హైదరాబాద్: ఎన్నికల సమయంలో సర్వేలు చేసుకోవచ్చునని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్ కుమార్ తెలిపారు. బుధవారం మీడియాతో రజత్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణాకు 4 రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయని, పక్కరాష్ట్రాల సరిహద్దు జిల్లాలతో సమన్వయం చేసుకుంటున్నామని వెల్లడించారు. 31 జిల్లాల ఎన్నికల పరిశీలకులు పోలింగ్ ఏర్పాట్లపై నిమగ్నమై ఉన్నారని చెప్పారు. బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ డిసెంబర్ ఒకటి నాటికి పూర్తి చేస్తున్నామని అన్నారు. తెలంగాణాలో 2.8 కోట్ల ఓటర్లు ఉన్నారని, కొత్తగా 19 లక్షల మంది ఓటర్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. 7 లక్షల మంది యువత మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ఓటర్ స్లిప్ పంపిణీ ప్రారంభించామని, డూప్లికేట్ ఓటర్లు కూడా ఉన్నారని ఆయన అంగీకరించారు. .
రూ.104 కోట్లు స్వాధీనం
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి రూ.104 కోట్ల విలువ చేసే నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నామని రజత్ కుమార్ తెలిపారు. నగరంలో అన్ని చోట్ల ఒకే పార్టీకి హోర్డింగ్స్ పెట్టడానికి అవకాశం ఇస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని, అన్ని పార్టీలకు సమాన అవకాశం ఇవ్వాలని సూచించామని తెలిపారు. గోషామహల్ ఇండిపెండెంట్ అభ్యర్థి మిస్సింగ్ కేసుపై నివేదిక ఇంకా రాలేదని వెల్లడించారు. కొడంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఇంట్లో సోదాలు జరిగాయి..రిపోర్టు వచ్చింది..ఇంకా పూర్తిస్థాయిలో చూడలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment