Rajat Kumar
-
త్వరలో నీటిపారుదల సమీకృత చట్టం
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖకు సంబంధించిన 18 వేర్వేరు చట్టాలను కలిపి కొత్తగా ఒక సమీకృత నీటిపారుదల చట్టాన్ని తెస్తున్నామని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే ముసాయిదా బిల్లును సిద్ధం చేశామని, బడ్జెట్ సమావేశాల్లో కాకుండా ఆ తర్వాత జరిగే సమావేశాల్లో ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశముందన్నారు. నీటిపారుదలశాఖపై ఈఎన్సీ సి.మురళీధర్‌తో కలసి మంగళవారం ఆయన జలసౌధలో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నిజాం కాలం నాటి ఫసలి చట్టం 1935 అమల్లో ఉండగా రాష్ట్ర నీటిపారుదల రంగంలో సమూల మార్పులు రావడంతో కొత్త చట్టం అనివార్యమైందన్నారు. నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణతోపాటు నీటి నిర్వహణ పద్ధతులు, ఆర్థికపరమైన అధికారాలు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిబంధనల్లో భారీ మార్పులు వచ్చాయని... నీటిపారుదల ఆస్తుల పరిరక్షణ, నీటి భద్రత, నిర్వహణ అంశాలు పాత చట్టాల్లో లేవని, కొత్త చట్టంలో వాటిపై కచి్చతమైన నిబంధనలను పొందుపరచనున్నట్లు రజత్‌కుమార్ వెల్లడించారు. సెక్షన్–3పై వెనక్కి తగ్గలేదు.. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపకాల కోసం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం–1956లోని సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని రజత్‌కుమార్ తెలిపారు. కృష్ణా జలాల పంపిణీ బాధ్యతను కొత్త ట్రిబ్యునల్‌కు అప్పగించాలా లేక ఇప్పటికే మనుగడలో ఉన్న కృష్ణా ట్రిబ్యునల్–2 లేదా మరే ఇతర ట్రిబ్యునల్‌కు అప్పగించాలా? అనే అంశంపై న్యాయశాఖ సలహా మేరకు చర్యలు తీసుకుంటామని గత అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. దీనిపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆ శాఖ అధికారులు గతేడాది డిసెంబర్లో హామీ ఇచ్చారని... అందువల్ల ఈ విషయమై మళ్లీ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లాలనే భావనతో ఉన్నామని చెప్పారు. ఒకవేళ కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల వాటా ఉండగా తెలంగాణకు 575 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని, ట్రిబ్యునల్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. గోదావరి జలాల విభజనకూ కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును ఏపీ కోరడంపై స్పందిస్తూ తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. ఎనిమిది డ్యామ్‌ల మరమ్మతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు.. ఆనకట్టల భద్రతా చట్టం కింద కడెం, మూసీ, స్వర్ణతోపాటు మొత్తం 8 డ్యామ్‌ల మరమ్మతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని తెలిపారు. మూసీ ప్రాజెక్టు పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. సీతమ్మసాగర్ జలాశయం నిర్మాణంతో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పంపులు నీటమునగనున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. -
6లోగా వరదలపై నివేదిక ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్ : వరదల నివారణకు శాశ్వత చర్యలను సూచించడంతో పాటు ఏయే ప్రాంతాలను తరలించాల్సి ఉంటుందో సిఫారసు చేసేలా వరదలపై సమగ్ర నివేదికను నవంబర్ 6లోగా సమర్పించాలని నిపుణుల కమిటీని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్‌కుమార్ ఆదేశించారు. నవంబర్ 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికను సమర్పించి, తదుపరి ఆమోదం తీసుకుంటామని తెలిపారు. భద్రాచలం పరిసరాలు నీట మునగడానికి పోలవరం బ్యాక్ వాటర్‌తో పాటు ఉప నదుల ప్రవాహం సజావుగా లేకపోవడం, నిలిచి ఉన్న నీరే కారణమని నిపుణుల కమిటీ తేల్చింది. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాలతో నీటిపారుదలశాఖ ఈఎన్సీ (ఓ అండ్ ఎం) బి.నాగేంద్రరావు నేతృత్వంలో నిపుణుల కమిటీ వేశారు. ప్రాథమిక అధ్యయనం అనంతరం అందులోని అంశాలపై శుక్రవారం జలసౌధలో నీటి పారుదలశాఖ రజత్‌కుమార్, ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, ఈఎన్సీ (గజ్వేల్) బి.హరిరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏడాదిలో 8 నెలలపాటు 892 ఎకరాలు ముంపులోనే... పోలవరం నిర్మాణం పూర్తయి...150 అడుగులు (పూర్తిస్థాయి రిజర్వాయర్ లెవల్)లో నీటిని నిల్వ చేస్తే ఏడాదిలో 8 నెలల పాటు తెలంగాణలోని 892 ఎకరాలు నీట మునుగుతాయని నిపుణులు వివరించారు. ఈ భూములను పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలోనే భాగంగానే సేకరించాలని కమిటీ తెలిపింది. పోలవరం వద్ద డ్యామ్ నిర్మాణం జరగని సమయంలో 25.53 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తే పోలవరం నిర్మాణంలో 2,159 లక్షల క్యూసెక్కుల ప్రవాహానికే పరిమితమైందని ఈ కారణంగా 103 గ్రామాల్లోనే 40వేల ఎకరాలు నీటమునగగా..28వేల మంది దీనికి ప్రభావితులయ్యారని గుర్తు చేశారు. పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా భద్రాచలం, బూర్గంపాడు, సారపాక వంటి లోతట్టు ప్రాంతాల్లో నీటిని నిరంతరం పంపింగ్ చేయాల్సి ఉంటుందని, దీని కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ అండ్ మెయిటెనెన్స్ ప్రణాళికను సిద్ధం చేయాలని వివరించారు. -
కాళేశ్వరం అనుమతులు పునరుద్ధరించాలి
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండడాన్ని కారణంగా చూపి, కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు అనుమతులు జారీ చేసే ప్రక్రియను గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) నిలిపివేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. అనుమతుల ప్రక్రియను పునరుద్ధరించేలా గోదావరి బోర్డును ఆదేశించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ కేంద్ర జలశక్తి శాఖకు బుధవారం లేఖ రాశారు. అనుమతులు లేకుండా చేపట్టిన అదనపు టీఎంసీ పనుల విషయంలో మాత్రమే యధాతథాస్థితి కొనసాగించాలని సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని లేఖలో స్పష్టం చేశారు. అన్ని అనుమతులున్న కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగానే అదనపు టీఎంసీ పనులను చేపట్టినట్టు ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కలసి నివేదించినట్టు గుర్తు చేశారు. గెజిట్ నోటిఫికేషన్లో పొందుపర్చిన అనుమతి లేని జాబితాల నుంచి అదనపు టీఎంసీ పనుల భాగాన్ని తొలగించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర జలశక్తి శాఖ మధ్య ఈ ప్రాజెక్టు విషయంలో ఆ తర్వాత కాలంలో సమగ్ర చర్చలు జరిగాయన్నారు. సీడబ్ల్యూసీ కోరిన అన్ని రకాల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని వివరించారు. ఆ తర్వాతే ఈ ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాలని గోదావరి బోర్డుకు సీడబ్ల్యూసీ సిఫారసు చేసిందన్నారు. ఈ దశలో అనుమతుల ప్రక్రియను గోదావరి బోర్డు నిలుపుదల చేస్తే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతుల ప్రక్రియను సత్వరంగా పూర్తి చేయాలని గోదావరి బోర్డును ఆదేశించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గోదావరి బోర్డు అత్యుత్సాహం.. సీడబ్ల్యూసీ సిఫారసు చేసిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు సవరణ డీపీఆర్‌కు అనుమతుల ప్రక్రియను నిలుపుదల చేసే అధికారం గోదావరి బోర్డుకు లేదని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. డీపీఆర్‌ను పరిశీలించిన తర్వాత వాటిని బోర్డు సమావేశంలో ఉంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభిప్రాయాలను గోదావరి బోర్డు స్వీకరించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ)కి డీపీఆర్‌ను గోదావరి బోర్డు పంపించాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు. టీఏసీ క్లియరెన్స్ లభించిన తర్వాత అపెక్స్ కౌన్సిల్లో చర్చించి ప్రాజెక్టుకు అనుమతి ఇస్తారని అధికారులు చెపుతున్నారు. అనుమతుల ప్రక్రియను నిలుపుదల చేసి గోదావరి బోర్డు అత్యుత్సాహం ప్రదర్శించిందని విమర్శిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సవరణ డీపీఆర్‌ను బోర్డు వెనక్కి తిప్పి పంపలేదని, కేవలం పరిశీలన జరపడానికి నిరాకరించిందని ఓ అధికారి తెలిపారు. -
కాళేశ్వరం పర్యవేక్షణకు ‘కమాండ్ కంట్రోల్’
గజ్వేల్ రూరల్: రాష్ట్రంలోని నదులు, రిజర్వాయర్లు, ప్రధాన కాలువలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పరిస్థితులను తెలుసుకునేందుకు ఇరిగేషన్ శాఖ డేటా సపోర్టింగ్ సిస్టంను తయారు చేసిందని.. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం గజ్వేల్, కరీంనగర్‌లలో కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. శనివారం ఆయన గజ్వేల్ పట్టణంలోని కాళేశ్వరం ఎస్ఈ కార్యాలయంలో కమాండ్ కంట్రోలింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఈలు, ఈఈలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు చేరుతున్నప్పటికీ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రాల ద్వారా వరదలు వచ్చినపుడే కాకుండా సాధారణ సమయాల్లోనూ నదులు, ప్రాజెక్టుల సామర్థ్యం, నీటి ప్రవాహ వేగం పరిశీలన, నీటి నిల్వలు, కాలువల కింద ఎంత నీటి అవసరమున్నదనే విషయాలను లెక్కగట్టి నీరు విడుదల చేసే అవకాశముంటుందన్నారు. వరదల జరిగిన నష్టం పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టచర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇటీవల వరదల వల్ల లక్ష్మీ పంప్‌హౌస్‌లోకి వచ్చిన నీటిని తొలగించే పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆయా ప్రాజెక్టుల వద్ద అవసరమైన చర్యలు చేపట్టేందుకు అధికారులంతా అప్రమత్తతతో ఉన్నట్లు వివరించారు. -
Kaleshwaram Project: వందల కోట్ల నష్టమనే ప్రచారం అవాస్తవం: రజత్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన అన్నారం, మేడిగడ్డ పంపుహౌస్‌లు నీట మునగడంతో రూ.వందల కోట్ల నష్టం వాటిల్లిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. వరదలతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల మేరకు మాత్రమే నష్టం జరిగిందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. ఒప్పందం మేరకు ఈ నష్టాన్ని కూడా నిర్మాణ సంస్థలే భరిస్తాయని, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. 45 రోజుల్లోగా కాళేశ్వరం పంపుహౌస్‌లకు మరమ్మతులు పూర్తి చేస్తామని.. సెప్టెంబర్‌లోగా పూర్తిగా పునరుద్ధరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో వరదల కారణంగా సాగునీటి ప్రాజెక్టులకు వాటిల్లిన నష్టంపై రజత్‌కుమార్ బుధవారం జలసౌధలో సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తు వరదల ప్రభావాన్ని సరిగా అంచనా వేయకుండానే కాళేశ్వరం ప్రా జెక్టు నిర్మించడంతో పంపుహౌస్‌లు నీటమునిగాయన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఎవరూ సరిగా అంచనా వేయలేదు వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా క్లౌడ్ బరస్ట్ వంటి పరిస్థితులు ఉత్పన్నం కావడంతో పంపుహౌస్‌లు నీటమునిగాయని రజత్‌కుమార్ పేర్కొన్నారు. కేంద్ర జల సంఘంలోని 18 విభాగాల నుంచి అనుమతులు లభించాకే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామన్నారు. భారత వాతావరణ శాఖ, యూరోపియన్ శాటిలైట్ ఏజెన్సీలు సైతం వర్షాలు, వరదల తీవ్రతను సరిగ్గా అంచనా వేయలేక పోయాయని చెప్పారు. జలవనరుల శాఖలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి కడెం ప్రాజెక్టుకు ఇటీవలే మరమ్మతులు చేశామని.. అందువల్లే రికార్డు స్థాయిలో వరద వచ్చినా ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. గత వందేళ్లలో ఎన్నడు లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు మండలాల్లో 30 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురవడంతోనే కడెంకు భారీ వరద వచ్చిందన్నారు. పోలవరంతో తెలంగాణలో భారీ ముంపు గోదావరి నదిపై ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో తెలంగాణలో లక్ష ఎకరాల మేర ముంపు బారినపడతాయని రజత్‌కుమార్ పేర్కొన్నారు. భద్రాచలం, పర్ణశాలతోపాటు పలు చారిత్రాక ప్రదేశాలు మునిగిపోతాయన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం జరపాలని కేంద్రానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా ఇప్పటివరకు స్పందన లేదని విమర్శించారు. -
సుజల తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలో రాష్ట్రంలో సగటు భూగర్భ జల మట్టం 4 మీటర్లకు పైగా పెరిగిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జలసౌధలో జరిగిన రాష్ట్ర భూగర్భ జలాల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ‘భూగర్భ వనరులు–2020’నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూగర్భజల మట్టం మీటర్ పెరుగుదల 100 టీఎంసీల నీటితో సమానమన్నా రు. ఐదేళ్లలో 400 టీఎంసీల మేరకు భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. 93% మండలాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందాయన్నారు. 50 శాతానికి తగ్గిన భూగర్భ జల వినియోగం 2016–17లో రాష్ట్రంలో 65 శాతం భూగర్భ జలాల వినియోగం ఉండగా, 2019–20 నాటికి 50 శాతానికి తగ్గిందని రజత్‌కుమార్ వెల్లడించారు. కాళేశ్వరం ఎత్తిపోతల, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాల ద్వారా భూగర్భ జలాల లభ్యత పెరగడమే ఇందుకు కారణమన్నారు. పెరిగిన భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునే అంశంపై ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలని అధికారులను కోరారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు ‘ఏ కేటగిరీ’, తెలంగాణ రాష్ట్ర జలవనరుల మౌలిక సదుపాయా ల అభివృద్ధి సంస్థకు ‘ఏ కేటగిరీ’గ్రేడింగ్‌ను ఆర్ఈసీ కేటాయించిన నేపథ్యంలో.. ఈ సంస్థలు తీసుకున్న రుణాలకు వడ్డీ రాయితీ లభించనుందన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, భూగర్భ జల శాఖ డైరెక్టర్ ఎం.పండిత్ పాల్గొన్నారు. -
తెలంగాణకు తీరని నష్టం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టదలిచిన ప్రాజెక్టులతో తెలంగాణ ప్రాజెక్టులకు తీరని నష్టం జరుగుతుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేశారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేటప్పుడు బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి అనే విషయాన్ని రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం స్పష్టం గా చెబుతోందని పేర్కొన్నారు. అయినా దానికి విరుద్ధంగా ఏపీ నడుచుకుంటోందని బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీలు తరలించేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తిగా కొత్తదని, దీనికి ఎలాంటి అనుమతుల్లేవని, బోర్డు తక్షణం జోక్యం చేసుకొని దీన్ని అడ్డుకోవాలని కోరారు. దీంతోపాటు పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంచడం కూడా తెలంగాణ తాగు, సాగు నీటి అవసరాలకు విఘాతం కలిగించేదేనని, ఈ దృష్ట్యా ఏపీ తీసుకొచ్చిన జీవో 203పై మరింత ముందుకెళ్లకుండా బోర్డు చర్యలు తీసుకోవాలని కోరారు. (చదవండి: 30 ఏళ్ల వరద లెక్కలివ్వండి) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్, సీఈలు నరసింహారావు, నర్సింహా.. కృష్ణా బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌తో బుధవారం జలసౌధలోని ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన భేటీలో ఇప్పటికే తెలంగాణ అభ్యంతరాలు పేర్కొంటూ రాసిన లేఖను ప్రస్తావిస్తూ, ఏపీ ప్రాజెక్టులతో జరిగే నష్టాన్ని వివరించారు. తెలంగాణ ప్రయోజనాలను అడ్డుకునే ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కోరారు. ఈ అంశంపై తమ పరిధిలో ఏపీ నుంచి వివరణ కోరతామని బోర్డు వారికి హామీ ఇచ్చింది. అలా అయితే అభ్యంతరం లేదు: రజత్ భేటీ అనంతరం రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణకు జరిగే నష్టంపై బోర్డుకు వివరించామని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర తాగు, సాగునీటి అవసరాలకు ఇబ్బంది కలుగుతుందని వివరించినట్లు చెప్పారు. గతంలోనే ఈ అంశంపై ఫిర్యాదు చేశామని, దీనిపై ఏపీ వివరణను బోర్డు కోరిందని, అయితే ఇప్పుడు అధికారికంగా జీవో వచ్చినందున తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. 3 టీఎంసీలతో చేపట్టే లిఫ్టు పథకం ముమ్మాటికీ కొత్తదేనని, దీనికి బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాలని చెప్పామన్నారు. ఈ సందర్భంగానే తమ వాటా 512 టీఎంసీల నుంచే నీటిని వినియోగిస్తామని ఏపీ అంటోంది కదా అని ప్రశ్నించగా.. ‘ఏపీ తమ వాటా మేరకు నీటిని వాడుకుంటే అభ్యంతరం లేదు. అయితే అంతే నీటిని వాడుకుంటున్నారన్న దానికి సరైన విధానం లేదు. పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీ పెట్టాలని చెప్పినా అది పూర్తిగా అమల్లోకి రాలేదు. అక్కడి నీటి వినియోగంపై సరైన పర్యవేక్షణ లేదు. మాటల్లో చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటైతే సమస్యే కదా’అని పేర్కొన్నారు. ప్రస్తుతం మధ్యంతర ఒప్పందం మేరకు తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల మేర కేటాయింపులున్నాయని, అయితే పరీవాహకం ఆధారంగా చూస్తే తెలంగాణకు సైతం వాటా పెరగాల్సి ఉందన్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్ ముందు తాము పోరాడుతున్నట్లు చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2009లో భారీ వరదలు వచ్చాయని, అలా వచ్చినప్పుడు సమస్య లేదని, అదే 2017, 2018లో వరద లేక క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. శ్రీశైలానికి వరద రాకుంటే తెలంగాణ జిల్లాలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టుల కింద తాగు, సాగు అవసరాలకు నీరందడం కష్టం అవుతుందని పేర్కొన్నారు. అందుకే ఏపీ ప్రాజెక్టులను ఆపాలని కోరుతున్నట్లు చెప్పారు. -
‘సీతారామ’ వేగం పెంచండి
సాక్షి, కొత్తగూడెం: కాళేశ్వరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని, మే చివరికల్లా మొదటి ప్యాకేజీ పనులు పూర్తవ్వాలని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్‌కుమార్ ఆదేశించారు. శనివారం అశ్వాపురం మండలంలో జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు పనులను ఆయన ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వచ్చిన బృందం నేరుగా అశ్వాపురం గౌతమీనగర్ హెవీవాటర్ ప్లాంట్‌లోని పర్ణశాల అతిథి గృహానికి చేరుకుంది. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి కుమ్మరిగూడెం వద్ద ప్రస్తుతం ఉన్న దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సీతమ్మసాగర్ పేరుతో మరో ఆనకట్ట నిర్మించేందుకు నిర్ణయించిన ప్రాంతాన్ని పరిశీలించారు. మ్యాప్‌ల ద్వారా కాంటెక్ సంస్థ, అధికారులతో మాట్లాడి కొత్త బ్యారేజీ ఎత్తు, నీటి నిల్వ సామర్థ్యం, వరద ముంపు తదితర వివరాలు తెలుసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పంప్‌హౌసులు, కెనాల్ పనుల వివరాలు తెలు సుకున్నారు. అనంతరం బీజీకొత్తూరులో సీతారామ ప్రాజెక్ట్ మొదటి ప్యాకేజీ పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్ట్ అధికారులు, నిర్మాణ సంస్థ బాధ్యులతో మాట్లాడి పంప్‌హౌస్ పనుల పురోగతిని, పనులు ఎప్పటి వరకు పూర్తవుతాయనే వివరాలు తెలుసుకున్నారు. పరిశీలన అనంతరం సీతారామ పనుల తీరుపై మేఘా సంస్థ అధికారులతో సీతారాంపురం వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. విద్యుత్ స్టేషన్‌కు వెళ్లే రహదారిపై దుమ్ము లేవకుండా నీళ్లు చల్లించాలని సూచించారు. 8 ప్యాకేజీలపై సమగ్ర సమీక్ష పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం ఉండొద్దని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్‌కుమార్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, నిర్ణీత కాలంలోనే పనులన్నీ పూర్తి చేయాలన్నారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు 8ప్యాకేజీల పనులను రజత్‌కుమార్ సమగ్రంగా సమీక్షించారు. మొదటి ప్యాకేజీలో 75 శాతం పనులు పూర్తి కావచ్చాయని, రెండో ప్యాకేజీ పనులను వేగవంతం చేశామని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. పనులపై రోజువారీ పర్యవేక్షణ చేయాలని ఎస్ఈ నాగేశ్వరరావును ఆదేశించారు. 3వ ప్యాకేజీ పనులు పురోగతిలో ఉన్నాయని, 4వ ప్యాకేజీలో మిషన్ భగీరథ పైపులైన్ల పనుల కారణంగా 60 శాతం వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ఇసుక కొరత ఉందని, కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు ప్రిన్సిపల్ సెక్రెటరీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఇసుక విషయమై సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు. మార్చి 22 నాటికి సీతారామ ప్రాజెక్టు పనులు ఒక దశకు వచ్చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు, సీతారామ ప్రాజెక్ట్ ఎస్ఈలు వెంకటకృష్ణ, నాగేశ్వరరావు, ఈఈ బాబురావు, డీఈలు మహేశ్వరరావు, వెంకటేశ్వరరావు, తహసీల్దార్ భగవాన్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఇతర అధికారులున్నారు. -
15 వరకు ఓటర్ల నమోదు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం– 2020లో భాగంగా గత నెల 16న ముసాయి దా ఓటర్ల జాబితా విడుదల చేశామని, ఈ నెల 15వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంత రాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు, ఓటర్ల పేర్లు, వివరాల్లో తప్పుల్ని సరిచేయడానికి విజ్ఞప్తులను స్వీకరిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు మంగళవారం ఆయన తన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తుది ఓటర్ల జాబితాను ఫిబ్ర వరి 7న ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఓటర్లను భౌగోళికంగా సులువుగా గుర్తించేందుకు వారి గృహాల మ్యాపు(నజరీ నక్షా)ను తయారు చేస్తున్నామన్నారు. ఓటర్ల నమోదు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారోద్యోమాలు నిర్వహించాలని, డూప్లికేట్ ఓట్లను తొలగించాలని ఈ సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులకు సీఈఓకు విజ్ఞప్తి చేశాయి. -
‘కేసీఆర్‌కు భయం పట్టుకుంది’
సాక్షి, హైదరాబాద్: హుజూర్‌నగర్‌లో గురువారం జరగనున్న సీఎం కేసీఆర్ సభ కోసం టీఆర్ఎస్ నిబంధనలకు విరుద్ధంగా భారీగా డబ్బు ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఎన్నికల సంఘం సీఈఓ రజత్‌కుమర్‌ను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ కుటుంబ సభ్యులకు చెందిన ఓ టీవీ చానల్, ఇంగ్లీష్ పత్రికలో భారీగా టీఆర్ఎస్ అభ్యర్థి కోసం ప్రకటనలు ఇస్తున్నారని, ఈ ఖర్చును టీఆర్ఎస్ అభ్యర్థి ఖర్చుగానే చూడాలని ఈసీని కోరినట్లు చెప్పారు. ఈ ఉపఎన్నికలో పెద్ద ఎత్తున మద్యం, డబ్బు సరఫరా జరుగుతోందన్న విషయాన్ని రజత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్వర్‌రెడ్డిలు కోదాడలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తెలిపామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన మంత్రులపై కేసులు నమోదు చెయాలని కోరామని వెల్లడించారు. కేసీఆర్ హుజూర్నగర్ సభలో ఎలాంటి విధానపరమైన ప్రకటనలు చేసినా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం సీఈఓకు విజ్ఞప్తి చేశామని శశిధర్‌రెడ్డి తెలిపారు. హుజుర్ నగర్ ఉపఎన్నికలపై కేసీఆర్‌కు భయం పట్టుకుందని అందుకే తానే స్వయంగా ప్రచారానికి రావాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. కేసీఆర్ ఒళ్లు దగ్గరపెట్టుకొని పని చెయాలంటే హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌పార్టీని గెలిపించాలని కోరారు. -
మరికొద్ది గంటల్లో!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. 41 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు నేటితో తెరపడనుంది. రాష్ట్రంలోని 17లోక్‌సభ స్థానాలతోపాటు దేశంలోని 542 లోక్‌సభ స్థానాల్లో పోలైన ఓట్లను గురువారం లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నా రు. నేడు జరగనున్న కౌంటింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కు మార్ ప్రకటించారు. బుధవారం సచివాలయంలో మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను వివరించా రు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ని ర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. రా ష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు తొలిదశలో (ఏప్రిల్ 11న) పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటలకు ప్రారంభం రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 35 చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల కలిపి లెక్కింపు కోసం 126 హాళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎన్నికల పరిశీలకుడు, అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. లోక్‌సభ స్థానాల పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లను లెక్కించనున్నారు. ప్రతి శాసనసభ స్థానం పరిధిలో పోలైన ఓట్లను లెక్కించడానికి ఒక హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు సంఖ్యలో 185 మంది బరిలో ఉన్నందున అక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలైన ఓట్లను రెండేసి హాళ్లలో లెక్కించనున్నారు. ఒక్కో హాల్లో 18 చొప్పున మొత్తం 36 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్న మల్కాజ్గిరి లోక్‌సభ స్థానంలోని మేడ్చల్, ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన ఓట్లను లెక్కించడానికి 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. సువిధ యాప్‌లో ఫలితాలు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ (ఈటీపీబీ)లను లెక్కించనున్నారు. అనంతరం ఉదయం 8.20 గంటలకు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును ప్రారంభించనున్నారు. ఈవీఎంల రౌండ్లన్నీ పూర్తయిన తర్వాత ప్రతి శాసనసభస్థానం పరిధిలోని 5 పోలింగ్ కేంద్రాలను ర్యాండమ్ విధానంలో ఎంపిక చేసి, అక్కడ నమోదైన వీవీప్యాట్స్ ఓట్లను లెక్కించనున్నారు. సంబంధిత పోలింగ్ కేంద్రాల ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లతో వీవీప్యాట్స్ ఓట్లను సరిపోల్చి చూస్తారు. ఈవీఎం, వీవీప్యాట్స్లలోని ఓట్లలో తేడాలొస్తే వీవీప్యాట్స్ స్లిప్పుల కౌంటింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి రౌండు పూర్తి కాగానే సువిధ అప్లికేషన్ ద్వారా ఫలితాలను రిటర్నింగ్ అధికారులు పోర్టల్‌లో నమోదు చేస్తారు. దీంతో ఓట్ల లెక్కింపు ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌పోర్టల్ (https://results.eci.gov.in) ద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవులు ప్రకటించిందని రజత్‌కుమార్ తెలిపారు. గురువారం మద్యం షాపులను మూసివేయాలని ఆదేశించామన్నారు. రిటర్నింగ్ అధికారే కింగ్! ఓట్ల కౌంటింగ్, రీ–కౌటింగ్‌కు సంబంధించిన ఏ విషయంలోనైనా నిర్ణయాధికారం స్థానిక రిటర్నింగ్ అధికారిదేనని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే స్థానిక రిటర్నింగ్ అధికారి ఫలితాలను చదివి వినిపిస్తారు. ఆ తర్వాత రెండు నిమిషాల పాటు నిశ్శబ్ద సమయం ఉండనుంది. ఓట్ల లెక్కింపుపై అనుమానాలుంటే ఆ రెండు నిమిషాల్లోగా అభ్యర్థులు, వారి ఏజెంట్లు లిఖితపూర్వకంగా రీ–కౌంటింగ్ కోరాల్సి ఉంటుంది. రిటర్నింగ్ అధికారులు తమ విచక్షణ ఉపయోగించి రీ–కౌంటింగ్ జరపాలా? వద్దా? అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ఒక వేళ విజ్ఞప్తిని తిరస్కరిస్తే మాత్రం ఆ విషయాన్ని రిటర్నింగ్ అధికారులు లిఖిత పూర్వకంగా తెలియచేయాల్సి ఉంటుందని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. వీవీప్యాట్స్ ఓట్లు కీలకం! కొన్ని సందర్భాల్లో వీవీప్యాట్స్ ఓట్లు కీలకం కానున్నాయి. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంల మీద ఉండే ‘క్లోజ్’మీటను నొక్కడాన్ని ప్రిసైడింగ్ అధికారులు మరిచిపోతే, మళ్లీ క్లోజ్ మీటను నొక్కే వరకు అలాంటి ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడం సాధ్యం కాదు. ఎన్నికల పరిశీలకుడి సమక్షంలో సంబంధిత పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లను సరిచూసుకున్న తర్వాత క్లోజ్ మీటను నొక్కి ఓట్లను లెక్కిస్తారు. ఒక వేళ పోలైన ఓట్ల సంఖ్య, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల సంఖ్యలో తేడాలుంటే, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను కాదని వీవీప్యాట్స్ స్లిప్పులను లెక్కిస్తారు. ఇప్పటి వరకు ఎక్కడా ఈవీ ఎం, వీవీప్యాట్స్ ఓట్ల మధ్య తేడాలు రాలేదని రజత్‌కుమార్ వెల్లడించారు. పోలింగ్ రోజు మాక్ పోల్ లో వేసిన ఓట్లను ఈవీఎం నుంచి డిలీట్ చేయడాన్ని పోలింగ్ సిబ్బంది మరిచిపోతే, వాస్తవ పోలింగ్ ఓట్లతో మాక్‌పోల్ ఓట్లు కలిసిపోనున్నాయి. ఇలాంటి సందర్భాల్లో సైతం వీవీప్యాట్స్ ఓట్లను పరిగణలోకి తీసుకుంటామని రజత్‌కుమార్ వెల్లడించారు. తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య మార్జిన్ ఓట్ల సంఖ్య కంటే ఎక్కువ ఉంటేనే మళ్లీ తిరస్కరించిన పోస్టల్ ఓట్లకు రీ–కౌంటింగ్ చేయనున్నారు. -
ఓట్లు లెక్కించేందుకు సర్వం సిద్ధం: సీఈవో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 23న ఓట్లు లెక్కించేందుకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 18 జిల్లాల్లోని 35 ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన 82 హాళ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈనెల 23న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇందుకు మొత్తంగా 1,841 టేబుళ్లు ఏర్పాటు చేయను న్నట్లు వివరించారు. 110 సెగ్మెంట్లలో ఒక్కో సెగ్మెంట్లో 15 (14+1) టేబుళ్లను, నిజామాబాద్‌లోని 7 సెగ్మెంట్లలో 19 (18+1) టేబుళ్లను, మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మేడ్చల్, ఎల్బీనగర్లోని 2 సెగ్మెంట్లలో 29 (28+1) టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి టేబుల్‌కు ఒక సూపర్వైజర్, ఒక లెక్కింపు సహాయకుడు, ఒక సూక్ష్మ పరిశీలకుడు ఉంటారని చెప్పారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక అదనపు లెక్కింపు సహాయకుడు, ఇద్దరు అదనపు సూక్ష్మ పరిశీలకులు, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్స్, ఇద్దరు కార్మికులు, ఒక డీఈవో ఉంటారని వివరించారు. వీరితోపాటు 61 మంది కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ఉంటారని, మొత్తం 6,745 మంది లెక్కింపులో పాల్గొంటారని తెలిపారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే పూర్తయిందని, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ర్యాండమ్‌గా ఎంపిక చేసిన 5 వీవీ ప్యాట్లలోని పేపర్ స్లిప్పులను కూడా లెక్కిస్తామని పేర్కొన్నారు. దీంతో ఎన్నికల ఫలితాల ప్రకటన 3 గంటలు ఆలస్యం కావొచ్చని రజత్ కుమార్ తెలిపారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికే ఓటు హక్కు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు స్థానిక సంస్థ ల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ప్రస్తుత జెడ్పీటీసీ, ఎంపీటీసీలకే ఓటు హక్కు లభించనుం దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్ కుమార్ తెలిపారు. ప్రస్తుత జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం జూలై 5తో ముగియనుందని పేర్కొన్నారు. దీనికి నెల రోజులకు ముందుగా (మే 31న) ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండటంతో ఓటు హక్కు వారికే లభిస్తుందని తెలిపారు. ఈ మేరకు పాత ఓటర్ల జాబితాతోనే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం జారీ చేసింది. ఈ సందర్భంగా సీఈఓ విలేకరులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం ఏదైనా నియోజకవర్గం ఖాళీ అయితే, ఖాళీ అయిన తేదీ నుంచి 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఖాళీ అయి వరుసగా జూన్ 10, 16, 21 నాటికి ఆరు నెలల కాలం పూర్తవుతుందన్నారు. ఈ మూడు స్థానాలకు సంబంధించి న్యాయ స్థానాల్లో ఎలాంటి కేసులు లేకపోవడంతో ఆరు నెలల గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పారు. దీంతో జూలై 5 వరకు పదవీ కాలం ఉన్న ప్రస్తుత ఎంపీటీసీ, జెడ్పీటీసీలే ఓటు హక్కు పొందుతారని తెలిపారు. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితా లు మే 27న రానుండగా, గెలిచిన కొత్త సభ్యుల పదవీ కాలం జూలై 5 తర్వాత ప్రారంభం కానుండటంతో అంతకు ముందే జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి ఓటు హక్కు కల్పించే ఆస్కారం లేదన్నారు. మిగతా స్థానాలకు త్వరలో ఎన్నికలు.. ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని సీఈఓ తెలిపారు. రిటర్నింగ్ అధికారుల సూచనల మేరకు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే స్థానిక సంస్థల ప్రతినిధులపై కోర్టు కేసులున్నా.. వారు ఓటేసేందుకు అర్హులేనన్నారు. ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సైతం త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. -
అసత్య ప్రచారాలు చేస్తే కేసులే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల యంత్రాంగం పూర్తిగా నిబంధనల మేరకే నడుచుకుందని, దురుద్దేశాలతో, అవగాహన లేమితో కొందరు పనిగట్టుకుని అవాస్తవాలు వ్యాప్తి చేస్తున్నారని, పత్రికలు, టీవీలు కూడా నిజానిజాలు తెలుసుకోకుండా వాటిని ప్రచురించడంతో ప్రజలు మరింత గందరగోళానికి గురవుతున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలో మాట్లాడుతూ.. ఈవీఎంల తరలింపు, పోలింగ్ శాతంపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్‌లో పోలింగ్ శాతం మొదట ప్రకటించిన దానికి, తుది ప్రకటనకు మధ్య వ్యత్యాసంపై కొందరు లేనిపోనివి మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే అంచనా శాతం ప్రకటిస్తామని, తర్వాత అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి సమాచారం అందాక 17–ఏ ఫారం (ఓటర్లు ఓటు వేసేముందు సంతకం చేసే రిజిస్టర్)తో పోల్చి చూసుకుని, పోలింగ్ శాతం తుది వివరాలతో 17 సీ ఫారం నింపి ఒక కాపీని పోలింగ్ కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీల, అభ్యర్థుల ఏజెంట్లకు అందజేస్తామని, ఈ వివరాలనే మీడియాకు కూడా ఇచ్చామని వివరించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగేలా కొందరు సామాజిక మాధ్యమాల్లో ఈసీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ సరిహద్దుల్లో ఒక ప్రముఖ నేత ఇంట్లో దొరికిన ఈవీఎంలంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, అది రాజస్తాన్‌కు చెందిన పదేళ్ల కిందటి వీడియో అని స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నడిచిందని, చాలా పోలింగ్ కేంద్రాల్లో 6 గంటల వరకు పోలింగ్ జరిగిందన్నారు. జీపీఎస్‌తో ఈవీఎంల తరలింపు పోలింగ్ పూర్తయిన సాయంత్రం 5 గంటలకు అంచనా వివరాలు ఇస్తామని.. తర్వాతి రోజు మాత్రమే పోలింగ్ శాతాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వగలమని పేర్కొన్నారు. నిజామాబాద్ మినహా ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరే వరకు అర్ధరాత్రి 12.04 గంటలు అయిందన్నారు. మొత్తం స్ట్రాంగ్ రూమ్‌లు సీల్ చేసే వరకు ఉదయం 5.30 గంటలు అయిందన్నారు. తాము ఎంతో కష్టపడి ఎన్నికలు నిర్వహిస్తే ఒక్క మాటతో చెడ్డ పేరు తెస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంల తరలింపునకు జీపీఎస్ ట్రాకింగ్ కూడా ఉందన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడు అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి అంచె భద్రతలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఉండొచ్చన్నారు. పోలింగ్ ముగిసే ముందు ఫారం 17సీ కాపీలు పోలింగ్ ఏజెంట్లకు అందిస్తామని.. దానిపై వాళ్ల సంతకాలు సైతం ఉంటాయన్నారు. ఫారం 17 ఏ, ఫారం 17సీని సరిచూసుకున్న తర్వాత కూడా పోలింగ్ శాతంపై అనవసర రాద్ధాంతం చేయడం తగదన్నారు. రిసెప్షన్ సెంటర్‌కు వచ్చిన తర్వాత కూడా 17 సీ ఫారం పరిశీలిస్తామన్నారు. పోలింగ్ ఏజెంట్లు సంతకాలు చేసిన తర్వాత కూడా ఎందుకు అనుమానిస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. స్ట్రాంగ్‌రూం నుంచి వీవీప్యాట్లు బయటకు తీసుకువచ్చే ముందు ఆ కాపీలను సరిచూస్తామన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లపై ఆరోపణలు చేసేటప్పుడు ఫారం–17సీ ఎందుకు సరిచూడరన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన కీసర స్ట్రాంగ్ రూమ్‌లో ఒక పార్టీ నేత ఫొటోపై కలెక్టర్‌ను వివరణ కోరామన్నారు. అతడిని అరెస్ట్ కూడా చేశామన్నారు. ఫొటోలు తీసుకున్న వ్యక్తిపై న్యాయవిచారణ జరుగుతోందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నట్టు స్పష్టంచేశారు. పోలింగ్ శాతాలతో పాటు పలుచోట్ల ఈవీఎంల తరలింపు తదితర అంశాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి తొలుత విడుదల చేసిన పోలింగ్ శాతానికి, ఆ తర్వాత వచ్చిన శాతానికి 10 శాతం పెరగడంపై మీడియా ప్రశ్నించగా, సాయంత్రం చల్లగా ఉంటుందని ఎక్కువ సంఖ్యలో ఓటు వేశారని అనుకోవచ్చు కదా అని రజత్ కుమార్ సమాధానమిచ్చారు. అవి శిక్షణ ఈవీఎంలు.. జగిత్యాలలో ఆటోలో రవాణా చేసిన ఈవీఎంలను పోలింగ్ కోసం వాడలేదని.. కేటగిరీ–సీ కిందకు చెందిన వాటిని అధికారుల శిక్షణ, అవగాహన కోసం వాడినట్లు స్పష్టంచేశారు. మండల కేంద్రం నుంచి వాటిని జిల్లా కేంద్రానికి తరలిస్తున్నట్లు చెప్పారు. ఈవీఎంలు నాలుగు రకాలుంటాయన్నారు. మొదటి రకం పూర్తిగా ఓటింగ్‌కు వినియోగించేవని, ఓటింగ్ కొంతమేర జరిగిన తర్వాత సమస్యలొస్తే కొత్త ఈవీఎం వాడుతామని.. ఈ రెండింటికి మాత్రం అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పటిష్టమైన భద్రతలో ఉంచుతామని వివరించారు. మాక్ పోలింగ్ నిర్వహించే సందర్భంలో లోపాలున్న వాటిని తొలగించి వేరు చేస్తామనీ, ఇవి మూడో రకం ఈవీఎంలని అన్నారు. వీటిని తయారీదారుకు తిప్పి పంపుతామన్నారు. ముందు జాగ్రత్తగా అదనంగా కొన్ని ఈవీఎంలను తెప్పించి రిజర్వులో ఉంచుతామనీ వీటిని నాలుగో రకం అంటామన్నారు. ఇవి మన రాష్ట్రంలో కానీ, అవసరమైన ఇతర రాష్ట్రాలకు తరలించడానికి సిద్ధంగా ఉంచుతామని చెప్పారు. అందువల్ల చివరి రెండు రకాల ఈవీఎంలను తరలిస్తున్న సందర్భాలను చూసి వాస్తవాలను తనిఖీ చేసుకోకుండా ఓట్లతో ఉన్న ఈవీఎంలను తరలిస్తున్నట్లు ప్రచారం కల్పిస్తే అహోరాత్రులు శ్రమిస్తున్న అధికార యంత్రాగం విశ్వసనీయత కోల్పోయే ప్రమాదముందని, సంబంధిత సమాచారంపై ఎప్పుడు వివరణ కావాలన్నా సీనియర్ అధికారులందరూ మీడియాకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారనీ, వాస్తవాలను నిర్ధారించుకోవచ్చని సూచించారు. శిక్షణకు, ఓటర్ల అవగాహనకు ఉపయోగించేవాటిని, రిజర్వులో ఉంచిన వాటిని కూడా కేంద్ర గోదాముల్లో సాయుధ కాపలాతోనే ఉంచుతామని స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్లతో ఫలితాలు త్వరగా వస్తాయనేది అవాస్తవమన్నారు. ఓటింగ్ శాతంపై అనుమానం వద్దన్నారు. ఎన్నికలు జరిగాక వీడియో రికార్డులను పరిశీలకులు అన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారన్నారు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ప్రసారం చేసిన చానెల్ పై కేసులు బుక్ చేస్తామన్నారు. -
మీడియాపై కేసులు నమోదు చేస్తాం..
హైదరాబాద్: ప్రజాస్వామ్యంపై మనందరికీ నమ్మకం ఉండాలని, సోషల్ మీడియాలో పోలింగ్ పర్సంటేజీపై అసత్య ప్రచారం జరగడంపై ఈసీ ఆగ్రహంగా ఉందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. మంగళవారం సెక్రటేరియట్లో రజత్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ జరిగిన రోజే పోలింగ్ పర్సంటేజీ అంత కరెక్ట్‌గా తెలియదని, అంచనా వేసి మాత్రమే చెప్తామని అన్నారు. పోలింగ్ జరిగిన రోజు సాయంత్రమే ఎస్టిమేషన్ పోలింగ్ పర్సంటేజ్ ఎంత అని చీఫ్ ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది..కాబట్టి తాము ఎస్టిమేషన్ పర్సంటేజ్ మాత్రమే చెప్తామని వెల్లడించారు. 17ఏ, 17సీ కాపీ ప్రతి పోలింగ్ ఏజెంట్‌కు ఇస్తాం.. పోలింగ్ అయిపోయాక పోలింగ్ ఏజెంట్ల సంతకం రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకుంటారని పేర్కొన్నారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలు,17ఏ, 17సీ కాపీలను సీల్ వేసి స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచామని తెలిపారు. అసత్య ప్రచారం చేస్తోన్న సోషల్ మీడియాపై కేసులు కచ్చితంగా బుక్ చేస్తామని హెచ్చరికలు పంపారు. జగిత్యాలలో ఆటోలో తీసుకెళ్తున్న ఈవీఎం, శిక్షణలో ఉన్న వారి కోసం వాడారని స్పష్టంగా పేర్కొన్నారు. మొత్తం నాలుగు రకాల ఈవీఎంలు ఉన్నాయని, ఎ కేటగిరీ ఈవీఎంలు మాత్రమే పోలింగ్‌కు వాడుతున్నామని తెలిపారు. వంద మీటర్ల లోపు పోలింగ్ బూత్‌ల వద్దకు వాహనాల అనుమతి లేదని చెప్పారు. మాక్ పోలింగ్‌లో ఫెయిల్ అయిన ఈవీఎంలను సీ కేటగిరీ ఈవీఎంలుగా పరిగణిస్తామని, వాటిని వెంటనే కలెక్టర్ కార్యాలయానికి తరలిస్తామని అన్నారు. కీసర స్ట్రాంగ్ రూంలో టీఆర్ఎస్ అభ్యర్థి వెళ్లిన సందర్భం వేరు.. స్ట్రాంగ్‌రూంలో ఈవీఎంలు పెట్టే ముందు అన్ని రాజకీయపార్టీల వారు పరిశీలిస్తారు.. ఆ సందర్భంలోనే ఆయన ఫోటో తీసుకున్నాడని చెప్పారు. పోల్ అయిన ఓట్లలో నోటా ఓట్లను తొలగించి పర్సంటేజీ లెక్కిస్తామని, పోలిటికల్ మోటివేషన్‌తోనే సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. -
ఇందూరు ఎన్నికలపై అనుమానాలు: అరవింద్
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల తీరుపై అక్కడి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌ను సోమవారం ఆయన సచివాలయంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. సమాచార హక్కు చట్టం కింద నిజామాబాద్ లోక్‌సభ పోలింగ్‌కు సంబంధించిన వివరాలను అందజేయాలని సీఈఓను కోరారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద తమ పార్టీ ప్రతినిధులను కాపలా పెట్టుకోవడానికి అనుమతించాలని కోరగా, సీఈఓ సానుకూలంగా స్పందించారు. సమావేశం అనంతరం అరవింద్ విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ శాతంతో పాటు పలు అంశాలపై సమాచారం అందించాలని ఆర్టీఐ కింద సీఈఓకు దరఖాస్తు చేశామని తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారాన్ని అందజేస్తామని సీఈఓ హామీ ఇచ్చారని తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత కొన్ని యంత్రాలు ఆలస్యంగా స్ట్రాంగ్ రూమ్‌కు రావడంపై అనుమానాలు వ్యక్తం చేశామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, అక్కడ ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని సీఈఓ హామీ ఇచ్చారని వెల్లడించారు. -
ఈవీఎంలకు ‘స్ట్రాంగ్’ భద్రత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ కోసం వినియోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఉంచామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ పేర్కొన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్స్ల భద్రత, తరలింపు వంటి అంశాల్లో తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కండ్లకోయ గ్రామంలో ఉన్న ఏఎంసీ గోదాంను రాష్ట్ర స్థాయిలో కేంద్ర గోదాంగా వినియోగిస్తున్నామన్నారు. ఇక్కడికి తీసుకువచ్చే, ఇక్కడి నుంచి తీసుకుపోయే ఈవీఎంల కదలికలు, ఇక్కడ ఉంచిన వాటికి భద్రత కల్పించడం వంటి విషయాలపై ఎప్పటికప్పడు రాజకీయ పార్టీలకు తగిన సమాచారం అందిస్తామన్నారు. ఈసీ ఆదేశాల మేరకు ఈ కింది నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. కేటగిరి–ఏ: ఓట్లతో నిండిన ఈవీఎంలను పోలింగ్ ముగిసిన తరువాత నిబంధనల పాటిస్తూ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచాలి. కేటగిరి–బీ: కొన్ని ఓట్లు పోలైన తరువాత లోపాల కారణంగా తొలగించిన ఈవీఎంలను తగిన విధివిధానాలను పాటించిన తరువాత కేటగిరీ–ఏ ఈవీఎంతో పాటే, విడిగా భద్రపరచాలి. కేటగిరి–సీ: పోలింగ్ ప్రారంభానికి ముందే లోపాలు బయటపడి తొలగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో కాకుండా వేరే గదిలో భద్రపరచాలి. తరువాత తగిన విధివిధానాలు అనుసరించి వాటిని సంబంధిత తయారీదారుకు తిప్పి పంపాలి. కేటగిరి–డీ: ముందు జాగ్రత్త కోసం అదనంగా తెప్పించి, పోలింగ్‌కు అసలు ఉపయోగించకుండా సెక్టార్/జోనల్/ ఏరియా మేజిస్ట్రేట్ దగ్గర రిజర్వ్‌లో ఉన్న ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో కాకుండా విడిగా మరో గదిలో భద్రపరచాలి. మూడంచెల భద్రత... ఈవీఎంలను ఉంచిన ప్రదేశం చుట్టూ తొలి భద్రతావలయంగా కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు (సీపీఎఫ్) రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నాయి. దాని తర్వాత భద్రతా వలయంగా రాష్ట్ర సాయుధ దళం కాపలా కాస్తుంది. ఆ రెండింటి చుట్టూ ఉన్న ప్రాంత వలయాన్ని జిల్లా ఎగ్జిక్యూటివ్ దళం కనిపెట్టుకుని ఉంటుంది. ఓట్లతో ఉన్న ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద కనీసం ఒక ప్లటూన్ ఉంటుంది. పరిశీలకులు లేదా జిల్లా ఎన్నికల అధికారులు లేదా పోలీస్ సూపరింటెండెంట్లు లేదా వారి ప్రతినిధులు లేదా ఇతర వ్యక్తులతో సహా ఎవరైనా తొలి భద్రతా వలయంలోకి వెళ్లిరావాలంటే దానికి తగిన నియమాలను తప్పకుండా పాటించాలి. రెండో (మధ్య) భద్రతా వలయం దాటే వారి పేరు, తేదీ, సమయం, వ్యవధి అన్నీ కేంద్ర బలగాలు నిర్వహించే లాగ్ బుక్‌లో వివరంగా పేర్కొనాలి. ఇటువంటి సందర్శనలను వీడియోగా చిత్రీకరించడానికి కేంద్ర బలగాలకు తగిన పరికరాలు ఇవ్వాలి. స్ట్రాంగ్ రూమ్ సందర్శించాలనుకునే అభ్యర్థుల ఏజంట్లను సీసీటీవీ ద్వారా చూడటానికి అనుమతించవచ్చు. దీనిని కూడా లాగ్ బుక్‌లో నమోదు చేయాలి. స్ట్రాంగ్ రూమ్‌కు డబుల్ లాక్ పద్ధతి ఉండాలి. ఒక తాళం చెవి జిల్లా ఎన్నికల అధికారి వద్ద, మరొకటి సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద ఉండాలి. స్ట్రాంగ్ రూమ్ పక్కనే 24 గంటలూ ఒక కంట్రోల్ రూమ్ పని చేస్తుండాలి. ఒక పోలీస్ అధికారితో పాటూ, ఒక గెజిటెడ్ అధికారి నిరంతరం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండాలి. స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లడానికి బయటికి రావడానికి ఒకే ద్వారం ఉండాలి. అగ్నిమాపక దళం తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి. జిల్లాలో స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతకు, ప్రొటోకాల్ అమలుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యులు. రిటర్నింగ్ అధికారులు ప్రతిరోజూ స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణాన్ని అంతర్ వలయం (తొలి వలయం) వరకు ఉదయం, సాయంత్రం వెళ్లి లాగ్ బుక్‌ను, వీడియో చిత్రీకరణను పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక సమర్పించాలి. ఈవీఎంలు భద్రపరిచిన ప్రాంగణంలోకి ఏ అధికారి, మంత్రి లేదా మరే ఇతర రాజకీయ నాయకులకు చెందిన వాహనాలను అనుమతించ కూడదు. ఓట్ల లెక్కింపు జరిగే రోజున, అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఆర్ఓ, పరిశీలకుల సమక్షంలో వీడియో చిత్రీకరణతో స్ట్రాంగ్ రూమ్‌ను తెరవాలి. ఈవీఎంలను కౌంటింగ్ కోసం బయటికి తీయడం, అది ముగిసిన తరువాత తిరిగి వాటిని తీసుకొచ్చి అక్కడ భద్రపరిచే కార్యక్రమాన్నంతా పూర్తిగా వీడియో తీయాలి. కౌంటింగ్ ముగిసిన తరువాత నిబంధనల ప్రకారం ఈవీఎంలను (బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు), వీవీప్యాట్లను సీల్ వేసి భద్రపరచడానికి తిరిగి స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చాలి. అభ్యర్థులకు.. ఎన్నికల సంఘానికి చెందిన సీఈఓ, అదనపు సీఈఓ, డీఈసీ ఇన్చార్జీలు, సంబంధిత డీఈఓ, ఎస్పీ, సీఓపీ, ఆర్ఓ ఫోన్ నంబర్లు ఇవ్వాలి. ఈ నియమనిబంధనల ప్రతులను అభ్యర్థులందరికీ, డీఈఓలకు, ఆర్ఓలకు, కేంద్ర బలగాల కమాండెంట్‌కు అందచేయాలి. -
61 శాతం పోలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గురువారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) నిక్షిప్తమైంది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 61% అంచనా పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం కచ్చితమైన పోలింగ్ గణాంకాలను వెల్లడిస్తామన్నారు. మే 23న లోక్‌సభ ఎన్నికల ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 16 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు, నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ సమయం ముగిసే వరకు క్యూల్లో నిలబడిన ఓటర్లందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల సంఘం, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడా రీపోలింగ్ ఉండదు! నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ స్థానాల పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 7.30 గంటల వరకు పోలింగ్ జరుగుతూనే ఉందని రజత్‌కుమార్ వెల్లడించారు. పోలింగ్ వేళలు ముగిసిన అనంతరం గురువారం రాత్రి ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న 3 లక్షల మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది, భద్రతా బలగాలకు రజత్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలను విజయవంతం చేసేందుకు సహకరించిన రాజకీయ పార్టీలకు అభినందనలు తెలిపారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాలేదన్నారు. హింసా, దౌర్జన్యాలు, బూత్‌ల స్వాధీనం వంటి ఘటనలు జరగలేదన్నారు. ఒక పార్టీకి ఓటేస్తే మరో పార్టీకి పడిందంటూ సోషల్ మీడియాల్లో వస్తున్న ఫొటోల విశ్వసనీయతను రజత్ కుమార్ ప్రశ్నించారు. ఈ ఫొటోలపై విచారణకు ఆదేశించామని, ఇలాంటి ఘటనలు తన దృష్టికి రాలేదన్నారు. పోలింగ్‌పై భానుడి ప్రతాపం పోలింగ్ ఉదయంపూట జోరుగానే సాగింది. ఉదయం 9 గంటల వరకు 10.6%, 11 గంటలకు 22.8%, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 38.80% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఎండ తీవ్రత కారణంగా మందకొడిగా సాగింది. మధ్యాహ్నం 3 గంటలకు 48.95% పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఎండ తీవ్రత తగ్గిన తర్వాత మళ్లీ పుంజుకుంది. సాయంత్రం 5 గంటల నాటికి 61 శాతానికి చేరింది. కొన్ని చోట్ల ఆలస్యంగా ప్రారంభం షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈవీఎంలు మొరాయించడంతో పలు కేంద్రాల్లో గంట నుంచి రెండు గంటల పాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5.30–6.45 గంటల మధ్య మాక్‌పోలింగ్ నిర్వహించిన తర్వాత పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. మాక్పోలింగ్లోనే ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఎన్నికల్లో మొత్తం 64,512 బ్యాలెట్ యూనిట్లు, 34,635 కంట్రోల్ యూనిట్లు, 34,770 వీవీప్యాట్స్ వినియోగించగా, మాక్ పోలింగ్ సందర్భంగా 541 బ్యాలెట్ యూనిట్లు, 639 కంట్రోల్ యూనిట్లు, 843 వీవీప్యాట్స్‌ను మార్చాల్సి వచ్చింది. ఉదయం 7 గంటలకు వాస్తవ పోలింగ్ ప్రారంభమైన తర్వాత కూడా కొన్ని చోట్ల యంత్రాలు మొరాయించాయి. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈ సారి ఈవీఎంల సమస్యలు తగ్గాయని రజత్‌కుమార్ పేర్కొన్నారు. బద్ధకించిన జంటనగరాలు ఓటేసేందుకు జంటనగరాల ప్రజలు మళ్లీ బద్దకించారు. సాయంత్రం 5 గంటలకు ప్రకటించిన పోలింగ్ శాతం అంచనాల ప్రకారం.. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో అత్యల్పంగా 44.99% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో 39.49%, మల్కాజ్గిరి స్థానం పరిధిలో 49.21% పోలింగ్ నమోదైంది. మెదక్ లోక్‌సభ పరిధిలో అత్యధికంగా 68.60% పోలింగ్ జరిగింది. గ్రామీణ ప్రాంతాలతో కూడిన చేవెళ్ల లోక్‌సభలో 54.8% పోలింగ్ నమోదైంది. జంటనగరాల పరిధిలో అత్యల్ప ఓటింగ్ శాతం నమోదు కావడంపై సీఈఓ రజత్‌కుమార్ స్పందించారు. గురువారం 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత, బలమైన అభ్యర్థులు బరిలోలేకపోవటం, జాతీయస్థాయిలో రాజధాని అంశాలు ఎజెండాలో లేకపోవటం, విస్తృత ప్రచారానికి సమయం లేకపోవటం, నగరంలో ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు అందకపోవటం వంటి కారణాలతోనే పోలింగ్ తక్కువగా నమోదైందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 85%, ఎమ్మెల్యే ఎన్నికల్లో 70–75% పోలింగ్ జరిగిందన్నారు. ప్రజలతో అనుసంధానమై ఉండే వ్యక్తిని ఎన్నుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారన్నారు. ఎంపీలతో ప్రజలకు నేరుగా అనుబంధం ఉండదని, దీంతో సాధారణంగా లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ తక్కువే ఉంటుందన్నారు. పోలింగ్ శాతం పెంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. సికింద్రాబాద్‌లో అత్యల్పంగా.. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో అత్యంత తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. ఈ నియోజకవర్గంలో మధ్య, దిగువ మధ్య తరగతి జనాలు ఎక్కువగా ఉండే అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో 30.19%, ముషీరాబాద్ నియోజకవర్గంలో 36.70% ఓటింగ్ నమోదైంది. సంపన్నుల కేంద్రమైన ఖైరతాబాద్ నియోజకవర్గంలో 38% మంది ఓటేశారు. ఇక హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో యాకుత్‌పురా నియోజకవర్గంలో 32%, మలక్‌పేట నియోజకవర్గంలో 33.60% ఓటింగ్ నమోదైంది. ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా నివసించే గోషామహల్లో 45.70% ఓట్లు పోల్‌కావడం విశేషం. 220 కోట్లు విలువైన జప్తులు! మే 23న ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని రజత్‌కుమార్ తెలిపారు. పోలింగ్ ముగియడంతో తనిఖీలు ఉండవన్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మొత్తం రూ.74.56 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను జప్తు చేశామన్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో రూ.76 కోట్లు విలువైన జప్తులు కలిపితే ఈ మొత్తం రూ.220 కోట్లకు పెరుగుతుందన్నారు. 2014లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఇది మూడు రెట్లు అధికమని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూంలకు ఈవీఎంలు! పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కలెక్షన్ సెంటర్‌కు తరలిస్తారని రజత్‌కుమార్ వెల్లడించారు. అక్కడ ఉండే సహాయ రిటర్నింగ్ అధికారి ఫారం–17సీ, ఈవీఎం, వీవీప్యాట్స్‌ను పరిశీలించి చూస్తారన్నారు. మొత్తం ఓట్లు, పోలైన ఓట్లను సరిచూసుకుంటారన్నారు. తర్వాత ఎన్నికల పరిశీలకుడు దీన్ని ధ్రువీకరిస్తూ సంతకం చేస్తారన్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలను సంబంధిత లోక్‌సభ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలిస్తారన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద రెండంచెల భద్రత ఉంటుందన్నారు. కేంద్ర సాయుధ బలగాలతో తొలి అంచె, రాష్ట్ర పోలీసు బలగాలతో రెండో అంచె బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. అక్కడ సీసీటీవీల నిఘా ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను కాపలాగా పెడతామని కోరుకుంటే, వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ముగిసిన తర్వాత 45 రోజుల వరకు ఈ భద్రత ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత, వాటిని సవాలు చేస్తూ 45 రోజుల్లోగా న్యాయ స్థానంలో పిటిషన్ వేయడానికి అవకాశముందని, అందుకే వీటికి భద్రత కల్పిస్తామన్నారు. గిన్నిస్‌బుక్‌లో ఇందూరు ఎన్నికలు! నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు పోటీ చేసినా, అక్కడ పోలింగ్ విజయవంతంగా ముగిసిందన్నారు. ఇందుకు నిజామాబాద్, జగిత్యాల జిల్లాల ఎన్నికల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. 185 మంది అభ్యర్థులకు ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం ప్రపంచరికార్డు అని, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించాలని ఆ సంస్థకు లేఖ రాశామన్నారు. నిజామా బాద్ పోలింగ్ సందర్భంగా 261 బ్యాలెట్ యూని ట్లు, 55 కంట్రోల్ యూనిట్లు, 87 వీవీప్యాట్స్‌ను మార్చాల్సి వచ్చిందన్నారు. -
‘రాజకీయ’ సినిమాలు ప్రసారం చేయొద్దు: ఈసీ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నమూనా ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో ఒక రాజకీయ పార్టీకి.. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ, అభ్యర్థికి అనుకూలంగా ఉండి, పోటీలో ఉన్న ప్రత్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపగల రాజకీయ కథాంశంతో ఉన్న సినిమాలు, జీవిత చరిత్రలు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసా రం చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లు సీఈవో రజత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సర్టిఫైడ్ అంశాలతో కూడుకున్నవి అయినప్పటికీ ఒక అభ్యర్థికి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పోటీలో సానుకూలంగా, తోడ్పాటుగా ఉన్న ఏ పోస్టర్, మరే ఇతర ప్రచార సామాగ్రినికానీ ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ప్రదర్శించకూడదని కూడా చెప్పారు. -
ఓటు వేయాలంటే గుర్తింపు కార్డు ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: దేశభవిష్యత్తును నిర్ణయించే.. 2019 లోక్‌సభ ఎన్నికల తొలివిడతకు సర్వం సిద్ధమైంది. తెలంగాణలోని 17ఎంపీ స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలు సహా 20 రాష్ట్రాల పరిధిలోని మొత్తం 91 లోక్‌సభ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలోని 16 స్థానాలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. నిజామాబాద్‌లో రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో.. అక్కడ పోలింగ్‌కు ముందు మాక్ పోలింగ్ నిర్వహణకు గంట సమయం అదనంగా పట్టనుంది. దీంతో ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 5 లోక్‌సభ స్థానాల పరిధిలోని 13 నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. మే 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల నుంచి తమ అభ్యర్థులను పోటీలో నిలిపాయి. ఐదు స్థానాల్లో బీఎస్పీ, చెరో రెండేసి స్థానాల్లో సీపీఐ, సీపీఎం అభ్యర్థులు, ఒక స్థానం నుంచి మజ్లిస్ పోటీ చేస్తున్నాయి. మొత్తం 443 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. అందులో 25 మంది మహిళా అభ్యర్థులున్నారు. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ మంచి ఊపు మీదుంది. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే భారీ విజయాన్ని అందిస్తాయని ఆ పార్టీ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో హైదరాబాద్ మినహా 16 స్థానాలను గెలుచుకుంటామని కేసీఆర్ చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకతతో పాటు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ‘న్యాయ్’పథకంపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ గాలి మళ్లీ వీస్తుందని.. ఆయన ఇమేజ్, విధానాలు ఎన్నికల్లో కలిసొస్తాయని బీజేపీ భావిస్తోంది. కాగా, హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి తన గెలుపు ఖాయమేనని మజ్లిస్ అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ధీమాతో ఉన్నారు. 2.97 కోట్ల మంది ఓటర్లు 17 లోక్‌సభ స్థానాల పరిధిలో మొత్తం 2,96,97,279 ఓటర్లుండగా అందులో 1,49,19,751 మంది పురుషులు, 1,47,76,024 మంది మహిళలు, 1504 మంది ఇతరులు కలిపి మంది సాధారణ ఓటర్లు ఉన్నారు. 11,320 మంది సర్వీసు ఓటర్లు కలిపి మొత్తం 2,97,08,599 మంది లోక్‌సభ ఎన్నికల్లో ఓటేయనున్నారు. ఓటర్లందరికీ ఫోటో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేశామని సీఈఓ వెల్లడించారు. 48 లక్షల మంది కొత్త ఓటర్లకు ఎపిక్ కార్డులు జారీ చేశామన్నారు. 77,365 బ్యాలెట్ యూనిట్లు, 41,051 కంట్రోల్ యూనిట్లు, 43,894 వీవీప్యాట్లను ఎన్నికల్లో వినియోగించబోతున్నారు. ఎన్నికలకు సర్వం సిద్ధం రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ ప్రకటించారు. ఎన్నికల సామగ్రితో ఎన్నికల సిబ్బంది బుధవారం రాత్రి నాటికి రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని వెల్లడించారు. గురువారం ఉదయం 5.30గంటలకు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు మాక్‌పోలింగ్ నిర్వహిస్తారని, ఎన్నికల ఏజెంట్లు తప్పనిసరిగా ఈ ప్రక్రియకు పాల్గొనాలన్నారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల విధుల్లో 2.2లక్షల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటారన్నారు. 145 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలతో పాటు 55వేల రాష్ట్ర పోలీసు సిబ్బంది, హోంగార్డులు ఎన్నికల బందోబస్తు నిర్వహిస్తారన్నారు. ఎన్నికల సిబ్బంది, భద్రత దళాలు కలుపుకుని మొత్తం 3లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాలుపంచుకోనున్నారన్నారు. మావోయిస్టుల మందుపాతరకు.. ఛత్తీస్‌గఢ్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యేతో పాటు ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించిన నేపథ్యంలో రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావంపై పోలీసుశాఖతో సమీక్ష నిర్వహించామన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం పెద్దగా లేదని, ఆందోళనపడాల్సిన అవసరం లేదని పోలీసు శాఖ స్పష్టం చేసిందన్నారు. ఇందూరుపైనే అందరి దృష్టి! నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు సంఖ్యలో 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి అక్కడే ఉంది. అక్కడ ఎం–3 మోడల్ అధునాతన ఈవీఎంలను వినియోగిస్తున్నారు. 185 అభ్యర్థులు, ఒక నోటా ఆప్షన్‌కు బ్యాలెట్లో చోటు కల్పించడానికి ఒక్కో కంట్రోల్ యూనిట్‌కు 12 బ్యాలెట్ యూనిట్లతో పాటు వీవీ ప్యాట్ యంత్రాలను అనుసంధానం చేసి ఎన్నికలు నిర్వహించబోతున్నారు. దేశ చరిత్రలో నాలుగుకు మించి బ్యాలెట్ల యూనిట్లను వాడడం ఇదే తొలిసారి. ఇంత పెద్ద సంఖ్యలో ఈవీఎం యంత్రాలను సిద్ధం చేయడానికి 600 మంది ఇంజనీర్లు, అధికారులు 6 రోజులుగా రాత్రింబవళ్లు శ్రమించారని రజత్ కుమార్ తెలిపారు. ఇక్కడ ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తాయా? లేదా? అన్నదానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్లీజ్ వచ్చి ఓటేయండి! ఓటు ప్రజాస్వామ్య హక్కు అని, ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని రజత్‌కుమార్ పేర్కొన్నారు. ప్రతి పౌరుడు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా, ఆత్మప్రబోధం మేరకు ఓటు హక్కును వినియోగించాలని పిలుపునిచ్చారు. కేవలం ఓటరు స్లిప్పుతో ఓటేయలేరు .. కేవలం ఓటరు స్లిప్పుతో వచ్చి ఓటర్లు ఓటేయలేరని, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉంటేనే ఓటేసేందుకు అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ స్పష్టం చేశారు. ఓటరు స్లిప్పు కేవలం ఆహ్వానపత్రం మాత్రమేనని, అదే ఓటరు గుర్తింపుకార్డు కాదన్నారు. ఓటరు వివరాలు, పోలింగ్ స్టేషన్ చిరునామా తెలపడమే ఓటరు స్లిప్పుల ఉద్దేశమన్నారు. ప్రతి ఓటరు తమ ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) లేదా కింద పేర్కొన్న 12 రకాల గుర్తింపు కార్డులను ఎన్నికల కేంద్రానికి తీసుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు ఉన్నంత మాత్రాన.. ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఓటువేయలేరన్నారు. ప్రతి ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో తనిఖీ చేసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లాలన్నారు. వీటిలో ఏదైనా ఒక ధ్రువీకరణ కార్డును వెంట తీసుకెళ్లాలి ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వ రంగ సంస్థలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి ఫోటో గుర్తింపు కార్డు బ్యాంకులు/తపాల కార్యాలయం జారీ చేసిన ఫోటో పాస్‌బుక్ , ఆర్జీఐ/ఎన్పీఆర్ జారీ చేసిన స్మార్ట్‌కార్డు ఉపాధి హామీ జాబ్ కార్డు , కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్‌స్రూ?న్స్ స్మార్ట్ కార్డు ఫోటో కలిగిన పింఛను డాక్యుమెంట్ , ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫోటో ఓటరు స్లిప్ ఎంపీలు/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు మీ పోలింగ్ కేంద్రం తెలుసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? ఈ కింది పేర్కొన్న ఏదైన ఓ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు. 9223166166 నంబర్‌కు 'TS VOTE VOTER ID NO' నమూనాలో ఎస్సెమ్మెస్ పంపితే మీ మొబైల్ ఫోన్‌కు పోలింగ్ కేంద్రం చిరునామా రానుంది. (ఉదాహరణకు 'TS VOTE AB-C1234567'). – 1950 నంబర్‌కు 'ECI VOTERID NO' నమూనాలో ఎస్సెమ్మెస్ పంపితే పోలింగ్ కేంద్రం తెలుసుకోవచ్చు. (ECI ABC1234567) – స్మార్ట్ ఫోన్లో నా ఓట్ (Naa Vote) యాప్‌ను డౌన్లోడ్ చేసుని లొకేషన్ చెక్ చేసుకోవచ్చు. – 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసిన తెలుసుకోవచ్చు. -
ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
హైదరాబాద్: ఏప్రిల్ 11న జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌తో పాటూ , ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించడం, వ్యాప్తి చేయడంపై చట్ట ప్రకారం ఆంక్షలున్నాయని, వాటిని నిక్కచ్చిగా పాటించాలని తెలంగాణా ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రజత్ కుమార్ బుధవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951కి సంబంధించిన సెక్షన్ 126ఏ లోని సబ్ సెక్షన్(1),(2)ల కింద సంక్రమించిన అధికారాలను వినియోగించి ఎన్నికల కమిషన్(ఈసీ) ఏప్రిల్ 11న ఉదయం 7 నుంచి, మే 19న సాయంత్రం 6.30 గంటల వరకు ఈ ఆంక్షల్ని విధించిందని ఆయన చెప్పారు. ఈ మధ్య కాలంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచురణ లేదా సమాచారం వ్యాప్తి చేయకూడదని, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ప్రకటించకూడదని ఆయన స్పష్టం చేశారు. పోలింగ్ ముగింపునకు నిర్ణయించిన సమయానికి ముందున్న 48 గంటల వ్యవధిలో, ఎటువంటి ఓపీనియన్ పోల్స్ ఫలితాలు లేదా మరే ఇతర పోల్ సర్వేలు, తదితర ఎన్నికల సమాచారం ప్రకటన, ప్రచురణ కూడా నిషిద్ధమని వివరించారు. -
నిజామాబాద్‌లో ప్రత్యేక ఏర్పాట్లు: సీఈఓ
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, నిజామాబాద్‌లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రజత్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణాలో 11వ తేదీ జరగబోయే పోలింగ్‌లో 2 కోట్ల 97 లక్షల 8599 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వెల్లడించారు. ఇందులో సర్వీస్ ఓటర్లు 11 వేల 320, ఎన్నారై ఓటర్లు 11 వేల 731 మంది ఉన్నారని చెప్పారు. తెలంగాణాలో 34 వేల 604 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, అన్ని పోలింగ్ కేంద్రాలకు సామగ్రి పంపిస్తామని అన్నారు. 48 గంటల ముందు ప్రచారం బంద్ ‘పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం బంద్ చెయ్యాలి. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మావోయిస్టు ప్రాంతాల్లో 7 గంటల నుంచి 4 గంటలకు వరకు మాత్రమే ఓటు వేయడానికి వీలుంది. నిజామాబాద్‌లో మాత్రం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌లో పాల్గొనవచ్చు. 4169 పోలింగ్ కేంద్రాలకు లైవ్ వెబ్‌క్యాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నాం. అన్ని పోలింగ్ కేంద్రాలలో వీడియో రికార్డ్ చేస్తాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా ఎన్నికలు నిర్వహించాం. ఈ ఎన్నికల్లో కూడా విజయవంతంగా నిర్వహిస్తాం. ఫోటో ఓటర్ స్లిప్ పంపిణీలో కొంత ఇబ్బంది ఉంది. గత ఎన్నికల్లో సమస్య ఉంది కానీ ఈసారి అలాంటి సమస్య లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన ఏవైనా ఐడీ కార్డులు చూపించి ఓటు వేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేశా’ మని రజత్ కుమార్ వెల్లడించారు. సోషల్ మీడియా వార్తలపై నిఘా ‘ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కూడా నిఘా పెట్టి చర్యలు తీసుకుంటున్నాం. 579 వార్తలు పెయిడ్ న్యూస్ కింద కేసులు బుక్ చేశాం. తెలంగాణాలో రూ.52 కోట్ల 62 లక్షల నగదు సీజ్ చేశాం. సీ-విజిల్ యాప్‌కు మంచి స్పందన వస్తోంది. 1435 కేసులు సి-విజిల్ ద్వారా బుక్ అయ్యాయి. అన్ని కేసులు తక్షణమే పరిష్కరిస్తున్నాం. కుల మతాల పేరు మీద ప్రచారం చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి. రేపు 5 గంటల నుంచి న్యూస్ ఛానల్లో ఎన్నికల ప్రచారం ప్రసారం చేయకూడదు. మద్యం కూడా బంద్ చెయ్యాలి. రేపు సాయంత్రం 5 గంటల నుంచి స్థానికేతరులు ఉండకూడదు. నిజామాబాద్ పార్లమెంటు నియోజవర్గంలో సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చు. పోలింగ్ కేంద్రంలో ఓటు వేశాక సెల్ఫీలు తీసుకుంటే చర్యలు ఉంటాయ’ని స్పష్టంగా పేర్కొన్నారు. అన్ని సంస్థలకు పోలింగ్ రోజు సెలవు ‘ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పోలింగ్ రోజున సెలవు ఇవ్వాలి. లేదంటే చర్యలు ఉంటాయి.గత ఎన్నికల్లో ఈవీఎంలలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు వచ్చాయి. కానీ ఈసారి బెల్ కంపెనీకి చెందిన లేటెస్ట్ యంత్రాలు వాడుతున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి వెళ్లి వచ్చాను. చాలా బాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తక్కువ సమయంలో అన్ని ఏర్పాట్లు చేశాం. బ్యాలెట్ పేపర్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బ్యాలెట్‌తో కౌంటింగ్ జరిపేటప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది. రైతులతో అన్ని అంశాలపై చర్చించాం. వాళ్లు చాలా సంతోషం వ్యక్తం చేశారు. లోకల్ బాడీ ఎన్నికలకు అనుమతి ఇచ్చారు. ఫలితాలు మాత్రం లోక్‌సభ ఎన్నికల తర్వాతే విడుదల చెయ్యాల’ని రజత్ కుమార్ చెప్పారు. ముగిసిన ప్రచారం తెలంగాణాలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఒక్క నిజామాబాద్ మినహా అన్ని నియోజకవర్గాల్లో 5 గంటల వరకే ఈసీ పర్మిషన్ ఇచ్చింది. నిజామాబాద్ నియోజకవర్గంలో మాత్రం అభ్యర్థులు 6 గంటల దాకా ప్రచారం చేసుకునే వెసులుబాటు ఉంది. -
‘పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ తీసుకోకూడదు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలంగాణ సీఈఓ రజత్‌కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఓటేశాక సెల్పీ తీసుకోకూడదన్నారు. అలా చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నిజామాబాద్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. తెలంగాణలో 2 కోట్ల 97 లక్షల 8599 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు సామాగ్రి పంపిస్తున్నాం. అభ్యర్థులు 48 గంటల ముందు ప్రచారం బంద్ చేయాలి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరనుంది. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. 4,169 పోలింగ్ కేంద్రాలకు లైవ్ వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాం. 90 శాతం ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నిఘా పెట్టి చర్యలు తీసుకుంటున్నాం. పెయిడ్ న్యూస్ కింద 579 కేసులు నమోదు చేశాం. రాష్ట్రంలో 52 కోట్ల 62 లక్షల రూపాయలు సీజ్ చేశాం. సీ విజిల్ యాప్‌కు మంచి స్పందన వస్తుంది. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు పోలింగ్ రోజు సెలవు ఇవ్వాలి లేదంటే తీసుకుంటామ’ని రజత్ కుమార్ తెలిపారు. -
11నే ‘ఇందూరు’ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 11న నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ స్పష్టం చేశారు. పసుపు, మొక్కజొన్న రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు వేయడంతో నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య 185కు పెరిగిపోయిన విషయం తెలిసిందే. తమకు ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవడానికి సరిపడా సమయం లభించలేదని, నిజామాబాద్ ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల బరిలో నిలిచిన రైతులు గత శుక్రవారం రజత్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. రైతుల విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల ఏర్పాట్లపై ఆదివారం ఆయన తన కార్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తుండటం, రాజకీయాల పట్ల అవగాహన లేకపోవడం వల్లే గుర్తుల కేటాయింపుపై కొందరు అభ్యర్థులు ఆందోళన చెందారని తెలిపారు. తన నిజామాబాద్ పర్యటనలో భాగంగా అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేశానని, వారూ సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో పోలింగ్ సమయం సరిపోదనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అభ్యర్థులు ఎంత మంది ఉన్నా పోలింగ్ నిర్వహించడానికి ఈవీఎంలకు అంతే సమయం పడుతుందని చెప్పారు. అభ్యర్థుల సమక్షంలో మాక్ పోలింగ్ సైతం నిర్వహించామని తెలిపారు. పోలింగ్ ప్రారంభానికి ముందు మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంలను పరీక్షించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల సంఖ్య 50కి మించితే, గరిష్టంగా 50 ఓట్లు మాత్రమే వేసి మాక్ పోలింగ్ నిర్వహించాలని నిబంధనలు పేర్కొంటున్నాయని ఆయన తెలిపారు. ఇక నిజామాబాద్‌లో 185 అభ్యర్థులు పోటీ చేస్తున్న నేపథ్యంలో మాక్ పోలింగ్ కోసం ఒక గంట సమయం పట్టనుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికలకు ఈవీఎంలు సిద్ధం.. నిజామాబాద్ మినహా రాష్ట్రంలోని మిగిలిన 16 లోక్‌సభ స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుందని రజత్‌కుమార్ తెలిపారు. నిజామాబాద్ ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎం యంత్రాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. 2,209 కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లకు ప్రథమ స్థాయి తనిఖీలు పూర్తి చేశామని చెప్పారు. ఒక యంత్రానికి ఈ తనిఖీలు నిర్వహించడానికి మూడు గంటల సమయం పడుతుందని, 2,209 యం త్రాలకు తనిఖీల కోసం అధిక సమయం, సిబ్బంది అవసరమని తెలిపారు. తనిఖీల తర్వాత ఈవీఎంలలో కేండిడేట్ల సెట్టింగ్ ప్రక్రియకు మరో మూడున్నర గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. అన్ని యంత్రాలకు ఈ పక్రియలు పూర్తి చేశామని, వాటిని పంపిణీ కేంద్రాలకు రవాణా చేస్తున్నామని ఆయన వెల్లడించారు. 9తో ప్రచారానికి తెర.. పోలింగ్ ముగింపునకు 48 గంటల ముందు అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలను విరమించాల్సి ఉంటుందని రజత్‌కుమార్ తెలిపారు. ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు ప్రచార కార్యక్రమాలతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో సైతం ప్రచారం ఆపేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వేదికగా టీఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ చేసిన ఫిర్యాదును ఈసీ పరిశీలనకు పంపామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కొత్త ఓటర్లకు 95 శాతం ఫొటో గుర్తింపు కార్డులు జారీ చేశామన్నారు. హైదరాబాద్‌లో కొంత తక్కువ పంపిణీ జరిగిందన్నారు. సోమవారం నాటికి 100 శాతం ఫొటో గుర్తింపు కార్డులు, ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. -
ఈసీఐదే తుది నిర్ణయం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ పోలింగ్ వాయిదాపై కేంద్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం నిజామాబాద్ లోక్‌సభ స్థానం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇక్కడకు వచ్చిన రజత్‌కుమార్.. బరిలో ఉన్న రైతు అభ్యర్థులు, ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలింగ్‌ను వాయిదా వేయాలని రైతు అభ్యర్థులు కోరుతున్నారని, ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘాని (ఈసీఐ)కి నివేదిస్తామని చెప్పారు. దీనిపై తుది నిర్ణయం వారిదేనని స్పష్టం చేశారు. గుర్తుల కేటాయింపు సక్రమంగా జరగలేదనీ, మొదటిసారి బరిలో ఉన్నామనీ, ఈ గుర్తులపై సరిగ్గా అవగాహన లేదని, గుర్తులు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయనీ, పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోయామని రైతు అభ్యర్థులు తమ దృష్టికి తెచ్చారన్నారు. ముందుగా బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ జరుపుతామని ప్రకటించారని, ఇప్పుడు మళ్లీ ఈవీఎంలతో నిర్వహిస్తున్నారనే అంశాలన్నీ కూడా చర్చకొచ్చాయని పేర్కొన్నారు. ప్రచారం నిర్వహించేందుకు సమయం లేనందున వారం, పది రోజులు పోలింగ్‌ను వాయిదా వేయాలని కోరారని చెప్పారు. అలాగే ఈవీఎంలను ముందుగా ఎల్ ఆకారంలో పెడతామని, మళ్లీ ఇప్పుడు డిజైన్‌ను మార్చారనే అంశంపై రైతు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారని వివరించారు. ఈ విషయాలన్నీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. పోలింగ్ వాయిదా వేయడంపై ఈసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 11న పోలింగ్ నిర్వహించాలని ప్రకటించిన మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని రజత్‌కుమార్ తెలిపారు. ప్రపంచంలోనే తొలి ఎన్నిక ఇది 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున ఈవీఎంలతో నిర్వహించడం దేశంలోనే కాకుండా, ప్రపంచంలో కూడా ఇది తొలి ఎన్నిక అవుతుందని రజత్‌కుమార్ పేర్కొన్నారు. దీన్ని ఓ సవాల్‌గా తీసుకున్నామని చెప్పారు. 27 వేల ఈవీఎంలను వినియోగిస్తున్నామని, యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని వివరించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. ఈనెల 7లోపు అన్ని ఈవీఎంలను పంపిణీ కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. మాక్ పోలింగ్ నిర్వహించాం మాక్ పోలింగ్ ప్రక్రియను నిర్వహించామని, వంద మంది అభ్యర్థులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారని తెలిపారు. అభ్యర్థులు స్వయంగా ఓటు వేసి చూశారని, ఓటింగ్ సమయాన్ని కూడా పరిశీలించారని, మాక్ పోలింగ్‌పై అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. విలేకరుల సమావేశంలో రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు, ఎన్నికల సంఘం అదనపు ఈసీఓ బుద్ధ్దప్రకాశ్, సంయుక్త సీఈఓ రవి కిరణ్, అదనపు డీజీపీ జితేందర్, ఎన్నికల పరిశీలకులు గౌరవ్ దాలియా, ఎన్నికల ప్రత్యేక అధికారి రాహుల్‌బొజ్జా తదితరులు పాల్గొన్నారు.