‘మండలి’ వేడి
తెరపైకి ఇప్పటికి ఐదుగురు
వైఎస్సార్ సీపీ మద్దతుతో గొల్ల బాబూరావు పోటీ
టీడీపీ అభ్యర్థిత్వం కోసం చైతన్యరాజు, పరుచూరి యత్నాలు
పీడీఎఫ్ అభ్యర్థిగా రాము సూర్యారావు
స్వతంత్రంగా రంగంలోకి దిగుతున్న పిల్లి డేవిడ్
ఈసారి ఓటర్ల సంఖ్య 20 వేలకు పైనే
ఏలూరు సిటీ : శాసన మండలి ఎన్నికలకు ఈ నెలాఖరున నగారా మోగబోతోంది. ఓటర్ల జాబితాలు సిద్ధమవుతున్నారుు. ఈనెల 16న తుది ఓటర్ల జాబితా ప్రచురణ కానుంది. నెలాఖరు నాటికి ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని, వచ్చే నెల రెండో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాల భోగట్టా. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. భారీగా ఎరిగిన ఓటర్ల సంఖ్య పోటీని తీవ్రతరం చేయనుంది. రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైనవిగా పేరొందిన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఓటర్లు ఏ విధమైన తీర్పు ఇస్తారనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే ఐదుగురు అభ్యర్థులు తెరపైకి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ కలిదిండి చైతన్యరాజు తాను టీడీపీ మద్దతుతో బరిలోకి దిగుతున్నట్టు చెబుతున్నారు. అదే పార్టీ నుంచి ప్రగతి విద్యాసంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు సైతం పోటీకి సై అంటున్నారు. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) తరఫున సామాజిక వేత్త రాము సూర్యారావు, స్వతంత్ర అభ్యర్థిగా పిల్లి డేవిడ్‌కుమార్ బరిలో ఉన్నారు.
టీడీపీ అభ్యర్థిత్వం ఎవరికో
టీడీపీ అభ్యర్థిత్వం ఎవరిని వరిస్తుందోననే అంశం ఆసక్తికరంగా మారింది. టీడీపీ తరఫున పోటీచేసే అవకాశం తనకే దక్కుతుందన్న ఉద్దేశంతో చైతన్యరాజు ఇప్పటికే ఎన్నికల గోదాలోకి దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన ప్రగతి విద్యాసంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు టీడీపీ టికెట్ తనకే ఖాయమని పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయనను పోటీనుంచి తప్పించడానికి ఎమ్మెల్సీ సీటిస్తామని అధినాయకత్వం హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరిలో ఎవరికైనా టీడీపీ సీటివ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటారని చెబుతున్నారు.
వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బాబూరావు
ఎమ్మెల్సీ ఎన్నికలు చప్పగా సాగుతాయేమో రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు బరిలో నిలవడంతో రాజకీయూలు ఒక్కసారిగా వేడెక్కారుు. శాసన మండలిలో విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేయూలనే తపనతో తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు బాబూరావు ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పాలన గాడి తప్పటం, చంద్రబాబు మాట తప్పడాన్ని అన్ని వర్గాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకత తప్పదనే అభిప్రాయాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్ల బాబూరావుకు విజయావకాశాలు ఎక్కువే అంటున్నారు. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ సహకారంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని బాబూరావు చెబుతున్నారు.
యూటీఎఫ్ మద్దతుతో ఆర్‌ఎస్‌ఆర్
ఏలూరుకు చెందిన సామాజికవేత్త రాము సూర్యారావు పీడీఎఫ్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్) ఆయనకు మద్దతు ప్రకటించింది. మరోవైపు నిడదవోలు పట్టణానికి చెందిన పిల్లా డేవిడ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు.
ఓటర్లు పెరిగారు
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలో 13,200 ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. రానున్న ఎన్నికలకు ఓటర్ల సంఖ్య పెరిగింది. పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా ఓటు హక్కు నమోదు చేయించుకున్న వారి సంఖ్య 4,184 కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 5వేలకు పైగా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 20 వేలు దాటిపోయేలా ఉంది.