‘మండలి’ రసవత్తరం  | Legislative Council Elections In Telangana | Sakshi
Sakshi News home page

‘మండలి’ రసవత్తరం 

Published Thu, Feb 21 2019 8:25 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Legislative Council Elections In Telangana - Sakshi

కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల శాసనమండలి స్థానానికి ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయం వేడెక్కింది. రేపోమాపో షెడ్యూల్‌ వెలువడనున్న నేపథ్యంలో ఆయా పార్టీల్లో ఆశావహులు టికెట్ల వేటలో పడ్డారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు సైతం అభ్యర్థులను సమాయత్తం చేస్తున్నాయి. ఇండిపెండెంట్‌గా సైతం బరిలోకి దిగేందుకు పలువురు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నాలుగుజిల్లాల నియోజక వర్గానికి మార్చిలో జరగనున్న ఎన్నికల కోసం టికెట్ల పోరు రసవత్తరంగా మారింది. 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ప్రస్తుతం కరీంనగర్‌ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న స్వామి గౌడ్‌ శాసనమండలి చైర్మన్‌గానూ కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం మార్చి నెలతో ముగుస్తున్నందున శాసన మండలి పోరుకు ఎన్నికల కమిషన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో మండలి ఎన్నికకు కోలాహలం నెలకొంది. ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానంపై ఆశలు పెంచుకున్న పలువురు నేతలు పెద్దఎత్తున ఓటరు నమోదు చేయించి పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఆయా పార్టీల అధిష్టానం వద్ద తమ బలం, బలగాన్ని చూపిం చుకుని టికెట్టు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
 
అధికార పార్టీలో పోటాపోటీ..
కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు నాయకులు పావులు కదుపుతున్నారు. కరీంనగర్‌ జిల్లా నుంచి కార్పొరేషన్‌ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్, ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు తదితరులు పోటీ పడుతున్నారు. మెదక్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ, ఇన్‌చార్జి డీటీసీగా పనిచేస్తున్న ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, టీఎన్‌జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు ఎంఏ. హమీద్, కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌తోపాటు మరికొంత మంది హైదరాబాద్‌ స్థాయిలో వారివారి ప్రయత్నాల్లో మునిగితేలుతున్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై అధిష్టానం ఎటూ తేల్చకపోవడంతో పదిమంది దరఖాస్తు చేసుకుని టికెట్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అదేస్థాయిలో నియోజకవర్గంపరిధిలో ముమ్మరంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దక్కుతుందోననే టెన్షన్‌ మొదలైంది.

కాంగ్రెస్‌ అభ్యర్థిగా జీవన్‌రెడ్డి.. నాలుగు జిల్లాల్లో పర్యటన
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీమంత్రి జీవన్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీవన్‌రెడ్డి తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. అందులోభాగంగానే పలు ప్రముఖ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, లెక్చరర్లతో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరుతున్నారు. నాలుగు జిల్లాల్లో మంచిపట్టున్న నాయకుడిగా జీవన్‌రెడ్డికి పేరుంది. మాజీమంత్రిగా, కాంగ్రెస్‌ శాసనసభ ఉపనాయకుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్‌.రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మసులుకున్నారు.

అదే సమయంలో వైఎస్సార్‌ శాసనసభకు కాంగ్రెస్‌పక్ష నాయకుడిగా ఉండగా.. జీవన్‌రెడ్డి ఉపనాయకుడిగా అధికార పార్టీని ఇరుకున పెడుతూ ప్రజాసమస్యలపై పోరాటం చేశారు. 1983 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగిన జీవన్‌రెడ్డికి సర్పంచ్‌ స్థాయి నుంచి పనిచేసిన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో పట్టభద్రుల ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా.. మంత్రిగా పనిచేసిన జీవన్‌రెడ్డి మల్యాల మండలం నాచుపల్లిలో జెఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల, జగిత్యాల మండలం పొలాసలో వ్యవసాయ డిగ్రీ, పీజీ కళాశాలలు, నిరుద్యోగ యువతకు సంబంధించిన న్యాక్‌శిక్షణ కేంద్రం, పీజీ కాలేజీల సాధనలో కీలకపాత్ర వహించారు. అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఆశతో ఉన్నారు.

బీజేపీ నుంచి సుగుణాకర్‌రావు ఖాయం
భారతీయ జనతాపార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు బరిలో నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పోటీ లేకపోవడంతో సుగుణాకర్‌రావుకే టికెట్‌ ఖరారైనట్లు సమాచారం. బీజేపీలో సీనియర్‌ నాయకుడి ఉన్న సుగుణాకర్‌రావు గతంలో రెండుమార్లు కరీంనగర్‌ శాసనసభకు పోటీ చేసి ఓటమి చెందారు. పార్టీ పలు కీలకపదవుల్లో పనిచేసి పార్టీ పటిష్టత కోసం కృషిచేయడంతో అధిష్టానం గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుగుణాకర్‌రావు పేరు ఖరారు చేసినట్లు తెలిసింది.

పార్టీలో సీనియర్‌గా ఉన్న సుగుణాకర్‌రావు ప్రచారాన్ని ప్రారంభించి ప్రశ్నించే గళాన్ని గెలిపించాలని పట్టభద్రులను కోరుతున్నారు. మొత్తంమీద మండలికి నోటిఫికేషన్‌ జారీ కాకముందే రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలో రాజకీయ వేడి రగులుతుండగా స్వతంత్రులుగా పోటీ చేసేందుకు పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. ఈసారి ఎమ్మెల్సీ స్థానానికి పోటీ కూడా హోరాహోరీగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. పక్కా ప్రజాప్రతినిధులుగా పనిచేసిన నేతలే రంగంలో నిలుస్తుండడంతో సాధారణ ఎన్నికలను తలపిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement