మండలి వేడి
త్వరలో మోగనున్న నగారా
* సమాయత్తమవుతున్న రాజకీయపార్టీలు
* పోటీకి హేమాహేమీల కదనకుతూహలం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : శాసన మండలి ఎన్నికలకు త్వరలో నగారా మోగనుందనే సంకేతాలతో జిల్లాలో ‘పెద్దల’ పోరుకు తెరలేచింది. స్థానిక సంస్థల కోటాలోని రెండు స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయనే ప్రచారంతో రాజకీయపార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహించిన పట్నం నరేందర్‌రెడ్డి గత మే నెలలో పదవీ విరమణ చేయడంతో ఖాళీ అయింది. మరోవైపు రాష్ట్ర పునర్విభ జనలో భాగంగా జిల్లాకు అదనంగా మరో సీటు దక్కింది. పెరిగిన స్థానాన్ని ఖరారు చేస్తూ ఇటీవల కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ రెండు స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ఊపందుకోంది. ఈ తరుణంలోనే మండలిలో ఆధిపత్యం ప్రదర్శించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. గెలుపు గుర్రాల వేట కొనసాగిస్తున్నాయి.
రేసు గుర్రాలివే..!
శాసనమండలి బరిలో నిలిచేందుకు టీఆర్‌ఎస్ పార్టీలో ఆశావహుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రెండు స్థానాలనూ గెలుచుకోగలమనే విశ్వాసం గులాబీ శిబిరంలో ఏర్పడింది. పదవీ విరమణ చేసిన నరేందర్‌రెడ్డి మరోసారి పోటీకి సై అంటున్నారు. ఇప్పటికే ఎంపీటీసీ సభ్యులతో వరుస భేటీలు నిర్వహించడంతోపాటు తన పలుకుబడితో నిధుల కేటాయింపులు చేస్తూ మద్దతు కూడగ ట్టుకుంటున్నారు.
తన సోదరుడు, మంత్రి మహేందర్‌రెడ్డి అండదండలతో పార్టీ టికెట్ దక్కుతుందనే భరోసాతో ఉన్నారు. ఇప్పటికే ఆ కుటుంబంలో రెండేసీ పదవులున్నందున (మహేందర్‌రెడ్డి భార్య సునీత జెడ్పీ చైర్‌పర్సన్)... నరేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే, కష్టకాలంలో పార్టీని విజయతీరాలకు చేర్చడంలో కీలకపాత్ర వహించిన ‘పట్నం’ కుటుంబంపై గులాబీ బాసుకు మంచి గురి ఉంది.
కాంగ్రెస్, టీడీపీలను ఉమ్మడి శత్రువుగా పరిగణిస్తున్నందున వాటిని ఢీకొనేందుకు నరేందరే గట్టి అభ్యర్థని అధిష్టానం నమ్ముతోంది. నరేందర్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, రాగం సుజాతా యాదవ్, కమలాకర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, సామ వెంకటరెడ్డి మండలిపై కన్నేశారు. సామాజిక సమీకరణల దృష్ట్యా బీసీలకు కేటాయిస్తే సుజాతా యాదవ్, రాజు పేర్లను అధిష్టానం పరిశీలించే అవకాశముంది. మంత్రి కేటీఆర్ సిఫార్సుతో వెంకటరెడ్డి, సీఎం ఆశీస్సులతో హరీశ్వర్, కమలాకర్‌రెడ్డి ఈ సీటును దక్కించుకునేందుకు లాబీయింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి ఎవరూ బరిలో దిగుతారనే అంశంపై స్పష్టత వచ్చిన తర్వాతే అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
కాంగ్రెస్ నుంచి హేమాహేమీలు
మండలి బరిలో నిలిచేందుకు కాంగ్రెస్‌లోనూ పోటీ తీవ్రంగా ఉంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న సబిత... ఇటీవల జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. చేవెళ్ల-ప్రాణహిత డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ విపక్షాలన్నింటినీ ఏకతాటి మీదకు తేవడంలో సఫలీకృతమయ్యారు.
సీనియర్ నేతగా జిల్లా రాజకీయాల్లో అపార అనుభవం ఉంది. ఇటీవల మంత్రి మహేందర్‌రెడ్డి ఘాటుగా విమర్శలకు దిగడంతో ఇరు కుటుంబాల మధ్య సఖ్యత దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో పోటీకి వెనుకాడకపోవచ్చనే ప్రచారమూ జరుగుతోంది. మరోవైపు సబిత విముఖత చూపితే కేఎల్లార్ పోటీ చేసే అవకాశం ఉంది. సబిత, కేఎల్లార్ మధ్య మునుపటి స్థాయిలో అంతరం లేనప్పటికీ, అభిప్రాయబేధాలున్నాయి.
వీరిరువురు ఐక్యతారాగం వినిపిస్తే విజయం సాధ్యమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ ఈ ఇద్దరి మధ్య సమన్వయం కుదరకపోతే ఎల్‌బీ నగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని రంగంలోకి దించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, అండబలం ఉన్న సుధీర్‌రెడ్డికి పార్టీలోనూ అసంతుష్టులు లేనందున ఈయన అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం వస్తుందని అనుకుంటోంది.
ఇక టీఆర్‌ఎస్ దూకుడుకు కళ్లెం వేయడానికి టీడీపీతో జతకట్టేందుకు కాంగ్రెస్ సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నందున చెరో సీటుకు పోటీ చేసేలా అవగాహన కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఒకవేళ ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరితే టీడీపీ తరఫున మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి బావమరిది శ్రీనివాస్‌రెడ్డిని బరిలో దించే అంశాన్ని ‘దేశం’ అధినాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.