
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. మెదక్–నిజామాబాద్– ఆదిలాబాద్– కరీంనగర్ పట్టభద్రులు/ ఉపాధ్యాయ నియోజకవర్గాలతో పాటు వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్– కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 17 మంది, మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్– కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఏడుగురు, వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 9 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటర్లు తమ తొలి ప్రాధాన్య త ఓటును వినియోగించుకుంటేనే ఓటు చెల్లుబాటు అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. తొలి ప్రాధాన్యత ఓటు వినియోగించుకోకుండా, మిగిలిన ప్రాధాన్యత ఓట్లు వేస్తే ఓటు చెల్లుబాటు కాదని పేర్కొన్నాయి. ఈ నెల 26న ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.
నేడు మండలి ఓటర్లకు సెలవు
మండలి ఎన్నికల్లో శుక్రవారం ఓటేయనున్న ఓటర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. మండలి ఓటు హక్కు కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగిన ప్రైవేటు ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని ఆయా ప్రైవేటు సంస్థల యాజమాన్యాలకు సీఈవో రజత్ కుమార్ సూచించారు. ఓటు వేయడానికి వీలు కల్పించేలా పనివేళలు సడలించి సర్దుబాటు చేయాలని కోరారు. కాగా, మండలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను పోలింగ్ అధికారులకు చూపించాలని ఓటర్లకు ఆయన సూచించారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే ప్రత్యామ్నాయంగా ఈ కింది 9 రకాల గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు/కార్డుల్లో ఏదైనా ఒక దాన్ని చూపించి ఓటు వేయొచ్చని తెలిపారు.
ఓటర్‌కార్డుకు ప్రత్యామ్నాయాలు..
పాస్‌పోర్టు; డ్రైవింగ్ లైసెన్స్; పాన్‌కార్డు; ఉపాధ్యాయులు/పట్టభద్రులు పనిచేసే విద్యా సంస్థల వారు జారీ చేసిన సర్వీసు గుర్తింపు కార్డులు; యూనివర్సిటీ జారీ చేసిన డిగ్రీ/డిప్లొమా ఒరిజినల్ సర్టిఫికెట్; అధీకృత అధికారి జారీ చేసిన అంగవైకల్య ధ్రువీకరణ పత్రం; కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రైవేటు పారిశ్రామిక సంస్థలు జారీ చేసిన సర్వీసు గుర్తింపు కార్డులు; ఆధార్ కార్డు; ఎంపీలు/ ఎమ్మెల్యేలు/ ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు కార్డులు.
Comments
Please login to add a commentAdd a comment