Legislative Council elections
-
మహారాష్ట్ర ఎంఎల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై: మహారాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన ఆరు స్థానాలకు జరిగిన ఎన్ని కల్లో నాలుగు స్థానాలు మహావికాస్ ఆఘాడి (కాంగ్రెస్–ఎన్సీపీ–శివసేన), ఒక స్థానం స్వతంత్ర అభ్యర్ధి, ఒక స్థానం బీజేపీ కైవసం చేసుకున్నాయి. రాష్ట్రంలోని మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలతో పాటు ఒక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కరోనా మహ మ్మారి నేపథ్యంలో లాక్డౌన్ ఆంక్షలను సడలించిన అనంతరం జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడంతో మహావికాస్ ఆఘాడిలో నూతన ఉత్సాహం నిండింది. డిసెంబర్ 1న జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ప్రారంభం కాగా బీజేపీకి తొలి విజయం దక్కింది. ధులే–నందుర్బార్ స్థానిక సంస్థ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అమరీష్ పటేల్ విజయం సాధించారు. అయితే మిగిలిన స్థానాల్లో మాత్రం బీజేపీ ఓటమిపాలైంది. ముఖ్యంగా పెట్టని కోటగా ఉండే నాగపూర్, పుణే, ఔరంగాబాద్‌లలో బీజేపీకి షాక్‌నిస్తూ మహావికాస్ ఆఘాడి విజయ ఢంకా మోగించింది. పుణే పట్టభద్రుల నియోజకవర్గంలో మహావికాస్ ఆఘాడికి చెందిన ఎన్సీపీ అభ్యర్థి అరుణ్ లాడ్ విజయం సాధించారు. సుమారు 60 ఏళ్ల అనంతరం నాగపూర్‌లో బీజేపీ పరాజయం పాలైంది. ఈ నియోజకవర్గంలో మహావికాస్ ఆఘాడికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి అభిజిత్ వంజారీ తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సందీప్ జోషిపై విజయం సాధించారు. అమరావతి టీచర్ల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్ధి కిరణ్ సర్నాయక్ గెలుపొందారు. -
టీఆర్ఎస్ నుంచి మళ్లీ పల్లా..?
సాక్షి, నల్లగొండ: శాసనమండలి నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు కోసం షెడ్యూల్ ప్రకటించడంతో అన్ని పార్టీలు కార్యాచరణ మొదలు పెట్టాయి. అధికార టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు (కేటీఆర్) ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్యనేతలతో మాట్లాడారని పార్టీ వర్గాలు అంటున్నాయి. టీఆర్ఎస్ ఇప్పటికిప్పుడు తమ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం తెలుస్తోంది. మరోవైపు సీపీఐ, ఇతర పార్టీలు ఈ నెలాఖరుకల్లా అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయని చెబుతున్నారు. తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జన సమితి (టీజేఎస్), యువ తెలంగాణ పార్టీలు ఎన్నికల రంగంలోకి దిగాయి. పార్టీ రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సీపీఎం వర్గాలు అంటున్నాయి. ఆ పార్టీ తమ అభ్యర్థిని బరిలోకి దింపుతుందా..? ఎవరికైనా మద్దతు ఇస్తుందా అన్న విషయం ఇంకా తేలలేదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి ఈ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు దాదాపు డజన్ మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఆ పార్టీ కూడా పోటీలో ఉంటుందా ..? లేదా ..? అన్న విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు 2015 ఎన్నికల్లో ఓటర్ల జాబితాను పూర్తిగా రద్దు చేశారు. 2017 నాటికి పట్టభద్రులైన వారు అక్టోబర్ 1వ తేదీనుంచి దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. కార్యక్రమాలు మొదలుపెట్టిన పార్టీలు శాసనమండలి ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్న వారంతా తమ కార్యక్రమాలు మొదలుపెట్టారు. పార్టీలు సోషల్ మీడి యా వేదికగా ఓటు నమోదుపై ప్రచారం చేయడం.. పనిలో పనిగా తమ అభ్యర్థులకూ ప్రచారం కల్పించడమనే ద్విము ఖ వ్యూహంతో కదులుతున్నాయి. అధికార టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన ఈ నియోజకవర్గాన్ని నిలబెట్టుకునేందుకు ఎత్తులు వేస్తోంది. చివరి నిమిషం దాకా తమ అభ్యర్థి ఎవరనే విషయాన్ని గోప్యంగానే ఉంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నా.. ఈ సారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డినే తమ అభ్యర్థిగా బరిలోకి దింపే వీలుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జన సమితి, యువ తెలంగాణ పార్టీ లు ఇప్పటికే ఎన్నికల ముందస్తు కార్యాచరణలోకి దిగాయి. జిల్లాకే చెందిన ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ తాను పోటీ చేస్తున్నానని ఇప్పటికే ప్రకటించారు. పార్టీ రెండో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 30 వ తేదీన యువ తెలంగాణ పార్టీ తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనుందని చెబుతున్నారు. ఈ పార్టీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జర్నలిస్టు రాణి రుద్రమను పోటీకి పెట్టనున్నారని సమాచారం. ఇంకో వైపు సీపీఐ కూడా ఈ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిని పోటీకి పెట్టాలని నిర్ణయించుకుని క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తోంది. సీపీఐ కూడా ఈనెల 30వ తేదీన తమ అభ్యర్థి పేరును ప్రకటించనుందని అంటున్నారు. జర్నలిస్ట్ విజయ సారథిని తమ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించే వీలుందని పార్టీ వర్గాల సమాచారం. ఆ పార్టీ శనివారం కూడా కొత్తగూడంలో సన్నాహక సమావేశం నిర్వహించింది. సీపీఎం హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ నియోజకవర్గం తమ అభ్యర్థిని పోటీకి పెట్టే అవకాశం ఉండడంతో ఈ నియోజవర్గంలో పోటీ చేయకపోవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక్కడ ఎవరికి అవకాశం ఇస్తారన్న విషయం తేలలేదు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చి ఆయా పార్టీల మద్దతు కూడగడుతున్నారని అంటున్నారు. అంతా నమోదు చేసుకోవాల్సిందే ! వచ్చే ఏడాది మార్చిలో నల్లగొండ –ఖమ్మం– వరంగల్ పట్టభద్రుల శాసనమండలి స్థానం ఖాళీ కానుంది. ఈ నియోజకవర్గానికి 2015లో ఎన్నిక జరగగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఆయన పదవీ కాలంలో మార్చి నెలాఖరుకు ముగియనుంది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ముందస్తు కార్యాచరణకు షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు పట్టభద్రుల ఓట్ల నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ ఈ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరిలోనే ఎన్నిక జరుగుతుందని అంచనా వేస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గంలో కీలకమైన ఓటర్ల ఎన్రోల్మెంట్పై ఎవరికి వారు దృష్టి పెట్టారు. 2015 నాటి ఓటర్ల జాబితా ఇప్పుడు చెల్లుబాటులో ఉండదని ప్రకటించిన నేపథ్యంలో పట్టభద్రులంతా కొత్తగా తమ ఓటును నమోదు చేసుకోవాల్సి ఉంది. దీంతో ఈ అంశానికి ఎక్కువ ప్రచారం కల్పించేందుకు, తద్వారా ఎక్కువ మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యేందుకు ఆయా పార్టీలతో పాటు స్వతంత్రంగా బరిలోకి దిగాలనుకుంటున్న వారూ రంగంలోకి దిగనున్నారు. ఈ నియోజకవర్గంలో 2015లో 2.81 లక్షల ఓటర్లు ఉండేవారు. ఇప్పుడు ఈ జాబితా రద్దు కావడంతో వీరితోపాటు కొత్తవారూ తమ ఓటును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
ఆర్జేడీ శాసనమండలి అభ్యర్థులు వీరే
పట్నా : బీహార్‌లో త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికలకు సంబంధించి రాష్ట్రీయ జనతాదళ్( ఆర్జేడీ) బుధవారం ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. వారిలో బిస్కోమోన్ చైర్మన్ సునీల్ సింగ్, బీఎన్ కాలేజీ ప్రొఫెసర్ రామ్ బాలి చంద్రవన్షీ, ముంబైకి చెందిన వ్యాపారవేత్త ఫరూఖ్ షేక్‌లు ఉన్నారు.అంతకుముందు మంగళవారం వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలతో పాటు ఆర్జేడీకి చెందిన రాధా చరణ్ షా, సంజయ్ ప్రసాద్, దిలీప్ రాయ్, ఎండి కమర్ ఆలమ్, రణ్విజయ్ కుమార్ సింగ్‌లు పార్టీకి రాజీనామా చేసి జేడీయులో చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకేత్తించింది. మరోవైపు జేడీయూ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గులామ్ కౌస్, కుముద్ వర్మ, బీష్మ్ సాహ్నిలను ఎంపిక చేశారు. బీహార్ శాసనడమండలిలో మొత్తం 75 సీట్లు ఉండగా అందులో 63 ఎన్నికల ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 12 నామినేటెడ్ పదవులుగా ఉన్నాయి. జూలై 6న బీహార్‌లోని తొమ్మిది శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.(ఆ రాజవంశం ప్రతిపక్షంతో సమానం కాదు) -
నేడు మండలి ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. మెదక్–నిజామాబాద్– ఆదిలాబాద్– కరీంనగర్ పట్టభద్రులు/ ఉపాధ్యాయ నియోజకవర్గాలతో పాటు వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్– కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 17 మంది, మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్– కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఏడుగురు, వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 9 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటర్లు తమ తొలి ప్రాధాన్య త ఓటును వినియోగించుకుంటేనే ఓటు చెల్లుబాటు అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. తొలి ప్రాధాన్యత ఓటు వినియోగించుకోకుండా, మిగిలిన ప్రాధాన్యత ఓట్లు వేస్తే ఓటు చెల్లుబాటు కాదని పేర్కొన్నాయి. ఈ నెల 26న ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. నేడు మండలి ఓటర్లకు సెలవు మండలి ఎన్నికల్లో శుక్రవారం ఓటేయనున్న ఓటర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. మండలి ఓటు హక్కు కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగిన ప్రైవేటు ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని ఆయా ప్రైవేటు సంస్థల యాజమాన్యాలకు సీఈవో రజత్ కుమార్ సూచించారు. ఓటు వేయడానికి వీలు కల్పించేలా పనివేళలు సడలించి సర్దుబాటు చేయాలని కోరారు. కాగా, మండలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను పోలింగ్ అధికారులకు చూపించాలని ఓటర్లకు ఆయన సూచించారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే ప్రత్యామ్నాయంగా ఈ కింది 9 రకాల గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు/కార్డుల్లో ఏదైనా ఒక దాన్ని చూపించి ఓటు వేయొచ్చని తెలిపారు. ఓటర్‌కార్డుకు ప్రత్యామ్నాయాలు.. పాస్‌పోర్టు; డ్రైవింగ్ లైసెన్స్; పాన్‌కార్డు; ఉపాధ్యాయులు/పట్టభద్రులు పనిచేసే విద్యా సంస్థల వారు జారీ చేసిన సర్వీసు గుర్తింపు కార్డులు; యూనివర్సిటీ జారీ చేసిన డిగ్రీ/డిప్లొమా ఒరిజినల్ సర్టిఫికెట్; అధీకృత అధికారి జారీ చేసిన అంగవైకల్య ధ్రువీకరణ పత్రం; కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రైవేటు పారిశ్రామిక సంస్థలు జారీ చేసిన సర్వీసు గుర్తింపు కార్డులు; ఆధార్ కార్డు; ఎంపీలు/ ఎమ్మెల్యేలు/ ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు కార్డులు. -
‘మండలి’ రసవత్తరం
కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల శాసనమండలి స్థానానికి ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయం వేడెక్కింది. రేపోమాపో షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ఆయా పార్టీల్లో ఆశావహులు టికెట్ల వేటలో పడ్డారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు సైతం అభ్యర్థులను సమాయత్తం చేస్తున్నాయి. ఇండిపెండెంట్‌గా సైతం బరిలోకి దిగేందుకు పలువురు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నాలుగుజిల్లాల నియోజక వర్గానికి మార్చిలో జరగనున్న ఎన్నికల కోసం టికెట్ల పోరు రసవత్తరంగా మారింది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: ప్రస్తుతం కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న స్వామి గౌడ్ శాసనమండలి చైర్మన్‌గానూ కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం మార్చి నెలతో ముగుస్తున్నందున శాసన మండలి పోరుకు ఎన్నికల కమిషన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో మండలి ఎన్నికకు కోలాహలం నెలకొంది. ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానంపై ఆశలు పెంచుకున్న పలువురు నేతలు పెద్దఎత్తున ఓటరు నమోదు చేయించి పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఆయా పార్టీల అధిష్టానం వద్ద తమ బలం, బలగాన్ని చూపిం చుకుని టికెట్టు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అధికార పార్టీలో పోటాపోటీ.. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు నాయకులు పావులు కదుపుతున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి కార్పొరేషన్ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు తదితరులు పోటీ పడుతున్నారు. మెదక్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, ఇన్చార్జి డీటీసీగా పనిచేస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, టీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు ఎంఏ. హమీద్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌తోపాటు మరికొంత మంది హైదరాబాద్ స్థాయిలో వారివారి ప్రయత్నాల్లో మునిగితేలుతున్నారు. టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై అధిష్టానం ఎటూ తేల్చకపోవడంతో పదిమంది దరఖాస్తు చేసుకుని టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అదేస్థాయిలో నియోజకవర్గంపరిధిలో ముమ్మరంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దక్కుతుందోననే టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్‌రెడ్డి.. నాలుగు జిల్లాల్లో పర్యటన కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీమంత్రి జీవన్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీవన్‌రెడ్డి తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. అందులోభాగంగానే పలు ప్రముఖ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, లెక్చరర్లతో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరుతున్నారు. నాలుగు జిల్లాల్లో మంచిపట్టున్న నాయకుడిగా జీవన్‌రెడ్డికి పేరుంది. మాజీమంత్రిగా, కాంగ్రెస్ శాసనసభ ఉపనాయకుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్.రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మసులుకున్నారు. అదే సమయంలో వైఎస్సార్ శాసనసభకు కాంగ్రెస్‌పక్ష నాయకుడిగా ఉండగా.. జీవన్‌రెడ్డి ఉపనాయకుడిగా అధికార పార్టీని ఇరుకున పెడుతూ ప్రజాసమస్యలపై పోరాటం చేశారు. 1983 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగిన జీవన్‌రెడ్డికి సర్పంచ్ స్థాయి నుంచి పనిచేసిన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో పట్టభద్రుల ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా.. మంత్రిగా పనిచేసిన జీవన్‌రెడ్డి మల్యాల మండలం నాచుపల్లిలో జెఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, జగిత్యాల మండలం పొలాసలో వ్యవసాయ డిగ్రీ, పీజీ కళాశాలలు, నిరుద్యోగ యువతకు సంబంధించిన న్యాక్‌శిక్షణ కేంద్రం, పీజీ కాలేజీల సాధనలో కీలకపాత్ర వహించారు. అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఆశతో ఉన్నారు. బీజేపీ నుంచి సుగుణాకర్‌రావు ఖాయం భారతీయ జనతాపార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు బరిలో నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పోటీ లేకపోవడంతో సుగుణాకర్‌రావుకే టికెట్ ఖరారైనట్లు సమాచారం. బీజేపీలో సీనియర్ నాయకుడి ఉన్న సుగుణాకర్‌రావు గతంలో రెండుమార్లు కరీంనగర్ శాసనసభకు పోటీ చేసి ఓటమి చెందారు. పార్టీ పలు కీలకపదవుల్లో పనిచేసి పార్టీ పటిష్టత కోసం కృషిచేయడంతో అధిష్టానం గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుగుణాకర్‌రావు పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. పార్టీలో సీనియర్‌గా ఉన్న సుగుణాకర్‌రావు ప్రచారాన్ని ప్రారంభించి ప్రశ్నించే గళాన్ని గెలిపించాలని పట్టభద్రులను కోరుతున్నారు. మొత్తంమీద మండలికి నోటిఫికేషన్ జారీ కాకముందే రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలో రాజకీయ వేడి రగులుతుండగా స్వతంత్రులుగా పోటీ చేసేందుకు పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. ఈసారి ఎమ్మెల్సీ స్థానానికి పోటీ కూడా హోరాహోరీగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. పక్కా ప్రజాప్రతినిధులుగా పనిచేసిన నేతలే రంగంలో నిలుస్తుండడంతో సాధారణ ఎన్నికలను తలపిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు వేళాయె..
మెదక్ అర్బన్: రాష్ట్రంలో ఒకవైపు ముందస్తు అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఉండగా మరోవైపు శాసనమండలి ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన శాసన మండలి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం తెలంగాణాలో మూడు, ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2019 మార్చి 29న ఖాళీ కానున్న తెలంగాణలోని ఎమ్మెల్సీ స్థానాలు ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించినవిగా ఉన్నాయి. అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 1న ప్రారంభించారు. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబరు 6గా నిర్ణయించారు. 2019 జనవరి 1వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేయనున్నారు. జనవరి నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులు, సవరణలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 20న ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా ప్రకటించడం జరుగుతుంది. 2006లో శాసన మండలి ఏర్పాటు తర్వాత జరుగుతున్న మూడో ఎన్నికలు ఇవి. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయులు, పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల వేడి మొదలైంది. గత ఎన్నికల్లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పాతూరి సుధాకర్‌రెడ్డితో పాటు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన స్వామిగౌడ్‌ల పదవీ కాలం ముగియనుంది. ప్రస్తుతం వీరిలో సుధాకర్‌రెడ్డి చీఫ్‌విప్‌గా ఉండగా... స్వామిగౌడ్ శాసనమండలి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. జిల్లాకు సంబంధించి ఈ రెండు స్థానాలు ఖాళీ కానుండటంతో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా ముందుగా ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. రెండు స్థానాలకూ ఓటు నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఓటు నమోదు ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. శాసనమండలి విషయంలో బూత్‌లెవల్ అధికారుల వద్ద కాకుండా ఓటు నమోదు పత్రాలు తహసీల్దార్లు, ఆర్డీఓ కార్యాలయాల్లో మాత్రమే అందుబాటులో ఉంచుతారు. కానీ ఈసారి మాత్రం ఆన్లైన్లోను నమోదుకు అవకాశం కల్పించారు. ఉపాధ్యాయ ఓటర్లుగా వీళ్లు అర్హులు.. 2012 అక్టోబరు 31 నుంచి 2018 నవంబరు 1వ తేదీ వరకు అంటే ఆరేళ్ల వ్యవధిలో మూడేళ్ల పాటు ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేసిన వారిని మాత్రమే ఓటర్లుగా గుర్తించడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, పాలిటెక్నిక్, మోడల్, కస్తూర్బా, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఐటీఐ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ, యూని వర్సిటీల్లో పని చేసిన వారంతా అర్హులు. ఏ జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు ఆ జిల్లాలోనే ఓటరుగా నమోదు చేసుకోవాలి. పట్టభద్రుల ఓటరుగా నమోదుకు 2015వరకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటరు నమోదు దరఖాస్తులను స్వీకరిస్తారు. పెరగనున్న ఓటర్ల సంఖ్య... సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలకు ప్రాధాన్యం తక్కువ. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతి ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. దీంతో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ పొందని వారు వీటిపై దృష్టి సారించడం జరుగుతుంది. గత శాసనమండలి ఎన్నికల సమయంలో మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో మొత్తం 1,55,347 మంది ఉపాధ్యాయ నియోజకవర్గంలో 19,731 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. అయితే గతంతో పోలిస్తే వాట్సాప్, ట్వీటర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా ఆయా పార్టీలు, సంఘాలు విస్తృతంగా ఆయా వర్గాల్లోకి తీసుకువెళ్తే ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎన్నికలు కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఉమ్మడి జిల్లాల వారీగా ఓటరు నమోదు, ఎన్నికల ప్రక్రియ సాగనుంది. ఓటరు షెడ్యూల్ విడుదలైనప్పటికీ ఓటు నమోదు పత్రాలు ఇంకా జిల్లాకు చేరలేదు. ఒకటి రెండు రోజుల్లో పత్రాలు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. -
చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి
► శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించాలి ► అగ్రిగోల్డ్ బాధితుల పోరాట సంఘం రాష్ట్ర కన్వీనర్ మోజస్ పిలుపు ఒంగోలు టౌన్ : ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని అగ్రిగోల్డ్ బాధితుల పోరాట సంఘం రాష్ట్ర కన్వీనర్ వీ మోజస్ అగ్రిగోల్డ్ బాధితులకు పిలుపునిచ్చారు. స్థానిక ఎల్బీజీ భవన్లో సోమవారం నిర్వహించిన అగ్రిగోల్డ్ బాధితుల పోరాట సంఘ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే విషయంలో చంద్రబాబు మాయమాటలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. బాధితులు ఉద్యమం చేసినప్పుడు, కోర్టు మందలించినప్పుడు, సీఎంను కలిసినప్పుడల్లా ప్రత్యేక కోర్టు పెట్టి బాధితులకు వెంటనే న్యాయం చేస్తానని చెప్పడం తప్పితే ఇంతవరకు ఒక్కరికీ రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మార్చిలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లోపు బాధితులకు ఎప్పటిలోగా డబ్బులిస్తారో స్పష్టంగా ప్రకటించకుంటే జరగబోయే ఉద్యమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ బాధితుల పోరాటసంఘ రాష్ట్ర అధ్యక్షుడు జీ జడ్సన్ మాట్లాడుతూ కోర్టును, యాజమాన్యాన్ని మేనేజ్ చేస్తూ హాయ్‌ల్యాండ్ వంటి విలువైన ఆస్తులను కాజేసేందుకు బాధిత జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శించారు. సీఐడీ ద్వారా స్వాధీనం చేసుకున్న అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే ఉంచుకుని బాధితులకు కూడా ప్రభుత్వమే డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధితుల వివరాలను వెంటనే ఆన్లైన్లో పెట్టి వారికి మనోధైర్యం కల్పించాలన్నారు. సమావేశంలో పోరాట సంఘ నాయకులు ఏ కోటేశ్వరరావు, ఏ నరసయ్య, కే ప్రసాద్, వెంకట్రావు, శివ, ఆర్.లక్ష్మి, విశాలాక్షి, ఉమాకుమారి, శోభాదేవి, నర్సమ్మ, జాలయ్య, ఎస్కే మస్తాన్, కొండయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో మండలి పోరు!
రెండు సీట్ల ‘హస్త’గతానికి ముందస్తు వ్యూహం - అభ్యర్థుల కూర్పుపై కసరత్తు - పరిశీలనలో కేఎల్లార్, సుధీర్ పేర్లు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రంగారెడ్డి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. శాసనమండలి బరిలో నిలిచేందుకు కాంగ్రెస్‌లో నాయకుల మధ్య రేసు మొదలైంది. స్థానిక సంస్థల కోటాలో రెండు స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టింది. గాంధీభవన్‌లో మంగళవారం డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ అధ్యక్షతన పార్టీ నేతలు సర్వే సత్యనారాయణ, సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కేఎల్లార్, కూన శ్రీశైలంగౌడ్, సుధీర్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి తదితరులు సమావేశమై అభ్యర్థుల కూర్పుపై చర్చించారు. స్థానిక సంస్థల్లో పార్టీకి తగినంత బలం ఉన్నప్పటికీ, అధికారపార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌తో బలా బలాలు మారిపోయాయి. ఈ తరుణంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపారు. టీఆర్ఎస్ తరఫున ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై ఇంకా స్పష్టత రానప్పటికీ, విజ యతీరాలకు చేరడమే లక్ష్యంగా గట్టి అభ్యర్థులను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చిం ది. మారిన సమీకరణలతో రెండు సీట్లను గెలుచుకోవడానికి సరిపడా సంఖ్యాబలం లేకపోవడంతో టీడీపీతో అవగాహన కుదుర్చుకునే అంశంపై సమావేశంలో చర్చించారు. చెరో సీటుకు పోటీ చేయడం ద్వారా కారుకు కళ్లెం వేయడం సాధ్యమవుతుందనే అంచనాకొచ్చా రు. టీడీపీ సంకేతాలకు అనుగుణంగా ముందడుగు వేయాలనే అభిప్రాయానికొచ్చారు. పోటీకి సబిత విముఖత! శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విముఖత చూపారు. అధికార పార్టీ దూకుడుకు కళ్లెం వేయడానికి పోటీ చేయాల్సిందేనని సీనియర్లు పట్టుబట్టినప్పటికీ, ఆమె సున్నితంగా తిరస్కరించారు. అభ్యర్థి ఎవరైనా అంతిమ లక్ష్యం కాంగ్రెస్ గెలవడమేనని.. మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారు. సామాజిక సమతుల్యతలో భాగంగా ఒక స్థానాన్ని బీసీలకు కేటాయించాలని నిర్ణయించారు. అయితే, కేఎల్లార్ మాత్రం తన అంతరంగాన్ని బయటపెట్టలేదు. కొంత సమయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ కేఎల్లార్ వెనుకడుగు వేస్తే ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని రంగంలోకి దించాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. బీసీ కోటాలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, డీసీసీ అధ్యక్షుడు మల్లేశ్ పేర్లను సీరియస్‌గా పరిశీలిస్తోంది. -
మండలి వేడి
త్వరలో మోగనున్న నగారా * సమాయత్తమవుతున్న రాజకీయపార్టీలు * పోటీకి హేమాహేమీల కదనకుతూహలం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : శాసన మండలి ఎన్నికలకు త్వరలో నగారా మోగనుందనే సంకేతాలతో జిల్లాలో ‘పెద్దల’ పోరుకు తెరలేచింది. స్థానిక సంస్థల కోటాలోని రెండు స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయనే ప్రచారంతో రాజకీయపార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహించిన పట్నం నరేందర్‌రెడ్డి గత మే నెలలో పదవీ విరమణ చేయడంతో ఖాళీ అయింది. మరోవైపు రాష్ట్ర పునర్విభ జనలో భాగంగా జిల్లాకు అదనంగా మరో సీటు దక్కింది. పెరిగిన స్థానాన్ని ఖరారు చేస్తూ ఇటీవల కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ రెండు స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ఊపందుకోంది. ఈ తరుణంలోనే మండలిలో ఆధిపత్యం ప్రదర్శించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. గెలుపు గుర్రాల వేట కొనసాగిస్తున్నాయి. రేసు గుర్రాలివే..! శాసనమండలి బరిలో నిలిచేందుకు టీఆర్ఎస్ పార్టీలో ఆశావహుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రెండు స్థానాలనూ గెలుచుకోగలమనే విశ్వాసం గులాబీ శిబిరంలో ఏర్పడింది. పదవీ విరమణ చేసిన నరేందర్‌రెడ్డి మరోసారి పోటీకి సై అంటున్నారు. ఇప్పటికే ఎంపీటీసీ సభ్యులతో వరుస భేటీలు నిర్వహించడంతోపాటు తన పలుకుబడితో నిధుల కేటాయింపులు చేస్తూ మద్దతు కూడగ ట్టుకుంటున్నారు. తన సోదరుడు, మంత్రి మహేందర్‌రెడ్డి అండదండలతో పార్టీ టికెట్ దక్కుతుందనే భరోసాతో ఉన్నారు. ఇప్పటికే ఆ కుటుంబంలో రెండేసీ పదవులున్నందున (మహేందర్‌రెడ్డి భార్య సునీత జెడ్పీ చైర్పర్సన్)... నరేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే, కష్టకాలంలో పార్టీని విజయతీరాలకు చేర్చడంలో కీలకపాత్ర వహించిన ‘పట్నం’ కుటుంబంపై గులాబీ బాసుకు మంచి గురి ఉంది. కాంగ్రెస్, టీడీపీలను ఉమ్మడి శత్రువుగా పరిగణిస్తున్నందున వాటిని ఢీకొనేందుకు నరేందరే గట్టి అభ్యర్థని అధిష్టానం నమ్ముతోంది. నరేందర్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, రాగం సుజాతా యాదవ్, కమలాకర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, సామ వెంకటరెడ్డి మండలిపై కన్నేశారు. సామాజిక సమీకరణల దృష్ట్యా బీసీలకు కేటాయిస్తే సుజాతా యాదవ్, రాజు పేర్లను అధిష్టానం పరిశీలించే అవకాశముంది. మంత్రి కేటీఆర్ సిఫార్సుతో వెంకటరెడ్డి, సీఎం ఆశీస్సులతో హరీశ్వర్, కమలాకర్‌రెడ్డి ఈ సీటును దక్కించుకునేందుకు లాబీయింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి ఎవరూ బరిలో దిగుతారనే అంశంపై స్పష్టత వచ్చిన తర్వాతే అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాంగ్రెస్ నుంచి హేమాహేమీలు మండలి బరిలో నిలిచేందుకు కాంగ్రెస్‌లోనూ పోటీ తీవ్రంగా ఉంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న సబిత... ఇటీవల జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. చేవెళ్ల-ప్రాణహిత డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ విపక్షాలన్నింటినీ ఏకతాటి మీదకు తేవడంలో సఫలీకృతమయ్యారు. సీనియర్ నేతగా జిల్లా రాజకీయాల్లో అపార అనుభవం ఉంది. ఇటీవల మంత్రి మహేందర్‌రెడ్డి ఘాటుగా విమర్శలకు దిగడంతో ఇరు కుటుంబాల మధ్య సఖ్యత దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో పోటీకి వెనుకాడకపోవచ్చనే ప్రచారమూ జరుగుతోంది. మరోవైపు సబిత విముఖత చూపితే కేఎల్లార్ పోటీ చేసే అవకాశం ఉంది. సబిత, కేఎల్లార్ మధ్య మునుపటి స్థాయిలో అంతరం లేనప్పటికీ, అభిప్రాయబేధాలున్నాయి. వీరిరువురు ఐక్యతారాగం వినిపిస్తే విజయం సాధ్యమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ ఈ ఇద్దరి మధ్య సమన్వయం కుదరకపోతే ఎల్బీ నగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని రంగంలోకి దించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, అండబలం ఉన్న సుధీర్‌రెడ్డికి పార్టీలోనూ అసంతుష్టులు లేనందున ఈయన అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం వస్తుందని అనుకుంటోంది. ఇక టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేయడానికి టీడీపీతో జతకట్టేందుకు కాంగ్రెస్ సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నందున చెరో సీటుకు పోటీ చేసేలా అవగాహన కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఒకవేళ ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరితే టీడీపీ తరఫున మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి బావమరిది శ్రీనివాస్‌రెడ్డిని బరిలో దించే అంశాన్ని ‘దేశం’ అధినాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఇద్దరు సీఎంలు దోషులే!
నిజామాబాద్ సిటీ : శాసనమండలి ఎన్నికలలో ‘ఓటుకు నోటు’ విషయంలో ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులపై రాష్ట్రపతి రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవాలంటూ డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ కోరారు. ‘నోటుకు ఓటు’ విషయంలో ఇద్దరు సీఎంలు అవలంబిస్తున్న వైఖరికి నిర సనగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ (ఎన్టీఆర్ చౌరస్తా) వద్ద వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం తాహెర్ బిన్ హం దాన్ మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికలలో ఒక సీఎం నోట్లు ఇస్తుండగా,మరొక సీఎం డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేను కొంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని అన్నారు. ‘ఓటుకు నోటు’ విషయంలో దొంగ నాటకం ఆడుతున్న ఇద్దరు సీఎంలు తోడు దొంగలేనని ఆయన వ్యాఖ్యానించారు. వీరిద్దరూ శిక్షర్హూలేనని, రాష్ట్రపతి జోక్యం చేసుకుని వీరిద్దరిపై రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వాస్తవాలను బయటకు తీసి రెండు రాష్ట్రాల ప్రజలకు ఉత్కంఠ తొలగించాలన్నారు. మేధావులు ఏకమై తెలం గాణ, ఏపీ ప్రజలను కాపాడాలని కోరారు. ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకి పూర్తి గౌరవం ఉందన్నారు. ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటూ పోరాటం చే స్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు, మున్సిపల్ ఫ్లోరులీడర్ మాయవార్ సాయిరాం, కార్పొరేటర్లు కేశ మహేష్, చాంగుభాయి, ఖూద్దుస్, దారం సాయిలు, సర్పంచుల సంఘం ఫోరం అధ్యక్షుడు బోజన్న, డీసీసీ ఉపాధ్యక్షుడు జాకీర్, ప్రధాన కార్యదర్ళులు ఆకుల చిన్న రాజేశ్వర్, పోలా ఉషా, మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వర్ణలత, అపర్ణ, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుమీర్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజారుద్దీన్, నాయకులు సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు
- జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు - వచ్చే నెల 3న ఎన్నికలు - మొత్తం ఓటర్లు 1,192 - రాజకీయ పార్టీలతో కలెక్టర్ సమావేశం విజయవాడ : జూలై 3న జరగనున్న శాసనమండలి ఎన్నికలకు జిల్లా యంత్రాంగం కసరత్తులు ప్రారంభించింది. కృష్ణాజిల్లా స్థానిక సంస్థల రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాట్లపై రాజకీయ పార్టీలతో కలెక్టర్ బాబు.ఎ బుధవారం క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ వేరు, వేరుగా నిర్వహిస్తామని, ఓటర్లు రెండింటికి రెండు ఓట్లు వేయాలన్నారు. రెండు నియోజకవర్గాలకు సంబంధించి జిల్లాలో 1,192 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 650 మంది మహిళా ఓటర్లు ఉన్నారని చెప్పారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒకొక్క పోలింగ్ కేంద్రం చొప్పున జిల్లాలో 4 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు. మచిలీపట్నం, గుడివాడ, ఎంపీడీవో కార్యాలయాల్లో, నూజివీడు ఎస్.ఆర్.ఆర్.బాలుర ఉన్నత పాఠశాలలో, వియవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒకొక్క పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేషన్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఓటు హక్కు కల్గిన పదవీరీత్యా సభ్యులు నగర పంచాయతీ వార్డు సభ్యులు ఓటర్లుగా ఉంటారని కలెక్టర్ వివరించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఓటరు నెంబరును ఆధార్ కు అనుసంధానం చేసేందుకు ఓటర్లందరూ తప్పనిసరిగా ఆధార్ నంబరు కలిగి ఉండాలని కలెక్టర్ కోరారు. ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉయ్యూరునగర పంచాయతీ కౌన్సిలర్ అబ్దుల్ రహమాన్, విజయవాడ రూరల్ ఎంపీటీసీ సౌజన్యలకు ఆధార్ నంబర్లు లేవని గుర్తించామని కలెక్టర్ వెల్లడించారు. మచిలీపట్నం రూరల్ ఎంపీటీసీ సభ్యురాలు పి.సీతామహలక్ష్మికి ఎపిక్ కార్డు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో టీడీపీ నేత బచ్చుల అర్జునుడు, బీజేపీ నేత రామినేని వెంకట కృష్ణ, బీఎస్పీ నుంచి కిరణ్‌కుమార్, దాసన్ పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూలు ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 9న విడుదల చేస్తారు. 16వ తే దీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17న నామినేషన్ల పరిశీలన చేస్తా రు. 19న పోటీ నుంచి విరమించేందుకు చివరి తేదీ. జూలై 3వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు 7వ తేదీ ఉదయం 8గంటలకు ప్రారంభిస్తారు. ఖాళీ అయిన స్థానాలు జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు ఐలాపురం వెంకయ్య, పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగిసింది. మరొక స్థానిక సంస్థల శాసన మండలి సభ్యులు యలమంచిలి వెంకట బాబూ రాజేంద్రప్రసాద్ పదవీకాలం 2013 మార్చి 29తో పూర్తయింది. -
ఓటేద్దాం రండి!
సాక్షి, హన్మకొండ : వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. బరిలో 22 మంది అభ్యర్థులు నిలవగా, జిల్లాలో పట్టభద్రుల ఓట్లు 1,04,364 ఉన్నారుు. వీరిలో పురుషులు 76,873, మహిళా ఓటర్లు 27,487 కాగా ఇతర కేటగిరీలో నలుగురు ఓటర్లు ఉన్నారు. వీరు 144 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా 99 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1000 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని మరో 45 చోట్ల అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించేందుకు వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. ఐదు చోట్ల అనువైన పరిస్థితి లేదు. ఏర్పాట్లు పూర్తి ఎన్నికల నిర్వాహణలో పీవోలు, ఏపీవోలు, ఇతర పోలింగ్ సిబ్బందితో కలిపి 1000 మంది వరకు ప్రభుత్వ సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి పోలింగ్ జరుగనున్న దృష్ట్యా శనివారం సాయంత్రానికే ఎన్నికల సామగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇందుకోసం హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీ, నర్సంపేట, మహబూబాబాద్, ములుగు, జనగామ ఆర్డీవో కార్యాలయాల్లో ప్రత్యేక ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి పోలింగ్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సూక్ష్మ పరిశీలకులుగా, పోలింగ్ పార్టీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. వీరు అవసరాన్ని బట్టి పోలింగ్ సరళి, ఇతర సమాచారాలను నేరుగా జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు సమాచారం ఇస్తారు. జిల్లాలో తొమ్మిది పోలింగ్ కేంద్రాలు మినహా మిగతా అన్నింటిలో 1000 లోపు ఓటర్లు ఉండేలా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రంలో కూడా ఆలస్యం కాకుండా 800లోపు ఓట్లు ఉన్నట్లయితే రెండు ఓటింగ్ కంపార్టుమెంట్లు, ఆపైన ఓటర్లు ఉన్నట్లయితే మూడు ఓటింగ్ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా బ్యాలెట్ బ్యాక్స్‌లు కూడా ఒక్కో బూత్‌లో రెండుకన్నా తక్కువ కాకుండా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ ప్రాంతాన్ని 27 రూట్లు, 27 జోన్లుగా విభజించారు. వాటికి ప్రత్యేక ఇన్చార్జీలను నియమించారు. పోలింగ్ పూర్తరుున వెంటనే బ్యాలెట్ బాక్సులను డివిజన్ ప్రధాన కేంద్రాలు చేరుస్తారు. అన్ని బాక్సులు వచ్చినతర్వాత కట్టుదిట్టమైన భద్రత నడుమ నల్గొండకు తరలిస్తారు. స్థానికులనే ఏజెంట్లుగా నియమించుకోవాలి.. నియోజకర్గ పరిధిలోని వ్యక్తినే పోలింగ్ ఏజెంట్‌గా నియమించుకోవాలి. ఏజెంటుగా నియమితులైన వారు ఉదయం 7:00 గంటల వరకు పోలింగ్ కేంద్రాలను చేరుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వాకాటి కరుణ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె శనివారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల తీరు తెన్నులపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బందోబస్తు వరంగల్ క్రైం : ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు అర్బన్ పరిధిలో ఒక అదనపు ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 35 మంది ఎస్సైలు, 400 కానిస్టేబుళ్లతో పాటు ఒక కంపెనీ సీఐఎస్ఎఫ్ బలగా లు పో లింగ్ నిర్వహణలో సేవలందించనున్నాయి. కాగా, రూరల్ పరిధిలో 20 మంది సీఐలు, 56 మంది ఎస్సై లు, 83 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 300 కానిస్టేబుళ్లు, 67 మహిళా కానిస్టేబు ళ్లు, హోంగార్డులు, 100 మంది కానిస్టేబుళ్లు, 34 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు, ఒక కంపెనీ సీఐఎస్ఎఫ్ బలగాలను బందోబస్తు కోసం నియమించారు. -
‘మండలి’ వేడి
తెరపైకి ఇప్పటికి ఐదుగురు వైఎస్సార్ సీపీ మద్దతుతో గొల్ల బాబూరావు పోటీ టీడీపీ అభ్యర్థిత్వం కోసం చైతన్యరాజు, పరుచూరి యత్నాలు పీడీఎఫ్ అభ్యర్థిగా రాము సూర్యారావు స్వతంత్రంగా రంగంలోకి దిగుతున్న పిల్లి డేవిడ్ ఈసారి ఓటర్ల సంఖ్య 20 వేలకు పైనే ఏలూరు సిటీ : శాసన మండలి ఎన్నికలకు ఈ నెలాఖరున నగారా మోగబోతోంది. ఓటర్ల జాబితాలు సిద్ధమవుతున్నారుు. ఈనెల 16న తుది ఓటర్ల జాబితా ప్రచురణ కానుంది. నెలాఖరు నాటికి ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని, వచ్చే నెల రెండో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాల భోగట్టా. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. భారీగా ఎరిగిన ఓటర్ల సంఖ్య పోటీని తీవ్రతరం చేయనుంది. రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైనవిగా పేరొందిన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఓటర్లు ఏ విధమైన తీర్పు ఇస్తారనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే ఐదుగురు అభ్యర్థులు తెరపైకి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ కలిదిండి చైతన్యరాజు తాను టీడీపీ మద్దతుతో బరిలోకి దిగుతున్నట్టు చెబుతున్నారు. అదే పార్టీ నుంచి ప్రగతి విద్యాసంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు సైతం పోటీకి సై అంటున్నారు. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) తరఫున సామాజిక వేత్త రాము సూర్యారావు, స్వతంత్ర అభ్యర్థిగా పిల్లి డేవిడ్‌కుమార్ బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిత్వం ఎవరికో టీడీపీ అభ్యర్థిత్వం ఎవరిని వరిస్తుందోననే అంశం ఆసక్తికరంగా మారింది. టీడీపీ తరఫున పోటీచేసే అవకాశం తనకే దక్కుతుందన్న ఉద్దేశంతో చైతన్యరాజు ఇప్పటికే ఎన్నికల గోదాలోకి దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన ప్రగతి విద్యాసంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు టీడీపీ టికెట్ తనకే ఖాయమని పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయనను పోటీనుంచి తప్పించడానికి ఎమ్మెల్సీ సీటిస్తామని అధినాయకత్వం హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరిలో ఎవరికైనా టీడీపీ సీటివ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటారని చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బాబూరావు ఎమ్మెల్సీ ఎన్నికలు చప్పగా సాగుతాయేమో రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు బరిలో నిలవడంతో రాజకీయూలు ఒక్కసారిగా వేడెక్కారుు. శాసన మండలిలో విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేయూలనే తపనతో తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు బాబూరావు ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పాలన గాడి తప్పటం, చంద్రబాబు మాట తప్పడాన్ని అన్ని వర్గాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకత తప్పదనే అభిప్రాయాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్ల బాబూరావుకు విజయావకాశాలు ఎక్కువే అంటున్నారు. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ సహకారంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని బాబూరావు చెబుతున్నారు. యూటీఎఫ్ మద్దతుతో ఆర్ఎస్ఆర్ ఏలూరుకు చెందిన సామాజికవేత్త రాము సూర్యారావు పీడీఎఫ్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్) ఆయనకు మద్దతు ప్రకటించింది. మరోవైపు నిడదవోలు పట్టణానికి చెందిన పిల్లా డేవిడ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. ఓటర్లు పెరిగారు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలో 13,200 ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. రానున్న ఎన్నికలకు ఓటర్ల సంఖ్య పెరిగింది. పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా ఓటు హక్కు నమోదు చేయించుకున్న వారి సంఖ్య 4,184 కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 5వేలకు పైగా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 20 వేలు దాటిపోయేలా ఉంది.