గ్రాడ్యుయేట్లు, టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తుండడంతో అధికార తెలుగుదేశంపార్టీ ఓట్ల కొనుగోలుకు తెరలేపింది. పట్టభద్రులకు ఒక్కో ఓటుకు రూ.4వేలు విలువచేసే స్మార్ట్ ఫోన్, ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్లకు రానుపోను చార్జీలు ఇచ్చేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. అలాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు డబ్బులు ఎరవేసి శనివారం రాత్రి నుంచి శిబిరాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి తనకు అనుకూలంగా ఓటు వేసే వారికి స్మార్ట్ ఫోన్‌లు, ఎన్నికల ఖర్చులు పంపిణీ ప్రారంభించింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాల శాసనమండలి ఎన్నికలకు సోమవారంతో ప్రచారం గడువు ముగుస్తుంది. ఈ నెల 9వ తేదీ పోలింగ్ జరుగుతుంది.
పోలింగ్‌కు మూడు రోజులే గడువు ఉండటంతో అధికారపార్టీ ఓట్లు కొనుగోలు చేసే పనిలో పడింది. రాజధాని అమరావతి నిర్మాణంలో తెలుగుదేశంపార్టీ నుంచి వేల కోట్ల రూపాయల లబ్ధిపొందిన చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రముఖ కాంట్రాక్టర్ టీడీపీ తరపున పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు పోటీచేస్తున్న వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, వాసుదేవనాయుడు తరపున ఓటర్లకు పంపిణీ చేయడానికి పెద్ద సంఖ్యలో స్మార్ట్ ఫోన్‌లు కొనుగోలు చేశారు. ఇందులో భాగంగా ఆదివారం నాటికి జిల్లాలో సుమారు 75వేల మొబైల్ ఫోన్‌లు చేరవేశారు. ఓటరు జాబితా ప్రకారం పట్టభద్రులకు స్థానిక టీడీపీ నాయకులు స్లిప్ అందజేస్తారు.
ఓటర్లు ఆ స్లిప్‌ను నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న నాయకుడి వద్దకు తీసుకెళ్తే స్మార్ట్ ఫోన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల్లో ఉండే పట్టభద్రులు తమ ప్రాంతానికి వచ్చి ఓటు వేయడంకోసం వారికి ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చులకు డబ్బులు అందించేందుకు గాను జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు పెద్ద మొత్తంలో నగదు సరఫరా అయింది. దీంతోపాటు ఆయా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను చేర వేసేందుకు నియోజక వర్గానికి పది చొప్పున ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉపాధ్యాయ ఓటర్లను ప్రలోభపెట్టడంకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కుదిరితే తాయిలాలు ఇవ్వడం, లేకపోతే బెదిరించి తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
స్థానిక ఓటర్లను చేజారనియొద్దు
స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న తెలుగుదేశంపార్టీ ప్రజాప్రతినిధులను ఒక్కరిని కూడా చేజారకుండా చూసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జిల్లా నాయకులకు సూచించారు. ఆదివారం ఆయన పార్టీ అభ్యర్థి వాకాటి నారాయ ణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో ఎన్నికల గురించి ఫోన్‌లో చర్చించారు. అవసరమైతే ఏ స్థాయిలో అయినా అధికా ర దుర్వినియోగం చేసి అసంతృప్తి ఓటర్లను కట్టడి చేయాలని సూచించారు. సోమవారం సాయంత్రానికి ఏ రకంగానైనా పరిస్థితి అనుకూలంగా మలిచే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.