ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూలులో ఓటు వేసేందుకు బారులు దీరిన ఉపాధ్యాయులు, పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జేసీ చక్రధరబాబు
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 90.39 శాతం ఓట్లు పోలయ్యాయి. 5691 ఓటర్లు ఉండగా 5144 ఓట్లు పోలయ్యాయి. 3703మంది పురుషులు, 1441మంది స్త్రీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు ఈనెల 26న జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. శుక్రవారం ఉదయం 8 గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 10 గంటల సరికే 28.43 శాతం ఓట్లు పోలవగా 12 గంటల సరికి 68.52 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ ముగిసే సమయమైన 4 గంటల సరికి 90.39 శాతం ఓట్లు నమోదయ్యాయి.
వీరఘట్టం మండలంలో 75 ఓట్లు, భామిని మండలంలో 38, కొత్తూరుమండలంలో 90, పాతపట్నం మండలంలో 233, మెళియాపుట్టి మండలంలో 88, హిరమండలంలో 36, పాలకొండ మండలంలో 289, వంగరలో 27, రేగిడిలో 64, సారవకోటలో 50, సంతకవిటిలో 93, రాజాంలో 261, సీతంపేటలో 115 ఓట్లు పోలయ్యాయి. అలాగే ఎల్‌ఎన్ పేటలో 22, సరుబుజ్జిలిలో 38, బూర్జలో 29, జి. సిగడాంలో 38, ఆమదాలవలసలో 277, నరసన్నపేటలో 172, పోలాకిలో 58, గారలో 53, శ్రీకాకుళంలో 559, శ్రీకాకుళం బూత్–2లో 693, పొందూరులో 150, లావేరులో 39, రణస్థలంలో 49, ఎచ్చెర్లలో 106, పలాసలో 252, మందసలో 133, కంచిలిలో 66, ఇచ్ఛాపురంలో 106, కవిటిలో 71, సోంపేటలో 202, వజ్రపుకొత్తూరులో 50, నందిగాంలో 36, టెక్కలిలో 267, సంతబొమ్మాళిలో 42, కోటబొమ్మాళిలో 98, జలుమూరులో 79 ఓట్లు పోలయ్యాయి.
దివ్యాంగులకు ప్రత్యేక అవకాశం
పోలింగ్‌లో పాల్గొన్న దివ్యాంగులు క్యూలో నిలబడకుండా ప్రత్యేక అనుమతిని కల్పించారు. అంధులైన వారికి సహాయకులతో ఓటు వేసే అవకాశం ఇచ్చారు. గర్భిణులు, శస్త్ర చికిత్సలు జరిపించుకున్న వారికి కూడా ఇటువంటి ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జేసీ, డీఆర్‌ఓ
శ్రీకాకుళం నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ చక్రధర్‌బాబు, డీఆర్‌ఓ నరేంద్రకుమార్‌లు సందర్శించారు. ఓటింగ్ నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. డీఎస్పీ చక్రవర్తి, సీఐ ఎం.మహేష్ కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి బందోబస్తును పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment