హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఓటింగ్ రోజైన డిసెంబరు 7వ తేదీన, దేశ రక్షణ, భద్రతకు సంబంధించిన సంస్థలు తప్ప అన్ని కంపెనీలు, సంస్థలూ సెలవు పాటించేల్సిందేననీ, ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు, సంస్థలకు, విద్యాలయాలకు సెలవు ప్రకటించామని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన సీఈఓ, ప్రముఖులతో గురువారం సైబరాబాద్‌లో జరిపిన ఇష్టాగోష్ఠి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘దేశం, ప్రజాస్వామ్యం.. వీటిదే మొదటి ప్రాధాన్యతగా ఉండాలనీ, మీరంతా మార్పునకు ప్రతినిధులుగా వ్యవహరించాలి’’ అని ఉద్బోధించారు.
విదేశీ ఖాతాదారుల ప్రయోజనాల దృష్ట్యా అక్కడి వారి పనివేళలను అనుసరించడం, అలాగే కీలకమైన వ్యాపారపరమైన కార్యకలాపాలు కూడా నిర్వర్తించాల్సి ఉన్నందున, ఉద్యోగులు అన్ని సెలవు రోజుల్లో కూడా పనిచేయాల్సి ఉంటుందనీ, అందువల్ల రోజంతా పూర్తిగా సెలవు ప్రకటించకుండా తమకు మినహాయింపు ఇవ్వాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్.సి.ఎస్.సి) ప్రతినిధులు కోరినప్పడు డా. రజత్ కుమార్ పైవిధంగా స్పందించారు. అయితే పౌరులుగా తమ బాధ్యత నెరవేరుస్తామని, తమ వద్ద పనిచేసే వారందరూ ఓటు వేసి రావడానికి అవసరమైన రవాణా సౌకర్యాలు, విధి నిర్వహణ వేళల సడలింపు వంటి చర్యలు తీసుకుంటామని వారు గట్టి హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చెప్పిన విషయాలతో ఏకీభవిస్తూ అక్కడ హాజరైన వారందరూ చేతులెత్తి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ‘‘ఎంతో ప్రగతి శీలకంగా ఆలోచించే వారు మీ రంగంలో ఉన్నారు. దేశం ముందుకు పోతున్నకొద్దీ మీరు కూడా వ్యవస్థలో భాగస్వాములు కావాలి. ఓటు వేయడంలో మన బాధ్యతను మరిచి - అమెరికా, జపాన్, సింగపూర్‌లతో పోలిస్తే మన వ్యవస్థ ఘోరంగా ఉందనడం సరికాదనీ, మనం ఓటు వేయకపోతే జరిగే దుష్పరిణామాలకు మొత్తం దేశ ప్రజలందరూ కొన్ని సంవత్సరాలపాటు బాధపడాల్సి వస్తుందని డా.రజత్ కుమార్ హెచ్చరించారు. అలాగే ఐటీ కంపెనీల్లోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న వారి సూచనలను ప్రస్తావిస్తూ దేశంలో ప్రతి పౌరుడూ తను ఉంటున్న ఇంటి నుంచీ 500 మీటర్ల దూరం దాటి వెళ్ళే అవసరం లేకుండా పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నప్పుడు వారి సూచన పాటించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేసారు.
మరి కొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను దుర్వినియోగం చేయడం సాధ్యంకాదనీ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, దేశ చట్ట పరిమితులకు లోబడి, పేరెన్నికగన్న ప్రభుత్వ సంస్థలు వాటిని తయారు చేశాయనీ, ప్రతి స్థాయిలో వాటిని పలు రకాలుగా ప్రజలు, ప్రజా ప్రతినిధుల సమక్షంలోనే పరీక్షించడం జరుగుతున్నదని ఆయన వివరించారు. సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ ప్రారంభ ఉపన్యాసం చేసి అందర్నీ ఓటు హక్కు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్, జీహెచ్‌ఎంసీ సెంట్రల్ జోన్ కమీషనర్ హరి చందన, కార్మిక విభాగం జాయింట్ కమీషనర్ ఆర్. చంద్రశేఖర్, ఎస్.సి.ఎస్.సి కార్యదర్శి, ఇన్ఫోపీర్స్ సీఈఓ భరణీ కుమార్ ఆరోల్, రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దేశం, ప్రజాస్వామ్యం.. ఇదే మన ప్రాధాన్యత: రజత్ కుమార్
Published Thu, Nov 29 2018 6:44 PM | Last Updated on Thu, Nov 29 2018 6:51 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment