చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి
► శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించాలి
► అగ్రిగోల్డ్ బాధితుల పోరాట సంఘం రాష్ట్ర కన్వీనర్ మోజస్ పిలుపు
ఒంగోలు టౌన్ : ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని అగ్రిగోల్డ్ బాధితుల పోరాట సంఘం రాష్ట్ర కన్వీనర్ వీ మోజస్ అగ్రిగోల్డ్ బాధితులకు పిలుపునిచ్చారు. స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో సోమవారం నిర్వహించిన అగ్రిగోల్డ్ బాధితుల పోరాట సంఘ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే విషయంలో చంద్రబాబు మాయమాటలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు.
బాధితులు ఉద్యమం చేసినప్పుడు, కోర్టు మందలించినప్పుడు, సీఎంను కలిసినప్పుడల్లా ప్రత్యేక కోర్టు పెట్టి బాధితులకు వెంటనే న్యాయం చేస్తానని చెప్పడం తప్పితే ఇంతవరకు ఒక్కరికీ రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మార్చిలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లోపు బాధితులకు ఎప్పటిలోగా డబ్బులిస్తారో స్పష్టంగా ప్రకటించకుంటే జరగబోయే ఉద్యమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
అగ్రిగోల్డ్ బాధితుల పోరాటసంఘ రాష్ట్ర అధ్యక్షుడు జీ జడ్సన్ మాట్లాడుతూ కోర్టును, యాజమాన్యాన్ని మేనేజ్ చేస్తూ హాయ్‌ల్యాండ్ వంటి విలువైన ఆస్తులను కాజేసేందుకు బాధిత జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శించారు. సీఐడీ ద్వారా స్వాధీనం చేసుకున్న అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే ఉంచుకుని బాధితులకు కూడా ప్రభుత్వమే డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధితుల వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో పెట్టి వారికి మనోధైర్యం కల్పించాలన్నారు. సమావేశంలో పోరాట సంఘ నాయకులు ఏ కోటేశ్వరరావు, ఏ నరసయ్య, కే ప్రసాద్, వెంకట్రావు, శివ, ఆర్.లక్ష్మి, విశాలాక్షి, ఉమాకుమారి, శోభాదేవి, నర్సమ్మ, జాలయ్య, ఎస్‌కే మస్తాన్, కొండయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.