ఆర్.సత్యనారాయణ, డాక్టర్ రవీందర్‌గౌడ్
జోగిపేట(అందోల్): కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పదవీకాలం ముగియడంతో ఆ స్థానానికి తిరిగి మార్చిలో ఎన్నికలు జరుగనున్నాయి. స్వామిగౌడ్ ఈ స్థానం నుంచి తిరిగి పోటీ చేయకపోవచ్చని, ఆయన లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఆశావహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు.
పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించే అవకాశముందన్న నేపథ్యంలో జిల్లా నుంచి ఎవరికి బెర్త్ దక్కుతుందోనని ఎదురు చూస్తున్నారు. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, సరోజినిదేవి కంటి ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ ఎస్.రవీందర్‌గౌడ్ ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ జర్నలిస్టు ఆర్.సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఎన్నికై ఆరు సంవత్సరాల పదవీకాలం ఉన్నా పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునివ్వడమే తడువుగా గెలిచిన ఆరు నెలల్లోనే ఆరేళ్లపాటు ఉండే పదవికి రాజీనామా చేశారు. తిరిగి ఆ స్థానానికి ఎన్నికలు జరిగినా అధిష్టానం నిర్ణయానుసారం ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2013లో ఈ స్థానం నుంచి స్వామిగౌడ్ ఎన్నికయ్యారు. దీంతో సత్యనారాయణ సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించారు. తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేకే అవకాశం ఇవ్వడంతో ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ తరఫున టికెట్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పోటాపోటీగా ప్రయత్నాలు
ఈసారి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుంచి చాలామంది పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఎవరికి వారు తమ నాయకుల ద్వారా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, సరోజిని దేవి ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్‌గౌడ్‌తో పాటు కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, గ్రూపు–1అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్, తెలంగాణ ప్రైవేట్ విద్యా సంస్థల సంఘం (ట్రెస్మా) ప్రధాన కార్యదర్శి శేఖర్‌రావు ఈ లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌పార్టీ నుంచి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోటీ చేయనున్నట్లు ప్రకటనలు రావడంతో పోటీ ఆసక్తికరంగా ఉండొచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment