సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిర్మలకు 400 ఓట్లు వస్తాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన 230 మంది ఓటర్లతో పాటు ఇతర పార్టీలకు చెందిన 170 మంది తమకు ఓటేశారని అంచనా వేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 230 ఓట్లు తమ అభ్యర్థినికి రాకపోతే అందుకు తానే బాధ్యత వహిస్తానన్నారు.
ఫలితాలను చూశాక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలా వద్దా అనేది స్పందిస్తానని చెప్పారు. మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికను ఏకగ్రీవం కాకుండా చేయడమే తమ మొదటి విజయమని చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలతో ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు ట్రబుల్‌లో పడటం ఖాయమని వ్యాఖ్యానించారు.
హరీశ్‌తో క్యాంపులు పెట్టించి టూరిస్ట్ బస్సు దగ్గరుండి ఎక్కించే పరిస్థితి తీసుకొచ్చామని జగ్గారెడ్డి చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వరి రైతు లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగిస్తోందన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారి కోసం గాంధీభవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment