరువాత కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
మరోవైపు తెలంగాణ ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ముసాయిదాను సోమవారం విడుదల చేసింది. ఈ జాబితాపై సెప్టెంబర్ 25వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని పేర్కొంది. అక్టోబర్ 4 వరకు అభ్యంతరాలను పరిష్కరించి.. అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment