మాట్లాడుతున్న ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి కారు గుర్తుకు, ఆటో గుర్తుకు మధ్య తికమక ఉందన్న ఫిర్యాదు మేరకు ఆటో గుర్తును తెలంగాణలో నిలిపివేసినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇచ్చామన్నారు. అక్టోబర్ 12 నాడు జాబితా విడుదల చేసామని తెలిపారు. అక్టోబర్ 14న హార్డ్ కాపీలు ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో అంటించామని, వాటిని అప్డేట్ చేస్తున్నామని పేర్కొన్నారు. నవంబర్ 19 తరువాత రెండవ జాబితా విడుదల చేస్తామన్నారు. అందరూ ఓటర్ల జాబితాలో తమ పేరును చెక్ చేసుకోవాలని సూచించారు. మహిళల కంటే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు.
4 లక్షల 12వేల మందికిపైగా వికలాంగులు పెన్షన్ తీసుకుంటున్నారని వెల్లడించారు. బ్రెయిల్ లిపిలో ఓటర్ కార్డులు ఇస్తామన్నారు. వాహన సదుపాయాలు, వీల్ ఛైర్లు అందుబాటులో ఉంచేందుకు ఎంతమంది ఉన్నారో వివరాలు సేకరించాలన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. స్లోప్ మరింత పెంచేందుకు ఆదేశాలిచ్చాం. నవంబర్ 24, 25న అబ్జర్వర్లు వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఇప్పటి వరకు రూ. 31.41కోట్ల నగదు సీజ్ చేసాం. రూ. 25.83 కోట్ల రూపాయలు పోలీస్ ఫోర్స్ ద్వారా రూ. 5.58 కోట్లు ఐటీ శాఖ ద్వారా సీజ్ చేశాం. కోటి విలువైన మద్యం సీజ్ చేశాం. గుడుంబా నిర్మూలన జరిగింది. చత్తీస్‌ఘడ్, ఆంధ్రా, మహారాష్ట్ర అధికారులతో సమావేశాలు నిర్వహించాం. కావాల్సిన పోలీస్ సిబ్బంది ఉన్నారు. 307 కంపెనీలను అడిగాం, చర్చలు నడుస్తున్నాయి. 22 కంపెనీలు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చారు.
ఓటింగ్‌లో ప్రజలు స్వేచ్చగా పొల్గొనేందుకు మార్చ్ ఫాస్ట్‌లు ప్రారంభిస్తాం. 6 లైసెన్సు లేని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. 7411 లైసెన్సు ఉన్న ఆయుధాలను స్వాధీనం చేశారు. 43,191 మందిని బైండోవర్ చేశాం. 3765 మందికి నోటీసులు పంపించాం. అధికార బంగళాలను పార్టీకోసం వినియోగిస్తున్నారన్న ఫిర్యాదుపై టీఆర్ఎస్ పార్టీకి లేఖ రాశాం. ఓటర్ల అవగాహన కోసం ప్రచారం చేస్తున్నాం. గతంలో కంటే ఇప్పుడు మహిళా ఓటర్ల నమోదు సంఖ్య పెరిగింది. తెలంగాణలో ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల వ్యవహారంపై ఏపీ డీజీపీని వివరాలు కోరుతాం. గచ్చిబౌలిలో జరిగే సెన్సేషనల్ ఈవెంట్‌పై విచారణ చేపడతాం. ఏ ఈవెంట్ కైనా స్థానిక అధికారుల అనుమతి ఇస్తారు.
నారాయణఖేడ్ నియోజకవర్గ అభ్యర్ది మాటలపై విచారణకు ఆదేశించాం. ఆ కేసు అట్రాసిటి కిందకు వస్తుంది. 11కేసులు పరిష్కరించాం. 46 ఫిర్యాదులపై విచారణ జరుగుతోంది. నామినేషన్ రోజునుంచే ప్రకటనల ఖర్చు లెక్కిస్తాం. ప్రస్తుత ఖర్చుపై పార్టీ అకౌంట్ లెక్కలు చూపించమని అడుగుతాం. అన్ని మీడియాలను 24గంటలు రికార్డ్ చేస్తున్నాం. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే మేం చర్యలు తీసుకుంటాం. అవసరమైతే సోషల్ మీడియా సహకారం తీసుకుంటాం. అన్ని శాఖలు, అన్ని సంస్థల నుంచి నాకు రిపోర్టులు వస్తున్నాయి. సీవిజిల్ యాప్ ఆలస్యంపై నేను కూడా సంతృప్తిగా లేను. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఎన్నికల కోడ్ అమలు మరింత సులువవుతుంది. త్వరలోనే ఈ యాప్ అందుబాటులోకి వస్తుంది. మంత్రుల పీఆర్వోల ప్రచారంపైన దృష్టిసారిస్తాం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment