మెదక్ అర్బన్: రాష్ట్రంలో ఒకవైపు ముందస్తు అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఉండగా మరోవైపు శాసనమండలి ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన శాసన మండలి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం తెలంగాణాలో మూడు, ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2019 మార్చి 29న ఖాళీ కానున్న తెలంగాణలోని ఎమ్మెల్సీ స్థానాలు ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించినవిగా ఉన్నాయి.
అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 1న ప్రారంభించారు. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబరు 6గా నిర్ణయించారు. 2019 జనవరి 1వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేయనున్నారు. జనవరి నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులు, సవరణలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 20న ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా ప్రకటించడం జరుగుతుంది. 2006లో శాసన మండలి ఏర్పాటు తర్వాత జరుగుతున్న మూడో ఎన్నికలు ఇవి.
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయులు, పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల వేడి మొదలైంది. గత ఎన్నికల్లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పాతూరి సుధాకర్‌రెడ్డితో పాటు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన స్వామిగౌడ్‌ల పదవీ కాలం ముగియనుంది. ప్రస్తుతం వీరిలో సుధాకర్‌రెడ్డి చీఫ్‌విప్‌గా ఉండగా... స్వామిగౌడ్ శాసనమండలి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. జిల్లాకు సంబంధించి ఈ రెండు స్థానాలు ఖాళీ కానుండటంతో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
దీనిలో భాగంగా ముందుగా ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. రెండు స్థానాలకూ ఓటు నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఓటు నమోదు ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. శాసనమండలి విషయంలో బూత్‌లెవల్ అధికారుల వద్ద కాకుండా ఓటు నమోదు పత్రాలు తహసీల్దార్లు, ఆర్డీఓ కార్యాలయాల్లో మాత్రమే అందుబాటులో ఉంచుతారు. కానీ ఈసారి మాత్రం ఆన్‌లైన్‌లోను నమోదుకు అవకాశం కల్పించారు.
ఉపాధ్యాయ ఓటర్లుగా వీళ్లు అర్హులు..
- 2012 అక్టోబరు 31 నుంచి 2018 నవంబరు 1వ తేదీ వరకు అంటే ఆరేళ్ల వ్యవధిలో మూడేళ్ల పాటు ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేసిన వారిని మాత్రమే ఓటర్లుగా గుర్తించడం జరుగుతుంది.
- ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, పాలిటెక్నిక్, మోడల్, కస్తూర్బా, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఐటీఐ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ, యూని వర్సిటీల్లో పని చేసిన వారంతా అర్హులు.
- ఏ జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు ఆ జిల్లాలోనే ఓటరుగా నమోదు చేసుకోవాలి.
- పట్టభద్రుల ఓటరుగా నమోదుకు 2015వరకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటరు నమోదు దరఖాస్తులను స్వీకరిస్తారు.
పెరగనున్న ఓటర్ల సంఖ్య...
సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలకు ప్రాధాన్యం తక్కువ. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతి ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. దీంతో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ పొందని వారు వీటిపై దృష్టి సారించడం జరుగుతుంది. గత శాసనమండలి ఎన్నికల సమయంలో మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో మొత్తం 1,55,347 మంది ఉపాధ్యాయ నియోజకవర్గంలో 19,731 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు.
అయితే గతంతో పోలిస్తే వాట్సాప్, ట్వీటర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా ఆయా పార్టీలు, సంఘాలు విస్తృతంగా ఆయా వర్గాల్లోకి తీసుకువెళ్తే ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎన్నికలు కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఉమ్మడి జిల్లాల వారీగా ఓటరు నమోదు, ఎన్నికల ప్రక్రియ సాగనుంది. ఓటరు షెడ్యూల్ విడుదలైనప్పటికీ ఓటు నమోదు పత్రాలు ఇంకా జిల్లాకు చేరలేదు. ఒకటి రెండు రోజుల్లో పత్రాలు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment