సాక్షి ప్రతినిధి, తిరుపతి: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన విద్యాసంస్థలు, కళాశాలలు ఉండడంతో రెచ్చిపోతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి, ఫోర్జరీ సంతకాలతో నాన్‌టీచింగ్ సిబ్బందినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. దీనికి తిరుపతి కేంద్రంగా వ్యవహారం నడుస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కనీయకుండా అత్యంత చాకచక్యంగా ముందుకు నడుపుతున్నట్టు సమాచారం.
మార్ఫింగ్ చేసి.. నమోదు చేసి
టీడీపీ సానుభూతిపరులు, ఆ పార్టీ నేతలకు సంబంధించిన పాఠశాలలు, కళాశాలలను ఎమ్మెల్సీ ఓటు బ్యాంక్‌గా ఉపయోగించుకుంటున్నారు. యూజీసీ జాబితాలో లేని యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారిని ఎంచుకుంటున్నారు. వారికి ఎంతో కొంత డబ్బులిచ్చి నకిలీ సర్టిఫికెట్లను సృష్టిస్తున్నట్టు సమాచారం. అందులో టీడీపీ నేతలు తాము ఎంచుకున్న కళాశాలలు, పాఠశాలల సిబ్బంది ఫొటోలు మార్ఫింగ్ చేసి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసేపనిలో నిమగ్నమైనట్టు ఇప్పటికే ఫిర్యాదులు వస్తున్నాయి. ఆపై వారికి అనుకూలంగా ఉన్న గెజిటెడ్ అర్హత లేని ప్రయివేటు కళాశాలల ప్రిన్సిపాళ్లతోనే సంతకాలు చేయించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బీఎల్వోలు, మండల స్థాయిలో విచారణాధికారులు అత్యంతపటిష్టంగా ఓటర్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది.
తిరుపతిలోని ఓ విద్యాసంస్థలో 54 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉన్నవారు 18 మంది మాత్రమే. మిగిలిన వారు నాన్ టీచింగ్ సిబ్బంది. వారందరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. నాన్ టీచింగ్ సిబ్బందిని ఉపాధ్యాయులుగా చిత్రీకరించే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. ఒకటి రెండు రోజుల్లో అనర్హులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
చంద్రగిరి పరిధిలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో రెండు రోజుల క్రితం టీడీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మండల, గ్రామస్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్లను చేర్పించాలని కోరారు. ‘మీకెంత కావాలి?.. డబ్బులు కాకుండా ఇంకేమైనా కావాలా?’ అని అడిగారు. ఎక్కువ మంది డబ్బే డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం హాజరైన వారందరికీ మందు, విందు ఏర్పాటు చేశారు.
టీడీపీ అడ్డదారులు
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదు ప్రక్రియ సమయం దగ్గరపడుతుండడంతో టీడీపీలో హడావుడి మొదలైంది. తమకు అనుకూలంగా ఓట్లు వేయించే వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు ఆ పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. అందుకు పక్కాప్రణాళికలు రచించారు. అనర్హులను ఓటర్లుగా నమోదుచేసే ప్రక్రిను దిగ్విజయంగా పూర్తిచేసేపనిలో తలమునకలయ్యారు.
చిత్తూరుకు సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళా శాలలో దాదాపు 35మంది పనిచేస్తున్నారు. ఇందులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉన్నవారు 12 మంది మాత్రమే. కానీ మొత్తం మందిని ఓటర్లుగా చూపేందుకు అక్కడ టీడీపీ నేతలు వ్యూహాలు రచించి అమలు చేస్తున్నారు.
పూతలపట్టుకు సమీపంలోని ఓ ప్రయివేటు కళాశాలలో 17 మంది సిబ్బంది దాకా పనిచేస్తున్నారు. ఇందులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు అర్హత ఉన్నవారు 8 మంది మాత్రమే. మిగిలిన వారు అనర్హులైనా ఓటర్లుగా చిత్రీకరించే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు.
గూడూరులో ప్రముఖ విద్యాసంస్థలో మొత్తం 43 మంది వరకు పనిచేస్తుండగా అందులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు అర్హత ఉన్నవారు 25 మంది మాత్రమే. కానీ అక్కడ టీడీపీ నేత ఒకరు సిబ్బంది అందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని సదరు యాజమాన్యానికి హుకుం జారీచేశారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో 14 మంది సిబ్బంది ఉండగా అందులో ఎమ్మెల్సీ ఓటు హక్కుకు అర్హులు 08 మంది మాత్రమే. స్థానికంగా టీడీపీ నేత దగ్గరుండి అందరినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు నకిలీ పత్రాలు సృష్టించే పనిలో ఉండడం గమనార్హం.
ప్రచారంలో బిజీబిజీ
చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన తూర్పురాయలసీమ నియోజకవర్గ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు శ్యాంప్రసాద్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డి దూసుకుపోతున్నారు. అయితే టీడీపీ నుంచి అభ్యర్థుల ప్రకటన రాకముందే ఆ పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతూ అడ్డదారులు తొక్కడం విమర్శలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment